యువమంత్రం... సాకేంతిక తంత్రం

* సామాజిక వేదికలే ప్రచారాస్త్రం
* తక్కువ ఖర్చుతో ఎక్కువ మందిని
* ఆకర్షిస్తూ... ప్రత్యేకత చాటుకుంటున్న నవతరం
* భిన్నమైన మార్కెటింగ్‌తో ఆర్థిక పునాదులు
ఇంజినీరింగ్‌, ఎంబీఏ.. చదివింది ఏ కోర్సు అయినా నేటి కుర్రకారు ఆలోచనంతా సొంతంగా వ్యాపారం ప్రారంభించి నలుగురిలో తమ ప్రత్యేకతను చాటుకోవాలనే. తమ సృజనతో కొత్త ఉత్పత్తులతో పాటు సరికొత్త మొబైల్‌ అప్లికేషన్లను సృష్టిస్తున్న నవతరం వాటిని వినియోగదారులకు పరిచయం చేయడంలోనూ భిన్నమైన మార్కెటింగ్‌ విధానాలను పాటిస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి చేరువవుతూ తమ భవిష్యత్తు వ్యాపారానికి పటిష్టమైన ఆర్థిక పునాదులు వేసుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కళాశాలలను వదిలి బయటకు వచ్చి సరికొత్త వ్యాపారాలపై దృష్టి పెడుతున్న నగర యువత అంతర్జాల సామాజిక అనుసంధాన వేదికలను తమ ప్రచారాస్త్రాలుగా ఉపయోగించుకుంటూ దూసుకెళుతున్నారు.
నగరంలో కొన్నేళ్లుగా స్టార్టప్‌ కంపెనీల జోరు కొనసాగుతోంది. భారీ స్థాయిలో కాకపోయినా ప్రతి ఒక్కరూ తమకు చేతనైనంతలో సరికొత్త ఉత్పత్తులను సృష్టించడంతో పాటు సాంకేతికంగా కొత్త అప్లికేషన్లను రూపొందిస్తున్నారు. తమ బుర్రలో మెదిలో ఆలోచనలకు ఒక రూపమిస్తున్నారు. ఇక్కడే అసలు కథ మొదలవుతోంది. ఉత్పత్తి లేదా ఆలోచనను పూర్తిస్థాయిలో వృద్ధి చేసినా సరైన మార్కెటింగ్‌ లేకపోతే వారి ప్రయత్నం మొత్తం వృథాగా మారిపోవాల్సిందే. ఇక్కడే యువ వ్యాపారవేత్తలు తమ చుట్టూ ఉన్న సాంకేతిక వనరులను అద్భుతంగా ఉపయోగించుకుంటూ తమ ఉత్పత్తులు, సేవల గురించి లక్షిత వినియోగదారులను వివరిస్తున్నారు.
* తక్కువ పెట్టుబడితో..
ఏదైనా కొత్త ఉత్పత్తి లేదా సేవను మార్కెట్లోకి ప్రవేశపెట్టి దానిని వినియోగదారులకు అందించడం అనేది చాలా కష్టమైన ప్రక్రియ. పెద్దపెద్ద కంపెనీలు సైతం ఈ విషయంలో ఎంతో చెమటోడుస్తుంటాయి. కానీ వారి వద్ద మార్కెటింగ్‌ చేయడానికి అనువైన సిబ్బందితో పాటు కావాల్సిన పెట్టుబడి సైతం అందుబాటులో ఉంటుంది. ఇలాంటి వారే తమ ఉత్పత్తులకు ప్రచారం కల్పించేందుకు నానా కష్టాలు పడాల్సి వస్తుంటే మరి అప్పుడే ఆ రంగంలోకి వచ్చిన కుర్రకారు పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నగరంలో ఇలా కొత్తగా వ్యాపారంలోకి వస్తున్న యువత సరికొత్త విధానాలతో తమ ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేసుకుంటున్నారు. నామమాత్రపు పెట్టుబడితో తాము ఎవరికైతే తమ ఉత్పత్తులు లేదా సేవలను విక్రయించాలనుకుంటున్నారో వారి మనసులను తాకేలా ప్రచారం నిర్వహిస్తున్నారు.
* యువతను ఆకట్టుకునేలా...
నగరంలో ఎవరి చేతిలో చూసినా స్మార్ట్‌ ఫోన్లు దర్శనమిస్తున్నాయి.అంతర్జాలాన్ని విరివిగా ఉపయోగిస్తున్నారు. సామాజిక అనుసంధాన వేదికల్లో ఖాతాలు లేనివారు లేరంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి పరిస్థితుల్లో అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ తమదైన శైలిలో ముందుకు సాగుతున్నారు యువతరం. తమ ఉత్పత్తులు, సేవల గురించి ఫేస్‌బుక్‌ వేదికగా ఇతరులతో పంచుకుంటున్నారు. సంప్రదాయ మార్కెటింగ్‌ పద్ధతులను పక్కనబెట్టి ఆన్‌లైన్‌ ద్వారానే తమ పనులను చక్కబెడుతున్నారు. వీరి ఉత్పత్తులు, సేవలు యువతరాన్ని ఆకర్షించేవే కావడంతో ఇలాంటి సాంకేతిక మార్కెటింగ్‌ పద్ధతి నవతరానికి వరంగా మారుతోంది.
* సరిహద్దులు ఉండవు : శ్రీనివాస్‌రెడ్డి కొంపల్లి, యువ వ్యాపారవేత్త
నేను సీబీఐటీలో ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన తర్వాత రెండేళ్లపాటు ఉద్యోగం చేశాను. తర్వాత అంకిత్‌ అనే మిత్రుడితో వ్యాపారాన్ని ప్రారంభించాను. కంపెనీల్లో ఉద్యోగుల పనితీరు, వారి హాజరు తదితర అంశాలను లోపాలు లేకుండా గుర్తించే ప్రత్యేక అప్లికేషన్‌ను రూపొందించాం. వీటితో పాటు ఇప్పుడిప్పుడే మరిన్ని కొత్త ఉత్పత్తులను తయారు చేసే పనిలో ఉన్నాం. వీటన్నింటికీ మేం ఫేస్‌బుక్‌ లాంటి వేదికలను ఉపయోగించి మార్కెటింగ్‌ చేస్తున్నాం. దుబాయ్‌, ముంబాయి మార్కెట్లపై దృష్టిసారించాం. నగరంలోనూ వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాం. అంతర్జాలంలో సామాజిక వేదికల ద్వారా మార్కెటింగ్‌ చేయడం వల్ల సరిహద్దులు లేని వ్యాపారం చేయొచ్చు
* అపరిమిత అవకాశాలు... : వెంకటేష్‌ శేషాద్రి, ఫ్లాట్‌ఫెబుల్‌.కామ్‌
కొత్తగా వ్యాపారంలోకి అడుగుపెట్టాలనే ఆలోచన రాగానే ముందుగా మార్కెటింగ్‌ ఎలా చేయాలి అనే అంశానికే అధిక ప్రాధాన్యమిచ్చాం. మేం చేసే సేవలన్నీ ఆన్‌లైన్‌ ద్వారానే. వాటి గురించిన పూర్తి వివరాలను వివిధ అంతర్జాల సామాజిక అనుసంధాన వేదికల ద్వారానే వినియోగదారులకు అందిస్తున్నాం. ప్రస్తుతం వారి నుంచి మాకు మంచి స్పందన కనిపిస్తోంది.
* 90శాతం మంది... : అర్పిత, ఇంటర్న్‌ఫీవర్‌
సెలవుదినాల్లో ఇంటర్న్‌షిప్‌ చేయాలనుకునే విద్యార్థులకు అనువుగా ఉండేలా దీనిని ప్రారంభించాం. మొదట్లో కళాశాలలకు వెళ్లి అక్కడి విద్యార్థులకు దీని గురించి వివరించేవాళ్లం. దీని వల్ల సమయం, ఖర్చు ఎక్కువగా ఉండేవి. దీంతో ఫేస్‌బుక్‌ వేదికగా మా సంస్థ గురించి మార్కెటింగ్‌ చేయాలని నిర్ణయించుకున్నాం. ప్రస్తుతం 90శాతానికి పైగా విద్యార్థులు కేవలం ఫేస్‌బుక్‌ ద్వారానే మమ్ముల్ని సంప్రదిస్తున్నారు.
* బాధితులకు న్యాయం చేసేలా... : పల్లవ్‌, యువ సీఈఓ
వివిధ అంశాల్లో న్యాయం దక్కకుండా పోరాడుతున్న వారికి మద్దతుగా నిలిచేలా మేం ఒక సామాజిక అనుసంధాన వేదికను ఏర్పాటు చేశాం. ఫేస్‌బుక్‌ సాయంతో దేశంలోని పలు స్వచ్ఛంద సంస్థలను ఆన్‌లైన్‌ ద్వారా కలుస్తూ మా సంస్థ గురించి ప్రచారం చేస్తున్నాం. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే మాలాంటి యువతకు అందివచ్చిన సాంకేతికత ఎంతగానో ఉపయోగపడుతోంది.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning