నిపుణుడే విజేత

* త్వరలో లక్షలాది కొలువులు
* పోటీ తట్టుకుంటేనే ఐటీఐఆర్ ఫలాలు

* యువతా.. సిద్ధమేనా...
ఈనాడు, హైదరాబాద్: సాఫ్ట్‌వేర్ హబ్‌గా మారిన హైదరాబాద్‌కు సమాచార సాంకేతిక పెట్టుబడుల ప్రాంతం(ఐటీఐఆర్) దక్కడంతో మరికొద్ది సంవత్సరాల్లో లక్షలాది ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. ఇది ఇంజినీరింగ్ విద్యార్థులను ఊరిస్తోంది. మరి ఆ ఉద్యోగాలను అందుకునేందుకు మన విద్యార్థులు సిద్ధమవుతున్నారా? కళాశాలలు వారిని అన్ని నైపుణ్యాలతో తీర్చిదిద్దుతున్నాయా? ఐటీఐఆర్ ఫలాలు మన యువతకు అందాలంటే ఏం చేయాలి?...
కళాశాలలు చేయాల్సిందేంటి
తెలంగాణలో 1.90 లక్షల ఇంజినీరింగ్ సీట్లు అందుబాటులో ఉండగా ఇప్పటికే 50 వేలకుపైగా సీట్లు మిగిలిపోతున్నాయి. ఉన్నవాటిల్లో కొద్ది కళాశాలల్లో మాత్రమే పూర్తిస్థాయిలో సీట్లు భర్తీ అవుతున్నాయి. మిగతా వాటిలో మిగిలిపోవడానికి కారణం ఐటీ బూమ్ కొంత తగ్గడంతోపాటు కళాశాలల్లో తగిన ప్రమాణాలు లేకపోవడమే. అర్హులైన అధ్యాపకులు లేకపోవడం, ప్రయోగశాలల్లో తగిన పరికరాలు ఉండకపోవడం వల్ల ఆయా కంపెనీలు ప్రాంగణ నియామకాలకు కొన్ని కళాశాలకే వెళుతున్నాయి. విశ్వవిద్యాలయాలచే 50 శాతం ఆమోదం పొందిన అధ్యాపకులున్న కళాశాలలు కేవలం 50లోపే ఉన్నాయంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో స్పష్టమవుతోంది. ఏటా జేఎన్‌టీయూహెచ్ తనిఖీల్లో 50 శాతం కళాశాలలు వివిధ లోపాలపై నోటీసులు అందుకుంటూనే ఉన్నాయి. వర్సిటీ తర్వాత పట్టించుకోవడం లేదు. ఫలితంగా కళాశాలలు విద్యార్థులు చేరి ఫీజులొస్తే చాలన్నట్లు వ్యవహరిస్తున్నాయి. ఒకవేళ వర్సిటీ అధికారులు ఉదాసీనంగా వ్యవహరించినా నాణ్యత పాటించని కళాశాలల మూసివేసుకునే పరిస్థితి ఎంతో దూరంలో లేదని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. నాణ్యమైన విద్యాబోధన అందే సంస్థలే మనుగడ సాగిస్తాయంటున్నారు. అందువల్ల అర్హులైన అధ్యాపకులను నియమించుకోవడం ప్రథమంగా చేయాల్సిన పనని సూచిస్తున్నారు.
ప్రభుత్వం ఏం చేయాలంటే...
హైదరాబాద్ చుట్టుపక్కల సుమారు 180 వరకు ఇంజినీరింగ్ కళాశాలలున్నాయి. నాణ్యత పెంచుకునేందుకు అవి పోటీ పడేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలకు అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. ఇప్పటికే తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జి(టాస్క్) కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ఐటీ మంత్రి కేటీఆర్ ప్రకటించడం శుభపరిణామంగా నిపుణులు చెబుతున్నారు. ఐటీఐఆర్‌ను త్వరితగతిన సిద్ధం చేసి కంపెనీలను ఆకర్షించేందుకు కృషి చేయాల్సి ఉంది.
విద్యార్థులు పాటించాల్సింది ఇదీ...
* ఆసక్తి ఉన్న కోర్సులను ఎంచుకొని మంచి కళాశాలల్లో చదవడం
* తరగతులకు హాజరు కావడంతోపాటు ప్రాక్టికల్స్‌ను చిత్తశుద్ధితో చేయడం
* కనీసం 70 శాతం మార్కులు ఉండాలి
* పూర్వ విద్యార్థులతో తరచూ మాట్లాడుతూ మార్కెట్లో డిమాండ్ ఉన్న అంశాలపై పట్టు సాధించడం
* వ్యక్తిత్వ వికాసం, సానుకూల దృకృథాన్ని అలవర్చుకోవడం, బృందంతో కలిసి పనిచేసేలా సిద్ధంగా ఉండటం. కమ్యూనికేషన్ నైపుణ్యం పెంచుకోవడం.
* నాలుగో సంవత్సరంలో ప్రాజెక్టు వర్క్‌లో భాగంగా ప్రస్తుతం ఏదైనా రంగం ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించేలా లైవ్ ప్రాజెక్టును చేపట్టడం.
భవిష్యత్తు టెక్నాలజీపై కన్నేయాలి - రాజన్న, ప్రాంతీయ అధిపతి, టీసీఎస్
ఇప్పటికే స్మార్ట్ ఫోన్‌తో చాలా సదుపాయాలు పొందుతున్నాం. 2020 నాటికి ఫోన్ నుంచే చాలా వాటిని నడిపే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తోంది. ఫోన్ నుంచే ఫ్రిజ్, మైక్రో ఓవెన్, విద్యుత్తు బల్బులు ఇలా ఎన్నింటినో ఆన్, ఆఫ్ చేసుకోవచ్చు. ఈ భవిష్యత్తు టెక్నాలజీలపై దృష్టి సారించాలి. ఎంటర్‌ప్రెన్యూర్ సొల్యూషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్, టెస్టింగ్, అప్లికేషన్లు తదితర విభాగాల్లో కూడా మంచి ఉద్యోగావకాశాలు వస్తున్నాయి. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, బిగ్‌డాటా వాటికీ భవిష్యత్తు ఉంది. ఇంజినీరింగ్ సిలబస్‌లో పెద్ద లోపాలు ఏమీ ఉండటం లేదు. ఇప్పుడు ప్రతి విశ్వవిద్యాలయం బోర్డు ఆఫ్ స్టడీస్‌లో కంపెనీల ప్రతినిధులు సభ్యులుగా ఉంటున్నారు. వారి సూచనలనూ వర్సిటీలు పరిగణనలోకి తీసుకొని సిలబస్‌లో మార్పులు చేర్పులు చేస్తున్నాయి.
ఉపాధి కల్పన ముఖ్యం - ఎన్ఎల్ఎన్ రెడ్డి, ప్లేస్‌మెంట్ అధికారి, సీబీఐటీ
దేశ, రాష్ట్రవ్యాప్తంగా లక్షల్లో ఇంజినీరింగ్ పట్టభద్రులు ఏటా బయటకు వస్తున్నారు. ఉద్యోగాలేమో తక్కువ. ఉన్నా ఐటీ రంగంలోనే అధికం. అవి కూడా 20 శాతానికి మించి ఇవ్వడం లేదు. అందువల్ల ప్రధాన సమస్య పట్టభద్రులతో సమానంగా ఉద్యోగాలు లేకపోవడమే. ఒకవేళ అందరిలో పరిశ్రమలు కోరుకున్న నైపుణ్యాలు ఉంటే ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఉందా అంటే లేదనే చెప్పాలి. అదే సమస్య అయితే మన విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచడం పెద్ద కష్టం కాదు. ఉద్యోగాలు ఉంటే విద్యార్థులే ఎవరికి వారు దృష్టి పెడతారు. అందుకే పెట్టుబడులు ఎక్కువగా పెట్టేలా కంపెనీలను ఆకట్టుకోవాలి. దానివల్ల ఎక్కువ ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం 90శాతం సాఫ్ట్‌వేర్‌ను ఎగుమతి చేస్తున్నాం. అంటే ఆ దేశాల్లో వాటిని వినియోగించుకుంటున్నారు. మన దేశంలో కేవలం 10 శాతం మాత్రమే వాడుకుంటున్నాం. ఇక్కడ కూడా ఐటీ వినియోగం పెంచుకుంటే మరిన్ని ఉద్యోగాలు స్పష్టించుకోవచ్చు.
ఐటీఐఆర్ స్వరూపమిదీ...
ఐటీఐఆర్ అంటే సమాచార సాంకేతిక పరిజ్ఞాన పెట్టుబడుల కేంద్రం. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలకు సంబంధించి కంపెనీలకు వసతులు కల్పిస్తారు.
ఆయా కంపెనీల పెట్టుబడుల అంచనాలు ఇలా...
* ఐటీ నుంచి: రూ.1.18 లక్షల కోట్లు
* ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ తయారీ రంగం నుంచి: రూ.1.01 లక్షల కోట్లు
* నగర పరిసరాల్లో ఐటీఐఆర్ ప్రాజెక్టు: 50 వేల ఎకరాలు
* మొదటి దశ పూర్తి: 2018 నాటికి
* రెండో దశ పూర్తి: 2018 నుంచి 2038 నాటికి
* సదుపాయాల కల్పనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కేటాయింపు: రూ.17 వేల కోట్లు
* అందుబాటులోకి వచ్చే ఉద్యోగాలపై అధికారుల అంచనా:
- ప్రత్యక్షంగా 14.8 లక్షలు
- పరోక్షంగా 55.9లక్షలు.


Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning