తగ్గుతున్న పీహెచ్‌డీ ప్రవేశాలు

* దూరవిద్యపై మహిళల ఆసక్తి
* బెంగళూరు జిల్లాలో అత్యధికంగా 924 కళాశాలలు
* దేశంలో 5,362 మంది విదేశీ విద్యార్థులు
* హెచ్‌ఆర్‌డీ ప్రాథమిక నివేదిక వెల్లడి
ఈనాడు - హైదరాబాద్‌: దేశ వ్యాప్తంగా పీహెచ్‌డీలో ప్రవేశాలు తక్కువగా ఉంటున్నాయి. ఈ విషయాన్ని మానవ వనరుల అభివృద్ధి (హెచ్‌ఆర్‌డీ) శాఖ తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్ర పాలిత ప్రాంతాలు, అన్ని రాష్ట్రాల్లో కలిపి 84,505 మంది పీహెచ్‌డీ చేస్తున్నారు. వీరిలో 51,362 మంది యువకులు, 33,143 మంది యువతులు ఉన్నారు. ఏపీలో 5,231 మంది యువకులు, యువతులు 2,756 మంది ఉన్నారు. దూరవిద్య ద్వారా మహిళలు అధిక ప్రయోజనం పొందుతున్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థి, అధ్యాపకుల నిష్పత్తి 25 : 6గా నమోదైంది. దేశంలో 642 విశ్వవిద్యాలయాలు, 34,908 అనుబంధ కళాశాలలు, ప్రత్యేక కోర్సులతో నడిచే 11,356 సంస్థలు ఉన్నాయి. వీటిలో 601 విశ్వవిద్యాలయాలు, 34,908 అనుబంధ కళాశాలలు, 6,702 ఇతర విద్యా సంస్థల నుంచి కేంద్ర హెచ్‌ఆర్‌డీ శాఖ 2011-12 విద్యా సంవత్సరంనాటి విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్‌ ద్వారా సేకరించింది. ఇకపై ప్రతి ఏడాది అక్టోబరు నాటికి వివరాలు సేకరించాలని కేంద్ర హెచ్‌ఆర్‌డీ శాఖ నిర్ణయించింది. తాను సేకరించిన వివరాలతో కూడిన ప్రాథమిక నివేదికను హెచ్‌ఆర్‌డీ శాఖ తాజాగా విడుదల చేసింది.
అందులోని ప్రధాన అంశాలు..
* దేశవ్యాప్తంగా ఉత్తరప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్‌, తమిళనాడు రాష్ట్రాల్లోనే అత్యధిక సంఖ్యలో కళాశాలలు ఉన్నాయి. బెంగళూరు జిల్లాలో అత్యధికంగా 924, జైపూర్‌లో 544 కళాశాలలు ఉన్నాయి.
* ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాల్లో 85% ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ కళాశాలలు ఉన్నాయి. బీహార్‌లో ఆరు శాతం, అస్సాంలో పది శాతం కళాశాలలు ప్రైవేట్‌ యాజమాన్యాల పరిధిలో పనిచేస్తున్నాయి. దేశవ్యాప్తంగా..73% కళాశాలలు ప్రైవేట్‌ యాజమాన్యాల పరిధిలో నడుస్తున్నాయి. 15% ప్రైవేట్‌ ఎయిడెడ్‌ కళాశాలలు ఉన్నాయి.
* ఉన్నత విద్యలో 28.56 మిలియన్ల మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో 15.87 మిలియన్ల విద్యార్థులు కాగా 12.69 మిలియన్ల విద్యార్థినులు ఉన్నారు.
* దేశవ్యాప్తంగా పీహెచ్‌డీ చేస్తున్న వారు 84,505 మంది మాత్రమే ఉన్నారు. సైన్స్‌ సబ్జెక్టులో 22%, ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ విభాగంలో 20.5% మంది పీహెచ్‌డీ చేస్తున్న వారు ఉన్నారు. పీజీ స్థాయిలో మేనేజ్‌మెంట్‌ విభాగంలో ఎక్కువమంది చదువుతున్నారు. ఆ తరువాత సోషల్‌సైన్స్‌లో ఎక్కువ మంది చదువుతున్నారు. డిగ్రీలో 34%, ఇంజినీరింగ్‌/టెక్నాలజీ కోర్సుల్లో 19%, కామర్స్‌, సైన్స్‌ సబ్జెక్టుల్లో 14.5% మంది విద్యార్థులు చేరారు.
* ఎస్సీ విద్యార్థులు 12.5%, ఎస్టీ విద్యార్థులు 4.2%, అల్పసంఖ్యాక విద్యార్థులు 2.1% ఉన్నతవిద్యను అభ్యసిస్తున్నారు.
* విదేశాలకు చెందిన 5,362 మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా పీహెచ్‌డీ, ఎంఫిల్‌, పోస్టుగ్రాడ్యుయేషన్‌ కోర్సులను అభ్యసిస్తున్నారు. వీరిలో పీహెచ్‌డీ చేస్తున్న వారు 707 మంది ఉన్నారు. అత్యధికంగా నేపాల్‌ నుంచి 17%, భూటాన్‌, ఇరాన్‌ నుంచి 7%, మలేసియా, అఫ్ఘనిస్థాన్‌ నుంచి ఐదు శాతం మంది మనదేశంలోని విద్యను అభ్యసిస్తున్నారు. వీరే కాకుండా 153 దేశాలకు చెందిన విద్యార్థులు సైతం మనదేశంలో అడుగుపెట్టారు.
* అత్యధికంగా బెంగుళూరులో 924, జైపూరులో 544, హైదరాబాదులో 533, పుణేలో 470, రంగారెడ్డిలో 448, నాగపూర్‌లో 433, ముంబాయిలో 358, భోపాల్‌లో 323, చిత్తూరులో 290, ఇండోరులో 290 వంతున కళాశాలలు ఉన్నాయి.
* దూరవిద్యలో 12.5% మంది చదువుతున్నారు. వీరిలో మహిళలు 39.9% మంది ఉన్నారు.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning