కొత్త సంస్థలతోనే ఐటీ పరుగు

* అనుమతులు సరళీకరించాలి
* టెక్నాలజీ మిషన్‌కు రూ.500 కోట్లివ్వాలి
* నాస్కామ్‌ అధ్యక్షుడు ఆర్‌.చంద్రశేఖర్‌
ఈనాడు - హైదరాబాద్‌: 'దేశ ఐటీ పరిశ్రమ ఆదాయం 118 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.7,08,000 కోట్లు)లో 80 శాతం వాటా 200 లోపు పెద్ద కంపెనీలవే. మిగిలిన 20 శాతం ఆదాయాన్ని 15,000 చిన్న కంపెనీలు సాధిస్తున్నాయి. ఇంక్యుబేటర్ల వంటి మౌలిక సదుపాయాల కల్పనతో పాటు పేటెంట్‌ నమోదుకు ఆర్థిక సాయం, ఏంజెల్‌ ఇన్వెస్టర్లతో భాగస్వామ్యం వంటి ప్రక్రియల్లో ప్రభుత్వం పాలుపంచుకుంటే, ఇవి దూసుకెళ్తాయి. దేశీయ ఐటీ రంగం మరింత వృద్ధితో సాగుతుంది. ఇందుకోసం టెక్నాలజీ ఎంట్రప్రెన్యూర్‌ మిషన్‌ను రూ.500 కోట్ల ప్రారంభ నిధితో, వచ్చే బడ్జెట్‌లోనే ఆరంభించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం' అని నాస్కామ్‌ అధ్యక్షుడు ఆర్‌.చంద్రశేఖర్‌ వెల్లడించారు. బిగ్‌డేటా-అనలిటిక్స్‌పై శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశానికి హాజరైన చంద్రశేఖర్‌ విలేకరులతో మాట్లాడారు. ఆయా అంశాలపై ఆయన ఏం చెప్పారంటే...
విదేశాలకు తరలకుండా చూడాలి
ఐటీ రంగంలో కొత్త కంపెనీ ప్రారంభానికి సవాలక్ష నిబంధనలు సరికాదు. అమెరికా, బ్రిటన్‌ కెనడా, సింగపూర్‌ వంటి దేశాలు అతి తేలికైన నిబంధనలతో మన నిపుణులను ఆకర్షించి, అక్కడ సంస్థలు నెలకొల్పేలా చూస్తున్నాయి. ఇక్కడా ఒకటి, రెండు రోజుల్లోనే సంస్థ ప్రారంభించేందుకు అనువుగా చట్టాన్ని మార్చాలి. కొత్త సంస్థల్లో ఏంజెల్‌ ఇన్వెస్టర్ల పెట్టుబడిలోనే 30 శాతం పన్నుగా వసూలు చేయడం నిలపాలి. వీటికి నిధులు సమకూర్చడంలో, ప్రధానపాత్ర పోషించకనే, భాగస్వామిగా ప్రభుత్వం వ్యవహరించాలి. 2020 నాటికి దేశీయ ఐటీ పరిశ్రమ 300 బిలియన్‌ డాలర్ల ( సుమారు రూ.18,00,000 కోట్లు) స్థాయికి చేరుతుందని ఆశిస్తున్నాం. అందులో 100 బిలియన్‌ డాలర్లు (రూ.6,00,000 కోట్లు) రెండు-మూడో అంచె నగరాలలోని చిన్న-మధ్యస్థాయి కంపెనీల నుంచే రావాలన్నది నాస్కామ్‌ ఆకాంక్ష.
13-15 శాతం వృద్ధి ఆశిస్తున్నాం
గత ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఐటీ రంగం 13.2 శాతం వృద్ధితో సాగింది. ఈ ఏడాది 13-15 శాతం వృద్ధితో 130 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.7,80,000 కోట్లు)కు చేరుతుందని అంచనా. సామాజిక మాధ్యమాలు, మొబిలిటీ, అనలిటిక్స్‌, క్లౌడ్‌ (స్మాక్‌) రంగాలు పరిశ్రమ వృద్ధికి రెట్టింపు వేగంతో సాగుతున్నాయి. అనలిటిక్స్‌ అయితే 40 శాతం వార్షిక వృద్ధితో సాగుతోంది. అయితే ఉద్యోగాల కల్పన ఆ స్థాయిలో లేదు. గత ఏడాది 1.5 లక్షల మందికి కొత్తగా ఉపాధి లభించింది. ఈ ఏడాది మరికొంత అదనంగా నియామకాలు జరుగుతాయని ఆశిస్తున్నాం.
డేటా అనలిటిక్స్‌కు ముఖ్య కేంద్రంగా మారదాం
వ్యాపార, వాణిజ్య నిర్ణయాలే డేటా విశ్లేషణ ముఖ్యపాత్ర పోషిస్తోంది. కంపెనీలు చీఫ్‌ డేటా సైంటిస్టులు, చీఫ్‌ అనలిటిక్స్‌ ఆఫీసర్లను నియమించుకోనున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో అనలిటిక్స్‌ బిలియన్‌ డాలర్ల ఆదాయం సాధిస్తే, 2017-18కి 2 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.12,000 కోట్లు)కు చేరనుందని నాస్కామ్‌, బ్లూఓషన్‌ అధ్యయనంలో తేలింది. ఆయా రంగాలపై అవగాహన కలిగిన (డొమైన్‌) నిపుణులు, వ్యాపార, ప్రోగ్రాం నిర్వహణ నిపుణులు ఎక్కువగా అవసరం అవుతారు. ఈ విభాగంలో సత్తా చాటితే, ప్రపంచానికే ముఖ్య కేంద్రంగా మారే అవకాశం ఉంది.
ఆకర్షణీయ విధానాలు మౌలిక వసతులు ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ విస్తరణకు అవకాశాలు: చంద్రశేఖర్‌
'ఐటీ సంస్థలకు ప్రధానంగా కావాల్సింది నిపుణులైన మానవ వనరులు. పెట్టుబడులు పెట్టే ప్రాంతంలో తమకు అవసరమైన నిపుణుల లభ్యత, వారి నైపుణ్యస్థాయిలను పరిశీలిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో నిపుణుల కొరత లేదు. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఆకర్షణీయ విధానాలు రూపొందించి, ఉద్యోగుల కుటుంబాలకు మెరుగైన జీవనం కోసం విద్య-వైద్య-వినోద-ఆతిథ్య-వాణిజ్య సంస్థలు నెలకొల్పితే ఐటీ సంస్థలను సత్వరం ఆకర్షించవచ్చు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఐటీ అభివృద్ధి కోసం మా సహకారాన్ని కోరారు' అని నాస్కామ్‌ అధ్యక్షుడు ఆర్‌.చంద్రశేఖర్‌ వెల్లడించారు. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కూడా వినూత్న విధానాలతో ఐటీ వృద్ధికి కృషి చేస్తామని చెప్పారని, రెండు రాష్ట్రాల్లోనూ ఐటీ మరింత వృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఆయన ఏమన్నారంటే..
అనిశ్చితి తొలగడం ప్రధాన వూరట
అనిశ్చితి తొలగినందున, హైదరాబాద్‌లో ఐటీ వృద్ధికి అవకాశం ఏర్పడింది. ఏ ప్రాంతంలో కొత్త పెట్టుబడులు పెట్టాలనే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ కేంద్రాలుగా అభివృద్ధి చేయదలచిన, అవకాశం ఉన్న ప్రాంతాల్లో సత్వరం మౌలిక వసతులు పెంచి, ప్రోత్సాహక విధానాలు ప్రకటించాలి. డిజిటైజేషన్‌ పథకాలకు శ్రీకారం చుట్టాలి. ఆయా ప్రాంతాల్లో భవనాలు, నివాస సముదాయాలు, మెరుగైన సామాజిక జీవనం అందించే వసతులు లేకపోతే, ఐటీ సంస్థలు ఏర్పాటైనా, సీనియర్లు వచ్చేందుకు ఇష్టపడరు. ఐటీ పరిశ్రమల స్థాపన పెరిగాకే ఆయా నగరాల్లో ఆధునిక సదుపాయాలు ఏర్పడ్డాయి. అందుకోసమే ప్రభుత్వం కొంత పెట్టుబడితో మౌలిక సదుపాయాలు మెరుగు పరిచి, పెట్టుబడులను ఆహ్వానిస్తే, క్రమంగా ఐటీ పరిశ్రమ వృద్ధి చెందేనాటికి సమకూరతాయి.
సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ కలిస్తేనే
డిజిటైజేషన్‌లో సాఫ్ట్‌వేర్‌తో పాటు పరికరాల (హార్డ్‌వేర్‌) ముఖ్యమే. ఆర్థిక సేవలు, విద్య, ఆరోగ్య సంరక్షణ, ప్రభుత్వ సేవల డిజిటైజేషన్‌లో ఇవి కీలకంగా మారాయి. స్మార్ట్‌ఫోన్లు రూ.3,000లకే లభిస్తున్నందున, ఈ రంగంలో మెరుగైన భవిష్యత్తు ఉంటుంది. డిజిటైజేషన్‌తో ఖర్చును తగ్గించి, కార్యకలాపాలు సమర్థంగా నడిపే వీలుంటుంది. వీటిపై రెండు రాష్ట్రాలు ముందుకు సాగి, దేశ ఆర్థిక వృద్ధికి దోహద పడతాయని ఆశిస్తున్నాం.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning