ఇంజినీరింగ్‌కు ఎందుకా ప్రత్యేకత?

వృత్తివిద్యల్లో ఇంజినీరింగ్‌, వైద్యవిద్యలపట్ల ఉన్న ఆకర్షణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ రెండింటిలో ఇంజినీరింగ్‌ విద్యకున్న ఆదరణ ఇంకా ఎక్కువ. దీనిలో కెరియర్‌ అవకాశాలు, ఇతర విశేషాలను పరిశీలిద్దాం!
ఆకర్షణీయమైన జీతాలు, గౌరవప్రదమైన జీవితం, ప్రతిష్ఠ, సమాజానికి సేవచెయ్యగలగడం వంటి అదనపు ఆకర్షణలు ఇంజినీరింగ్‌ విద్యకు ప్రత్యేక స్థానం కల్పిస్తున్నాయి.
కార్యసాధనకు అవసరమైన ఉపకరణాలను పెంపొందించడం ఇంజినీర్ల ముఖ్యమైన విధి. వివిధ అవసరాలకు ఉపయోగమయ్యే యంత్రాల, ఉపకరణాల రూపకల్పన, సేవల గురించి ఈ రంగం నేర్పిస్తుంది. వివిధ రంగాల వైజ్ఞానిక విషయాలను సమ్మిళితం చేసి, శాస్త్రీయంగా ఆమోదయోగ్యమైన పద్ధతుల ఆవిష్కారం, ఉత్పాదనల అభివృద్ధి, వాటి నిర్వహణకు కావలసిన పనిముట్లు, పద్ధతుల అభివృద్ధి కూడా ఇంజినీర్ల బాధ్యతే.
వైవిధ్యమైన అవకాశాలు
ఈ రంగం వైవిధ్యమైన, ఉత్తేజకరమైన వివిధ కెరియర్లకు అవకాశమిస్తుంది. అభిరుచి ఉన్న విభాగంలో శిక్షణ పొందితే ఎన్నో మెరుగైన అవకాశాలకు ఆస్కారముంది. సాంప్రదాయికమైన సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ రంగాలే కాకుండా ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజి, మెడికల్‌ టెక్నాలజి, మైనింగ్‌, బయో టెక్నాలజి వంటి ఎన్నో నవీన కెరియర్లు లభిస్తున్నాయి.
నాణ్యతకు గిరాకీ
ఇంచుమించు అన్ని విభాగాల్లో సుశిక్షితులైన, ఉద్యోగ సంసిద్ధులైన ఇంజినీర్ల కొరత చాలా ఎక్కువ. ప్రావీణ్యం లేనివారి వల్ల పరిశ్రమల అభివృద్ధి కుంటుపడుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మంచి శిక్షణ పొందినవారికి గిరాకీ ఉంది. పనిలో నాణ్యత చూపించేవారికి ఉద్యోగ భద్రత కూడా ఎక్కువే.
నవ్యతకు ఆస్కారం

ఒక ఇంజినీరుగా ప్రయోగాత్మక పద్ధతుల అన్వేషణకూ, తద్వారా నవ్యతకూ మొదటి అవకాశం కలుగుతుంది. కృత్రిమ హృదయాలు, వాతావరణ సమతుల్యంతో కూడుకున్న గృహాల, జలగర్భ గృహాల నిర్మాణం, కృత్తిమ ప్రపంచం, ఉపగ్రహాలు వంటి సమాజానికి ఎంతో ఉపయోగకరమైన సాధనాలు, ప్రసాధనాలను పెంపొందించగలగడం ఈ రంగానికే ఉన్న ప్రత్యేకతలు. నవ్యతకు ఆస్కారమున్న ఇటువంటి కెరియర్లో ఉద్యోగ అసంతృప్తికి అవకాశం ఉండదు.
బహుముఖ సామర్థ్యం

గ్రామాల నుంచి మహానగరాల వరకు, భూగర్భం నుంచి అంతరిక్షం వరకూ, ఆదివాసాల నుంచి అత్యాధునిక వాతావరణాలలోనూ వీరి అవసరం ఉంటుంది. సవాళ్ళను దీటుగా ఎదుర్కొనే అవకాశాలుండటం వల్ల వీరికి బహుముఖ ప్రజ్ఞ సహజంగానే అలవడుతుంది. ప్రతి పరికరం, సాధన పద్ధతి కూడా అధిక సామర్థ్యంతో పనిచేసేవిధంగా రూపకల్పనకు కృషిచేస్తారు. కాబట్టి వీరిలో ప్రయోగాత్మకత పెరిగి తద్వారా సామర్థ్యం పెరుగుతుంది.

దూరప్రయాణాల అవకాశాలు
ఈ విద్య సాంకేతికపరమైనది కాబట్టి ఇంజినీర్లకు స్వదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ఎన్నో అవకాశాలుంటాయి. ఇతర రంగాల్లోని అవకాశాలతో పోలిస్తే వీరికి విదేశీయాన అవకాశాలు ఎక్కువ. దీంతో ఆయా దేశాల్లోని సాంకేతిక అభివృద్ధి గురించి తెలుసుకుని, తమ జ్ఞానాన్ని పెంచుకోవటం, తద్వారా మెరుగైన ఉద్యోగావకాశాలు పొందటం సాధ్యమవుతుంది. ఇతర దేశాల్లో స్థిరపడ్డవారిలో ఇంజినీర్లే అత్యధికులు.

ఆసక్తి కలిగించే ప్రాజెక్టులు
ఒక ప్రాజెక్టులో ఇతర రంగాలకు చెందిన ఉద్యోగులు కూడా ఉంటారు. వివిధ రకాల ప్రాజెక్టుల్లో వారితో కలిసి పనిచెయ్యడం మంచి అవకాశమే కాకుండా ఆసక్తికరమైనది కూడా. ఇటువంటి ప్రవీణుల సమూహంతో కలిసి పనిచెయ్యడం సంతృప్తినివ్వడమే కాకుండా సృజనాత్మకత, చాతుర్యం, సమయస్ఫూర్తిలకు పదునుపెడుతుంది. అత్యుత్తమమైన రీతిలో ప్రాజెక్టు పూర్తిచెయ్యగల సామర్థ్యాన్ని పెంపొందింపజేస్తుంది. దీనితో మేధాభివృద్ధికి కూడా ఆస్కారం ఉంటుంది.

చదవాలంటే ఏ అర్హతలుండాలి?
ఇంజినీరింగ్‌ కెరియర్‌గా చేసుకోవాలంటే మేధావి కానక్కరలేదు. కష్టపడే తత్వం మాత్రం చాలా అవసరం. దీనిలో రాణించాలంటే శ్రమకు వెనుకాడకూడదు. సమస్యా సాధనకు సంబంధించిన మెలకువల్లో ప్రావీణ్యం సంపాదించుకోవాలి. దీనికి అభ్యాసం ఎక్కువగా చెయ్యాలి. వీరి సమయంలో అధిక భాగం సమస్యల పరిష్కారానికే వినిమయమవుతుంది. కాబట్టి ఈ మెలకువను ఒక కళగా అలవరచుకోవాలి. దీన్ని పెంపొందించుకోవాలంటే గణితం, భౌతికశాస్త్రం, రసాయనిక శాస్త్రాల్లోని సమస్యలను బాగా అధ్యయనం చెయ్యాలి.

ఇంజినీరింగ్‌లో సఫలమవ్వాలంటే రెండు ముఖ్యమైన మెలకువల్లో ప్రావీణ్యం సంపాదించాలి.
* ఇందులో మొదటిది సాంకేతికపరమైన ప్రావీణ్యం. దీనికి పైన చెప్పినవిధంగా గణిత, భౌతిక, రసాయనిక శాస్త్రాలపై పట్టు సాధించాలి.

* రెండోది బదిలీకృత మెలకువ. అంటే మన ద్వారా సమాచారం ఇతరులకు చేరవేసే ప్రక్రియలో ప్రవేశం. భావ ప్రకటన, భాషా ప్రావీణ్యం, భావప్రసారం (కమ్యూనికేషన్‌), బృందంగా పనిచెయ్యడం, సాంకేతిక సామర్థ్యం, సునిశితంగా ఆలోచించగలగడం వంటివి ఈ కోవలోకి వస్తాయి.

ఇవేకాకుండా వివిధ ప్రదేశాల సంస్కృతులు, ఆచార వ్యవహారాల పట్ల లోకజ్ఞానం ఉంటే చాలా మంచిది. మున్ముందు ఉద్యోగావసరాలకు ఆయా ప్రదేశాలకు వెళ్ళినపుడు ఇబ్బందులనెదుర్కునే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు.
తల్లిదండ్రులకు సూచనలు
పిల్లలు తమ కెరియర్‌ను ఎంచుకోవడంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో ఉంది. కాబట్టి వారు పిల్లల శక్తిసామర్థ్యాలను దృష్టిలో ఉంచుకుని తగిన నిర్ణయం తీసుకోవాలి. వారికి ఏ రంగంలో అభిరుచి ఉందో తెలుసుకోవాలి. ఇష్టంలేని రంగంలో కానీ, వారు సమర్థంగా చెయ్యలేని రంగంలో కానీ బలవంతాన చేరిస్తే చివరకు బాధపడటం తప్పిస్తే వేరేమీ చెయ్యలేరని తెలుసుకోవాలి.

హైస్కూలు సమయంలోనే ముందు ఏ చదువులైతే బాగుంటాయి, ఏ రంగంలో రాణించగలరు అనేది తప్పక తెలుసుకోవాలి. ప్రథమ, మాధ్యమిక విద్యల్లో చొరవ తీసుకున్నట్టే ఇంజినీరింగ్‌ వంటి డిగ్రీ స్థాయి విద్యల్లో కూడా తల్లిదండ్రులు చొరవ తీసుకోవటం మేలు. అవసరమైతే ఇతర నిపుణుల సహాయ సహకారాలు తీసుకోవటం మంచిది.

ఒకవేళ పిల్లలు ఇంజినీరింగ్‌ చెయ్యాలనుకుంటే, వారికి గణితంలో ప్రావీణ్యం అవసరమైనంత మేరకు ఉందో లేదో చూడాలి. హైస్కూలు దశలోనే ఇంజినీరింగ్‌ పట్ల మక్కువ చూపితే వారిని గణితం ఎక్కువ అభ్యాసం చెయ్యడానికి ప్రోత్సహించాలి. అవసరమైతే కొన్ని అదనపు మెలకువలు నేర్పించాలి. పిల్లలు తమ సహజ సామర్థ్యాలను పెంచుకునే వాతావరణం కలుగజెయ్యాలి. జీవితంలో ఒడిదొడుకులు, ఒత్తిడులూ సహజమని మొదటినుంచే నేర్పాలి.
పరిపక్వత రాని దశలోనే...
మానసికంగా పూర్తిస్థాయిలో పరిపక్వత ఇంకా రాని వయసులోనే ఇంజినీరింగ్‌ను ఒక కెరియర్‌గా నిర్ణయించుకోవలసిన అవసరమౌతుంది. చాలావరకు ఈ నిర్ణయం తీసుకునేది తల్లిదండ్రులే. కొన్ని సందర్భాల్లో తమ సీనియర్లను చూసి స్ఫూర్తిని పొంది విద్యార్థులు సొంత నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఐతే, ఈ నిర్ణయాలు తీసుకునే హితోభిలాషులు స్వయంగా ఇంజినీర్లు కాకపోయి ఉండొచ్చు. వీరికి ఇంజినీరింగ్‌ పట్ల పూర్తి అవగాహన కూడా ఉండకపోవచ్చు.

ఇంజినీరింగ్‌ చెయ్యాలనుకునేవారిలో కూడా ఈ రంగంలోని వృత్తిపై పూర్తి అవగాహన అరుదుగా కనిపించే లక్షణం. వైద్యం, న్యాయవాదం వంటి వృత్తివిద్యా రంగాలతో పోలిస్తే ఒక ఇంజినీరు చేయగలిగిన పనులపై సమగ్రంగా చెప్పగలగడం ఒకింత కష్టమే.

సూక్ష్మంగా చెప్పాలంటే ఇంజినీర్లు మానవ జీవితానికీ, సంఘానికీ అవసరమైన స్థితిగతుల నిర్మాణ, నిర్వహణ, వికాసాలకూ, వాటి నాణ్యతకూ బాధ్యత వహిస్తారు.

తాగే రక్షిత మంచినీరు, నివసించే గృహాలు, పనితనంలోని మెలకువలు, నిత్యం ఉపయోగించే వివిధ ఉత్పత్తులు, మన జీవన గతినే మార్చిన కంప్యూటర్లు, అంతర్జాలం, సేవలందించే వైద్యరంగం, వాడే రవాణా సాధనాలు, గృహోపకరణాలు అన్నీ వివిధ రంగాల ఇంజినీర్లు తమ వంతు కృషిగా సేవలందించినవే!


Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning