రండి.. ఉద్యోగంలో చేరండి

* ఆఫర్‌ లెటర్‌ ఇచ్చిన నెలకే కొలువు
* ఇంజినీరింగ్‌ విద్యార్థులు ఖుషీ ఖుషీ
ఈనాడు - హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌ పూర్తయిన నెలకే అయిదంకెల వేతనంతో దిగ్గజ సాఫ్ట్‌వేర్‌ సంస్థలు విద్యార్థులకు నియామక పత్రాలు ఇస్తున్నాయి. 2008 ముందు ఇదే పరిస్థితి ఉన్నా, ఆర్థిక మాంద్యం దెబ్బతో నియామకాలు ఆలస్యం అవుతూ వచ్చాయి. మళ్లీ ఈ ఏడాది నుంచి పాత రోజులు మొదలైనట్లు అనిపిస్తోంది. మొన్న మే నెలలో ఇంజినీరింగ్‌ పూర్తి చేసుకుని, ప్రాంగణ/ప్రాంగణేతర (ఆఫ్‌ క్యాంపస్‌) నియామకాలలో ఎంపికైన విద్యార్థులకు ఆఫర్‌ లెటర్లు ఇచ్చిన సంస్థలు, ఇప్పుడు ఉద్యోగంలో చేరమని నియామక పత్రాలు కూడా ఇస్తున్నాయి. డిసెంబరులో చేరాల్సి ఉంటుందని తెలిపిన సంస్థలు కూడా, ఇప్పుడే ఉద్యోగంలో చేరమని ఆహ్వానిస్తున్నాయి.
ఇంజినీరింగ్‌ నాలుగో సంవత్సరంలోనే విద్యార్థులను ఎంపిక చేసుకున్న సంస్థలు, ఆఫర్‌ లెటర్లు ఇస్తున్నాయి. కొన్ని సంస్థలు ఎప్పుడు ఉద్యోగంలో చేరాల్సి ఉంటుందీ ఆఫర్‌ లెటర్‌లోనే వెల్లడిస్తుంటే, మరికొన్ని సంస్థలు తరవాత సమాచారం పంపుతామని చెబుతుంటాయి. సాధారణంగా ఆఫర్‌ లెటర్‌ ఇచ్చిన 3 నెలల తరవాత విద్యార్థులను విడతలుగా నియమిస్తుంటాయి. ఆర్థిక మాంద్యం అనంతరం అమెరికా, ఐరోపాల నుంచి ప్రాజెక్టులు ఆలస్యం కావడం, మార్జిన్లు కూడా తగ్గడంతో నిర్వహణ వ్యయాన్ని నియంత్రించుకునేందుకు ఐటీ సంస్థలు అవసరమైన సమయంలోనే కొత్త నియామకాలు చేపడుతున్నాయి. ఆఫర్‌ లెటర్లు ఇచ్చినా, ప్రాజెక్టు లభించాకే విద్యార్థులను చేర్చుకోవడం ప్రారంభించాయి. ఆఫర్‌ లెటర్‌ ఇచ్చాక, ఏడాది - ఏడాదిన్నర పాటు కూడా నియామక పత్రం ఇవ్వడం లేదంటూ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌పై గతంలో విద్యార్థులు ఆందోళన చేసిన సంగతి విదితమే. ఈ ఏడాది మాత్రం ప్రాజెక్టుల లభ్యత బాగున్నందున కాగ్నిజెంట్‌ టెక్నాలజీస్‌, మహీంద్రా సత్యం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) ఇప్పుడే నియామకాలు చేపడుతున్నాయి.
ఈ ఏడాది డిసెంబరులో చేరాలని విద్యార్థులకు ఆఫర్‌ లెటర్‌లో తెలిపిన కాగ్నిజెంట్‌, నియామక ప్రక్రియను ముందుకు జరిపింది. ఈ నెలాఖరులోనే చేరాలని విద్యార్థులకు సమాచారం పంపింది.
ఐటీ పరిశ్రమ వృద్ధికి నిదర్శనం: అవసరమైనప్పుడే నియామకం దశకు చేరిన సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమ మళ్లీ గాడిన పడిందనేందుకు తాజా పరిణామాలు నిదర్శనమని ఐటీ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. వ్యాపారం పెరగడం, ప్రాజెక్టులు దక్కుతాయని భరోసా లభించడం వల్లే అనుకున్న సమయం కంటే ముందస్తుగా నియామకాలు జరుపుతారని ఇట్స్‌ ఏపీ అధ్యక్షుడు రమేశ్‌ లోగనాధన్‌ చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల నుంచి 3,500 మంది ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఈ ఏడాది ఆఫర్‌ లెటర్లు ఇచ్చినట్లు టీసీఎస్‌ ప్రాంతీయ అధిపతి వి.రాజన్న వెల్లడించారు. ప్రాంగణ, ప్రాంగణేతర నియామకాల ద్వారా దాదాపు అన్ని ఇంజినీరింగ్‌ కళాశాలల విద్యార్థులకు అవకాశం కల్పించామని పేర్కొన్నారు. ఆఫర్‌ లెటర్లలో ఎప్పుడు చేరాలనేది పేర్కొనబోమని, అయితే అందరినీ తప్పనిసరిగా నియమిస్తుంటామని తెలిపారు. ఆఫర్‌ లెటర్‌ పొందిన విద్యార్థులకు 'క్యాంపస్‌ కమ్యూన్‌' డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ, సంస్థలో చేరేసరికే, అవసరమైన పరిజ్ఞానం అందచేస్తామన్నారు. దేశంలో ఐటీ పరిశ్రమ 2012-13లో 7 శాతం, 2013-14లో 9 శాతం వృద్ధి సాధించిందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరింత మెరుగైన అవకాశాలున్నందునే, తాజా నియామకాలు పెరిగాయని వివరించారు. టీసీఎస్‌ కూడా జులై నుంచే చేరాలని విద్యార్థులకు నియామక పత్రాలు ఇస్తున్నట్లు వెల్లడించారు. ఐరోపా, ఆసియా-పసిఫిక్‌ దేశాల నుంచి ప్రాజెక్టులు లభిస్తున్నందునే మెకానికల్‌, ఇంజినీరింగ్‌, ఏరోస్పేస్‌ వంటి విభాగాల్లో 'తాజా నియామకాలు' చేపడుతున్నట్లు టెక్‌ మహీంద్రా అధికారి ఒకరు చెప్పారు. ప్రత్యేక నైపుణ్యం ఉన్న విద్యార్థులకు సత్వరం నియామక పత్రాలు అందిస్తున్నామని పేర్కొన్నారు.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning