ఇక‌ కంప్యూటర్ పైనే ప్రాక్టికల్స్!
 • * విద్యార్థుల‌కు వ‌రంగా మార‌నున్న వర్చువల్‌ల్యాబ్స్‌
  * అందుబాటులోకి తీసుకొచ్చిన హైదరాబాద్‌ ట్రిపుల్‌ఐటీ

  హైదరాబాద్‌: కొత్తగా వస్తోన్న వర్చువల్‌ల్యాబ్స్‌ ఇంజినీరింగ్‌, ఫార్మసీ తదితర సాంకేతిక కోర్సుల విద్యార్థులకు వరంగా మారనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వందలసంఖ్యలో ఇంజినీరింగ్‌ కళాశాలలున్నప్పటికీ.. వాటిలో సరైన ప్రయోగశాలలున్న కాలేజీల సంఖ్య మాత్రం చాలా తక్కువే. మిగిలినవాటిల్లో ప్రయోగశాలలు పేరుకే తప్ప విద్యార్థులకు ఉపయోగపడే స్థాయిలో లేవు. ఈ సమస్యకు పరిష్కారంగా వర్చువల్‌ల్యాబ్‌ ముందుకొచ్చింది.

  కంప్యూటర్‌, ఇంటర్నెట్‌, జావా సాఫ్ట్‌వేర్‌ ఉంటే చాలు.. విద్యార్థికి ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. దీనిద్వారా కంప్యూటర్‌పైనే ప్రాక్టికల్స్‌ చేసుకోవచ్చు. భౌతికంగా ఓ పరికరాన్ని ఉపయోగించి చేసే ప్రాక్టికల్‌ను.. కంప్యూటర్‌లో యానిమేషన్‌, త్రీడీ టెక్నాలజీలతో పునఃసృష్టించవచ్చు. దీనివల్ల ప్రయోగశాలలో ప్రాక్టికల్‌ చేసేముందు వర్చువల్‌ ల్యాబ్‌పై సాధన చేసి అవగాహన పెంచుకోవటానికి అవకాశం లభిస్తుంది. ఫలితంగా ప్రయోగశాలలో తక్కువ సమయంలో ప్రాక్టికల్‌ పూర్తవుతుంది. ఇంజినీరింగ్ లాంటి కోర్సులకు ప్రయోగశాల ఏర్పాటు చేయటం అంటే ఖరీదైన వ్యవహారం కాబట్టి.. చాలా కళాశాలలు వాటిని నెలకొల్పడం లేదు. ఈ నేపథ్యంలో, వర్చువల్‌ ల్యాబ్‌లు ప్రత్యామ్నాయం కాగలవని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా, మౌలిక సదుపాయాలు అసలే ఉండని గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకైతే ఇవి మరింత ఉపయోగం. వీటిపైనే సాధన చేసి ప్రాక్టికల్స్‌ పరీక్షలకు సిద్ధం కావచ్చు.

  నేపథ్యం: వర్చువల్‌ల్యాబ్‌ల వెనుక భారీ కసరత్తు జరిగింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ నిధులివ్వగా, ఐఐటీ ఢిల్లీ నేతృత్వంలో 12 ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు వర్చువల్‌ ల్యాబ్‌ ప్రాజెక్టును 2009లో చేపట్టాయి. దీంట్లో హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ (ట్రిపుల్‌ఐటీ) కీలకపాత్ర పోషించింది. ఇంజినీరింగ్‌కు సంబంధించి ఈసీఈ, కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, సివిల్‌, కెమికల్‌, బయోటెక్నాలజీ అండ్‌ బయోమెడికల్‌ బ్రాంచీల్లో.. సైన్స్‌కు సంబంధించి భౌతిక, రసాయనశాస్త్ర కోర్సుల్లో వర్చువల్‌ ల్యాబ్‌లను తయారు చేశారు. ట్రిపుల్‌ఐటీ తన వంతుగా.. ఈసీఈ, కంప్యూటర్‌ సైన్స్‌, సివిల్‌, కెమికల్‌ సైన్స్‌ ప్రాక్టికల్స్‌ బాధ్యతను చేపట్టి పూర్తిచేసింది. గత ఏడాది చివరకు మాడ్యుళ్ల తయారీని పూర్తిచేశారు. వచ్చే రెండు మూడేళ్లలో వర్చువల్‌ ల్యాబ్‌లు విస్తృతవినియోగంలోకి రానున్నాయి.
  క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నాం
  "వర్చువల్‌ ల్యాబ్‌ తయారీ ప్రక్రియ గత ఏడాది పూర్తయింది. ఈ ఏడాది వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నాం. ఈ మేరకు పలు కళాశాలల్లో సెమినార్లు నిర్వహించాం. ఇప్పటివరకు గీతం విశ్వవిద్యాలయంలోని ఐటీ విభాగం, అభినవ్‌ హైటెక్‌ ఇంజినీరింగ్‌ కళాశాల తదితర కొన్ని విద్యాసంస్థలు ఈ సదుపాయాన్ని వినియోగించుకునేందుకు ముందుకొచ్చాయి. వచ్చే రెండుమూడేళ్లపాటు ఈ ల్యాబ్‌లను క్షేత్రస్థాయిలోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నది మా ప్రణాళిక. జాతీయస్థాయి పాఠ్యప్రణాళికల్ని దృష్టిలో పెట్టుకొని ఈ ల్యాబ్స్‌ను తయారుచేశాం. మున్ముందు విశ్వవిద్యాలయాల సిలబస్‌ ప్రకారమూ తయారు చేసుకొనే రోజు రావొచ్చు. ఎవరైనా వర్చువల్‌ ల్యాబ్స్‌ సౌకర్యాన్ని వినియోగించుకోవాలంటే ట్రిపుల్‌ఐటీలోని సీవీఐటీ విభాగాన్ని సంప్రదించవచ్చు."
  ఆచార్య జయంతి శివస్వామి,
  హెచ్‌వోడీ, సెంటర్‌ ఫర్‌ విజువల్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ,
  ట్రిపుల్‌ఐటీ.

 • Industry      Interaction

  Higher Education

  Job Skills

  Soft Skills

  Comm. English

  Mock Test

  E-learning