యంత్రవిద్యకు ప్రత్యామ్నాయ దృష్టి

* ఇతర కోర్సులపై విద్యార్థుల ఆరా
* నిన్నటి వరకు 'ఇంజినీరింగ్‌'పైనే విద్యా ప్రదర్శనలు
* ఈ ఏడాది తెరపైకి ఫైన్ ఆర్ట్స్, ఆర్కిటెక్చర్
* ఎడ్యుకేషన్ ఫెయిర్ల బాటలో జేఎన్ఎఫ్ఏయూ, అనుబంధ కళాశాలలు


ఈనాడు, హైదరాబాద్: దశాబ్దంన్నర వెనక్కి వెళితే డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు ఎవరి నోట విన్నా మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అనే వినిపించేది.. ఇప్పుడు ఆ కోర్సులు కనుమరుగవుతున్నాయి. దాదాపు దశాబ్దం నుంచి ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థుల లక్ష్యం ఇంజినీరింగ్, మెడిసిన్. సాధారణ డిగ్రీ పూర్తిచేసిన వారూ సాఫ్ట్‌వేర్‌కు సంబంధించి ఓ సర్టిఫికెట్ కోర్సు చేస్తే చాలు రూ.వేలల్లో వేతనాలు.. ఐటీ బూమ్ ఫలితమది. ఇప్పుడు ఆ బూమ్ పడిపోవడంతో పుట్టగొడుగుల్లా వెలిసిన ఇంజినీరింగ్ కళాశాలలు క్రమేణా మూతపడే దుస్థితికి చేరుకుంటున్నాయి. అందుకే విద్యార్థులు ప్రత్యామ్నాయ కోర్సుల వైపు దృష్టి సారిస్తున్నారు. ఇంజినీరింగ్ బదులు ఉద్యోగావకాశాలున్న కోర్సులపై ఆరా తీస్తున్నారు. ఈ పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్న ఇతర కోర్సులను అందించే విద్యాసంస్థలు విద్యా ప్రదర్శనకూ తెరతీశాయి. ఆయా కోర్సులపై అవగాహన కల్పిస్తూ విద్యార్థులను ఆకట్టుకునేందుకు తహతహలాడుతున్నాయి.
గత కొన్నేళ్లుగా ఎడ్యుకేషన్ ఫెయిర్ అంటే ఇంజినీరింగ్ కోర్సులకు సంబంధించినవే అన్నట్లు పరిస్థితి మారిపోయింది. హైదరాబాద్‌లాంటి మెట్రో నగరాల్లో మాత్రం ఇంజినీరింగ్‌తో పాటు తరచూ విదేశీ విద్యపై కన్సల్టెన్సీలు, విదేశీ విద్యాసంస్థలు విద్యాప్రదర్శనలు ఏర్పాటు చేయడం సాధారణమైంది. ఇతర ఎన్ని కోర్సులున్నా...అలాంటి వాటిని అందించే సంస్థలు ఎన్నున్నా ఎడ్యుకేషన్ ఫెయిర్ ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. గతేడాది వరకు అదే వాస్తవం. ఈ సంవత్సరం అందుకు భిన్నంగా ఫైన్ ఆర్ట్స్, ఆర్కిటెక్చర్ కోర్సులకు సంబంధించి విద్యాప్రదర్శలు జరపడం కొత్త ట్రెండ్. అందుకు మాసబ్ ట్యాంకులోని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం చొరవ తీసుకుంది. కొద్ది రోజుల క్రితం ఫైన్ ఆర్ట్స్ కింద వచ్చే యానిమేషన్, పెయింటింగ్, అఫ్త్లెడ్ ఆర్ట్స్, ఫొటోగ్రఫీ, శిల్పకళ కోర్సులపై విశ్వవిద్యాలయం, తన అనుబంధ కళాశాలలు సంయుక్తంగా విశ్వవిద్యాలయం ప్రాంగణంలోనే విద్యాప్రదర్శన నిర్వహించాయి. తాజాగా అదే వర్సిటీ, తనకు అనుబంధంగా ఉండి ఆర్కిటెక్చర్, ప్లానింగ్ కోర్సులను అందించే విద్యాప్రదర్శనను ఈనెల 5, 6వ తేదీల్లో జరిపింది. విశ్వవిద్యాలయంతోపాటు మరో తొమ్మిది ప్రైవేట్ కళాశాలలు పాల్గొన్నాయి. యానిమేషన్ విభాగం అధ్యాపకుడు ముకుందరావు సైతం మూడు ఆదివారాలు ఫైన్ ఆర్ట్స్ కోర్సులపై ఉచితంగా అవగాహన తరగతులు నిర్వహించడం విశేషం. సాఫ్ట్‌వేర్ రంగం పరిస్థితిలో మార్పు రాకపోతే ఇంటీరియర్ డిజైన్, ఫ్యాషన్ టెక్నాలజీ, కాస్మోటాలజీ, సంప్రదాయ డిగ్రీ కోర్సులను అందించే విద్యాసంస్థలు సైతం ప్రత్యేకంగా ఎడ్యుకేషన్ ఫెయిర్‌ను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని విద్యావేత్తలు భావిస్తున్నారు. 'ఫైన్ ఆర్ట్స్ కోర్సులపై విద్యాప్రదర్శన నిర్వహించగా 200 దరఖాస్తులు పెరిగాయి...సందర్శించిన వారందరూ చేరకున్నా ఇంజినీరింగ్ కోర్సులే కాకుండా ఇతర మంచి కోర్సులు చాలా ఉన్నాయని అవగాహన పెంపొందించాలన్నది మా ప్రయత్నం అని జేఎన్ఎఫ్ఏయూ అకడమిక్ సెల్ సంచాలకుడు ఆచార్య ప్రదీప్‌కుమార్ చెప్పారు.
ఇంజినీరింగ్ నుంచి దూరంగా...
అమెరికా, చైనా కంటే ఒక్క మన దేశం నుంచే ఎక్కువ మంది ఇంజినీర్లు వస్తున్నారు. అమెరికాలో ఏటా లక్ష మంది, చైనాలో 11 లక్షల మంది ఇంజినీర్లు తయారవుతుంటే భారత్‌లో ఏటా 14-15 లక్షల మంది డిగ్రీ పట్టాలు పుచ్చుకొని వస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఏటా 1.70 లక్షల మంది తయారవుతున్నారు. 2008 తర్వాత నాలుగేళ్లలో ఇంజినీరింగ్ కళాశాలలు దేశంలో 1,668 నుంచి 3393కు పెరిగాయి. అదే సమయంలో ఐటీ రంగంలో ఉద్యోగాలు 3.41 లక్షల నుంచి 2.35 లక్షలకు తగ్గాయి. ఉద్యోగాలు తగ్గి ఇంజినీర్లు పెరగడంతో అందరికీ ఉద్యోగాలు కష్టంగా మారింది. ఫలితంగా ఉద్యోగావకాశాలు ఉన్న కోర్సులను వెతికేవారు అధికమవుతున్నారు. గత ఏడాది రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.10 లక్షల ఇంజినీరింగ్ సీట్లు మిగిలిపోయాయి. అందులో కన్వీనర్ కోటా సీట్లు 70 వేలు ఉండటం గమనార్హం.
కామర్స్ కోర్సులు
గత కొన్నేళ్లుగా వీటికి డిమాండ్ పెరుగుతోంది. ఓయూ పరిధిలో డిగ్రీ కోర్సుల్లో ఎక్కువగా బీకాంనే ఎంచుకుంటున్నారు. మొత్తం 1.70 లక్షలమంది డిగ్రీ చివరి ఏడాది పరీక్షలు రాయగా వారిలో లక్ష మంది బీకాం విద్యార్థులే. బ్యాంకింగ్, ఐటీ సంస్థలు డిగ్రీ విద్యార్థులను ఎంపిక చేసుకొని శిక్షణ ఇచ్చుకుంటున్నాయి. దీంతో సంప్రదాయ కోర్సులకూ ఆదరణ పెరుగుతోంది. ఇంటర్ తర్వాత సీఏలో చేరుతున్న వారు శరవేగంగా పెరుగుతున్నారు. ఈ ఏడాది 250 మంది విద్యార్థులు చేరగా వారిలో 60 మంది పదో తరగతిలో 9.5 గ్రేడ్ పాయింట్ల కంటే ఎక్కువ వచ్చిన వారేనని అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ అవినాష్ తెలిపారు. కంపెనీలకు 2016 నుంచి అంతర్జాతీయ అకౌంటింగ్ ప్రమాణాలు తప్పనిసరి చేస్తున్నందున ఈ కోర్సులకు డిమాండ్ మరింత అధికమవుతుందని అంచనా.
డిజైన్ రంగం
దీనికి సైతం మంచి డిమాండ్ పెరుగుతోంది. హస్తకళలకు భారత్ ప్రసిద్ధి. ప్రపంచ స్థాయి మార్కెట్లో నిలవాలంటే మరింత కష్టపడాల్సి ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వం అహ్మదాబాద్, గాంధీనగర్, బెంగళూరులో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్ఐడీ)లను నెలకొల్పింది. వచ్చే ఐదారేళ్లలో భారత్‌లో 20 వేల మంది డిజైనర్లు అవసరం అవుతారని అంచనా వేశారు. అందుకే విజయవాడతోపాటు అసోం, హర్యానా, మధ్యప్రదేశ్‌లో ఎన్ఐడీలను నెలకొల్పుతున్నారు. మొదట హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలనుకున్నా తర్వాత దాన్ని విజయవాడలో ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం 3ఎన్ఐడీల్లో 100 శాతం విద్యార్థులకు ప్లేస్‌మెంట్లు లభిస్తున్నాయి. అత్యధికంగా రూ.30 లక్షల వరకు వేతనం ఇచ్చి కంపెనీలు విద్యార్థులను ఎంపిక చేసుకుంటున్నాయి. ఈ కోర్సుల్లో ప్రవేశానికి సెప్టెంబరు, అక్టోబరులో నోటిఫికేషన్ విడుదలవుతుంది. ప్రవేశ పరీక్ష అనంతరం జూన్ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.
యానిమేషన్, గేమింగ్
ఈ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది.భారత్ యానిమేషన్ రంగం విలువ రూ.5,400 కోట్లుగా అంచనా. ఈ రంగంలో 80 వేల మందికిపైగా పనిచేస్తున్నారు. అమెరికా తరహాలో యానిమేషన్ కోర్సులకు ప్రమాణాలను నిర్దేశించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోంది. అందువల్ల మరో 25 వేలమంది నిపుణులైన ఉద్యోగులు అవసరమవుతారని అంచనా. వచ్చే నాలుగేళ్లలో ఈ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని చెబుతున్నారు. గేమింగ్ పరిశ్రమకు గతేడాది ప్రభుత్వం హైదరాబాద్‌లో స్థలం కేటాయించిన సంగతి తెలిసిందే.
బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (బీఆర్క్)
ఇది ఇంజినీరింగ్‌తో సరిసమానమైన కోర్సు. ఐఐటీ, ఎన్ఐటీలతోపాటు జేఎన్ఎఫ్ఏయూ ఈ కోర్సును అందిస్తున్నాయి. విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్(ఎస్‌పీఏ)లో కూడా కొన్ని కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఓ అధ్యయనం ప్రకారం వచ్చే పదేళ్లలో భారత్‌లో 4 లక్షల మంది ఆర్కిటెక్టులు అవసరం అవుతారని వెల్లడైంది. నిర్మాణరంగంలోకి టాటా, మహేంద్రా అండ్ మహేంద్రా తదితర ప్రముఖ కంపెనీలు సైతం ప్రవేశిస్తుండటం, 2050 నాటికి సగం జనాభా నగరాల్లోనే నివసిస్తారన్న అంచనాలు ఉండటంతో ఆర్కిటెక్టుల అవసరం పెరగనుంది. తాజాగా కేంద్రం దేశంలో 100 స్మార్ట్ సిటీలను నిర్మిస్తామని ప్రకటించింది. వీటన్నింటిని పరిశీలిస్తే ఆర్కిటెక్చర్ కోర్సులను అభ్యసించిన వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పొచ్చు.
ఫెయిర్ చాలా ఉపయోగకరం - ఆర్.శ్రీజ
ఆర్కిటెక్చర్ కోర్సు గురించి తెలుసుకోవాలనుకునే వారికి ఈ ఫెయిర్ ఉపయోగకరం. సృజనాత్మక కళలో రాణించాలంటే దాన్ని సవాలుగా తీసుకోవాలి. మంచి జీతభత్యాలతోపాటు విస్తృత అవకాశాలున్న ఈ కోర్సుల్లో శిక్షణ పొందాలని ఉంది.
నిపుణుల కొరతతోనే డిమాండ్ - బి.సాధన
నేను ఎంసెట్ రాశాను. అయినా ఆర్కిటెక్చర్‌కు మంచి డిమాండ్ ఉండడంతో ఫెయిర్‌కు వచ్చాను. దీంతో కోర్సుల వివరాలు తెలిశాయి. ఆర్కిటెక్చర్‌లో నిపుణుల కొరత ఏర్పడటంతో డిమాండ్ నెలకొంది. మన దగ్గర మేధస్సు, మానవ వనరులు పుష్కలంగా ఉన్నా కొరతకు కారణం సరి అయిన దిశలో బోధన లేకపోవటమే. ఈ కోర్సుకు మన దగ్గరే కాకుండా విదేశాల్లో సైతం మంచి డిమాండ్ ఉందని తెలుస్తోంది.
* మొదట్లోనే స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్న విద్యార్థులు అందుకనుగుణంగా కోర్సులను ఎంపిక చేసుకుంటున్నారు. సివిల్ సర్వీసెస్ లక్ష్యంతో వందలాది మంది బీఏ కోర్సుల్లో చేరుతున్నారు. ఆ కోర్సు చదువుతూనే పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు.
* వచ్చే అయిదేళ్లలో ఒక్క బ్యాంకింగ్ రంగంలోనే 7.5 లక్షల ఉద్యోగాలు వస్తాయని ఆ రంగ నిపుణులు చెబుతున్నారు. దీంతో వాటిపై దృష్టి పెట్టిన విద్యార్థులు బీకాం, బీఎస్‌సీ చదువుతూనే బ్యాంకు పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు.
ప్రభుత్వం ప్రోత్సహించాలి - డి.విద్య
మార్కెట్లో మంచి డిమాండున్న కోర్సుల్ని సర్కారు ప్రోత్సహించాలి. చాలా మంది ఇంజినీరింగే చేస్తున్నారు.. ఆవేపు అంతగా అవకాశాలుండటం లేదు. అవసరాలను తీర్చేలా కొత్తకోర్సుల్ని ప్రోత్సహిస్తే పేద విద్యార్థులకు డిమాండున్న కోర్సుల్లో శిక్షణ పొందే అవకాశం ఉంటుంది.
మంచి అవకాశాన్ని కల్పించింది - జి.శ్రీముఖి
జేఎన్ఎఎఫ్ఎ వర్సిటీ అందించిన ఆర్కిటెక్చర్ ఎడ్యుకేషన్ ఫెయిర్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. సృజనకు అద్దంపట్టే ఇలాంటి కోర్సుల్లో చేరితే ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఇబ్బంది ఉండదు. వర్సిటీ యాజమాన్యానికి ధన్యవాదాలు.
ఉద్యోగం దొరికే కోర్సుల్లో చేరాలని ఉంది - అవినాష్
ఆర్కిటెక్చర్ కోర్సుకు ఇంత మంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాలున్నాయని ఇంతకు ముందు నాకు తెలీదు.వెంటనే ఉద్యోగం దొరికే కోర్సుల్లో చేరాలని ఉంది. పరీక్షల నిర్వహణ, సర్టిఫికెట్ల ప్రదానం కూడా వర్సిటీ ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు. వర్సిటీకి దేశవిదేశాల్లో సైతం మంచి పేరుందని విన్నాను.
అవగాహన కల్పించక పోవడమూ లోపమే - డి.ముకుందరావు, అధ్యాపకుడు, జేఎన్ఎఫ్ఏయూ
వివిధ కోర్సులను ప్రారంభిస్తున్న విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు వాటిని చదివితే ఎలాంటి, ఏ పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలు వస్తాయి? ..దేశానికి ఉన్న అవసరాలు ఏమిటన్నది చెప్పడం లేదు. దానివల్ల కొన్ని మంచి కోర్సులున్నా విద్యార్థులకు తెలియక చేరడం లేదు. కొందరు ఎవరో చెప్పిన మాటలను విని ఏమాత్రం డిమాండ్ లేని కోర్సులలోనూ చేరేవారున్నారు. ఉదాహరణకు సృజనాత్మకత ఉన్న వారు ఫైన్ ఆర్ట్స్ కోర్సులను చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. అలాంటి వారు అందుకు భిన్నమైన కోర్సులో చేరితే తన పూర్తిస్థాయి శక్తి, సామర్ధ్యాలను వినియోగించలేరు. అందుకే ఇటీవల మూడుసార్లు ఫైన్ ఆర్ట్స్ కోర్సులపై అవగాహన తరగతులు నిర్వహించాను.
బీకాం సీట్లకు తీవ్ర పోటీ - ఆచార్య వీరభద్రం, వైస్ ప్రిన్సిపాల్, నిజాం కళాశాల
సాఫ్ట్‌వేర్ భూమ్ తగ్గడంతో మూడు నాలుగేళ్ల నుంచి కళాశాలలోని డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి నిజాం కళాశాలకు 2 వేల దరఖాస్తులు పెరిగాయి. గత సంవత్సరం 5,628 దరఖాస్తులు అందగా ఈసారి 7,540 వచ్చాయి. కళాశాలలో ఉన్న సీట్లు 660 మాత్రమే. బీఎస్‌సీలో 150 సీట్లకు 2909 దరఖాస్తులు రాగా బీకాంలో 90 సీట్లకు 2,210 మంది దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. అయితే ఇంత డిమాండ్ అన్నీ కళాశాలల్లో ఉందని చెప్పలేం. సంప్రదాయ కోర్సుల్లో కూడా బీకాంకు భవిష్యత్తు ఉందన్నది నిజం. గతంలో అత్యధిక శాతం సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు కోసం ఇంజినీరింగ్‌లో చేరేవారు. ఆ రంగం కేవలం 10-20 శాతం మందికే ఉద్యోగాలు ఇవ్వగలదని వాస్తవం అర్థం కావడంతో మళ్లీ ప్రత్యామ్నాయ, సంప్రదాయ కోర్సుల వైపు మళ్లుతున్నారు. మా కళాశాలే కాదు.. ఉస్మానియా విశ్వవిద్యాలయం వ్యాప్తంగా బీకాంలో చేరే విద్యార్థుల సంఖ్య బాగా పెరుగుతోంది.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning