కొలువు పరీక్ష.. నైపుణ్యమే శ్రీరామరక్ష!

* ప్రాంగణ ఎంపికల్లో నైపుణ్యాలదే పైచేయి
* తొలి నుంచి ప్రణాళిక అవసరమంటున్న నిపుణులు
* కొత్త రాష్ట్రంలో నియామకాలకు ఐటీ కంపెనీల ముందంజ

తూర్పు గోదావరి జిల్లా (అమలాపురం) : 'జిల్లాలో ఇంజినీరింగ్‌ కళాశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చి పెరిగిపోయాయి.. వీటిలో నాతో పాటుగా ఇంజినీరింగ్‌ చదువుకున్న, బీటెక్‌లు పూర్తిచేసిన వేలాది మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఎక్కడ ఉన్నాయి? పైగా రాష్ట్ర విభజనతో ఉద్యోగ అవకాశాలు తగ్గుతాయోమో? అసలు అంతమందిలో నాకు ఉద్యోగం వస్తుందా?'
- ప్రస్తుతం విద్యార్థుల్ని తొలుస్తోన్న ప్రశ్నలు ఇవి
'మన అర్హతలు, సామర్ధ్యాలను పెంచుకుంటే ప్రాంగణ ఎంపికల పరీక్షల్లో పాల్గొనవచ్చు. ఇంజినీరింగ్‌ విద్యార్థులు కొంత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒడిసి పట్టుకుంటే ఉద్యోగం సంపాదించినట్టే. నిజానికి విద్యార్థులకు ఉపాధినిచ్చే సంస్థలు కొత్త ఆంధ్రప్రదేశ్‌కు కూడా వస్తున్నాయి. విద్యార్థులంతా ప్రాంగణ ఎంపికలతో అవకాశాలు అందుపుచ్చుకోకపోవడమే అసలు సమస్య'
- జిల్లాలో ఆయా రంగాల నిపుణులు చెబుతున్న మాటలివి
ఈ రెండింటిలోనూ వాస్తవం ఉంది.. చదువుతున్న ఇంజినీరింగ్‌ విద్యార్థుల సంఖ్య.. ప్రాంగణ నియామకాలకు హాజరవుతున్నవాళ్లను.. వాటిలో ఉద్యోగాలు సాధిస్తున్న వారి సంఖ్యను చూసే చాలా మంది విద్యార్థులు ఇలా డీలా పడిపోతున్నారు. మొన్నటి వరకూ ఆర్థిక మాంద్యం ప్రపంచాన్ని వణికించడంతో ప్రాంగణ ఎంపికలకు ఐటీ కంపెనీలు కాస్త వెనుకంజ వేశాయి. కానీ ఖాతాదారులకు ఒప్పుకున్న ప్రాజెక్టులను సరైన సమయంలో.. సక్రమంగా పూర్తిచేసే లక్ష్యంగా ఐటీ కంపెనీలు ప్రాంగణ ఎంపికలు చేపట్టేందుకు ముందుకు వస్తున్నాయి. అందుకోసం ఉద్యోగ ఎంపిక వడపోత పద్ధతులను కఠినతరం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అన్ని రకాల నైపుణ్యాలు ఉన్నవారే ఉద్యోగాలు పొందగల్గుతున్నారని నిపుణులు చెప్తున్నారు. అందుకు అనుగుణంగా విద్యార్థులు తమను తాము అభివృద్ధి చేసుకోవాలని సూచిస్తున్నారు. అలాంటి అంశాలపై 'న్యూస్‌టుడే' ప్రత్యేక కథనమిది..
* చంద్రబాబుని కలిసిన ఆయా కంపెనీల ప్రతినిధులు
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఐటీ కంపెనీలకు దేశంలోనే కాకుండా.. విభజన అనంతరం మన కొత్త ఆంధ్రప్రదేశ్‌కు కూడా విదేశీ ప్రాజెక్టులు వచ్చే అవకాశం మెండుగా ఉన్నాయి. ఇప్పటికే ఆయా ప్రైవేటు కంపెనీలు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పలుమార్లు సంప్రదింపులు కూడా జరిపారు. అలాగే రాష్ట్రంలో పలు సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ కంపెనీలను తీసుకురావడమే కాకుండా.. ఇంజినీరింగ్‌ యువతకు భారీగా ఉద్యోగావకాశాలు కల్పిస్తామని భరోసా అందజేశారు. దీంతో ఆయా సంస్థలు నిపుణుల కోసం భారీగా ప్రాంగణ ఎంపికలను చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కారణంగా ఇంజినీరింగ్‌ విద్యార్థుల్లో కొత్త ఆశలు రేకెత్తుతున్నాయి.
* కొలువులున్నాయి.. సాధనే రక్ష!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్‌ కంపెనీ 25,000 కొలువులను, ఇన్ఫోసిస్‌ 16000, కాగ్నిజెంట్‌ పదివేలు వరకూ, టెక్‌మహీంద్రా సంస్థ 8వేలు, క్యాప్‌జెమినీవారు 5వేలు వరకూ దేశ వ్యాప్తంగా నియామకాలు చేపట్టనున్నట్లు సమాచారం. దీంతో జిల్లాకు వచ్చే కొలువుల శాతం చాలా తక్కువగా ఉండే అవకాశాలు ఉండటంతో విద్యార్థులు ఇప్పటి నుంచే సాధన చేయాల్సిన ఆవశ్యకత ఉందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఇంజినీరింగ్‌ నాల్గో సంవత్సరం చదువుతున్న వారికి ఈ ఎంపికలు నిర్వహించనున్నారు. పైగా మొదటి మూడేళ్లలో కనీసం 60 శాతం, అంతకు మించిన విద్యార్థులకు కొలువు పరీక్షలు నిర్వహించి ఎంపికలు చేస్తారు. దీంతో తొలుత నుంచీ ప్రణాళికగా దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు.
* ఇదీ జిల్లాలో పరిస్థితి
జిల్లాలోని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఏటా సుమారు 12వేల మంది విద్యార్థులు ప్రవేశాలు పొందుతున్నారు. అయితే వీరిలో 75 శాతం మంది గ్రామీణ ప్రాంతాలు వారే కావడంతో ఆంగ్ల భాషా నైపుణ్యాలపై అవగాహన కొరవడుతుందని నిపుణుల అభిప్రాయం. ఈ కారణంగా ప్రాంగణ ఎంపికల్లో ఉద్యోగాల్లో చేరుతున్నవారు కేవలం 23 శాతం మంది మాత్రమే ఉంటున్నారు. మిగిలిన 77 శాతంలో 7 శాతం మంది పీజీ కోర్సులకు వెళ్తున్నారు. ఇక బోధనా రంగం, ఇతర కొలువుల్లో చేరుతున్నవారు 23 శాతం మంది ఉంటున్నారు. ఇక 2వేల నుంచి రూ.6వేల జీతంలో చిరుద్యోగులుగా మిగిలినపోతున్నవారు 47 శాతం మంది ఇంజినీర్లు ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రముఖ సంస్థలు నిర్వహించే ప్రాంగణ ఎంపికల్లో పూర్తిస్థాయి దృష్టిసారించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని విద్యావేత్తలు సూచిస్తున్నారు.
* ప్రాంగణ ఎంపిక విధానం ఇలా
ప్రాంగణ ఎంపికలకు మొదటగా కళాశాలల్లో క్యాంపస్‌ కనెక్టు ద్వారా నిర్వహించిన పోటీల్లో పాల్గొనాలి. రెండో దశలో ఆంగ్ల భాషపై అభ్యర్థి పట్టును సాధించాలి. అందుకు భావ వ్యక్తీకరణ నైపుణ్యాలపై దృష్టిపెట్టాలి. మూడో దశలో ఆన్‌లైన్‌ పరీక్షలో భాగంగా క్యాంటిటేటివ్‌ అనాలసిస్‌, రీజనింగ్‌, క్రిటికల్‌ రీజనింగ్‌ తదితర అంశాలపై నిపుణత పెంచుకోవాలి. ఇందులో కొంత మందిని ఎంపిక చేసి వారిని మౌఖిక పరీక్షలకు పంపుతారు. తరువాత టెక్నికల్‌ రౌండులో ప్రోగ్రామ్‌ చేసే సాంకేతిక పరిజ్ఞానం, మేనేజ్‌మెంటు రౌండులో సైకోమెట్రిక్‌ టెస్ట్‌ నిర్వహించి నాయకత్వ లక్షణాలు పరిశీలన చేస్తారు. హెచ్‌ఆర్‌ రౌండ్లో ఆటిట్యూడ్‌, హుందా తనం, డ్రెస్‌ కోడ్‌ తదితర అంశాల్లో నైపుణ్యం పెంపొందించుకోవాలి.
* శోధించు.. సాధించు!
అలాగే క్యాంపస్‌ ఎంపికల వరకే కాకుండా.. స్వయంగా ప్రయత్నిస్తే ఉద్యోగాలు ఇచ్చే ఎన్నో కంపెనీలు సిద్ధంగా ఉంటాయి. అందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి. టెలికం లెక్కలు ప్రకారం మొత్తం మీద 56 వేల మంది యువత నెటిజన్లుగా నమోదు చేసుకున్నారు. వారిలో 45 వేల మంది వరకూ పట్టాలను తీసుకున్నవారని వారి అంచనా. ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఏకైక వేదిక అంతర్జాలమే. చాలా సంస్థలు ఉద్యోగాల భర్తీకి వెబ్‌సైట్‌లనే వేదికగా ఎంచుకుంటున్నాయి. ఉపాధి వివరాలను మన కళ్ల ముందుంచే వీటిపై అవగాహన పెంచుకుంటే.. అభిరుచి, సామర్థ్యానికి తగిన ఉద్యోగం పట్టుకోవడం పెద్ద కష్టం కాదు. ఉద్యోగాలను శోధించే వెబ్‌సైట్‌లలో మన మెయిల్‌ ఐడీతో నచ్చిన వెబ్‌సైట్‌ను తెరచి వివరాలు నమోదు చేసుకోవచ్చు.
* సాంకేతిక పరిజ్ఞానం అవసరం : డాక్టర్‌ కె.ఎస్‌.ఎన్‌.రావు, బిట్స్‌ పిలానీ విశ్రాంత శాస్త్రవేత్త, అమలాపురం.
ముఖ్యంగా విద్యార్థులంతా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒడిసి పట్టుకుంటే జాబ్‌ సంపాదించినట్టే. ఆయా నైపుణ్యాలపై పూర్తిస్థాయి శిక్షణ తీసుకోవాలి. ముఖ్యంగా ప్రతి విద్యార్థీ అవుట్‌ కమ్‌ బేస్డ్‌ లెర్నింగ్‌ విధానాన్ని అవలంభించాలి. అలాగే ఇంజినీరింగ్‌ విద్యలో ప్రయోగ అంశాలపై కూడా దృష్టిసారించాలి. ప్రాజెక్టు వర్కులపై పట్టు సాధించాలి. మారుతున్న ప్రపంచీకరణ నేపథ్యంలో పెరుగుతున్న సాంకేతిక అవసరాలు, విస్తృతమవుతున్న శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులు అవగాహన పొందేందుకు అంతర్జాలంపై పట్టు సాధించాలి.


Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning