'వేవ్‌రాక్‌' ఐటీపార్క్‌ రెండో దశ ప్రారంభం

* తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు శంకుస్థాపన
* 7,000 ఐటీ నిపుణులు పనిచేయొచ్చు
* 400 ఎకరాల్లో సమగ్ర హరిత నగరం
ఈనాడు - హైదరాబాద్‌ : గచ్చిబౌలిలోని ఐటీ/ఐటీఈఎస్‌ ప్రత్యేక ఆర్థిక మండలం (సెజ్‌)లో 'వేవ్‌రాక్‌' ఐటీ పార్క్‌ రెండో దశ అందుబాటులోకి వచ్చింది. రెండోదశలోని మొదటి భాగాన్ని (ఫేజ్‌ 2.1)ను ప్రారంభించడంతోపాటు రెండో భాగం (ఫేజ్‌ 2.2) నిర్మాణానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఐటీ, పంచాయితీ రాజ్‌ మంత్రి కె.టి.రామారావు కూడా హాజరయ్యారు. వేవ్‌రాక్‌ ఐటీ పార్క్‌లోని భవనాన్ని సందర్శిస్తే.. విదేశాల్లో ఉన్నట్లు ఉందని, ఇటువంటి ప్రాజెక్టులు హైదరాబాద్‌లో రావడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని చంద్రశేఖర్‌ రావు చెప్పారు. 'అత్యుత్తమ అంతర్జాతీయ నగరాల్లో ఒకటిగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతాం. డిజిటల్‌ నగరంగా అభివృద్ధి చేస్తాం. నూతన ఆవిష్కరణలు, ఐటీ సేవలు, ఉత్పత్తులకు ఆలవాలం చేస్తాం. మాస్టర్‌ ప్లాన్‌ను డిజైన్‌ చేయబోతున్నాం' అని అన్నారు. తెల్లాపూర్‌లో టిష్‌మన్‌ స్పేయర్‌ చేపట్టిన భారీ ప్రాజెక్టుకు అన్ని విధాల సహకరిస్తామన్నారు. రాక్‌వేవ్‌ పార్క్‌లో జీజీకే టెక్నాలజీస్‌ మూడో అభివృద్ధి కేంద్రాన్ని కె.టి.రామారావు ప్రారంభించారు.
7,000 ఐటీ నిపుణులు పనిచేయొచ్చు
రాక్‌వేవ్‌ ఐటీ పార్క్‌ మొదటి దశ 2010లో పూర్తయింది. ఇందులో టీసీఎస్‌, యాక్సెంచర్‌ వంటి కంపెనీలు ఉన్నాయి. రెండో దశలో మొదటి భాగం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. దాదాపు రూ.200 కోట్ల పెట్టుబడులతో దీన్ని నిర్మించినట్లు టిష్‌మన్‌ స్పేయర్‌ ఛైర్మన్‌, సహ ముఖ్య కార్యనిర్వహణ అధికారి జెర్రీ స్పేయర్‌ తెలిపారు. 7,000 మంది ఐటీ నిపుణులు కూర్చుని పని చేసుకోవడానికి వీలుగా అంతర్జాతీయ ప్రమాణాలతో దీన్ని తీర్చిదిద్దామని, 7 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. రెండేళ్లలో రెండో దశ రెండో భాగం పూర్తవుతుందని తెలిపారు. వేవ్‌రాక్‌ ప్రాజెక్టుపై రూ.1,050 కోట్లకు పైగా పెట్టుబడులు పెడుతున్నామని, మూడో దశ కూడా పూర్తయి ఐటీ పార్క్‌ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే.. 23,000 మంది ఐటీ నిపుణులు కూర్చుని పని చేయడానికి 20 లక్షల చదరపు అడుగుల ఐటీ కార్యాలయ స్థలం అందుబాటులోకి వస్తుందని స్పేయర్‌ వివరించారు.
400 ఎకరాల్లో సమగ్ర హరిత నగరం
ఐసీఐసీఐ వెంచర్‌తో కలిసి 400 ఎకరాల్లో సమగ్ర హరిత నగరం 'తెల్లాపూర్‌ టెక్నోసిటీ'ని టిష్‌మన్‌ స్పేయర్‌ అభివృద్ధి చేయనుంది. ఈ ప్రాజెక్టు పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని జెర్రీ స్పేయర్‌ అన్నారు. పెట్టుబడులు, ఇతర వివరాలను వెల్లడించలేదు. నివాస గృహాలు, వాణిజ్య, ఐటీ కార్యాలయాలు, రిటైల్‌, ఆరోగ్య సంరక్షణ, ఇతర పౌర సౌకర్యాలు ఇందులో ఉంటాయి. 11 దేశాల్లో భాగస్వాములతో కలిసి టిష్‌మన్‌ స్పేయర్‌ 358 పైగా ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తోంది. భారత్‌లో పెట్టుబడులు మరిన్ని పెట్టడానికి కంపెనీ ఆసక్తిగా ఉందని స్పేయర్‌ తెలిపారు.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning