రెక్కలు తొడిగి... రివ్వున ఎగసి

* మానవ రహిత విమానాల తయారీ
* ఆదిత్య విద్యార్థుల విజయం
న్యూస్‌టుడే, భానుగుడిసెంటర్‌ (కాకినాడ) : ఆ యువకులు తమ వూహలకు 'రెక్కలు' తొడిగారు... నింగిలో తమ ఆలోచనలను ఎగురవేశారు... ఎగిరే మానవ రహిత విమానాలకు కెమెరాలను అమర్చి... వాటిని గాలిలో చక్కర్లు కొట్టించారు. ఇటీవలే వాటిని ప్రయోగాత్మకంగా పనిచేయించి చూపి వహ్వా అనిపించుకున్నారు. ఆదిత్య ఇంజినీరింగ్‌ కళాశాలలో ద్వితీయ సంవత్సరం మెకానికల్‌ చదువుతున్న 15మంది విద్యార్థులు సాకారం చేసిన ఆ విశేషాలను చూసొద్దాం...
కాకినాడలో శ్యామలాసదన్‌ అనే అపార్టుమెంట్‌ ఉన్నఫళంగా కూలిపోయింది. లోపల ఏం జరిగిందో... ఎంతమంది శిథిలాల కింద చిక్కుకున్నారో రిస్క్యూ టీం వచ్చే వరకు తెలియలేదు.. హిమాచల్‌ప్రదేశ్‌లో నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన విద్యార్థుల్లో కొంతమంది జాడపై ఇప్పటికీ స్పష్టత లేదు. సరైన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రాకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి మనకు ఎదురవుతోంది. ఇలాంటి సమస్యలకు పరిష్కార మార్గాన్ని కనుగొనాలనుకున్నారు ఆ విద్యార్థులు. అనుకోని ప్రమాదాలు జరిగినపుడు మనుషులు ప్రవేశించలేని ప్రదేశానికి తాము తయారు చేసిన విమానాలను పంపి అక్కడి దృశ్యాలను, వీడియోలను చిత్రీకరించి మనకు అందిస్తే ప్రాణనష్టాన్ని నివారించవచ్చని వారు భావించారు. ఇందుకు వారంతా కలిసి ఎగిరే మానవ రహిత విమానాలను తయారు చేశారు.
* ఇలా తయారు చేశారు...
సూరంపాలెం ఆదిత్య ఇంజినీరింగ్‌ కళాశాల మెకానికల్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న 14 మంది విద్యార్థులు పూర్తిగా రిమోట్‌ కంట్రోల్‌ సహాయంతో ఎగిరే మూడు మానవ రహిత విమానాలను తయారు చేశారు. వీరిలో పీజే శేఖర్‌, ఎ.నాని, చరణ్‌తేజ, సూర్యకిరణ్‌, తిరుమల స్వామి, వంశి, నందన్‌, గౌతమ్‌, శ్రీకాంత్‌, నాగేంద్ర, శిరీష, సందీప్‌, ఖలీంలతో పాటు ప్రాజెక్టు కోఆర్డినేటర్లు జేడీ వెంకటేష్‌, ఎం.ఎస్‌.పవన్‌కుమార్‌లు వ్యవహరించారు. ఇటీవల వీరు తాము తయారు చేసిన విమానాలను ప్రయోగాత్మకంగా ఎగురవేసి అందరి మన్ననలు పొందారు. 70 కి.మీల వేగంతో భూమికి అర కిలోమీటరు ఎత్తున ఎగిరే ఈ విమానం రిమోట్‌ కంట్రోల్‌ సహాయంతో సుమారు రెండు కీమీల పరిధిలో ఉన్న దృశ్యాలను చిత్రీకరించడం దీని విశేషం. విమానానికి ఎదుట ఒక ప్రొపెల్లర్‌ను అమర్చారు. గాలి వేగాన్ని అదుపు చేయడానికి రెండు సర్వో మోటార్లను, చివరిభాగంలో ఒక మోటారును అమర్చారు. 11.2 వాట్స్‌ సామర్ధ్యం గల రెండు బ్యాటరీలుంటాయి. ఒక రిసీవర్‌, ఒక చిప్‌ ఉంటుంది. రిమోట్‌ సూచనలు తీసుకొని విమానం లోపల గేర్‌ సహాయంతో పైకి ఎగురుతుంది. దీనికి అడుగు భాగాన కెమెరాలను అమర్చారు. అవసరమైతే రెండు అంతకుమించి రెక్కలకు కూడా అమర్చే వీలుంది. వీటిని తయారు చేసేందుకు సుమారు నెల సమయం పట్టిందని, ప్రాజెక్టు కోఆర్డినేటర్లు జేడీ వెంకటేష్‌, ఎం.ఎస్‌.పవన్‌కుమార్‌, ఐఐటీ కాన్పూర్‌ విద్యార్థులు తమకు సహాయం అందించారన్నారని విద్యార్థులు తెలిపారు. ఒక్కో విమానం తయారీకి సుమారు రూ. 15 వేలు ఖర్చయిందని, బృందంలోని సభ్యులందనై కలిసి భరించామని వారు చెప్పారు.
* రక్షణ రంగంలో ఉపయోగాలు
ఈ మానవరహిత విమానం వల్ల అనేక ప్రయోజనాలున్నాయని విద్యార్థి బృందం తెలిపింది. సివిల్‌ రంగంలో ఏరియల్‌ సర్వే, రహస్య ప్రదేశాల్లో గూఢచర్యం చేసేందుకు, శాంతి భద్రతల పరిశీలన, ట్రాఫిక్‌ పర్యవేక్షణ, సమస్యాత్మక ప్రదేశాలను వీక్షించడం, వాతావరణ మార్పులు వివరాలు, విపత్తులు వచ్చినప్పుడు ఆ సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకునే విధంగా తాము తయారు చేసిన మానవరహిత విమానాలు ఉపయోగపడతాయన్నారు. ముఖ్యంగా రక్షణ రంగంలో శత్రువుల జాడను వీటిద్వారా తెలుసుకోడానికి వినియోగించుకోవచ్చని విద్యార్థులు తెలిపారు. దీనికి మరింత ఆధునిక టెక్నాలజీని అనుసంధానం చేస్తే అయిదు కీమీల దూరంలో ఉన్న దృశ్యాలను చిత్రీకరిస్తాయని చెప్పారు. త్వరలో వీటిని దేశవ్యాప్తంగా నిర్వహించే వివిధ ప్రదర్శనలకు పంపనున్నామని తెలిపారు.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning