నైపుణ్యమస్తు

* క్షేత్రస్థాయిలో రాణించేందుకు అంతర్జాల వేదిక
* మార్కెట్‌ అవసరాలు తీర్చే నయా కోర్సులు
* శిక్షణ పొందడానికి బిజీ జీవులకు వెసులుబాటు
ఈనాడు, హైదరాబాద్‌ : ఇంజినీరింగ్‌ చదువుతున్న సునీత ఎథికల్‌ హ్యాకింగ్‌ నేర్చుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ ఈ రంగంలో అనుభవజ్ఞులైన వారి సేవలు అందుబాటులో లేవు. ఆన్‌లైన్లో రిజిస్టర్‌ చేసుకోవడం ద్వారా డిగ్రీ చేతికొచ్చేసరికే అదనపు నైపుణ్యంలో ప్రావీణ్యం సంపాదించవచ్చు అనేది ఆలోచన. హ్యాకింగ్‌ ముప్పు పెరిగిన పరిస్థితుల్లో ఎథికల్‌ హ్యాకర్లకు డిమాండ్‌ పెరుగుతున్న తరుణంలో ఉద్యోగ అవకాశాన్ని మెరుగుపర్చుకోవచ్చనేది ఆమె ధీమా.
* బేగంపేటలో పనిచేసే సాకేత్‌ యాప్స్‌ డిజైన్‌ నేర్చుకోవాలనుకుంటున్నారు. ఇల్లేమో సికింద్రాబాద్‌లో... నేర్పించే ఇనిస్టిట్యూటేమో బంజారాహిల్స్‌లో ఉంది. ఎంత ప్రయత్నించినా పనివేళలు సర్దుబాటు కావడం లేదు. ఇదివరకైతే కోర్సుకెళ్లాలనే ఆలోచనలను మానుకోవాలి.. లేదంటే ఉద్యోగం వదిలేయాలి. ఇప్పుడా అవసరం లేదు. అంతర్జాలంలో కోర్సులను అభ్యసించే అవకాశం రావడంతో నగరంలోని ఎంతోమంది ఔత్సాహికులు కొత్త నైపుణ్యాలను ఇంటి నుంచే పెంపొందించుకుంటున్నారు.
* క్లాస్‌ రూమ్‌లో నేర్చుకునే కోర్సు ఒకటైతే.. క్షేత్రస్థాయి అవసరాలు భిన్నంగా ఉండడం వల్ల చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాల వేటలో పడే అభ్యర్ధులకు అవకాశాలు కష్టసాధ్యంగా మారుతున్నాయి. పోటీ వాతావరణంలో నైపుణ్యాలను మెరుగు పర్చుకోవడం, కొత్తవాటిని నేర్చుకోవాల్సిన అవసరం పెరిగిందని నిపుణులు అంటున్నారు. లేదంటే పోటీలో వెనకబడటం కానీ, ఉపాధి కోల్పోయే ప్రమాదం కానీ ఉందనేది వారి హెచ్చరిక. మెరుగైన ఉపాధి కోసం అభ్యసించేవారు కొందరైతే.. సరదాగా నేర్చుకునేవారు ఇంకొందరు. నేర్చుకోవాలనే తపన మాత్రం ఇటీవల బాగా పెరిగిందనేందుకు కొత్త కొత్తగా పుట్టుకొస్తున్న శిక్షణ కేంద్రాలే నిదర్శనం. వీరు భిన్న అంశాలపై తరగతులు నిర్వహిస్తున్నారు.తీరిక లేని నగర జీవనంలో వీటికి హాజరవ్వడం అందరికీ సాధ్యపడటం లేదు. కొన్నింటిలో అయితే నేర్చుకునేది తక్కువ.. ప్రయాణమే ఎక్కువ చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో తరగతి గది చదువుకు భిన్నంగా 'మార్కెట్‌ అవసరాలను తీర్చేలాంటి విభిన్న కోర్సు'లను అంతర్జాలంలో అభ్యసించేందుకు నగరవాసులు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో కాలానుగుణంగా అభ్యర్ధులను ఆకట్టుకునే పలు అంశాల్లో ఆన్‌లైన్‌లో శిక్షణ అందించడమే కాకుండా వాటికి ధ్రువపత్రాలను సైతం ఆయా సంస్థలు జారీ చేస్తుండడం విశేషం.
* ఎందెందు చూసినా..
భాషలు నేర్చుకోవడం ఆంగ్లం, స్పానిష్‌, జర్మన్‌, ఫ్రెంచ్‌తో సహా ఫోటోగ్రఫీ, వెబ్‌ డెవలప్‌మెంట్‌, గార్డెనింగ్‌, యాప్స్‌ డిజైనింగ్‌, బ్యూటీషియన్‌ కోర్సులు, వంటకాలు, సంగీతం నేర్చుకోవడం, వ్యాపార పాఠాలు, వెడ్డింగ్‌ ప్లానింగ్‌తో సహా మరెన్నో కోర్సులు అంతర్జాలంలో నేర్చుకునేందుకు అవకాశాలు మెరుగయ్యాయి. ఇదివరకు భారీగా వసూలు చేసే ఫీజులు అందుబాటులో ఉండటం ఇటీవలి పరిణామం. కొత్త సంస్థలు ఈ రంగంలోకి అడుగుపెడుతున్నాయి. గ్రూప్‌ఆన్‌ సంస్థ ఏకంగా 40 కోర్సులను వారి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచి. ఐఐటీ అధ్యాపకులు రూపొందించిన పాఠాలు http://nptel.ac.in/ లో చూడొచ్చు. ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి. ఎంఐటీ, స్టాన్‌ఫోర్డ్‌, కోర్సెరా, మూడీల్‌వంటి సంస్థలు విద్యార్థులకు పలు కోర్సులను అందిస్తున్నాయి. వయోఃబేధం లేకుండా నేర్చుకునే అవకాశం ఉండటంతో నగరం నుంచి నుంచి అభ్యసించే వారి సంఖ్య పెరుగుతున్నట్లు నిపుణులు అంటున్నారు. ఉద్యోగం చేస్తూనే వీలు చిక్కినప్పుడల్లా నేర్చుకునే సౌలభ్యం వల్ల టెకీసావీలు ఈ దిశగా అడుగులేస్తున్నారు. మొబైల్‌లో ఫేస్‌బుక్‌ వంటి సామాజిక సైట్లలో కాలక్షేపంతో పాటూ కాలపరీక్షలో కొట్టుకు పోకుండా అంతర్జాలంలో నైపుణ్యాలను అప్‌డేట్‌ చేసు కుంటున్నారు.
* నవశకం...
ప్రతి ఇంట్లోకి కంప్యూటర్‌, ఐపాడ్‌, స్మార్ట్‌ఫోన్‌ రాకతో ఆన్‌లైన్‌ కోర్సుల పేర్లు ఇప్పుడు అందరి నోళ్లలో నానుతున్నాయి. అవకాశాలను అందిపుచ్చుకునేందుకు, తమ సేవలను విస్తరించేందుకు విశ్వవిద్యాలయాలతో పాటూ పాఠశాలలు ఆన్‌లైన్‌ విద్యను ఆరంభిస్తున్నాయి. విద్యతో పాటూ వ్యక్తిగత అభిరుచులను నేర్చుకునేందుకు కోర్సులను డిజైన్‌ చేస్తున్నాయి. అసోసియేట్‌, బ్యాచిలర్‌, మాస్టర్స్‌, పీహెచ్‌డీ డిగ్రీలు అంతర్జాలంలోకి వచ్చేశాయి. పిల్లల సంరక్షణ బాధ్యతల వల్ల ఉద్యోగాలు మానేసిన వారు ఈ తరహా ఆన్‌లైన్‌ కోర్సులు అభ్యసించడం ద్వారా అవసరమైన నైపుణ్యాలను పొంది తిరిగి ఉద్యోగాలను దక్కించుకుంటున్నారు. ఈ ధోరణి ఉపాధి రంగంలో నవశకానికి దారితీస్తోంది. భిన్న రంగాలు, అవసరాలున్న వారికి ఇది ఉపయుక్తంగా మారింది.
* నిపుణుల కొరతకు ప్రత్యామ్నాయంగా.. : ఎన్‌.బి.వెంకటేశ్వర్లు, ఆచార్యులు.
పదిహేనేళ్ల క్రితమే యూ.ఎస్‌.ఏలోని ఎంఐటీలో ఆన్‌లైన్‌ కోర్సులు మొదలెట్టారు. ఒక రంగంలో ఎవరినైతే ఆద్యుడు అనుకుంటారో ఆయన తరగతులను ఇందులో వినొచ్చు. ప్రపంచంలోని ఎక్కడున్న వారైనా వీక్షించవచ్చు. ముఖ్యంగా మనదగ్గర ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలు కావొచ్చు.. ఐఐటీలు కావొచ్చు.. సగం సిబ్బందితోనూ నడుస్తున్నాయి. ఇక్కడ చదివే పిల్లలకు ఆన్‌లైన్లో కోర్సులు పనికొస్తాయి. ఎన్నిసార్త్లెనా ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా వినొచ్చు. వేర్వేరు అసైన్‌మెంట్లు ఇక్కడ పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుంది. తప్పుగా సమాధానం ఇస్తే.. అక్కడే సరైన వివరణ ఉంటుంది. మొత్తానికే తప్పు రాస్తే అంశం అవగాహన కాలేదని అంతకుముందున్న సమాచారం మరోసారి అందుబాటులోకి వస్తుంది. ఈ 'మ్యాసివ్‌ ఓపెన్‌ కోర్సు వేర్‌' విద్యార్థులకు బహుళ ప్రయోజనకరంగా మారింది.. సిలబస్‌లో పాత అంశాలు ఉంటాయి. బయట పరిశ్రమల్లో కొత్త నైపుణ్యాల అవసరం ఉంటుంది. ఆన్‌లైన్‌ కోర్సుల్లో చేరడం ద్వారా అవసరమైన నైపుణ్యాలు సంపాదించవచ్చు. ధ్రువపత్రాలు ఇస్తారు కాబట్టి అదనపు అర్హత అవుతుంది. అంతర్జాల బ్యాండ్‌ విడ్త్‌ వేగం పెరిగితే మరింత ప్రయోజనం ఉంటుంది.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning