ఇంజినీరింగ్‌లో.. ఆన్‌లైన్‌ పరీక్ష

* సాంకేతిక విద్యలో నూతన ఒరవడి
* ప్రమాణాల పెంపునకు చర్యలు

కరీంగనగర్ (గణేశ్‌నగర్‌): బోధనా రుసుం విషయమై ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ నిలిచింది. ఉభయ రాష్ట్రాల్లో సీట్లను ఎంపిక చేసుకొనే విద్యార్థులు కొందరు పక్క రాష్ట్రాలకు పయనమయ్యారు.. ప్రస్తుతం రాష్ట్రంలోని కళాశాలల యాజమాన్యాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. కౌన్సెలింగ్‌ ఆలస్యమైనా సరే.. విద్యార్థులను చేజార్చుకోవద్దని ఇప్పటికే పోటాపోటీగా ప్రచారం, ఉచిత బహుమతులతో విద్యార్థుల తల్లిదండ్రులను వూపిరి పీల్చుకోకుండా చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితి కొరకరాని కొయ్యగా మారితే కేంద్రం నిర్ణయం మూలిగే నక్కపై తాటి పండు చందంగా మారింది. యంత్ర విద్యా కళాశాలల్లో సెమిస్టర్‌ పరీక్షలను ఆన్‌లైన్‌ పద్ధతిలో నిర్వహించాలని యోచిస్తోంది..
యంత్ర విద్యా బోధన పటిష్ఠం చేసేందుకు, విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు సమూలమైన మార్పులు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పరీక్ష నిర్వహణలో నూతన పద్ధతులను ప్రవేశపెట్టేందుకు కార్యాచరణ రూపొందించింది. సాంకేతిక విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచేలా పరీక్షలను ఆన్‌లైన్‌ చేయాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి ఇటీవల నిర్ణయించింది. బ్యాంకింగ్‌, బీమా, బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఉద్యోగాలకు, ఐఐఎం, ఐఐటీల్లో ప్రవేశాలకు ఇప్పటికే ఆన్‌లైన్‌ పరీక్ష విధానం అమల్లో ఉంది. తొలిసారిగా ఇంజినీరింగ్‌ విద్యా వార్షిక పరీక్షలను ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్నారు.
* నాలుగో ఏటా చివరి పరీక్ష
ఇంజినీరింగ్‌ కళాశాలల్లో నాలుగేళ్లపాటు సాగే విద్యలో ఆరు సెమిస్టర్‌లు ఉంటాయి. మొదటి సంవత్సరం విద్యా సంవత్సరంగా పూర్తి చేసి రెండో సంవత్సరం నుంచి ఏటా రెండు సెమిస్టర్ల వారీగా పరీక్షలు నిర్వహిస్తారు. వీటిలో చివరి పరీక్షను ఆన్‌లైన్‌ విధానంలోకి తీసుకురానున్నారు. పరీక్ష నిర్వహణలో భాగంగా ఇప్పటివరకు కళాశాలలకు ప్రశ్నపత్రాలు పంపేవారు. ఇప్పుడు విశ్వవిద్యాలయం పర్యవేక్షణలో పరీక్షలు జరపనున్నారు. ఈ పరీక్షల్లో విద్యార్థులు కనబర్చే ప్రతిభ ఆధారంగా కళాశాలల పని తీరును అంచనా వేయవచ్చనేది అధికారుల అభిప్రాయం.
* జరిగేది ఇలా..
జేఎన్‌టీయూ పరిధిలోని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఆన్‌లైన్‌ పరీక్ష విధానం 2005లోనే రెండేళ్ల పాటు అమలు చేశారు. అప్పట్లో పూర్తిస్థాయి పర్యవేక్షణలోపం, రాజకీయ కారణాలు చోటు చేసుకోవడంతో ఆన్‌లైన్‌ పద్ధతికి స్వస్తి పలికారు. తాజాగా మళ్లీ ఆ విధానాన్నే తెరపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో ఆయా కళాశాలల వారికి ప్రశ్నలతో కూడిన సీడీలు ఇస్తారు. వాటిని కళాశాలల్లో ఉండే సర్వర్‌లో లోడు చేస్తారు. ఇంటర్నెట్‌ సాయంతో కళాశాలల్లో ఉండే 60-120 కంప్యూటర్లకు అనుసంధానం చేస్తారు. విద్యార్థి పరీక్ష రాసే సమయంలో కంప్యూటర్‌ ముందు కూర్చున్న తర్వాత తనకు ఇచ్చిన హాల్‌టిక్కెట్‌ నంబరులో కంప్యూటర్‌లో లాగిన్‌ అవ్వాలి. ఆ తర్వాత పాస్‌వర్డ్‌ పెట్టుకొని లాగిన్‌ కోడుతో అనుసంధానం చేయాలి. అప్పుడు 20 ప్రశ్నలు తెరపై కనిపిస్తాయి. ఆ ప్రశ్నలకు సమాధానం రాసేందుకు 20 నిమిషాల సమయం ఇస్తారు. అనంతరం ఎన్ని మార్కులు వస్తాయనే విషయం అప్పటికప్పుడు తెలిసిపోతుంది. ఇదంతా పారదర్శకంగా జరుగుతుండటంతో నాణ్యమైన విద్య అందించే అవకాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు.
* 18 కళాశాలలు.. 6878 సీట్లు
జిల్లా కేంద్రం, పరిసర ప్రాంతాలతో పాటు అన్ని ముఖ్య పట్టణాల్లో యంత్ర విద్యా కళాశాలలున్నాయి. 18 కళాశాలల్లో 6,878 వరకు సీట్లున్నాయి. ఎంసెట్‌-2014లో ఇంజినీరింగ్‌ విభాగంలో జిల్లా నుంచి 11,804 మంది హాజరయ్యారు. గతంలో విచ్ఛలవిడిగా వెలిసిన కళాశాలలు ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. కొత్తగా సీట్ల సంఖ్యను పెంచుకునే ప్రయత్నం చేయడమే లేదు. ఉన్న సీట్లు భర్తీ చేసుకోవడమే పలు కళాశాలలకు భారంగా మారింది. తాజాగా సెమిస్టర్‌లో ఆన్‌లైన్‌ పరీక్షతో కళాశాల ప్రమాణాలను పరిగణించాలని చూడటం కళాశాలలకు మింగుడు పడని విషయంగానే తెలుస్తుంది.
* మిశ్రమ ఫలితం
కొత్త విధానంతో మిశ్రమ ఫలితాలుంటాయని యంత్ర విద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఒక కళాశాల ప్రమాణాన్ని లెక్కించడంలో మొత్తం మంది విద్యార్థుల ప్రతిభను పరిగణలోకి తీసకుంటారు. అయితే కళాశాలలో విద్యార్థులంతా ఒకే విధమైన పరిజ్ఞానం కలిగి ఉండరు. అంతేకాదు ఎంసెట్‌లో అతి తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు ప్రవేశాలు లభిస్తున్న తరుణంలో ప్రమాణాన్ని తేల్చడం కష్టమని తెలుస్తోంది.. ఆన్‌లైన్‌ విధానం ఉంటుందనే ఆలోచనతో విద్యార్థులు మొదటి నుంచీ చదువుపై శ్రద్ధ కనబర్చే అవకాశం ఉంది. అంతేకాకుండా హాజరు శాతం పెరుగుతుంది. యాజమాన్యాలు నియమ, నిబంధనలు పాటించి నాణ్యమైన బోధన అందించేందుకు చర్చలు తీసుకుంటారు. ఇప్పటి వరకు జేఎన్‌టీయూ మూడో సంవత్సరం మొదటి సెమిస్టర్‌ వరకు డిటెన్షన్‌ అయ్యే అవకాశం లేదు. ఆన్‌లైన్‌ పరీక్షతో ఈ విధానంలో మార్పు చోటు చేసుకునే అవకాశం ఉందని వాగేశ్వరీ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ శ్రీనివాస్‌ పేర్కొన్నారు.


Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning