కొలువుల జాతర

* టీపీఎస్సీ ఏర్పడగానే నియామకాలు
* 18 వేల ఖాళీల భర్తీ
* స్థానికతకు కొత్త నిబంధనలు
* బోధన రుసుముల నిబంధనలే ప్రామాణికం!
* రాత పరీక్షలతో పాటు మౌఖిక పరీక్షలూ..
* తెలంగాణ సర్కారు యోచన
ఈనాడు - హైదరాబాద్‌: తెలంగాణ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ (టీపీఎస్సీ) ఏర్పడిన వెంటనే 18 వేల ఉద్యోగ నియామకాలను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. స్థానికతకు ఇప్పటి వరకు ఉన్న నిబంధనను మార్చి కొత్త నిబంధన తీసుకురానుంది. బోధన రుసుముల కోసం రూపొందిస్తున్న స్థానికత నిబంధనను ప్రామాణికంగా తీసుకోవాలని భావిస్తోంది. రాత పరీక్షలతో పాటు మౌఖిక పరీక్షలను తప్పనిసరి చేయనున్నట్లు తెలిసింది. టీపీఎస్సీని అతి త్వరలోనే ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే నియమావళి సిద్ధమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి టీపీఎస్సీ ఏర్పాటు గురించి తెలిపారు. దీనిపై అతిత్వరలో తుది ఉత్తర్వులు రానున్నాయి. తర్వాత కేంద్ర ఆమోద ప్రక్రియ ఉంటుంది. జులైలోనే కేంద్ర ఆమోదం లభించి టీపీఎస్సీ అమల్లోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. టీపీఎస్సీ ఏర్పడిన వెంటనే ఉద్యోగ నియామకాలు జరపాలని సీఎం కేసీఆర్‌ పట్టుదలతో ఉన్నారు. ఆయన ఆదేశాల మేరకు తక్షణ నియామకాల కోసం అధికారులు జాబితాను సిద్ధం చేస్తున్నారు. గతంలో ఏపీపీఎస్సీ ఉమ్మడి రాష్ట్రం కింద నియామకం కోసం గుర్తించిన పోస్టుల్లో 18 వేల వరకు తెలంగాణవి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గ్రూపు-1 పోస్టులతో పాటు డిగ్రీ, జూనియర్‌ కళాశాలల లెక్చరర్లు, ఏఈలు, ఏఈఈలు, తదితర ఉద్యోగాలు ఇందులో ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఆరు జోన్ల కింద ఉద్యోగ నియామకాలు జరిగాయి. ఇందులో ఐదు, ఆరో జోన్లు తెలంగాణ రాష్ట్ర పరిధిలోకి వచ్చాయి. టీపీఎస్సీ ఏర్పడిన తర్వాత జరిపే నియామకాల్లో తెలంగాణ వారే లబ్ధి పొందేలా స్థానికత నిబంధనలను రూపొందించాలని కేసీఆర్‌ ఇప్పటికే అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. బోధన రుసుముల కోసం కొత్త నిబంధన తెస్తున్నామని, దాన్నే ఉద్యోగ నియామకాలకు ప్రాతిపదికగా తీసుకునే అంశాన్ని పరిశీంచాలని సూచించినట్లు సమాచారం. ఏపీపీఎస్సీలో కొన్ని ఉద్యోగాలను పూర్తిగా రాత పరీక్షల ద్వారా భర్తీ చేస్తున్నారు. కొన్నింటికి మౌఖిక పరీక్షలను జరుపుతున్నారు. స్థానికతను గుర్తించేందుకు వీలుగా టీపీఎస్సీ ఆధ్వర్యంలో జరిగే ఉద్యోగ నియామకాలకు మౌఖిక పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning