ఈ-పాఠం ఎప్పుడు కావాలంటే... అప్పుడు
 • * జేఎన్‌టీయూకే నూతన ప్రయోగం
  * దేశంలోనే ప్రథమంగా ఈ-లెర్నింగ్ విధానం
  ధ్యాపకులు పాఠం చెప్పినప్పుడు క్లాసులో మీరు లేకపోతే... ఆ అంశానికి సంబంధించిన విషయ పరిజ్ఞానాన్ని కోల్పోయినట్లే.ఇలాంటి స‌మ‌స్య లేకుండా ఎప్పుడు కావాలంటే.. అప్పుడు పాఠం విన‌గ‌లిగితే..!

  ముందు రోజు క్లాస్‌కు రాలేకపోయినా అధ్యాపకులు ఏం చెప్పారు.. ఎలా చెప్పారు అనేది తెలుసుకోగ‌లిగే విధానం ఉంటే విద్యార్థులకు ఎంతో ఉప‌యుక్తంగా ఉంటుంది క‌దూ! ఇంజినీరింగ్ విద్యార్థుల‌ సౌలభ్యం కోసం కాకినాడ జేఎన్‌టీయూ ఈ-లెర్నింగ్ విధానాన్ని ప్రవేశపెట్టి, మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. దీని ద్వారా వీడియోలో పాఠాలు చూడ‌వ‌చ్చు.. విన‌వ‌చ్చు.
  దేశంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో అన్నింటికంటే ముందుగా ఈ-లెర్నింగ్ విధానాన్ని ప్రవేశపెట్టి జేఎన్‌టీయూకే తన ఘనత సాటింది. రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రకాశం వరకు ఎనిమిది జిల్లాలో విస్తరించి ఉన్న జేఎన్‌టీయూకే ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో అమలవుతున్న ఈ-విధానాన్ని అమలు చేస్తోంది. జేఎన్‌టీయూకేతో పాటు 207 అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలల్లో దీన్ని అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. త్వర‌లో ఈ-లెర్నింగ్ కంటెంట్‌ను ఆయా కళాశాలల్లో లోడ్ చేస్తున్నారు. దీని వల్ల సుమారు లక్షా యాభైవేల మంది విద్యార్థులు ప్రయోజనం పొందనున్నారు.

  ఎన్ని సబ్జెక్టుల్లో...
  బీటెక్‌లో మొదటి సంవత్సరం నుంచి నాల్గో సంవత్సరం వరకు ఆరు బ్రాంచిలలో 230 సబ్జెక్టులు ఉన్నాయి. దీనిలో బీటెక్ ప్రథమ సంవత్సర మొదటి సెమిస్టర్ నుంచి చివ‌రి సంవ‌త్సరం మొదటి సెమిస్టర్ వరకు 85 సబ్జెక్టులు ఉంటాయి.
  వీటిని తొలి దశలో అప్‌లోడ్ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే 38 సబ్జెక్టులు అప్‌లోడ్ చేశారు.

  ఈ-లెర్నింగ్ సబ్జెక్టు రూపకల్పన
  ఈ-లెర్నింగ్ కంటెంట్ డెలివరీ డిప్లాయిమెంట్ వెబ్‌సైట్ రూపకల్పనకు హైదరాబాద్ గ్లోబరినా టెక్నాలజీ సంస్థతో ఒప్పందాలు జరిగాయి. బీటెక్‌లో సిలబస్‌ను జేఎన్‌టీయూకే గ్లోబరినాకు అందించింది. ఏయే నిబంధనల ప్రకారం సిలబస్ ఈ-లెర్నింగ్‌లో రూపొందించాలో మార్గదర్శకాలు చేసింది.
  దశల వారీగా పాఠ్యాంశాలు
  జేఎన్‌టీయూకే మార్గదర్శకాలను అనుసరించి గ్లోబరినా టెక్నాలజీ ఈ-లెర్నింగ్ నిపుణులతో పాఠ్యాంశాల రూపకల్పన చేయించింది. అనంతరం దేశంలో ఐఐటీ, ఎన్ఐటీల లాంటి ప్రముఖ విద్యాసంస్థల్లో నిపుణులతో ఒక పర్యాయం పరిశీలన చేయించింది. ఇలా రూపొందిన పాఠ్యాంశాలకు ఈక్వేషన్లు, యానిమేషన్లు జోడించి సాఫ్ట్‌కాపీ తయారు చేశారు. దీన్ని పరిశీలన నిమిత్తం జేఎన్‌టీయూకేకు ఇచ్చింది. ఇక్కడి ఆయా సబ్జెక్టుల నిపుణులు పరిశీలించి లోటుపాట్లు వివరించారు. అనంతరం ముగ్గురు సభ్యుల కమిటీ ఆమోదముద్ర వేసింది నాలుగు ద‌శ‌ల‌ పరిశీలన అనంతరం వచ్చిన కంటెంట్‌కు ఆడియో.. వీడియో కలిపి గ్లోబరినా ఈ-లెర్నింగ్ విధానాన్ని రూపొందించింది. జేఎన్‌టీయూకే, గ్లోబరినా టెక్నాలజీ (హైదరాబాద్‌)తో నాలుగేళ్లకుగాను ఒప్పందం చేసుకుంది. తొలిద‌లో 85 సబ్జెక్టులు లోడ్ చేస్తున్నారు. మిగిలిన 145 సబ్జెక్టులను త్వరలో అనుసంధానం చేస్తారు.
  ఒక్కో విద్యార్థికి రూ.680
  ఈ-లెర్నింగ్ నిమిత్తం ఒక్కొక్క విద్యార్థి వంతుగా సంవత్సరానికి గ్లోబరినా సంస్థకు రూ.680 చెల్లించాలి. దీంట్లో జేఎన్‌టీయూకే రూ.340 భరించగా.. మిగిలిన రూ.340 ఆయా ఇంజినీరింగ్ కళాశాలలు చెల్లిస్తాయి. విద్యార్థులు ఏడాదికి చెల్లించే ఫీజుల్లో దాదాపు ఒక శాతం ఈ-లెర్నింగ్ నిమిత్తం ఖర్చుచేయాలని అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలను కోరగా అందుకు వారు అంగీకరించారు.
  ఎన్నో... ఎన్నెన్నో...
  థియరీలో 12 సబ్జెక్టులు ఉంటాయి. అధ్యాపకులు బోధించేలా.. శిక్షణ పొందేలా.. విద్యార్థులు వీడియో చూసి నేర్చుకునేలా ఉంటుంది. గేట్ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు వీలుగా పశ్నలు ఉంటాయి. సంవ‌త్సరానికి 100 గంటలు పాటు పరిశ్రమల నిపుణులు, అకడమిక్ నిపుణులు ఇచ్చిన అంశాలు నిక్షిప్తమై ఉంటాయి. దీంట్లో భాగంగానే నాలుగేళ్లకు కలిపి ఒక్కో బ్రాంచికి 84 ల్యాబ్స్ ఉంటాయి. 40 ప్రయోగాలు చేస్తారు. మొద‌ట‌ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఈసీఈ, కంప్యూటర్ సైన్సు, ఐటీ విభాగాల్లో ఈ-లెర్నింగ్ ప్రవేశపెట్టారు.
  ఎంతమందికి ప్రయోజనం
  జేఎన్‌టీయూకే పరిధిలో 207 ఇంజినీరింగ్ అనుబంధ కళాశాలలున్నాయి. దీంట్లో అన్ని బ్రాంచిలు కలిపి 2 లక్షల 50 వేల మంది విద్యార్థులు ఉన్నారు. దీంట్లో ఆరు బ్రాంచిలలో లక్షా యాభైవేల మంది ఉన్నారు. వీరికే ప్రథమంగా ఈలెర్నింగ్ కంటెంట్ మెటీరియల్ ప్రవేశపెట్టారు. ఈ-లెర్నింగ్ కంటెంట్‌కు సంబంధించిన పూర్తి హక్కులు జేఎన్‌టీయూకేకే చెందుతాయి. అందువల్ల దీన్ని మ‌రో విశ్వవిద్యాలయం వినియోగించటం కానీ.. ప్రవేశ పెట్టడం గానీ కుదరదని యూనివర్శిటీ అధికారులు వెల్లడించారు. ఇక్కడి విద్యార్థులు విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పారు.

  ప్రతి విద్యార్థికీ యూజర్ ఐడీ
  ఈ-లెర్నింగ్ వెబ్‌సైట్‌లోకి ప్రవేశించడానికి ప్రతి విద్యార్థికి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఉంటుంది. మెటీరియల్‌ను విద్యార్థులు అభ్యసిస్తున్నది.. లేనిదీ గ్లోబరినా ప్రతినిధులు నిరంతరం పర్యవేక్షిస్తారు. విద్యార్థులు ముందు రోజు తరగతులు కూడా వినే వెసులుబాటు ఉంటుంది. దీనివల్ల విద్యార్థుల్లో ఉత్సుకత, చదవాలనే ఆసక్తి పెరుగుతుంది. దాదాపు ఐదు నెలలు శ్రమించి మెటీరియల్‌రూపొందించాం.

  - జేఎన్‌టీయూకే ఉపకులపతి డా. తులసీరామ్‌దాస్
  కొత్త వారికి మార్గదర్శి
  కొత్తగా అధ్యాపక వృత్తిలో వచ్చేవారికి ఇది మార్గదర్శకంగా ఉంటుంది. ఈ కంటెంట్ రెండేళ్లు అభ్యసిస్తే ఎన్నో అంశాలను తెలుసుకోవచ్చు. అటు విద్యార్థులకు, ఇటు అధ్యాపకులు ఈ విధానం ప్రయోజ‌న‌క‌రంగా ఉంటుంది.
  - ఈసీఈ బీఓఎస్ ఛైర్మన్ డా. సత్యప్రసాద్
 • Industry      Interaction

  Higher Education

  Job Skills

  Soft Skills

  Comm. English

  Mock Test

  E-learning