వయసు ఇరవై ఏళ్లు.. సీబీఐకే పాఠాలు!

ఓ కంపెనీకి సీఈవో... పంజాబ్‌ పోలీసు అకాడెమీకి సలహాదారు...కాకలుతీరిన వ్యాపారవేత్తలకు మార్గదర్శకుడు... ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు కన్సల్టెంట్‌... ఇండియాలోని టాప్‌ టెన్‌ ఎథికల్‌ హ్యాకర్స్‌లో ఒకడు... నిండా ఇరవై ఏళ్త్లెనా నిండని కుర్రాడి ఘనతలివి... పది కూడా పాస్‌కాని విద్యార్థి చిత్రాలివి... అతడే లూథియానాకి చెందిన తృష్ణిత్‌ అరోరా... తాజాగా కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి మెంటర్‌గా నియమితులయ్యాడు...
ఒక అమ్మాయికి ఓ మెయిల్‌ నుంచి అదే పనిగా అశ్లీల ఫొటోలు, సందేశాలు రాసాగాయి. పోలీసులను ఆశ్రయించిందామె. ఆ మెయిల్‌ ఓ కుర్రాడిదని తెలుసుకొని స్టేషన్‌కి తీసుకొచ్చారు. కానీ చిత్రంగా అవి పంపింది అతడు కాదని తేలింది. అతడి ప్రమేయం లేకుండానే మరెవరో ఉపయోగిస్తున్నారని తెలిసింది. పోలీసులు వెంటనే తృష్ణిత్‌ని సంప్రదించారు. ఆ మెయిల్స్‌ ఎక్కడినుంచి వస్తున్నాయో, ఎవరు పంపిస్తున్నారో..గంటలో వివరాలు పోలీసుల చేతిలో పెట్టాడు. ఆఖరికి తేలిందేమంటే ఆ హ్యాకర్‌ ఇద్దరికీ పరిచయం ఉన్నవాడే. ఇదొక్కటే కాదు.. వందల ఫేక్‌ ఫేస్‌బుక్‌ అకౌంట్ల గుట్టువిప్పుతూ.. ఆన్‌లైన్‌ నేరగాళ్ల పని పడుతూ ఎన్నో కేసులు ఛేదించాడు తృష్ణిత్‌.
టాప్‌ ఎథికల్‌ హ్యాకర్‌
తృష్ణిత్‌ ఇప్పుడు అంతర్జాతీయ గుర్తింపు ఉన్న ఎథికల్‌ హ్యాకర్‌. సైబర్‌ నేర పరిశోధకుడు. సొంతరాష్ట్రం పంజాబ్‌. చిన్నప్పట్నుంచీ చదువులో చురుకే. ఓరోజు అతడి నాన్న ఓ పర్సనల్‌ కంప్యూటర్‌ తెచ్చారు. అప్పట్నుంచి అదే అతడి లోకం. ఎప్పుడూ గేమ్స్‌ ఆడేవాడు. బోర్‌ కొడితే కంప్యూటర్‌ విప్పదీసి మళ్లీ బిగించేవాడు. బంధువులు, చుట్టుపక్కల ఇళ్లలో ఎవరి కంప్యూటర్‌ చెడిపోయినా అతడి చేయి పడాల్సిందే! ఏదైనా సందేహం వచ్చినా, అర్థం కాకపోయినా ఆన్‌లైన్‌లో గాలించేవాడు. ఈ ధ్యాసలో చదువు పక్కదారి పట్టి ఎనిమిదితోనే అటకెక్కింది. ఈ సమయంలోనే ఆన్‌లైన్‌ మోసాలు, సైబర్‌ నేరాల గురించి తెలిసింది. అసలు హ్యాకింగ్‌ అంటే ఏంటి? అంటూ గూగుల్‌లో గాలించడం మొదలుపెట్టాడు. పదిహేనేళ్ల వయసులో తొలిసారి తండ్రి ఈమెయిల్‌ని హ్యాక్‌ చేశాడు. తర్వాత ఎథికల్‌ హ్యాకింగ్‌ పుస్తకాల్ని బట్టీ పట్టాడు. దూరవిద్యలో ఎథికల్‌ హ్యాకెట్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ సెక్యూరిటీ కోర్సును ఇంటర్నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ డిస్టెన్స్‌ లెర్నింగ్‌ (ఐఏడీఎల్‌)నుంచి పూర్తి చేశాడు. తర్వాత స్మార్ట్‌ఫోన్‌నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించడం.. ఈమెయిల్‌ హ్యాకర్స్‌ని పట్టుకోవడం.. ఐపీ అడ్రస్‌ కనిపెట్టడం.. ఆన్‌లైన్‌ మోసాలు.. సెల్‌ఫోన్‌ ట్రేసింగ్‌.. సైబర్‌ మోసాలు.. ఏటీఎం ఫ్రాడ్‌లు.. ఇలా ప్రతి అంశంపై పట్టు సాధించాడు. 'నాకు తెలిసిన విజ్ఞానం మంచి పనులకు ఎందుకు వినియోగించకూడదు?' అనుకుంటూ ఇతరులకు సాయం చేయడం మొదలుపెట్టాడు.
పేరు మార్మోగింది
నోటి ప్రచారంతోనే తృష్ణిత్‌ ప్రతిభ రాష్ట్రమంతా పాకిపోయింది. పదహారేళ్లపుడు తమ క్రైం బ్రాంచ్‌ పోలీసు అధికారులకు పాఠాలు చెప్పమంటూ ఆహ్వానించింది పంజాబ్‌ ప్రభుత్వం అతడ్ని. ఆ దెబ్బతో ఒక్కసారిగా అతడి పేరు మార్మోగిపోయింది. తర్వాత పలు సభలు, సెమినార్లలో ప్రసంగించాడు. ఎథికల్‌ హ్యాకింగ్‌పై పలువురికి అవగాహన కల్పించాడు. పెద్దలతో కలిసి వేదికలు పంచుకున్నాడు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో క్రైం బ్రాంచ్‌ ఐపీఎస్‌ అధికారులకు, సైబర్‌ క్రైం యూనిట్‌కు శిక్షణ ఇచ్చాడు. పంజాబ్‌ పోలీసు అకాడమీకి చెందిన ఐపీఎస్‌, ఐజీ, డీఐజీ, డీఎస్పీ స్థాయి అధికారులకు సైబర్‌ సెక్యూరిటీపై అవగాహన కల్పించాడు. రాల్సన్‌ ఇండియా లిమిటెడ్‌ నిర్వహించిన కార్పోరేట్‌ ట్రైనింగ్‌ ఆన్‌ నెట్‌వర్క్‌ సెక్యూరిటీ అండ్‌ సైబర్‌లో పాల్గొని తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ది ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీడబ్ల్యుఏ), గుజరాత్‌ ఆధ్వర్యంలో 'ఆన్‌లైన్‌ ఫైనాన్షియల్‌ ఫ్రాడ్స్‌' అనే అంశంపై ఛార్టెడ్‌ అకౌటెంట్స్‌ (సీఏ)లకు శిక్షణనిచ్చాడు. న్యూఢిల్లీలో జరిగిన సైబర్‌ థ్రెట్స్‌ సమ్మిట్‌- 2014లో కీ నోట్‌ స్పీకర్‌గా ఉపన్యసించాడు. ఐఐటీ-రోపార్‌ విద్యార్థులకు సైబర్‌ సెక్యూరిటీ అండ్‌ ఎథికల్‌ హ్యాకింగ్‌పై తరగతులు బోధించాడు. పంజాబ్‌లోని పోలీసులకు సాయపడుతూ ఇప్పటికి 20 మనీ లాండరింగ్‌ కేసులను పరిష్కరించగలిగాడు. తృష్ణిత్‌ ఇటీవలే కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి సైబర్‌ నేరాలపై సలహాదారుగా నియమితులయ్యాడు. ఎందరో సీనియర్‌ ఐపీఎస్‌, పోలీసు అధికారులకు నిలయమైన ఆ సంస్థకి సలహాలివ్వడం మామూలు విషయం కాదు. అదీ ఇరవై ఏళ్లకే సాధించాడు. దీంతోపాటు పంజాబ్‌ పోలీసు అకాడెమీకి అతడు ఐటీ సలహాదారు కూడా.
కలం వీరుడిగా..
ఎథికల్‌ హ్యాకింగ్‌ని అందరికీ పరిచయం చేయాలనే ఉద్దేశంతో 'ది హ్యాకింగ్‌ ఎరా' అనే పుస్తకం రాశాడు తృష్ణిత్‌. ఈ అంశంపై పుస్తకం రాసిన రెండో పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. ఈ రంగంలో తను ఛేదించిన కేసులు, ఎదుర్కొన్న అనుభవాలతో 'హ్యాకింగ్‌ టాక్‌ విత్‌ తృష్ణిత్‌ అరోరా' అంటూ మరో పుస్తకం మొదలుపెట్టాడు. గతేడాది 'టీఏసీ సెక్యూరిటీ సొల్యూషన్స్‌' పేరుతో ఓ కంపెనీ స్థాపించాడు. ఐటీ రంగంలోని విద్యార్థులకు శిక్షణ ఇవ్వడంతో పాటు పోలీసులకు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు సైబర్‌ సెక్యూరిటీపై అవగాహన కల్పించడం దీని ఉద్దేశం.
అవార్డులు..
* సైబర్‌ సెక్యూరిటీ రంగంలో చేస్తున్న కృషికి గుర్తింపుగా పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వ అవార్డు
* మైక్రోసాఫ్ట్‌ సోషల్‌ ఫోరం ఇండియా టాప్‌-10 ఎథికల్‌ హ్యాకర్స్‌లో మూడో స్థానం
* ఎథికల్‌ హ్యాకర్స్‌ అండ్‌ సైబర్‌ కాప్స్‌ విభాగంలో ఇండియాటుడే ఫేమస్‌ పర్సనాలిటీగా గుర్తింపు

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning