కంప్యూటర్‌ విభాగంలో ఇవీ కోర్సులు

సత్వర ఆర్థికాభివృద్ధి, భారీ సంఖ్యలో ఉద్యోగాల కల్పనలకు కంప్యూటర్‌ రంగం చిరునామాగా మారడంతో ఔత్సాహికులకు దీనిపై ఆసక్తి పెరిగింది. విదేశాల్లో కూడా గణనీయమైన అవకాశాలు ఉండటంతో గిరాకీ ఉన్న బ్రాంచిగా కంప్యూటర్‌ సైన్స్‌కి ప్రఖ్యాతి లభించింది. ఈ రంగంలో కోర్సులూ, వాటికున్న అవకాశాలను తెలుసుకుందాం!
ప్రైవేటు రంగంలోని ఉద్యోగాలకు సంఘంలో గౌరవం ఆపాదించినదిగా కంప్యూటర్‌ రంగాన్ని చెప్పుకోవచ్చు. 'ఫలానా సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌' అని తల్లిదండ్రులు తమ పిల్లల గురించి గర్వంగా చెప్పుకునే స్థాయి కలిగించింది.
కంప్యూటర్‌ ప్రభావం ఇంచుమించు అన్ని రంగాలలోనూ ఉంది. దీనివల్ల ఈ రంగానికి కావలసిన సుశిక్షితులైన మానవ వనరుల అవసరాలను తీర్చడానికి రెండు కోర్సులున్నాయి. మొదటిది కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌, రెండోది కంప్యూటర్‌ సైన్స్‌. మనదేశంలో ఇంజినీరింగ్‌ స్థాయిలో కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ను కోర్సుగా ప్రవేశపెట్టారు. వివిధ ప్రైవేట్‌, ప్రభుత్వరంగ సంస్థలు ఈ రంగంలోని కొన్ని పరిమితమైన అనువర్తనం (అప్లికేషన్స్‌) కలిగిన డాటా ఎంట్రీ ఆపరేటర్‌, డెస్క్‌ టాప్‌ పబ్లిషింగ్‌ (డిటిపి) వంటి కోర్సులను కూడా ప్రవేశపెట్టారు.
కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌లో కంప్యూటర్ల తయారీ, కంప్యూటర్ల ద్వారా నియంత్రించే రోబో వంటి పరికరాల తయారీ ప్రధానాంశం. కంప్యూటర్‌ సైన్స్‌లో కంప్యూటర్ల వినిమయం, వాటికి కావలసిన క్రమసూత్ర పద్ధతుల (అల్గోరిథమ్‌), ప్రోగ్రాముల అభివృద్ధి ప్రధానాంశంగా ఉంటుంది. ఈ రెండు అంశాల సమ్మేళనంతో కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ కోర్సును దాదాపు అన్ని విశ్వవిద్యాలయాలూ ప్రవేశపెట్టాయి.
జె.ఎన్‌.టి.యు. తన పరిధిలోని ప్రాంగణంలో, అనుబంధ కళాశాలల ద్వారా, స్వయం ప్రతిపత్తి గల కళాశాలల ద్వారా కంప్యూటర్‌ రంగంలో నాలుగు ఇంజినీరింగ్‌ కోర్సులను ఆఫరు చేస్తున్నది. ఈ కోర్సుల మద్య ఉన్న పోలికలు, భేదాలు, వాటికి ఉన్న అవకాశాలు పరిశీలిద్దాం.
కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌
కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ సిస్టమ్స్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సిస్టమ్స్‌ ఇంజినీరింగ్‌ అని కూడా వ్యవహరించే ఈ కోర్సులో సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ సంబంధిత అంశాలుంటాయి. ఇంకా ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌లకు చెందినవి ఉంటాయి. ఈ రెండు బ్రాంచీలకి సంబంధించిన కోర్సుల్లో శిక్షణ పొందడం ద్వారా విద్యార్థులు కంప్యూటర్‌ వ్యవస్థల రూపకల్పనకు కావలసిన మౌలిక అంశాల పట్ల అవగాహన ఏర్పరచుకుంటారు.
ప్రోగ్రాములు రాయడం సాఫ్ట్‌వేర్‌కి చెందిన అంశం అయితే మైక్రో కంట్రోలర్‌, సెన్సర్లు, చిప్స్‌ తయారీకి సంబంధించిన కోర్సులు హార్డ్‌వేర్‌కి సంబంధించినవి. ఈ రెండింటి సంయోగమే కంప్యూటర్‌ వ్యవస్థ అని చెప్పవచ్చు.
ఈ కోర్సులో మైక్రో ప్రాసెసర్‌ ఆధారిత పరికరాల డిజైన్‌, సర్క్యూట్‌ సిస్టమ్స్‌ అభివృద్ధి, రౌటర్ల, వీడియో కార్డుల తయారీ, కంప్యూటర్ల డిజైన్‌లోని మెలకువలపై ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది. కంప్యూటర్ల పనితనం మీదనే కాకుండా వాటిని ఒక వ్యవస్థలో అనుసంధానం ఎలా చెయ్యవచ్చో తెలిపే కోర్సుగా దీన్ని చెప్పుకోవచ్చు. సూక్ష్మంగా చెప్పాలంటే దీన్ని అధ్యయనం చేసినవారు కంప్యూటర్‌ పరికరాలతో పని చేయించగలరు.
ఈ కోర్సులో రాణించాలంటే గణితశాస్త్రంలో అభిరుచే కాక ఒక స్థాయి వరకు ప్రావీణ్యం కూడా అవసరం. భౌతికశాస్త్రంలో కూడా మంచి ప్రవేశం ఉండాలి. ఈ కోర్సులో నేర్పే సబ్జెక్టుల్లో ముఖ్యమైనవి- కోడింగ్‌, క్రిప్టోగ్రఫి, సమాచార రక్షణ (ఇన్ఫర్మేషన్‌ ప్రొటెక్షన్‌), కమ్యూనికేషన్స్‌, నిస్తంత్రీ సమాచార వ్యవస్థా యంత్రాంగం (వైర్‌లెస్‌ నెట్‌వర్క్స్‌) ప్రోగ్రాముల కూర్పరి (కంపైలర్స్‌), కంప్యూటర్‌ నెట్‌వర్క్స్‌, మొబైల్‌ కంప్యూటింగ్‌, డిస్ట్రిబ్యూటెడ్‌ సిస్టమ్స్‌, సమాంతర ప్రక్రియ (పారలల్‌ ప్రాసెసింగ్‌), కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌, సిగ్నల్‌ ప్రాసెసింగ్‌.
కంప్యూటర్‌ ఇంజినీర్లకు కంప్యూటర్‌ సైన్స్‌ పట్ల కూడా అవగాహన ఉండటం అభిలషణీయం. దీనివల్ల ఒక ప్రోగ్రామ్‌ పనిచెయ్యడానికి అవసరమైన కంప్యూటర్‌ పరికరాలను అభివృద్ధి చెయ్యగలిగి ఉంటారు. సాంకేతిక పురోగతికి అనుగుణంగా ఆర్థికంగా మితవ్యయంలో, సమర్థంగా పనిచేసి మైక్రోచిప్‌, మైక్రో ప్రాసెసర్‌ల తయారీకి వీరు దోహదపడతారు.
కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌
వివిధ రంగాల్లో కంప్యూటర్ల వినియోగానికి ఉపయోగపడే సాంకేతిక, శాస్త్రపరమైన జ్ఞానాన్ని నేర్పే సబ్జెక్టులున్న బ్రాంచి ఇది. సి.ఎస్‌.ఇ. అనే స్థూలనామంతో వ్యవహరించే ఈ బ్రాంచి అత్యధిక ఉద్యోగావకాశాలను కల్పించిన రంగంగా చెప్పవచ్చు.
కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌లో కంప్యూటర్‌ శాస్త్ర సిద్ధాంతాలు, వాటి అనువర్తనానికి (అప్లికేషన్స్‌) సంబంధించిన సబ్జెక్టులుంటాయి. ఇంజినీరింగ్‌ (సి.ఎస్‌.ఇ.) చేసినవారు యాంత్రిక పద్ధతుల అభివృద్ధి (అల్‌గరిథమ్స్‌ డెవలప్‌మెంట్‌), వాటిని కంప్యూటర్‌ ప్రోగ్రాములుగా తిరిగి రాయడం అనే అంశాలపై పట్టు సాధించే అవకాశం ఉంటుంది.
సిద్ధాంత ఆధారిత కంప్యూటర్‌ సైన్స్‌ (థియరిటికల్‌ కంప్యూటర్‌ సైన్స్‌), అనువర్తిత కంప్యూటర్‌ సైన్స్‌ (అప్త్లెడ్‌ కంప్యూటర్‌ సైన్స్‌) అనే రెండు విశేష అధ్యయన ఉపవిభాగాలుగా విభజించవచ్చు. మొదటిదానిలో ప్రామాణిక లేక సాంప్రదాయిక పరికలన సిద్ధాంతం (క్లాసికల్‌ థియరీ ఆఫ్‌ కంప్యూటేషన్‌) తో పాటు సారాంశ (అబ్‌స్ట్రాక్ట్‌), తర్క (లాజిక్‌), గణితశాస్త్ర అంశాలను గురించి నేర్చుకుంటారు. కంప్యూటర్‌ రంగంలో రిసెర్చి చెయ్యాలనుకునేవారికి ఈ జ్ఞానం చాలా అవసరం. రెండో ఉపవిభాగంలో కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌), కంప్యూటర్‌ నిర్మాణ శాస్త్రం (కంప్యూటర్‌ ఆర్కిటెక్చర్‌), కంప్యూటర్‌ గ్రాఫిక్‌ డిజైన్‌ వంటి ప్రయోగాత్మక, అనువర్తిత సబ్జెక్టులు, నిజజీవిత సమస్యల కంప్యూటరీకరణ, ప్రోగ్రాముల రూపకల్పన గురించి నేర్చుకుంటారు. ఐతే బి.టెక్‌ (సి.ఎస్‌.ఇ.)లో ఈ రెండు ఉప విభాగాలకు సంబంధించిన సబ్జెక్టులూ ఉంటాయి.
కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీర్లు కూడా శాస్త్రజ్ఞుల కోవకు చెందినవారుగా భావించవచ్చు. వారి చదువు పరికలన అనువర్తనానికి సంబంధించిన సిద్ధాంతాల (థియరీ ఆఫ్‌ కంప్యూటేషనల్‌ అప్లికేషన్స్‌)పై కేంద్రీకృతమై ఉంటుంది. అంటే వీరికి కంప్యూటర్‌ ప్రోగ్రాములు ఎందుకు పనిచేస్తాయి అన్నదానిపై అవగాహన ఉంటుంది. గణితశాస్త్ర, క్రమసూత్ర పద్ధతులు, తర్కం ఆధారంగా వీరు కంప్యూటర్లు కొత్త పద్ధతుల్లో సమస్యలు సాధించే పద్ధతుల క్రమవృద్ధికి పాటు పడతారు.
కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ మాదిరే కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌కి కూడా గణితశాస్త్రంలో అధిక అభిరుచి అవసరం. ప్రత్యేకించి రేఖీయ బీజగణితం (లీనియర్‌ ఆల్జీబ్రా)లోని వర్గాలు (సెట్స్‌), సంబంధాలు (రిలేషన్స్‌), ప్రమేయాలు అధ్యాయాలు బాగా నేర్చుకుని ఉండాలి. ఈ విషయాల పరిజ్ఞానం ప్రోగ్రామింగ్‌కి సంబంధించిన సి, జావా వంటి సబ్జెక్టులు, డేటాబేస్‌ సిస్టమ్స్‌, లాంఛన పద్ధతులు (ఫార్మల్‌ మెథడ్స్‌) కృత్రిమ మేధ, క్రిప్టోగ్రఫి వంటి సబ్జెక్టులు నేర్చుకోవడానికి చాలా అవసరమౌతుంది.
ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌
ఈ బ్రాంచిలో దాదాపు సగం ఎలక్ట్రానిక్స్‌ బ్రాంచికి సంబంధిత సబ్జెక్టులు, మిగతా సగం కంప్యూటర్‌ సైన్స్‌కి సంబంధించిన సబ్జెక్టులు ఉంటాయి. ఈ కోర్సుకి కూడా గణిత, భౌతికశాస్త్రాల్లో మంచి ప్రవేశం అవసరం.
దీనిలో డిగ్రీ పూర్తిచేసినవారికి కంప్యూటర్‌ రంగంలోని పరిశ్రమల్లో, ఎలక్ట్రానిక్స్‌ రంగంలోని పరిశ్రమలో అవకాశాలుంటాయి. ప్రత్యేకించి నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేటర్లుగా, ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్‌ రంగానికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ డెవలపర్లుగా చేరవచ్చు. ప్రభుత్వ ఉద్యోగావకాశాలు కూడా పుష్కలంగా ఉంటాయి.
ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ
బి.టెక్‌ (సి.ఎస్‌.ఇ.)లో ప్రవేశం పొందలేనివారు సాధారణంగా ఐ.టి. వైపు మొగ్గు చూపుతుంటారు. ఈ రెండింటిలోనూ మూడు నాలుగు సబ్జెక్టులు మినహా ఇంచుమించు అన్ని సబ్జెక్టులూ సమానమవ్వడంతో గతంలో చాలామంది ఈ కోర్సును ఎంచుకున్నారు. ఐతే ఆర్థిక పరమైన, ఇతర కారణాలవల్ల తలెత్తే ఒడిదుడుకులు తరచుగా కంప్యూటర్‌ సైన్స్‌ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుండటంతో ఉద్యోగాలు కొంతమేరకు స్థిరత్వాన్ని ఇవ్వలేకపోతున్నాయి. దీనికి తోడు సి.ఎస్‌.ఇ. అనేది ఐ.టి. కన్నా మంచిది అనే భ్రమ ఐ.టి. పట్ల నిరాదరణగా మారింది. చాలా కళాశాలల్లో ఐ.టి. కోర్సు మూసివేతకు దారితీసింది.
ఉద్యోగ రీత్యా సి.ఎస్‌.ఇ., ఐ.టి.ల మధ్య కొన్ని ముఖ్యమైన భేదాలున్నాయి. సి.ఎస్‌.ఇ.కి చెందినవారు కంప్యూటర్‌ టెక్నాలజీని పెంపొందించేవారు. ఐ.టి.కి చెందినవారు కంప్యూటర్‌ టెక్నాలజీ వినియోగదారులు. ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌, సాఫ్ట్‌వేర్‌లను అనుసంధానం చేస్తూ వివిధ సంస్థలు సజావుగా నడవడానికి, ఉత్పాదకత పెంపొందించడానికి, నూతన ఉత్పత్తుల రూపకల్పనకు తమ విలువైన సేవలనందిస్తారు. అంటే చేసే పని ప్రవృత్తి రీత్యా ఐ.టి. రంగంలోనివారికి వినిమయదారులతో సంబంధాలు ఎక్కువగా ఉంటాయి.
ఇంజినీరింగ్‌ (ఐ.టి.) చెయ్యాలనుకునేవారికి కూడా గణిత శాస్త్రం మీద మంచి పట్టు ఉండాలి. దీనితో పాటుగా వ్యవహారశైలి పట్ల ఆసక్తి ఉన్నవారు బాగా రాణించగలరు. ఈ రంగంలో సాఫల్యాన్ని సాధించాలంటే, వివిధ రకాల సంస్థల పనితీరు గురించి తెలుసుకోవాలి. ఇంకా వాటిని సమర్థంగా నిర్వహించడానికి కంప్యూటర్‌ విజ్ఞానం ఎలా ఉపయోగపడుతుందో కూడా తెలుసుకోగలగాలి. వీటికి తోడు మంచి మాటకారితనం, ఎదుటివారిని నొప్పించకుండా ఒప్పించగలగడం నేర్చుకోవాలి.
ఐ.టి. చేసినవారు నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేటర్లుగా, డేటాబేస్‌ అడ్మినిస్ట్రేటర్లుగా, ఇంకా ఐ.టి. అనలిస్ట్‌, సెక్యూరిటీ అనలిస్టు, నెట్‌వర్క్‌ ఆర్కిటెక్టు, ఐ.టి. సలహాదారులుగా వివిధ అవకాశాలు పొందగలరు.
అన్ని దేశాలూ త్వరితగతిన ఆర్థికాభివృద్ధి చెందాలంటే కంప్యూటర్‌ టెక్నాలజీ రంగం సహాయ సహకారాలు లేకుండా సాధ్యం కాదన్నది నిజం. తాత్కాలికమైన ఆటుపోట్లు ఏ రంగంలోనైనా తప్పవు. ఈ ఒడిదుడుకులను తట్టుకుని ఎదగాలంటే, ఆ రంగంపై ఆసక్తి ఉండడం ఎంతో అవసరం. ఆపైన ఆ రంగంలో మనస్ఫూర్తిగా కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. ఐ.టి. రంగం కానీ మరో రంగం కానీ మాంద్యానికి లోనైనట్టు కనిపించవచ్చు. కానీ దీర్ఘకాలంలో అన్ని రంగాలూ సమానమైన అభివృద్ధినిస్తాయని మరువకూడదు.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning