జీఆర్‌ఈలో స్కోరు ఇలా!

ఇంగ్లిష్‌ మాతృభాషగా ఉండే దేశాల్లో చదవదల్చిన విదేశీ విద్యార్థులు జీఆర్‌ఈ, టోఫెల్‌, ఐఈఎల్‌టీఎస్‌ లాంటి ప్రి-రిక్విజిట్‌ టెస్టులను రాయాల్సివుంటుంది. అప్పుడే మంచి విద్యాసంస్థల్లో సీటు లభిస్తుంది. జీఆర్‌ఈ విధానం, సన్నద్ధమయ్యేతీరు గురించి తెలుసుకుందాం!
అమెరికా లాంటి దేశాల విశ్వవిద్యాలయాల్లో ఎం.ఎస్‌. చదవాలనుకునేవారి ప్రయత్నాలు జీఆర్‌ఈ (గ్రాడ్యుయేట్‌ రికార్డ్‌ ఎగ్జామ్‌)కి తయారవటంతో ప్రారంభమవుతాయి. గత ఏడాది 90 వేలమందికి పైగా భారతీయ విద్యార్థులు జీఆర్‌ఈ రాశారు. ఏటా ఈ పరీక్ష రాసేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ పరీక్ష స్కోరు ఐదేళ్ళపాటు చెల్లుబాటవుతుంది.
అమెరికాలో ఎన్నో బిజినెస్‌ స్కూళ్ళు ఎంబీఏ ప్రవేశాలకు జీమ్యాట్‌కు బదులుగా జీఆర్‌ఈ స్కోరును పరిగణనలోకి తీసుకుంటున్నాయి. టోఫెల్‌, శాట్‌లను ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే ఇంగ్లిష్‌ టెస్టింగ్‌ సర్వీస్‌ (ఈటీఎస్‌) సంస్థే జీఆర్‌ఈ నిర్వహణను చూస్తోంది.
ఎందుకీ పరీక్ష?
అమెరికా లాంటి ప్రసిద్ధ దేశాల్లో విద్యాభ్యాసం కోసం ప్రపంచవ్యాప్తంగా దరఖాస్తులు వస్తుంటాయి. కేవలం విద్యాపరమైన ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పించటం విశ్వవిద్యాలయాలకు చాలా కష్టమవుతుంది. ఎందుకంటే ఒక్కో దేశంలోని విద్యాసంస్థల ప్రమాణాలను బట్టి అక్కడ చదివినవారికి అవిచ్చే మార్కుల శాతాలు వేర్వేరుగా ఉంటాయి. అందుకని ఉమ్మడి వేదికగా ఉండే జీఆర్‌ఈ ద్వారా విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించుకోగలుగుతారు.
విద్యార్థి ఐక్యూను మదింపు చేస్తుంది జీఆర్‌ఈ. దీనిలో మూడు అంశాలుంటాయి. 1) అనలిటికల్‌ రైటింగ్‌ 2) వెర్బల్‌ రీజనింగ్‌ 3) క్వాంటిటేటివ్‌ రీజనింగ్‌.
* అనలిటికల్‌ రీజనింగ్‌: దీనిలో రెండు వ్యాసాలు (ఒక అంశం విశ్లేషణ, ఒక వాదన విశ్లేషణ)- నేరుగా కంప్యూటర్‌లో రాయాల్సివుంటుంది. ప్రతి వ్యాసానికీ 30 నిమిషాల వ్యవధి ఉంటుంది. www.gre.orgలో ఉన్న వ్యాసాల్లోంచి కంప్యూటర్‌ రాండమ్‌గా ఒకదాన్ని పరీక్ష రోజు ఎంచి తెరమీద చూపిస్తుంది. విద్యార్థి ఆ అంశంపై నిర్దిష్ట సమయంలో వ్యాసం రాయాలి. ఒక్కో వ్యాసానికి 0-6 పాయింట్ల మధ్య స్కోరు ఉంటుంది. రెండు వ్యాసాల సగటు స్కోరు తుది స్కోరు అవుతుంది. 4కు మించిన స్కోరు మంచి విశ్వవిద్యాలయాల్లో ప్రవేశానికి అవసరం.
* వెర్బల్‌ రీజనింగ్‌: ఒక్కో విభాగంలో 20 ప్రశ్నలుండే రెండు విభాగాలు దీనిలో ఉంటాయి. వ్యవధి 30, 30 నిమిషాలు. సెంటెన్స్‌ ఈక్వివలెన్స్‌, టెక్ట్స్‌ కంప్లీషన్‌, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ అనే మూడు రకాల ప్రశ్నలుంటాయి.
* క్వాంటిటేటివ్‌ రీజనింగ్‌: 35 నిమిషాల వ్యవధి ఉండే రెండు విభాగాలుంటాయి. ప్రతి విభాగంలో 20 ప్రశ్నలు. క్వాంటిటేటివ్‌ కంపారిజన్‌, మల్టిపుల్‌ చాయిస్‌, న్యూమరిక్‌ ఎంట్రీ రకం ప్రశ్నలుంటాయి.అన్‌స్కోర్డ్‌ లేదా రిసర్చ్‌ సెక్షన్‌ కూడా జీఆర్‌ఈలో ఉంటుంది.
ఇది కంప్యూటర్‌ అడాప్టివ్‌ టెస్ట్‌. వెర్బల్‌, క్వాంటిటేటివ్‌ ప్రశ్నలు వివిధ క్లిష్టత స్థాయుల్లో ఉంటాయి. విద్యార్థి ప్రతిభ తీరును బట్టి కంప్యూటర్‌ క్లిష్టత స్థాయిని హెచ్చించటం కానీ, తగ్గించటం కానీ చేస్తుంది. వెర్బల్‌/ క్వాంటిటేటివ్‌లో విద్యార్థి ప్రతిభను బట్టి రెండో విభాగం మొదటిదానికంటే తేలిగ్గానో, మరింత కఠినంగానో వస్తుంది. క్లిష్టత పెరిగినకొద్దీ విద్యార్థి స్కోరు మెరుగవుతుంది.
కొత్త జీఆర్‌ఈ... విద్యార్థులకు ఎంతో అనుకూలంగా రూపుదిద్దుకుంది. సెక్షన్‌కు నిర్దేశించిన సమయంలో ఆ సెక్షన్‌లో పూర్వపు ప్రశ్నలకు వెళ్ళాలన్నా, తర్వాతి ప్రశ్నకు మారాలన్నా వీలవుతుంది.
ఎంత స్కోరు అవసరం?
వెర్బల్‌, క్వాంటిటేటివ్‌లలో విద్యార్థులకు కనీసం 300+ స్కోరు ఉండాలని చాలా విశ్వవిద్యాలయాలు కోరుకుంటాయి. మన విద్యార్థులు ఎక్కువమంది సాంకేతిక కోర్సులు చదవటానికే అమెరికా లాంటి దేశాలకు వెళ్తుంటారు కాబట్టి క్వాంటిటేటివ్‌పైనే శ్రద్ధ ఉంటోంది. దీనిలో 160+, వెర్బల్‌లో 150+ తెచ్చుకోవాలనే లక్ష్యంతో కృషి చేస్తే మంచి విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం లభిస్తుంది. అనలిటికల్‌ రైటింగ్‌లో 4 స్కోరు తప్పనిసరి.
అడ్మిషన్లకు కనీసం ఏడాది ముందు జీఆర్‌ఈ సన్నద్ధత మొదలుపెట్టటం మేలు.
* ఫాల్‌ సెమిస్టర్‌ (ఆగస్టు ఇన్‌టేక్‌)కు దరఖాస్తు చేసేవారు జీఆర్‌ఈ స్కోరును డిసెంబరుకల్లా సిద్ధం చేసుకోవాలి.
* స్ప్రింగ్‌ సెమిస్టర్‌ (జనవరి ఇన్‌టేక్‌) దరఖాస్తుదారులు ఆగస్టుకల్లా ఈ స్కోరును పొందాలి.
ఈ పరీక్ష సన్నద్ధతకు 4 నుంచి 6 నెలల సమయం పడుతుంది కాబట్టి ప్రవేశాల సమయానికి కనీసం సంవత్సరం ముందే జీఆర్‌ఈపై దృష్టిపెట్టాలి.
ఇవీ మెలకువలు
రైటింగ్‌, వెర్బల్‌ సెక్షన్‌లలో బాగా స్కోరు చేయాలంటే పఠన నైపుణ్యాలు, పద సంపదను మెరుగుపరుచుకోవటం అవసరం. క్రమం తప్పకుండా వార్తాపత్రికలూ, మ్యాగజీన్లూ, పుస్తకాలూ చదువుతుంటే ఎంతో ఫలితం ఉంటుంది.
జీఆర్‌ఈ పాత పద్ధతిలో పదాలను గుర్తుంచుకుంటే సరిపోయేది. కానీ కొత్త పద్ధతిలో అది సరిపోదు. సందర్భానుసారం మాటలను అన్వయించుకోవాలి. పదాల అర్థాలను సందర్భానికి అనుగుణంగా గ్రహించటం తప్పనిసరి. ఈ రకంగా మంచి పఠన నైపుణ్యం జీఆర్‌ఈ స్కోరుకు పునాదిగా పనిచేస్తుంది.
క్వాంటిటేటివ్‌లో గణిత భావనలు (కాన్సెప్టులు) హైస్కూలు స్థాయివి అయినప్పటికీ సమస్యాసాధన మాస్టర్స్‌ స్థాయిలో ఆలోచించి చేయాల్సివుంటుంది. అనలిటికల్‌ రైటింగ్‌లో విద్యార్థి భాషానైపుణ్యాలను కాకుండా వాదనను ప్రవేశపెట్టటంలో తార్కిక శక్తిని పరీక్షిస్తారు.
జీఆర్‌ఈ సన్నద్ధత
* మొదటి దశ: భావనలు నేర్చుకోవటం, వాటిని ప్రాక్టీస్‌ ప్రశ్నల్లో అన్వయించటం.
* రెండో దశ: నిర్దిష్ట సమయంలో సాధన చేయటం, పునశ్చరణ, పొరపాట్లను సరిచేసుకోవటం.
* మూడో దశ: పేపర్‌పై, కంప్యూటర్‌పై వీలైనన్ని ఎక్కువ ప్రాక్టీసు టెస్టులు రాయటం. ఈ అనుభవం అసలు పరీక్ష రోజు ఎంతో ఉపయోగపడుతుంది.
వెబ్‌సైట్‌: www.ets.org/gre


Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning