వారంలో కొత్త ఐటీ విధానం!

* రానున్న ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలు
* విప్రో, టెక్‌మహీంద్రా, సమీర్ ఏర్పాటుకు అవకాశం
* ఐటీశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి వెల్లడి

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న ఐదేళ్లల్లో ఐటీ రంగం ద్వారా 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఐటీశాఖ మంత్రి పల్లెరఘునాథ్‌రెడ్డి వెల్లడించారు. పెట్టుబడులు ఆకర్షిస్తూ, యువతకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో వారం రోజుల్లో ప్రత్యేక ఐటీ విధానాన్ని ప్రకటించనున్నట్లు ఆయన చెప్పారు. ముసాయిదా విధానానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకారం తెలిపారని, రానున్న మంత్రిమండలి సమావేశంలో ఆమోదించాల్సి ఉందని తెలిపారు. కొత్త విధానంపై జులై 9న ముఖ్యమంత్రి లేక్‌వ్యూ అతిధి గృహంలో సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి రఘునాథరెడ్డి ఉన్నతాధికారులతో కలిసి మీడియాతో మాట్లాడారు.
కొత్త విధానం మేరకు ఏకగవాక్ష విధానం ద్వారా పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన అనుమతులన్నీ నాలుగు వారాల్లో మంజూరు చేస్తామని చెప్పారు. ఒకవేళ నెల రోజుల్లో ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం రాకుంటే... ఆ దరఖాస్తుకు ఆమోదం లభించినట్లుగానే గుర్తిస్తామని స్పష్టం చేశారు. ఈ విధానంతో ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ అభివృద్ధి జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. దాదాపు 300 కంపెనీల ప్రతినిధులతో మాట్లాడగా వారంతా కార్యకలాపాలు విస్తరించేందుకు అంగీకరించారని వెల్లడించారు. విశాఖపట్నం, తిరుపతిలో ఐటీఐఆర్, విజయవాడ, అనంతపురం, కాకినాడలో మెగాఐటీ హబ్‌లు ఏర్పాటు చేస్తామని వివరించారు. విశాఖపట్నంలో విప్రోసంస్థ 7500 మందికి, టెక్ మహీంద్రా 5వేల మందికి ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకు వచ్చాయని, కేంద్ర ప్రభుత్వ ఐటీ పరిశోధన సంస్థ 'సమీర్ కేంద్రం కూడా ఏర్పాటవుతుందని చెప్పారు.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning