ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 13 వేల ఐటీ కొలువులు

* టెక్‌మహీంద్రాకు 10 ఎకరాలు
* విప్రోకు ఐటీ సెజ్‌ కేటాయింపు!
* సమీర్‌ పరిశోధన కేంద్రానికి 13 ఎకరాలు
* మధురవాడ సెజ్‌ డీనోటిఫై చేసేందుకు ప్రతిపాదన
ఈనాడు - హైదరాబాద్‌ : విశాఖపట్నంలో ఐటీ పరిశ్రమకు కొత్తరూపు రానుంది. త్వరలో ఆంధ్రప్రదేశ్‌లోని యువ ఇంజినీర్లు, పట్టభద్రులకు దాదాపు 13 వేల ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. విశాఖపట్నంలో మూడు సంస్థలకు ప్రభుత్వం భూములు కేటాయించనుంది. రానున్న మంత్రిమండలి సమావేశంలో ఐటీ అభివృద్ధి దిశగా కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఐటీ పరిశ్రమకు పెట్టుబడులు రప్పించేందుకు పారదర్శకమైన, ప్రోత్సాహకాలతో కూడిన నూతన విధానాన్ని సిద్ధం చేయనున్నారు. విశాఖపట్నంలో ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలు తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు విశాఖ ఐటీ కారిడార్‌ను పారిశ్రామిక ప్రాంత స్థానిక ప్రాధికార సంస్థ(ఐలా) కిందకు తీసుకురానున్నారు. మధురవాడ ఐటీ సెజ్‌ను డీనోటిఫై చేయడంపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క విశాఖపట్నంలో మాత్రమే ఐటీ పరిశ్రమలు ఆశించిన స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఈ ప్రాంతం ఐటీ పరంగా మరింత అభివృద్ధి చెందేందుకు అవకాశముంది. మరోవైపు కొత్త ప్రభుత్వం చొరవతో ఐటీ పరిశ్రమలు తమ కార్యకలాపాల విస్తరణలో భాగంగా విశాఖలో పెట్టుబడులకు ముందుకొచ్చాయి. ఇందులో భాగంగా టెక్‌ మహీంద్రా సంస్థ 5 వేల మందికి ఉపాధి కల్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ సంస్థకు విశాఖ ఐటీ లేఅవుట్‌లో దాదాపు 10 ఎకరాలు ఇచ్చే అవకాశముంది. విప్రో సంస్థ తమ వ్యాపార విస్తరణలో భాగంగా 7,500 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకొచ్చింది. ఈ రెండు సంస్థలకు అవసరమైన భూములను మంజూరు చేసేందుకు ప్రభుత్వం అధికారిక నిర్ణయం తీసుకునే సూచనలున్నాయి. వీటి కార్యకలాపాలు ప్రారంభమైతే సుమారు 12,500 మందికి ప్రత్యక్షంగా.. మరో 10 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించే వీలుంటుంది. జాతీయ స్థాయిలో అప్లయిడ్‌ మైక్రోవేవ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌, పరిశోధన సొసైటీ(సమీర్‌) పరిశోధన విభాగాన్ని విశాఖలో ఏర్పాటు చేసేందుకు ఆ సొసైటీ సిద్ధమైంది. ఇది ఏర్పాటైతే వెంటనే సుమారు 500 మందికి ఉపాధి లభిస్తుంది.
ఐలా ఏర్పాటు... : విశాఖపట్నం ఐటీ జోన్‌ను 'ఐలా'గా ప్రకటించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు పురపాలక శాఖ త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది. తెలంగాణలోని హైటెక్‌ సిటీ, ఆదిభట్లను 'ఐలా'గా గుర్తించిన విషయం తెలిసిందే.. అక్కడి ఐటీ పరిశ్రమలకు అవసరమైన రహదారులు, వీధి దీపాలు, మురుగునీటిపారుదల, పన్నులు వసూలు వ్యవస్థ, లేఅవుట్లు వేయడం, మౌలిక సదుపాయాల నిర్వహణ బాధ్యత ఏపీఐఐసీ పరిధిలో ఉంటుంది. అదే తరహాలో విశాఖ ఐటీ పరిశ్రమ ప్రాంతాన్నీ 'ఐలా'గా ప్రకటించనున్నారు. ఐలా కింద ఐటీ పరిశ్రమల నుంచి వసూలు చేసిన పన్నుల్లో 70 శాతం ఏపీఐఐసీకి, మిగతా నిధులు వుడాకు వెళ్తాయి. అలాగే మధురవాడ ఐటీ సెజ్‌ను డీ నోటిఫికేషన్‌ చేయాలన్న డిమాండ్‌ చాలాకాలంగా ఉంది. డీనోటిఫై చేస్తే పరిశ్రమ విస్తరణకు అవకాశముందని, ఇప్పటివరకు ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకాలు వెనక్కు చెల్లిస్తామని అక్కడి పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning