హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ మరింత విస్తరణ

* సంసిద్ధతను వ్యక్తం చేసిన సంస్థ భారత ఛైర్మన్‌
* తెలంగాణ సీఎంతో భాస్కర్‌ ప్రామాణిక్‌ భేటీ
* ఆగస్టులో నగరానికి మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్ల!
ఈనాడు - హైదరాబాద్‌ : ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను మరింత విస్తరించడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వ ఐటీ విధాన ఖరారులో సహకరించటానికి ఆ సంస్థ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. భారత్‌లో ఆ సంస్థ ఛైర్మన్‌ భాస్కర్‌ ప్రామాణిక్‌ జులై 14న సచివాలయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలు వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలిసింది.

హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ కంపెనీ విస్తరణకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లో ఏమైనా ఇబ్బందులున్నాయా? అని అడిగారు. తమకు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదని భాస్కర్‌ప్రామాణిక్‌ చెప్పినట్లు తెలిసింది. తమ ప్రభుత్వం త్వరలోనే ఐటీ విధానాన్ని రూపొందించబోతోందని, దీని రూపకల్పనలో సాయం చేయాలని, ప్రభుత్వానికి వ్యాల్యూ పార్టనర్‌గా ఉండాలని కేసీఆర్‌ కోరారు. దీనికి మైక్రోసాఫ్ట్‌ తప్పకుండా సహకరిస్తుందని భాస్కర్‌ప్రామాణిక్‌ చెప్పినట్లు సమాచారం. హైదరాబాద్‌ను టెక్నాలజీ హబ్‌(టీ హబ్‌)గా మార్చాలనుకుంటున్నామని సీఎం వెల్లడించారు. ఐటీ మంత్రి కేటీఆర్‌, ఆ శాఖ ముఖ్యకార్యదర్శి హర్‌ప్రీత్‌సింగ్‌తో జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఐటీ పరిశ్రమ ప్రోత్సాహానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. మైక్రోసాఫ్ట్‌ ఛైర్మన్‌గా నియమితులైన తర్వాత తొలిసారి హైదరాబాద్‌కు సత్య నాదెళ్ల వచ్చే సందర్భంగా ఆయనకు తెలంగాణ ప్రభుత్వం 'పౌరసన్మానం' చేయాలనుకుంటోందని చెప్పారు. తెలుగువాడు మైక్రోసాఫ్ట్‌ ఛైర్మన్‌ స్థాయికి ఎదగడం గర్వకారణమని, ఆయనకు హైదరాబాద్‌లో పెద్దఎత్తున స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేయాలని భావిస్తున్నామన్నారు. ఆగస్టు లేదా సెప్టెంబరులో సత్యనాదెళ్ల హైదరాబాద్‌కు వచ్చే అవకాశం ఉందని ఆ కంపెనీ ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌తో చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 'టాస్క్‌', 'ఇన్‌క్యూబరేటర్‌' విధానాలను మంత్రి కేటీఆర్‌... భాస్కర్‌ప్రామాణిక్‌కు వివరించారు. హైదరాబాద్‌ను తొలి 'వైఫై' నగరంగా మార్చాలనుకుంటున్నట్లు కూడా చెప్పారు. వీటన్నింటితోపాటు తెలంగాణలోని ప్రతి గ్రామంలోని యువతీయువకులకు కూడా 'నేషనల్‌ డిజిటల్‌ లిటరసీ మిషన్‌' ద్వారా కంప్యూటర్‌ పరిజ్ఞానాన్ని అందించాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. దీనికి మైక్రోసాఫ్ట్‌ ప్రతినిధులు స్పందిస్తూ మైక్రోసాఫ్ట్‌ 'ఎగ్జిలరేటర్‌' కార్యక్రమం గురించి వివరించారు. వైఫై తరహాలోనే తాము కొత్తగా 'వైట్‌ ఫై' పేరుతో మార్కెట్‌లోకి కొత్త అప్లికేషన్‌ విడుదల చేయాలని యోచిస్తున్నామని, అయితే, దీనికి సంబంధించి మరికొన్ని అడ్డంకులున్నాయని, వాటిని అతిత్వరలోనే అధిగమిస్తామన్నారు. ఆగస్టు ఆరో తేదీన మరోసారి సమావేశం కావాలని తెలంగాణ ప్రభుత్వం, మైక్రోసాఫ్ట్‌ ప్రతినిధులు నిర్ణయించారు. హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్‌ కార్యాలయంలో ఈ భేటీ జరిగే అవకాశముంది.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning