త్రీడీ ప్రింటింగ్‌ రెడీ!

త్రీడీ ముద్రణ - వైద్యం మొదలు ఫ్యాషన్స్‌ దాకా ప్రతి రంగాన్నీ ప్రభావితం చేస్తోంది. గుండె నుంచి గుండుసూది వరకూ దేన్నయినా సృష్టించుకునే అవకాశం కల్పిస్తోంది. జెరాక్స్‌ మెషీన్లలా త్రీడీ ప్రింటర్లూ వీధికొకటి వెలిసేరోజు ఎంతోదూరం లేదు!
'వన్‌ చాక్లెట్‌ ప్రింట్‌ ప్లీజ్‌!'
'బాబూ! ఓ గుండె కావాలి. ప్రింట్‌ చేసి పెడతావూ?'
'పొట్టమీద రెండు సెంటీమీటర్ల మేర చర్మం ప్రింట్‌ చేయాలి. ఎంతవుతుందేమిటి?'
'అర్జెంటుగా ఓ మర్డరు చేయాలి. తుపాకీ ప్రింట్‌ తీసుకోవచ్చా?'
'నీ ఉంగరం భలే బావుందే! నాకూ ఇలాంటిదే కావాలి, ప్రింట్‌ చేసుకుని ఇచ్చేస్తా!'
ఏ డాక్యుమెంటునో ముద్రించుకున్నట్ట్టు హెల్మెట్లనీ బొమ్మల్నీ గుండెల్నీ చెవుల్నీ... ఒకటేమిటి, సమస్తం ప్రింట్‌ చేసుకోవచ్చు - త్రీడీ ప్రింటింగ్‌ టెక్నాలజీ ఆ వెసులుబాటును కల్పిస్తోంది.
సాధారణ ప్రింటర్‌ 2డీ రకానికి చెందింది. పొడవూ వెడల్పూ మాత్రమే ఉంటాయి. అదే త్రీడీలో ఎత్తూ తోడవుతుంది. అంటే, ఓ పరిపూర్ణ ఆకారానికి సరిపడా కోణాలన్నీ వచ్చేసినట్టే. ఇంకేముంది, ఏ బ్రాండెడ్‌ షూస్‌ నమూనాలోనో మనమూ పాదరక్షల్ని ముద్రించుకోవచ్చు. దర్జాగా ధరించొచ్చు కూడా. ఒక్కమాటలో చెప్పాలంటే, ఆకారం ఉన్న ఏ వస్తువు నమూనానైనా ముద్రించుకునే అవకాశం త్రీడీ ప్రింటింగ్‌లో ఉంది.

ఓ కంప్యూటర్‌.
మాయా, ఆటోకాడ్‌ లాంటి సాఫ్ట్‌వేర్‌లో వస్తువు డ్రాయింగ్‌.
ఓ త్రీడీ ప్రింటర్‌.
ఈమాత్రం చాలు. జెరాక్స్‌ మెషీన్‌లో కాగితాల్లా...త్రీడీ ప్రింటర్‌లో అవసరాన్ని బట్టి... సిరామిక్‌, ప్లాస్టిక్‌, లోహాలు మొదలైనవాటిని వాడుకోవచ్చు. ఫిలమెంట్లూ, గుళికలూ, పౌడరు రూపంలో ముడిసరుకు మార్కెట్లో దొరుకుతోంది. కంప్యూటర్‌ నుంచి సంకేతాలు వెళ్లగానే... ఆ డ్రాయింగ్‌ ప్రకారం ముద్రణ మొదలవుతుంది. ప్రింటర్‌లోని పెన్నులాంటి ఉపకరణాలు ఏ వస్తువునైనా పొరలు పొరలుగా తయారు చేస్తాయి. ఓ పది నిమిషాల తర్వాతో, అరగంట తర్వాతో ప్రింటరు లోంచి మనం కోరుకున్న వస్తువు బయటికి వచ్చేస్తుంది. తొలితరం ప్రింటర్లలో దేన్నయినా ఒకే రంగులో ముద్రించుకోవాల్సి వచ్చేది. ఇప్పుడలా కాదు... ఎన్ని రంగులైనా వాడుకోవచ్చు. ఏకంగా సీతాకోకచిలకనే ప్రింటు చేసుకోవచ్చు. కాగితానికి నకలు తీయడం సాధ్యమైనప్పుడు... వస్తువుకు మాత్రం ఎందుకు తీయలేం - 1984 ప్రాంతంలో చార్లెస్‌హుల్‌ అనే శాస్త్రవేత్త బుర్రలో వెలిగిన ఆలోచన సరికొత్త ఆవిష్కరణకు కారణమైంది. వైద్యం, నిర్మాణం, పరిశ్రమలు, ఫ్యాషన్స్‌ - దాదాపు ప్రతి రంగాన్నీ త్రీడీ ప్రింటింగ్‌ టెక్నాలజీ ప్రభావితం చేస్తోంది. ప్రింటరు మూడు దశాబ్దాల నాటిదే అయినా... 'అప్లికేషన్స్‌' విషయంలో మాత్రం కొత్తకొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో మరిన్ని అద్భుతాల్ని చూడబోతున్నాం.
వైద్యో నారాయణో 'త్రీడీ'!
ప్లాస్టిక్‌తో వస్తువుల్ని తయారుచేసినట్టు, చర్మ కణజాలంతో చర్మాన్ని ఎందుకు తయారు చేయలేం! గుండెను మాత్రం ఎందుకు నిర్మించలేం! - త్రీడీ ప్రింటింగ్‌ టెక్నాలజీ వైద్యరంగంలో పెను మార్పులకు కారణం అవుతోంది. ఆమధ్య ఓ క్యాన్సర్‌ రోగి మొహం ఎడమభాగమంతా దెబ్బతినిపోయింది. బుగ్గమీద ఓ పెద్ద రంధ్రం పడింది. దీంతో ఆహారం తీసుకోవడమూ కష్టమైంది. ప్లాస్టిక్‌ గొట్టంతో కడుపులోకి పంపాల్సిన పరిస్థితి. తమవల్ల కాదంటూ మహామహా సర్జన్లు కూడా చేతులెత్తేశారు. బృందంలోని యువ వైద్యుడికి ఓ ఆలోచన వచ్చింది. రోగి ఆరోగ్యంగా ఉన్నప్పుడు తీయించుకున్న ఫొటో ఒకటి తెప్పించాడు. త్రీడీ ప్రింటింగ్‌ టెక్నాలజీలో అచ్చంగా అలాంటి బొమ్మనే ప్రింట్‌ తీసుకున్నాడు. దాన్ని పక్కన పెట్టుకుని మొహాన్ని పునర్నిర్మించే వైద్య ప్రక్రియ ప్రారంభించాడు. శాస్త్రవేత్తలు త్రీడీ బయో ప్రింటరు సాయంతో కృత్రిమ గుండెను కూడా తయారు చేశారు. అంతేనా, ఈ పరిజ్ఞానంతో విరిగిపోయిన దంతాల్ని పునరుద్ధరించుకోవచ్చు.తెగిపోయిన ముక్కూ చెవుల స్థానంలో కొత్తవి అతికించుకోవచ్చు. ఏ దాతల కోసమో ఎదురు చూస్తూ కూర్చోవడం ఎందుకు? మూత్రపిండాల్ని తయారు చేసుకోలేమా? కాలేయానికి మాత్రం ప్రతిసృష్టి ఉండదా? త్రీడీలో ఆ ప్రయోగాలూ జరుగుతున్నాయి.
కంప్యూటర్‌ ఎయిడెడ్‌ డిజైన్‌ వైద్యశాస్త్రంలో సరికొత్త మార్పులకు కారణం కాబోతోంది. త్రీడీ ప్రింటర్‌... ప్రతి నిపుణుడి దగ్గరా ఉండితీరాల్సిన పరికరాల జాబితాలో స్థానం సంపాదిస్తోంది. త్రీడీ ప్రింటరుతో నేరుగా ఒంటిమీదే చర్మాన్ని ప్రింట్‌ చేసుకునే ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. లండన్‌ వైద్యనిపుణులు... ఓ మహిళకు సహజమైన పుర్రె స్థానంలో త్రీడీ పుర్రె బిగించారు. లక్షమందిలో ఒకరికి వచ్చే ఓ అరుదైన వ్యాధి కారణంగా ఆమె పుర్రె పరిమాణం అసాధారణంగా పెరిగిపోసాగింది. దీంతో త్రీడీ ప్రింటింగ్‌ టెక్నాలజీని ఉపయోగించారు. జర్మనీ శాస్త్రవేత్తలు త్రీడీ టెక్నాలజీతో రోబో చేతుల్నీ కాళ్లనూ తయారు చేస్తున్నారు. ఇవి మన జైపూర్‌ పాదాల్లాంటివే. కాకపోతే... వేళ్లలో కదలిక ఉంటుంది, ఆకృతిని బట్టి పరిమాణాన్నీ ఛాయను బట్టి రంగునూ మార్చుకునే వీలుంది. త్రీడీ ప్రింటరు ద్వారా గర్భస్థశిశువు ప్రతిరూపాన్ని తీసుకునే అవకాశమూ ఉందిప్పుడు.దీంతో వైద్యులు పిండాన్ని మరింత క్షుణ్నంగా పరీక్షించవచ్చు. కన్నతల్లి... కడుపులోని బిడ్డబొమ్మను ఎత్తుకుని ముద్దాడవచ్చు.

క్షణాల్లో నమూనాలు...
హైదరాబాద్‌ నిజాంకు సంబంధించి ఓ కథ ప్రచారంలో ఉంది. ప్రస్తుతం కోఠి మహిళా కళాశాల ఉన్న భవనం అప్పట్లో బ్రిటిష్‌ రెసిడెన్సీగా ఉండేది. ఆ నిర్మాణం వెనకో మతలబు ఉంది. ఓ బ్రిటిష్‌ అధికారి పెద్ద కాగితం మీద పక్కా ప్లాన్‌ గీసుకుని వెళ్లి... ఓ పాతిక ఎకరాల్లో భవంతి నిర్మాణానికి అనుమతి కోరాడట! అదంతా చూసి నవాబుగారి కళ్లు తిరిగిపోయాయి. ఇంత పెద్ద భవనమా! దీని ముందు మా రాజసౌధం కూడా చిన్నబోతుందేమో!- అన్న అనుమానం వచ్చింది. కుదర్దంటే కుదర్దని చెప్పేశారు. తప్పేదేముంది... మౌనంగా వెళ్లిపోయాడు తెల్లదొర. మరుసటి రోజు ఓ చిన్న చిత్తుకాగితం మీద అదే డ్రాయింగ్‌ గీసుకుని వచ్చాడు. 'దాందేముంది, వెంటనే నిర్మించుకోండి' అంటూ అనుమతి జారీ చేశారు నవాబుగారు. డ్రాయింగులు ఓ పట్టాన అర్థంకావు. అసలు సిసలు రూపాన్ని కళ్లముందు నిలపలేవు. ఆ గీతల స్థానంలో భవంతి సూక్ష్మరూపం కనిపిస్తూ ఉంటే... ఎదుటి వ్యక్తికి రకరకాలుగా వర్ణించి చెప్పాల్సిన శ్రమ తప్పుతుంది. అందుకే, పెద్దపెద్ద నిర్మాణ సంస్థలు త్రీడీ ప్రింటింగ్‌ టెక్నాలజీని విరివిగా ఉపయోగిస్తున్నాయి. చిన్న క్లిక్కు చాలు, వందంతస్తుల మేడ అయినా, పాతిక కిలోమీటర్ల వంతెన అయినా... సూక్ష్మరూపంలో ప్రింటయిపోతుంది. అదే గతంలో అయితే, ఏదైనా వస్తువు నమూనా తయారు చేయాలంటే తలప్రాణం తోకకొచ్చేది. ఇప్పుడా శ్రమలేదు. వంతెనలూ భవనాలూ యంత్రాలూ వాహనాలూ... ఒకటేమిటి మనసులో ఉన్న ఏ ఆలోచనకైనా ఓ రూపం ఇచ్చుకోవచ్చు. సినిమా పరిశ్రమలో అయితే... భారీ భారీ సెట్టింగులు సిద్ధం చేయడానికి ముందు... ఓ నమూనా తయారు చేసుకోవడం మహా సులభమైపోతుంది. చిత్రకారులకూ శిల్పులకైతే త్రీడీ ఓ సృజనాత్మక సాధనం!
తయారీ రంగంలో త్రీడీ ప్రింట్ల వాడకం ఇప్పటికే మొదలైంది. జెట్‌ ఇంజిన్లూ స్టీమ్‌ టర్బయిన్లూ తయారుచేస్తున్న జనరల్‌ ఎలక్ట్రికల్స్‌ తన కార్ఖానాలో మూడువందల ప్రింటర్లను ఉపయోగిస్తోందని సమాచారం. ఇంటెల్‌ సంస్థ త్రీడీ ప్రింటరు ద్వారా సొంతంగా రోబోల్ని తయారు చేసుకునే అవకాశమూ కల్పిస్తోంది. విడిభాగాలన్నీ ప్రింటు తీసుకుని చకచకా జోడించుకోవడమే. దానికోపేరు కూడా పెట్టారు - 'జిమ్మీ'! త్వరలోనే ఈ సాంకేతిక పరిజ్ఞానం మార్కెట్లోకి రాబోతోంది.

త్రీడీ టెక్నాలజీ మరింత విస్తరిస్తే... పెద్దపెద్ద కార్ఖానాల అవసరమే ఉండదు. ఆ మూలన ఉన్న ఫ్యాక్టరీ నుంచి ఈ మూలన ఉన్న షోరూమ్‌కు సరుకుల్ని తరలించాల్సిన శ్రమే ఉండదు. ప్రతి నగరంలోనూ ఓ షోరూమ్‌ ఉంటుంది. షోరూమ్‌లో ఓ ప్రింటరు ఉంటుంది. పక్కనే ఓ కంప్యూటర్‌లో ఫార్ములా ఉంటుంది. ఖాతాదారుడు ఆర్డరు చేయగానే... ప్రింట్‌ చేసి ఇచ్చేయడమే. ఇప్పటికే ప్రయోగాత్మకంగా త్రీడీ ప్రింటింగ్‌ కార్లను తయారు చేసి చూశారు. ఫలితాలు ఆశాజనకంగానే ఉన్నాయి. త్రీడీ ప్రింటింగ్‌ గృహనిర్మాణ రంగంలోనూ పెను మార్పులకు కారణం అవుతుందంటున్నారు విశ్లేషకులు. ఇప్పటిదాకా అందుబాటులో ఉన్న టెక్నాలజీ ప్రకారం... ఇంటి నమూనా మాత్రమే ముద్రిస్తున్నాం. ఎవరికి తెలుసు. ఏకంగా ఓ ఇంటినే ముద్రించుకోగల భారీ ప్రింటర్లు వచ్చినా రావచ్చు. అదే సాధ్యమైతే...కొద్ది గంటల వ్యవధిలో బ్రహ్మాండమైన మేడలు కట్టుకోవచ్చు. వంతెనలు నిర్మించుకోవచ్చు. దీనివల్ల, నిరుపేదల గృహనిర్మాణ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మౌలిక వనరుల కొరతా తీరుతుంది.
ప్రింట్‌ ఎ దోసె!
ఏ రెస్ట్టారెంటుకో వెళ్లినప్పుడు 'వేడివేడిగా ఓ దోసె ఇవ్వండి?' అని చెప్పాల్సిన అవసరం ఉండకపోవచ్చు. 'ఓ దోసె ప్రింట్‌ చేస్తారా?' అనాల్సిన రోజు రానేరావచ్చు. ఆహార రంగంలో త్రీడీ ప్రింటర్ల ప్రాధాన్యం పెరగబోతోంది. ముడిసరుకు సిద్ధంచేసి ప్రింటర్‌కు అందుబాటులో ఉంచితే... బిర్యానీ కావాలంటే బిర్యానీ, చిప్స్‌ కావాలంటే చిప్స్‌ - క్షణాల్లో సిద్ధం! అంజన్‌ ఇంజినీర్‌ అనే ప్రవాస భారతీయుడు త్రీడీ ప్రింటింగ్‌ ద్వారా పిజ్జాల తయారీ సాధ్యమేనని నిరూపించాడు.
'మాలిక్యులర్‌ గ్యాస్ట్రానమీ టెక్నిక్‌' ఆధారంగా యునైటెడ్‌ కింగ్‌డమ్‌ శాస్త్రవేత్తలు త్రీడీ పండ్లనూ తయారుచేస్తున్నారు. ఇందుకు ప్రత్యేకంగా ఓ ప్రింటరునూ కనిపెట్టారు. యాపిల్‌ పండో, అరటిపండో ప్రింట్‌ తీసుకుని తినడం కాదు...రెండింటిలోని ప్రత్యేకతల్నీ రంగరించి మనకు ఇష్టమైన రంగులో, ఇష్టమైన రుచితో, ఇష్టమైన ఆకారంలో 'యాపిలరటి' అనే కొత్త ఫలాన్నీ సృష్టించుకోవచ్చు. అవసరమైన పోషకవిలువల సమాచారాన్ని అందించగలిగితే...ఆమేరకు మనం కోరుకున్న ఆహారాన్ని సిద్ధంచేసిపెట్టే ప్రింటర్లూ రూపొందుతున్నాయి.
ఫ్యాషన్‌ రంగంలోనూ త్రీడీ ప్రింటింగ్‌ సంచలనాలు సృష్టించబోతోంది. డిజైనర్‌ షూస్‌, డిజైనర్‌ బెల్ట్స్‌ వగైరా వగైరా తయారు చేయడం పెద్ద కష్టమేం కాదిప్పుడు. ఆభరణాలైతే క్షణాల్లో పని! అదీ మనం కోరుకున్న డిజైన్లలో! మన పేరుతోనో మన సంతకంతోనో జూకాలూ గొలుసులూ తయారు చేసుకోవచ్చు. ఈమధ్యే మలేసియాలో త్రీడీ ప్రింటింగ్‌ ఫ్యాషన్‌షో జరిగింది. అందాల మోడళ్లు త్రీడీ నగలతో ధగధగలాడారు.

వ్యక్తిగత అవసరాలూ..
ఓ మిత్రుడి ఇంట్లోని పెన్‌స్టాండ్‌ బాగా నచ్చుతుంది. అచ్చంగా అలాంటి స్టాండు కోసమే నలభై దుకాణాలు వెతకక్కర్లేదు. స్కానరు కనుక ఉంటే, ఆటోకాడ్‌ డిజైన్‌తోనూ అవసరం ఉండదు. నేరుగా ఆ వస్తువునే స్కాన్‌ చేసి, ప్రింటు తీసుకోవచ్చు. ఏ అజంతాకో వెళ్తాం. అద్భుతమైన శిల్పాన్ని చూస్తాం. అలాంటి నమూనా మనింట్లోనూ పెట్టుకోవాలనుకుంటాం. త్రీడీ స్కానరుతో దాన్ని స్కాన్‌ చేస్తే చాలు ..ప్రింటరులో అచ్చంగా అలాంటి బొమ్మే తీసేసుకోవచ్చు. అవసరమైతే స్కాన్‌ చేసిన బొమ్మకు కంప్యూటర్‌లో మెరుగులూ దిద్దుకోవచ్చు. స్కానింగ్‌ యంత్రం ఏ వస్తువునైనా... అన్ని కోణాల్లోంచి ఫొటోలు తీసి మొత్తంగా 360 డిగ్రీల పరిపూర్ణ రూపాన్ని నిక్షిప్తం చేసి పెట్టుకుంటుంది. స్కానర్‌ను ప్రింటర్‌కు అనుసంధానించి ... ప్రింటు తీసుకోవడం ఏమంత కష్టమైన పని కాదు. నోకియా లాంటి సంస్థలు, కొన్ని మోడళ్ల సెల్‌ఫోన్‌ కేస్‌లను త్రీడీ ప్రింటు తీసుకోడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆన్‌లైన్‌లో అందిస్తున్నాయి. థింగివర్స్‌.కామ్‌ వెబ్‌సైట్‌లో బొమ్మలూ గృహాలంకరణ వస్తువులూ ఉపకరణాలూ ఇలా అనేకానేక డిజైన్లు అందుబాటులో ఉన్నాయి. త్రీడీ ప్రింటరు కనుక ఉంటే, నేరుగా ముద్రించుకోవచ్చు. కాకపోతే, ఇక్కడో విషయం గమనించాలి. దుకాణంలో ఏ వందరూపాయలకో వచ్చే పెన్‌స్టాండును...త్రీడీలో ముద్రించుకోడానికి ఏ ఎనిమిది వందలో తొమ్మిదివందలో ఖర్చవుతుంది. అదంత గిట్టుబాటైన వ్యవహారం కాదు. అరుదైన వస్తువుల వరకూ ఫర్వాలేదు.
తానియా జైన్‌ అనే ఫ్యాషన్‌ డిజైనర్‌ హైదరాబాద్‌లోని ఎల్వీప్రసాద్‌ నేత్రవైద్య విజ్ఞానసంస్థ సహకారంతో త్రీడీ టెక్నాలజీతో అంధుల కోసం బ్రెయిలీ పజిల్‌ను రూపొందించింది. అంధ బాలలు స్పెల్లింగులు నేర్చుకోడానికీ, ఆకారాల్ని అర్థంచేసుకోడానికీ ఈ పరికరం ఉపయోగపడుతుంది. ఎఫ్‌.ఐ.ఎస్‌.హెచ్‌... ఫిష్‌ నాలుగు అక్షరాల్ని కలిపితే ఓ పదం ఏర్పడుతుంది. అంతే కాదు... చేప రూపాన్ని కూడా తడిమి తెలుసుకోవచ్చు. అఫ్గాన్‌లో తాలిబన్ల దాడికి నేలకూలిపోయిన బమియాన్‌ బుద్ధుడిని పునఃప్రతిష్ఠించడానికి కూడా ఓ త్రీడీ ప్రింటింగ్‌ నిపుణుల బృందం ప్రయత్నాలు చేస్తోంది.

త్రీడీ ప్రెన్యూర్స్‌...
త్రీడీ టెక్నాలజీలోని వ్యాపార అవకాశాలు యువతరాన్ని ఆకర్షిస్తున్నాయి. ప్రింటర్ల తయారీలో, డిజైనింగ్‌లో, స్కానింగ్‌లో ఉపాధి మార్గాల్ని ఎంచుకుంటున్నారు. తక్కువ ధరలో, అంతర్జాతీయ నాణ్యతతో ప్రింటర్లను అందించే ప్రయత్నమూ మొదలైంది. ఓమోస్తరు ప్రింటరు ఎనభైవేల నుంచి లక్ష రూపాయల్లో దొరుకుతోందిప్పుడు. స్కానర్‌ అయితే కనీసం మూడు లక్షలు పలుకుతోంది. ఒకటి రెండేళ్లలో త్రీడీ ప్రింటర్ల మీదున్న పేటెంట్ల గడుపు పూర్తయిపోతుంది. దీంతో ఆ టెక్నాలజీని ఎవరైనా స్వేచ్ఛగా ఉపయోగించుకోవచ్చు. ఫలితంగా ప్రింటర్ల ధరలు తగ్గిపోయే అవకాశమూ ఉంది.

* * * * * * * * *

ఆ మధ్య ఓ అజ్ఞాతవ్యక్తి... త్రీడీ ప్రింటరు ద్వారా తుపాకీ తయారీకి సంబంధించి ఓ డిజైన్‌ను ఇంటర్నెట్‌లో పెట్టాడు. దాన్ని గుర్తించి తొలగించేలోపు లక్ష డౌన్‌లోడ్లు జరిగిపోయాయి. భవిష్యత్తులో ఇలాంటి విపరిణామాలు మరో రూపంలో ఉన్నా ఉండవచ్చు. ఏ టెక్నాలజీ అయినా అణుశక్తి లాంటిదే - మంచితో పాటూ చెడూ ఉంటుంది.
మనం ఎలా ఉపయోగించుకున్నాం అన్నది ముఖ్యం!


Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning