సాంకేతిక విద్యలో నూతన ఒరవడి

* ఆన్‌లైన్‌ పరీక్షకు ప్రణాళిక
మెదక్ జిల్లా (పటాన్‌చెరు), న్యూస్‌టుడే : ఇంజినీరింగ్‌ విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు సమూలమైన మార్పులు చేపట్టాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. పరీక్ష నిర్వహణలో నూతన పద్ధతులను ప్రవేశపెట్టేందుకు కార్యాచరణ రూపొందించింది. సాంకేతిక విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచేవిధంగా పరీక్షలను ఆన్‌లైన్‌ చేయాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి ఇటీవల నిర్ణయించింది. ఇంజినీరింగ్‌ కళాశాలల్లో నాలుగేళ్లపాటు సాగే విద్యలో ఏడు సెమిస్టర్లు ఉంటాయి. మొదటి ఏడాది ఒక సెమిస్టర్‌ మిగిలిన మూడేళ్లలో ఆరు సెమిస్టర్లు ఉంటాయి. కాగా ఏడో సెమిస్టర్‌లో జరిగే పరీక్షలను ఆన్‌లైన్‌ విధానంలోకి తీసుకురానున్నారు. పరీక్ష నిర్వహణలో భాగంగా ఇప్పటివరకు కళాశాలలకు ప్రశ్నపత్రాలు పంపేవారు. ఇప్పుడు విశ్వవిద్యాలయం పర్యవేక్షణలో పరీక్షలు జరపనున్నారు. ఏడో సెమిస్టర్‌ అంటే నాలుగో సంవత్సరం మొదటి సెమిస్టర్‌ అన్నమాట. ఈ పరీక్షల్లో ఏదయినా ఒక సబ్జెక్టులో తప్పితే మరో అవకాశం ఇవ్వడానికి జేఎన్‌టీయూ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విధానం వల్ల కళాశాలల పనితీరును అంచనా వేయవచ్చని అంటున్నారు.
* పరీక్ష ఇలా
జేఎన్‌టీయూ పరిధిలోని కళాశాలల్లో ఆన్‌లైన్‌ పరీక్షా విధానాన్ని 2005లో రెండేళ్లపాటు అమలు చేశారు. అప్పట్లో పూర్తిస్థాయి పర్యవేక్షణలోపం, రాజకీయకారణాలు చోటుచేసుకోవడం వల్ల ఆన్‌లైన్‌ పద్ధతికి స్వస్తి పలికారు. తాజాగా మళ్లీ ఆ విధానాన్ని తెరపైకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో ఆయా కళాశాలలవారికి 200 - 300 ప్రశ్నలతో కూడిన సీడీలు ఇస్తారు. వాటిని కళాశాలల్లో ఉండే సర్వర్‌లో లోడ్‌ చేస్తారు. ఇంటర్‌నెట్‌ద్వారా కళాశాలల్లో ఉండే 60 నుంచి 120 కంప్యూటర్‌లకు అనుసంధానం చేస్తారు.
* ఎలా కనిపిస్తాయి
విద్యార్థి పరీక్ష రాసే సమయంలో కంప్యూటర్‌ ముందు కూర్చున్న తరువాత తనకు ఇచ్చిన హాల్‌టిక్కెట్‌ నెంబరుతో కంప్యూటర్‌లో లాగిన్‌ అవ్వాలి. ఆ తరువాత పాస్‌వర్డ్‌ పెట్టుకొని లాగిన్‌ కోడ్‌కు అనుసంధానం చేయాలి. అప్పుడు 20 ప్రశ్నలు తెరపై కనిపిస్తాయి. ఆ ప్రశ్నలకు జవాబు రాయడానికి 20 నిమిషాల సమయం ఇస్తారు. అనంతరం ఎన్నిమార్కులు వస్తాయనే విషయం అప్పటికప్పుడు తెలిసిపోతుంది. ఇదంతా పారదర్శకంగా జరుగుతుండటం వల్ల నాణ్యమైన విద్య అందించే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు.
* అవగాహన కలిగించాలి: ఠాగూర్‌, ఉపన్యాసకులు, ఎల్లంకి ఇంజినీరింగ్‌ కళాశాల.
ఇంజినీరింగ్‌లో నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు ఆన్‌లైన్‌ పరీక్షా విధానం మంచిదే. గతంలో దీనిని నిర్వహించినా సఫలీకృతం కాలేదు. తాజా నిర్ణయం అమలుపై ఉపన్యాసకులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలి. అప్పుడే ఎటువంటి ఇబ్బందులూ తలెత్తవు.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning