సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలకు అర్హులు 20% లోపే

* ఇదీ మన ఇంజినీర్ల స్థితి
* ఆస్పైరింగ్‌ మైండ్స్‌ నివేదిక
న్యూఢిల్లీ: ఏడాదికి దేశంలో 6 లక్షల మంది ఇంజినీర్లు ఉత్తీర్ణత సాధిస్తున్నా, అందులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలకు పనికి వచ్చేవారి సంఖ్య 20 శాతం కూడా ఉండటం లేదని ఆస్పైరింగ్‌మైండ్స్‌ నివేదిక తేల్చింది. దేశంలోని 520 కళాశాలల నుంచి 2013లో ఉత్తీర్ణులైన 1.20 లక్షల మంది ఇంజినీరింగ్‌ విద్యార్థుల స్థితిగతుల ఆధారంగా, సంస్థ సవివర నివేదిక రూపొందించింది. ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణులైన వారిలో 18.43 శాతం మందే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు పొందినట్లు వెల్లడించింది.
నైపుణ్యాలకు ఇంతమంది దూరం
అభిప్రాయాలు సేకరించిన 1.20 లక్షల మందిలో 91.82 శాతం మందికి ప్రోగ్రామింగ్‌, క్రమసూత్ర పద్ధతుల్లో నైపుణ్యాలు లేవని, 71.23 శాతం మందిలో భావవ్యక్తీకరణ, అభిజ్ఞాస నైపుణ్యాలు కొరవడ్డాయని, 60 శాతం మందికి డొమైన్‌ పరిజ్ఞానం లోపించిందని, 73.63 శాతం మంది ఆంగ్లంలో మాట్లాడలేకపోవడంతో పాటు గ్రహణ నైపుణ్యానికి దూరంగా ఉన్నారని, 57.96 శాతం మందికి విశ్లేషణ చేయగల సామర్థ్యం లోపించిందని పేర్కొంది.
విద్యా ప్రమాణాలు లోపించడం వల్లే
ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణులు ఉద్యోగాలు పొందలేకపోవడానికి విద్యా ప్రమాణాలు లోపించడమే కారణమని ఆస్పైరింగ్‌మైండ్స్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) హిమాంశు అగర్వాల్‌ చెప్పారు. ఉద్యోగానికి పనికి వచ్చేలా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతో ఉందని పేర్కొన్నారు. ఉద్యోగానికి అవసరమైన పరిజ్ఞానం కలిగిన విద్యార్థులనే కార్పొరేట్‌ సంస్థలు ఎంపిక చేసుకుంటున్నాయని, స్వల్పకాల శిక్షణతోనే వారికి విధులు కేటాయించే వీలుండటమే ఇందుకు కారణమని విశ్లేషించారు. తక్కువ నైపుణ్యం కలిగిన వారిని, ఎంపిక ప్రక్రియలో ముందే తొలగిస్తున్నారని తెలిపారు.
పెద్దగా తెలియని కళాశాలల్లో అర్హులున్నా..
కార్పొరేట్‌ సంస్థలు ప్రాంగణ ఎంపికల కోసం పేరున్న విద్యాసంస్థలకే వెళ్తున్నాయి. అంతగా తెలియని కళాశాలల్లోనూ ఉద్యోగాలకు అర్హులైన 70 శాతం మంది ఉంటున్నారని, కార్పొరేట్‌ సంస్థలు వీరిని పట్టించుకోవడం లేదని, ఈ ప్రక్రియ సరిచేయాల్సి ఉందని వివరించింది. విద్యార్థుల దరఖాస్తు పత్రాలను ఎంపిక చేసుకునేప్పుడూ, కళాశాలల పేర్లకు ప్రాధాన్యత లభిస్తోందని, ప్రాచుర్యం పొందని కళాశాలల విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని విశ్లేషించింది. మహా నగర కళాశాలల విద్యార్థులకు సమానమైన నైపుణ్యాలు ఉన్నా, మూడో అంచె పట్టణాల్లోని విద్యార్థులకు సగటున రూ.66,000 తక్కువ వార్షిక వేతనం ఆఫర్‌ చేస్తున్నారని వెల్లడించింది. ఆస్పైరింగ్‌మైండ్స్‌ కంప్యూటర్‌ అడాప్టివ్‌ టెస్ట్‌కు హాజరైన విద్యార్థుల నుంచి సేకరించిన వివరాలతో ఈ నివేదిక రూపొందించినట్లు సంస్థ తెలిపింది.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning