వికలాంగులకు ఐటీలో సులభ ప్రవేశం

* కంప్యూటర్లు వ్యర్థాలుగా మారకుండా చూద్దాం
* నైపుణ్య మెరుగుదలకు ఒప్పందాలు
* నాస్‌కామ్‌ ఫౌండేషన్‌ సీఈఓ రీటా సోనీ
ఈనాడు - హైదరాబాద్‌: పాత కంప్యూటర్లను వృధాగా పారవేయక, అవసరమైన వారికి అందచేస్తే, ఉపాధి అవకాశాలు పెరగడంతోపాటు పర్యావరణానికి ఇ వ్యర్థాల బెడద తగ్గుతుందని నాస్‌కామ్‌ ఫౌండేషన్‌ సీఈఓ రీటా సోనీ చెప్పారు. స్వచ్ఛందసంస్థలు, పాఠశాలలకు ఇచ్చేలా ఐటీ కంపెనీలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. అందరికీ ఐటీని చేరువ చేయడంతో పాటు ఐటీ సంస్థలు, ప్రభుత్వం, స్వచ్ఛంద సేవా సంస్థల మధ్య సమన్వయం కుదర్చడం ద్వారా సమాజ అభివృద్ధే సంస్థ లక్ష్యమని తెలిపారు. హైదరాబాద్‌ (మాదాపూర్‌, నానక్‌రామ్‌గూడ)లోని ఐటీ పార్కులను పర్యావరణ హితంగా మార్చే పథకం ఆరంభానికి విచ్చేసిన రీటా నాస్‌కామ్‌ ఫౌండేషన్‌ లక్ష్యాలను 'ఈనాడు'కు వివరించారు. ఆ వివరాలు..
సామర్థ్యం ఉన్న వికలాంగులకు ఉద్యోగాలు:
నైపుణ్యం కలిగిన వికలాంగులకు ఐటీ సంస్థల్లో ఉద్యోగాలు కల్పించేలా చూస్తాం. రిజర్వేషన్‌పై ఇవ్వాలని కోరబోం. ఐటీ కార్యాలయాల్లో వికలాంగులు సులభంగా ప్రవేశించేలా నిర్మాణాలుండాలి. ఐటీ సంస్థలకు భవనాలు నిర్మించే వారితోనూ సంప్రదించి, తప్పనిసరిగా మా సూచనలు అమలయ్యేలా చూస్తాం. పాత భవనాల్లో వీలైనన్ని మార్పులను ప్రతిపాదిస్తున్నాం. సంస్థల వెబ్‌ను అందరికీ అందుబాటులో ఉంచేందుకు నిర్దేశించిన అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మార్చాలి. అప్పుడే వికలాంగులూ ఇబ్బంది లేకుండా యాక్సెస్‌ చేయగలుగుతారు.
ఉద్యోగుల స్వచ్ఛంద సేవ సంస్థలకే లాభదాయకం:
ఉద్యోగులను సేవా కార్యక్రమాలకు ప్రోత్సహించడం వల్ల ఐటీ సంస్థలకే లాభం. తక్కువ ఖర్చుతో ఎక్కువమందికి సేవలు అందించే నైపుణ్యాలు, వ్యక్తిగత పని సామర్థ్యం అభివృద్ధి చెందుతాయి. పలువురితో కలిసి పనిచేయడం వల్ల సంస్థలోనూ బృంద సభ్యుడు/సభ్యురాలిగా మెరుగైన పనితనం చూపగలుగుతారు. సామాజిక విలువలపై ఆపేక్ష పెరిగి, వారి కుటుంబానికీ మేలు కలుగుతుంది. స్వచ్ఛందసేవలతో ఐటీ సంస్థలను సమన్వయం చేసేందుకు మై కర్తవ్య పేరిట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.
నైపుణ్య శిక్షణకు కనెక్ట్‌ ఐటీ:
సమాచార సాంకేతిక నైపుణ్యం (ఐసీటీ) కలిగిన అధికారులతోనే ఇ గవర్నెన్స్‌ ప్రాజెక్టులు త్వరగా, సమర్థంగా అమలు చేయవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇ గవర్నెన్స్‌పై ఆసక్తి కనబరుస్తున్నాయి.. ప్రభుత్వ పథకాల అమలులో దేశంలోని లక్షల ఎన్‌జీఓలు పాలుపంచుకుంటున్నా, కొన్ని వేల సంస్థలే ఐసీటీని పరిమితంగా వినియోగిస్తున్నాయి. అధికారులు, ఎన్‌జీఓలకు ఐసీటీ శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నాం. పేదరికం, మతం, కులం, ప్రాంతం వల్ల అవకాశాలు దూరం కాకుండా టెలీసెంటర్లు, నాలెడ్జ్‌ సెంటర్లు, అధ్యయన కేంద్రాల ఏర్పాటుకు ఎన్‌జీఓలకు సాయం చేస్తున్నాం. బిజినెస్‌ ప్రాసెసింగ్‌ మేనేజ్‌మెంట్‌ (బీపీఎం), యానిమేషన్‌, ఐటీ, హార్డ్‌వేర్‌ రంగాల్లో అభిరుచి ఉన్న నిరుపేదలకు శిక్షణ ఇచ్చి, ఉద్యోగాలు పొందేలా ఎన్‌జీఓలకు తోడ్పడుతున్నాం. విద్యుత్తు లేని గ్రామాలు, భ్రూణహత్యలు, లక్షలమంది బాలికల అదృశ్యం వంటి సమస్యల పరిష్కారానికి ఐసీటీ సాయంతో వినూత్న పరిష్కారాల కోసం వేదిక ఏర్పాటు చేశాం. వచ్చిన సలహాల్లో మెరుగైన వాటిని ప్రభుత్వం, సంస్థలకు అందిస్తున్నాం. బీపీఎం సంస్థల నిర్వహణ ఖర్చులు తగ్గేందుకు గ్రామీణ ప్రాంతాల్లో కేంద్రాలు ఏర్పాటు చేసి, పరిమిత అవకాశాలుండే వర్గాలకు ఉపాధి కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning