సృజన ఉంటే చాలు.. అవకాశాలు కోకొల్లలు

* కొద్దిపాటి స్థలంలో ఐటీ యూనిట్లు
* వరాలు కురిపించిన మంత్రులు, ఉన్నతాధికారులు
ఈనాడు - విశాఖపట్నం : మౌలిక వసతులకు కొదవ లేదు.. అద్భుతమైన మానవ వనరులు మన సొంతం.. ప్రభుత్వ ప్రోత్సాహం ఎలానూ ఉంది.. బెంగళూరులో ప్రభుత్వం నుంచి తీసుకున్న ప్రతీ ఎకరానికీ వెయ్యి మందికి చొప్పున ఉద్యోగాలివ్వాలన్న నిబంధన ఉంది. అదే హైదరాబాదులో 500 మందికి ఇవ్వాలి. విశాఖలోనూ అదేస్థాయిలో ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలంటే.. ఐటీ క్లస్టర్లు ఏర్పడాలి. కొద్దిపాటి విస్తీర్ణంలో స్థలాలను ఆసక్తి ఉన్నవారికి కేటాయించి ఎస్‌.ఎం.ఇ.ల తరహాలో అభివృద్ధి చేస్తే అద్భుత ఫలితాలొస్తాయన్నది ఉన్నతాధికారుల ఆలోచన. ఈ దిశగా కార్యాచరణలోకి దిగుతామని కలెక్టరు యువరాజ్‌ ముందుకొచ్చారు. సృజనాత్మక ఆలోచనలున్న నిపుణులకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఐటీరంగ ప్రముఖులు ప్రశంసిస్తున్నారు.
2020.... 5 లక్షల ఐటీ ఉద్యోగాలు... ఇదీ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం...
అంతర్జాతీయస్థాయిలో ఐటీ హబ్‌గా విశాఖను తీర్చిదిద్దడంతోపాటు.. అందుబాటులో ఉన్న మానవ వనరులను అత్యద్భుతస్థాయిలో వినియోగించుకోవాలన్న దిశగా ప్రభుత్వంతో కలిసి ఐటీ రంగ నిపుణులు మరో అడుగు ముందుకేశారు. మంగళవారం విశాఖ నగరంలోని ఓ హోటల్‌లో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, రాష్ట్ర ఐటీ శాఖ ఉన్నతస్థాయి అధికారులు, నిపుణులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. విశాఖ ఐటీ రంగ అభివృద్ధికి తీసుకోబోతున్న పలు చర్యలను ప్రకటించారు. కార్యక్రమానికి హాజరైనవారు సైతం ఆ స్థాయిలో వరాల జల్లు కురుస్తుందని వూహించలేదంటే అతిశయోక్తి కాదు. ఆ వరాలన్నీ సాకారమైతే ప్రపంచ ఐటీ చిత్రపటంలో విశాఖకు స్థానం దక్కినట్లే. వివరాలివే....
హైదరాబాదు తరువాత అత్యధిక ఐటీ కంపెనీలు, మౌలిక వసతులు ఉన్న నగరంగా విశాఖకు గుర్తింపు ఉంది. అయితే ఐటీ ఎగుమతులు, టర్నోవరు విషయంలో ఈ రెండు నగరాల మధ్య వ్యత్యాసం భారీగా ఉంది. ఈ టర్నోవరు తెలంగాణ రాష్ట్రంలో ఏటా రూ. 65 వేల కోట్లు ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో కేవలం రూ. 1,750 కోట్లే.
ఐటీ రంగ అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం దృష్టి విశాఖమీదే కేంద్రీకృతమైందన్న విషయం తాజా సమావేశంలో స్పష్టమైంది. విశాఖ కేంద్రంగానే ఐటీ రంగ అభివృద్ధి ఉంటుందని మంత్రులు స్పష్టంగా పేర్కొన్నారు. మౌలిక వసతులపరంగా, మానవ వనరుల పరంగా ఐటీ సంస్థలకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూస్తామని ప్రభుత్వం తరఫున ఉన్నతాధికారులు పరిష్కార మార్గాలు చూపించారు. చిన్నచిన్న సంస్థలను స్థాపించుకుని సొంతంగా ప్రాజెక్టులు తెచ్చుకోవాలనుకునే ఆసక్తి ఉన్నవారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వాధికారులు పెద్దపీట వేయాలని నిర్ణయించారు. వారికి కొద్దిపాటి విస్తీర్ణంలో చిన్నచిన్న స్థలాల్ని కేటాయించి ఒక ప్రాంతంలో ఎస్‌.ఎం.ఇ.ల తరహాలో ఐ.టి. క్లస్టర్‌ను అభివృద్ధి చేస్తే బాగుంటుందని పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జె.ఎస్‌.వి.ప్రసాద్‌ పేర్కొన్నారు. ఆ మేరకు తగిన చర్యలు తీసుకోవడానికి వేదికపైనే ఉన్న కలెక్టరు యువరాజ్‌ కూడా అంగీకరించడంతో కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చినట్త్లెంది. సృజనాత్మక ఆలోచనలు చేసే యువ ఐ.టి. నిపుణులకు ఈ విధానం ఎంతో ప్రోత్సాహాన్నిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
సాకారమైతే స్వర్ణయుగమే....
విశాఖ నగర ఐ.టి. రంగ అభివృద్ధి కోసం అంతర్జాతీయస్థాయిలో కన్వెన్షన్‌ సెంటర్‌, నిపుణులైన మానవ వనరుల కోసం ఫారిన్‌ లాంగ్వేజ్‌ ల్యాబ్‌, ఫినిషింగ్‌ స్కూల్‌ తదితరాలనెన్నో అందుబాటులోకి తేవడానికి అధికారులు సూత్రప్రాయంగా అంగీకరించారు. ఆమేరకు పి.పి.పి. విధానంలోనైనా అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు ప్రకటించారు. అన్నింటికన్నా ప్రధానంగా విశాఖ కేంద్రంగా 'ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐ.టి. మిషన్‌'ను ప్రారంభించబోతుండడంపై ఐ.టి.వర్గాలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. ఐ.ఎ.ఎస్‌. స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఐ.టి. మంత్రిత్వశాఖ అనుబంధ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తే చాలా సమస్యల్ని వేగంగా పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని విశాఖలోని ఐ.టి. సంఘాలు ఎప్పటినుంచో డిమాండు చేస్తున్నాయి. మిషన్‌ స్థాపనతో ఆ డిమాండు కూడా నెరవేరడానికి అవకాశం ఉంటుంది. మధురవాడ ఐ.టి. సెజ్‌లోని హిల్‌ నెం.2ను డీనోటిఫై చేయాలన్న డిమాండుపై ఉన్నతాధికారులు పెద్దగా ఆసక్తి కనబరచలేదు. దీనికి ప్రత్యామ్నాయంగా ఐ.టి. సంస్థలకు 'కో-డెవలపర్‌' స్టేటస్‌ ఇచ్చి సంస్థల్ని సబ్‌లీజులకు ఇచ్చుకునే అవకాశాల్ని కల్పిస్తామని హామీ ఇవ్వడం కూడా వూరట కలిగించే అంశమే. కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టినవారు తమ కార్యాలయాల్ని నిరుపయోగంగా ఉంచుకునే కన్నా ఇతర ఐటీ సంస్థలకు ఇస్తే వందల మందికి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుందన్న అభిప్రాయం ఉంది. దీంతోపాటు మధురవాడ సెజ్‌లో నత్తనడకన నిర్మాణం సాగుతున్న ఇన్‌క్యుబేషన్‌ సెంటర్‌ను ఆగస్టు కల్లా పూర్తిచేస్తామని మంత్రి ప్రకటించడం నగర ఐ.టి. రంగానికి కొత్త వూపుఇచ్చే అంశంగా చెబుతున్నారు. ఒక లక్ష ఎస్‌.ఎఫ్‌.టి. సామర్థ్యమున్న ఈ భవనంలో ఐ.టి. సంస్థలకు అనువైన పూర్తిస్థాయి మౌలికవసతులుంటాయి. 'ప్లగ్‌ అండ్‌ ప్లే' విధానంలో ఎవరైనా నేరుగా తమతమ సంస్థల్ని ప్రారంభించుకోవచ్చు. మంత్రులు, ఉన్నతాధికారులు ప్రకటించిన వాటిలో కనీసం 50 శాతం అమల్లోకి వచ్చినా విశాఖ అతిపెద్ద ఐ.టి. హబ్‌గా కొద్దిసంవత్సరాల్లో ఆవిర్భవిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
బస్సు ప్రారంభంతో శ్రీకారం...
ఉద్యోగులు తగిన రవాణా సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అధికారులు నగరం నుంచి నేరుగా ఐ.టి. హిల్స్‌కు వెళ్లేలా ఒక బస్సు సర్వీసును కూడా ప్రారంభించారు. నిత్యం ఆ సర్వీసు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులకు ఐ.టి.శాఖ ఉన్నతాధికారులు సూచించారు.
విశాఖ కన్నా మించింది లేదు...
మధురవాడ సెజ్‌లోని నూనెట్‌ ఐ.టి. సంస్థకు వచ్చిన మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, గంటా శ్రీనివాసరావులు తొలుత విలేకరులతో మాట్లాడారు. అనంతరం ఐ.టి.హిల్స్‌లో ఉన్న సంస్థలను సందర్శించి ఐ.టి. రంగ అభివృద్ధికి విశాఖకు మించిన ఉత్తమ ప్రాంతం రాష్ట్రంలో మరొకటి లేదని వ్యాఖ్యానించడం గమనార్హం.
విప్రో, టెక్‌ మహీంద్రాల నిర్ణయాలతో కొత్త ఉత్సాహం...
విప్రో ఏడువేల మందికి, టెక్‌ మహీంద్రా ఐదు వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వటానికి అంగీకరించటంపై నగరవాసుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వేలాదిమంది ఐ.టి. నిపుణులకు నగరం కేంద్రంగా మారడం శుభపరిణామంగా భావిస్తున్నారు. త్వరలోనే మరికొన్ని సంస్థలు కూడా వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు..

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning