నవ్యత, ప్రయోగాల నెలవు... మెకానికల్‌ !

ఇంజినీరింగ్‌ విద్యలో మెకానికల్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఒకప్పుడు దీన్ని ఎంచుకోవటానికి విద్యార్థినులు అంత సుముఖంగా ఉండేవారు కాదు. ఇప్పుడా పరిస్థితి గణనీయంగా మారింది. దీన్ని ఎంచుకునే విద్యార్థుల సంఖ్య బాగా పెరుగుతోంది. దీనిలో అనుబంధ బ్రాంచీల గురించీ, అవకాశాల గురించీ తెలుసుకుందాం!
మానవుని శాస్త్రీయ వికాసంలో మొట్టమొదటి ఆవిష్కరణ- చక్రం కనుగొనడం. ఈ ఒక్కటీ ఎన్నో పెను విప్లవాలకు దారితీసింది. కుమ్మరి వాడే చక్రం నుంచి విమానాల్లో ఉపయోగించే చక్రాలూ, సైకిల్‌ నుంచి రాకెట్లూ, ఉపయోగించే ఇంజిన్ల వరకూ మెకానికల్‌ ఇంజినీర్ల ప్రతిభ కారణం అనడం అతిశయోక్తి కాదు. నవ్యత, ప్రయోగాలకు పుట్టినిల్లు మెకానికల్‌ ఇంజినీరింగ్‌. పురాతన సాంకేతికతకు ఉద్భవించిన అత్యాధునిక శాఖ నానో టెక్నాలజీ. భవిష్యత్తులో కూడా ఎంతో అభివృద్ధికి ఆస్కారమున్న బ్రాంచి మెకానికల్‌!
అన్ని శాస్త్రాలకూ గణితశాస్త్రం తల్లి లాంటిది అంటారు. ఇంజినీరింగ్‌ రంగానికి మెకానికల్‌ అలాంటిది. మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ శాఖలు మూలాలుగా, ఇతర శాఖలు ఉత్పత్తులుగా ఎదిగినట్టు చెప్తారు. జె.ఎన్‌.టి.యు.హెచ్‌. పరిధిలో అత్యధిక అనుబంధ బ్రాంచీల్లో అందిస్తున్న కోర్సులు మెకానికల్‌ శాఖకు చెందినవి. ఇంకా మెకానికల్‌ ఇంజినీరింగ్‌ (ప్రొడక్షన్‌), మెకానికల్‌ ఇంజినీరింగ్‌ (మెకాట్రానిక్స్‌), మెటలర్జీ అండ్‌ మెటీరియల్‌ టెక్నాలజీ, ఇంకా మైనింగ్‌ ఇంజినీరింగ్‌లలో బీటెక్‌ కోర్సులున్నాయి. వీటిలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీ కోర్సు ఎక్కువ కాలేజీల్లో లభిస్తోంది. తరువాత అత్యధికంగా మైనింగ్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీ కోర్సు లభ్యమవుతోంది. మిగిలినవి అతి తక్కువ కాలేజీల్లో, స్వయంప్రతిపత్తి కలిగిన అనుబంధ కళాశాలల్లో లభ్యమవుతున్నాయి.
దేశాభివృద్ధికి ఆయువు పట్టు అయిన పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందాలంటే ఆ రంగానికి అవసరమైన, నిపుణులైన ఇంజినీర్లు చాలా అవసరం. ఇందులో మెకానికల్‌ ఇంజినీర్ల పాత్ర ప్రత్యేకమైనది. మానవ సామర్థ్యాన్ని పెంచే యంత్రాల, పరికరాల తయారీ ఈ రంగానికి సంబంధించినదే.
మెకానికల్‌ ఇంజినీర్లు యంత్రాల, యాంత్రిక పద్ధతుల పరిశోధన, రూపకల్పన, తయారీ, పరీక్ష, అమలుకు సంబంధించిన పనులు చేస్తారు. వివిధ పదార్థాలు, ఉష్ణ స్థానాంతరణం, శక్తి స్థానాంతరణం గురించి క్షుణ్ణంగా నేర్చుకుని వివిధ అవసరాలకు కావలసిన పనిముట్ల, యంత్రాల రూపకల్పన చేస్తారు. సైకిల్‌ నుంచి అంతరిక్ష నౌకల నిర్మాణం వరకూ వీరి పరిధిలోకి వచ్చేవే.
వీరు చేసే పనులలో కొన్ని:
* అత్యాధునిక సౌకర్యాలతో కూడిన వాహనాల రూపకల్పన, అభివృద్ధి, కంప్యూటర్ల సహాయంతో నూతన నమూనాల తయారీ, నూతన పదార్థాల, ఉత్పత్తుల అభివృద్ధి, భారీ స్థాయి ఉత్పత్తికి ముందు చిన్న మోతాదులో వాటి తయారీ, పరీక్షించడం.
* నూతన పనిముట్ల, తయారీ పద్ధతుల రూపకల్పన, అభివృద్ధి
* చిన్న, సూక్ష్మ యంత్రాల (నానోబోట్‌) రూపకల్పన, అభివృద్ధి
* వాహనాలు, కృత్రిమ అవయవాలు, అంతరిక్ష నౌకల వంటి నవీన నమూనాల అభివృద్ధి, పరీక్షించడం
* పరిశ్రమలలో ఉత్పాదకత పెంచడానికి దోహదపడే వసతుల రూపకల్పన
* విద్యుదుత్పత్తి యంత్రాలు, అణు రియాక్టరు, రైలు, సబ్‌ మెరీన్లు, విమానాల వంటి భారీ, సంక్లిష్టమైన వాహనాల, మెషీన్ల సమర్ధ నిర్వహణ
* ఇంజినీరింగ్‌ బృందాల నిర్వహణ
రాణించాలంటే...
మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో భౌతికశాస్త్రానికి సంబంధించిన అంశాలను తెలుసుకోవడానికి, వాటిని అర్థం చేసుకోవడానికి గణిత శాస్త్రంలో జ్ఞానం చాలా అవసరమవుతుంది. ఒకరకంగా చెప్పాలంటే భౌతిక శాస్త్రాన్ని గణితశాస్త్ర పద్ధతుల్లో అర్థం చేసుకుంటాము. దీనివల్ల ఏయే భౌతికశాస్త్ర సూత్రాలు ఏ విధంగా అన్వయం చెయ్యవచ్చు అన్న విషయం అర్థమవుతుంది. కాబట్టి మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో రాణించాలంటే భౌతిక శాస్త్రం, గణితశాస్త్రం తప్పకుండా వచ్చి ఉండాలి. అన్ని ఇంజినీరింగ్‌ శాఖల్లోనూ మెకానికల్‌లోనే గణితం పాలు ఎక్కువ. అంటే ఇంచుమించు ప్రతి అంశాన్నీ గణిత శాస్త్ర సహాయంతో సాధిస్తారు. ఈ కారణంవల్ల ఇంజినీరింగ్‌ విద్యకు మూలస్తంభమైన సమస్యా సాధన మెలకువల్లో మెకానికల్‌ ఇంజినీర్లు అగ్రగణ్యులుగా ఉంటారు.
వివిధ రకాల పదార్థాలు, మూలకాలు, ధాతువులు, లోహాలు, మిశ్రమాల గురించి కూడా మెకానికల్‌ ఇంజినీర్లకు తెలిసి ఉండాలి. అందుకే రసాయనశాస్త్రంలో కూడా వీరికి అవగాహన ఉండాలి. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ శాఖలో ఇంజినీరింగ్‌ చెయ్యాలనుకునేవారికి గణిత, భౌతిక, రసాయన శాస్త్రాల్లో మంచి ప్రవేశం అత్యావశ్యకం.
ఇంజినీరింగ్‌లో వీరు ప్రత్యేకించి ద్రవ యంత్ర శాస్త్రం (హైడ్రాలిక్స్‌), ఘన యాంత్రిక శాస్త్రం (సాలిడ్‌ మెకానిక్స్‌), ద్రవ యాంత్రిక శాస్త్రం (ఫ్లూయిడ్‌ మెకానిక్స్‌), స్ట్రెంగ్త్‌ ఆఫ్‌ మెటీరియల్స్‌, మిశ్రమాలు (కాంపోజిట్స్‌), ఉష్ణగతిక శాస్త్రం (థర్మో డైనమిక్స్‌), ఇంకా వివిధ రకాల ఇంజన్ల గురించి ప్రత్యేకంగా నేర్చుకుంటారు. ఈ సబ్జెక్టులు అన్నీ కూడా గణిత శాస్త్రంలోని సంకలన, వ్యవకలన సిద్ధాంతాల మీద ఆధారపడినవి. కాబట్టి కాస్త శ్రమించి నేర్చుకోవలసి ఉంటుంది.
మెకానికల్‌ ఇంజినీరింగ్‌లోని ఈ ప్రాథమిక సబ్జెక్టులే కాకుండా రోబోటిక్స్‌, మెకాట్రానిక్స్‌, క్రయోజెనిక్స్‌, రవాణా, ఇంధన వనరులు, బయో మెకానిక్స్‌ వంటి ఎన్నో ప్రత్యేక సబ్జెక్టులుంటాయి. వీటిలో కొన్ని సబ్జెక్టులను బీటెక్‌ పరిధిలో ఇంకా ప్రవేశపెట్టలేదు.
ఉద్యోగావకాశాలు
దాదాపు ఏ రంగంలోనైనా వీరు తమ సేవలందించగలరు. మెకానికల్‌, ఆటోమొబైల్‌, బయో మెడికల్‌, వాతానుకూల పరికరాలు, అణు శాఖ, రోబోటిక్స్‌ రంగంలోని ఇంజినీరింగ్‌ విభాగాల్లో వీరికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. రక్షణ శాఖ, ప్రభుత్వరంగ సంస్థలు, బ్యాంకింగ్‌, పరిశ్రమల శాఖ, విద్యుత్‌ శాఖ, గనుల శాఖ, ధాతువులు, మిశ్రమాల తయారీ కంపెనీలు, నిర్మాణ, జలవనరుల, ఫార్మస్యూటికల్‌, రైల్వే, ఏరో స్పేస్‌, అంతరిక్ష శాఖ, పరిశోధన, ఎలక్ట్రానిక్స్‌, సేవల, గృహోపకరణాల, పెట్రోలియం, ఐ.టి. వంటి ఎన్నో రంగాల్లో వీరికి ఉద్యోగాలుంటాయి. కన్సల్టెంట్లుగా, అధ్యాపకులుగా కూడా స్థిరపడవచ్చు. ప్రతిష్ఠాత్మకమైన ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌, సివిల్‌ సర్వీసెస్‌కి కూడా ప్రయత్నించవచ్చు.
గేట్‌, నెట్‌, పీజీసెట్‌ వంటి పోటీ పరీక్షల్లో ర్యాంకులు సాధించి ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌, థర్మల్‌ ఇంజినీరింగ్‌, ప్రొడక్షన్‌ టెక్నాలజి, రోబోటిక్స్‌, క్యాడ్‌/క్యామ్‌ వంటి స్పెషలైజేషన్లలో ఎం.టెక్‌. చెయ్యవచ్చు.
మైనింగ్‌ ఇంజినీరింగ్‌
మెకానికల్‌ తరువాత ఆదరణ పొందిన కోర్సు మైనింగ్‌. దాదాపు రెండు సంవత్సరాలు మెకానికల్‌ సబ్జెక్టులు చదివిన తరువాత గనుల శాస్త్రానికి సంబంధించి తర్ఫీదునిచ్చే నాలుగేళ్ళ కోర్సు ఇది.
వ్యవసాయం ద్వారా ఉత్పత్తి చెయ్యలేని, కర్మాగారాల్లో కృత్రిమంగా ఉత్పత్తి చెయ్యలేని, భూమిలో నిక్షిప్తమైన, పునరుత్పత్తి శక్తి లేని సహజ వనరుల వెలికితీత, ఉపయోగాల మెలకువలు నేర్పే కోర్సు ఇది. సగం పైగా మెకానికల్‌ శాఖకు సంబంధించిన కోర్సులు, ఆ పైన గనులు, డ్రిల్లింగ్‌, గనుల నిర్వహణ, నియంత్రణలకు సంబంధించిన కోర్సుల సమ్మిళితమైన కోర్సు.
జె.ఎన్‌.టి.యు. పరిధిలో గనులున్న ప్రదేశాల్లో ఈ కోర్సును అందిస్తున్నారు. అంటే ఖమ్మం జిల్లాలో ఉన్న కాలేజీల్లో ఈ కోర్సు నడుస్తోంది. సీట్ల సంఖ్య తక్కువగానే ఉన్నా అవకాశాలు బాగానే ఉంటాయి.
నేర్చుకునే విషయాలు
మైనింగ్‌ ఇంజినీరింగ్‌లో ఈ కింది అంశాల గురించి నేర్చుకుంటారు.
* శిలలు, వాటి ఆవిర్భావం, శిలాస్తరాలు, వాటిలో ఖనిజాలు లభించే అవకాశాలు, వాటి సమర్థ వెలికితీత పద్ధతులు
* ఖనిజ వనరుల అన్వేషణ పద్ధతులు, వాటి వినిమయం
* మైనింగ్‌ పద్ధతుల అభివృద్ధి, నవీన పద్ధతులను కనుగొనడం, గనుల్లో పనిచేసే ఉద్యోగుల భద్రత, ఆరోగ్య రక్షణ, ఖనిజాల రవాణా, గనుల నిర్వహణ
* హానికరమైన వాయురహిత వాతావరణాన్ని గనుల్లో నెలకొల్పడం
ఇతర ఇంజినీరింగ్‌ చదువుల మాదిరే మైనింగ్‌ చదవాలంటే కొన్ని సబ్జెక్టుల విషయ పరిజ్ఞానంతోపాటు కొన్ని మెలకువలు అవసరమవుతాయి. రసాయన శాస్త్రంపై పట్టు సాధించాలి. భౌతిక శాస్త్రం ద్వారా పదార్థ, లోహాల, ధాతువుల గుణగణాల గురించి ఆకళింపు చేసుకోవాలి. భూగోళశాస్త్రంపై అవగాహన కూడా అవసరం. వీటితో పాటు వ్యక్తిత్వ వికాసానికి అవసరమయ్యే వాస్తవిక, బాధ్యతాయుత దృక్పథం, ఓర్పు, విశ్లేషణాత్మక దృష్టి, కఠిన భౌగోళిక పరిస్థితుల్లో పని చెయ్యగలగటం అలవర్చుకోవాలి.
ఉద్యోగావకాశాలు
వీరికి ప్రభుత్వరంగ సంస్థల్లోని గనుల శాఖలకు సంబంధించిన ఒ.ఎన్‌.జి.సి., కోల్‌ ఇండియా లిమిటెడ్‌, సింగరేణి సంస్థ, నెయివేలి లిగ్నైట్‌ కార్పొరేషన్‌, నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ వంటి సంస్థల్లో, జిందాల్‌ ప్రముఖ ప్రైవేట్‌ సంస్థల్లోనూ మైనింగ్‌ ఇంజినీర్లుగా అవకాశాలుంటాయి. ఇంకా గనులకు సంబంధించిన పరిశోధన సంస్థలలో అవకాశాలుంటాయి. అనుభవం సంపాదించిన మీదట కన్సల్టెంట్లుగా, ఆధ్యాపకులుగా స్థిరపడవచ్చు. స్వయం ఉపాధి ఆలోచనలు ఉండి, ఆర్థికంగా బాగున్నవారు గనుల లీజింగ్‌ వ్యాపారం చెయ్యవచ్చు. అభిరుచి ఉన్నవారు ఎం.బి.ఎ. చెయ్యవచ్చు.
ఈ రంగంలో పనిచేసేవారు నగరాలకు దూరంగా, జనావాసాలకు దూరంగా పని చెయ్యవలసి ఉంటుంది అనేది కొంతమేరకు నిజం. అయితే పట్టణాలకు దగ్గరగా కూడా గనులుంటాయి. పైగా ఒ.ఎన్‌.జి.సి. వంటి సంస్థలు నెలలో సగం రోజులు క్షేత్రంలో పనిచేస్తే సగం రోజులు కుటుంబంతో గడిపే వెసులుబాటునిస్తున్నాయి. నియామక సంస్థలు కూడా గనులున్నచోట ఉద్యోగులకు కాలనీలు కట్టించి, పిల్లల చదువులకు పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నాయి.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning