కొత్త ఆలోచన నుంచే కోట్ల రాబడి

* యువతకు ఏపీ ప్రభుత్వ ప్రోత్సాహం
* ఐ.టి.కంపెనీల ఏర్పాటుకు సాయం
* స్టార్ట్‌అప్‌ విలేజీ నెలకొల్పే యోచన

కొత్త ఆలోచన ఉంటే చాలు.. కోటీశ్వరుడు కావచ్చు. అదీ పైసా పెట్టుబడిలేకుండా..పట్టుదల, కష్టపడే మనస్తత్వం పుష్కలంగా ఉంటే ప్రభుత్వమే ముందుకొచ్చి అన్ని విధాలా ప్రోత్సహిస్తుంది. ఇందుకోసమే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 'స్టార్ట్‌ అప్‌ విలేజీ'ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. రాష్ట్ర ఐ.టి.శాఖ ఇందుకు ఏర్పాట్లు చేస్తోంది. యువతకు సరయిన మార్గనిర్దేశనం చేస్తే వారు పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతారు. ప్రపంచంలోని అగ్రశ్రేణి ఐటీ సంస్థల్లో సన్‌ మైక్రో సిస్టమ్స్‌ ఇలా ఏర్పాటయిందే. స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తిచేసిన ముగ్గురు విద్యార్థులు ఈ కంపెనీ ఏర్పాటు చేశారు. 'సన్‌' అంటే స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ నెట్‌వర్క్‌. ఇప్పుడీ సంస్థ ఉత్పత్తులు సాఫ్ట్‌వేర్‌ రంగంలో కీలకమయ్యాయి. అమెరికాలోని బిలియన్‌ డాలర్‌ కంపెనీల్లో ఒకటి.
వినూత్న ఆలోచనలు ఉన్న యువత రాష్ట్రంలో ఎందరో ఉన్నా, వాటిని కార్యరూపంలో పెట్టడానికి అడుగడుగునా సవాళ్లే. పెట్టుబడుల సమీకరణ దగ్గర నుంచి మార్కెటింగ్‌ వరకు సలహాలు ఇచ్చే వారూ లేరు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, కాకినాడ నగరాల్లో దాదాపు 223 ఐటీ కంపెనీలు 22,644 మందికి ఉపాధి కల్పించాయి. కానీ రాష్ట్రంలో ఏటా బయటకు వస్తున్న ఇంజినీరింగ్‌, ఎంసీఏ విద్యార్థుల సంఖ్య లక్షన్నర దాటుతోంది. వీరందరికి ఉపాధి కల్పించడంతో పాటు, సొంతంగా కంపెనీలు ఏర్పాటు చేసుకొనే విధంగా సహకరించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించాలని ఐ.టి.శాఖ ప్రభుత్వాన్ని కోరుతోంది.
కేరళ ఆదర్శం... కేరళలోని కోచిలో పనిచేస్తున్న స్టార్ట్‌అప్‌ విలేజీని రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శంగా తీసుకొంది. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో ఎలాంటి లాభాపేక్షలేని ఇన్‌క్యుబేషన్‌ కేంద్రాన్ని 2012 ఏప్రిల్‌లో ప్రారంభించారు. ఇప్పటి వరకు దాదాపు 679 ఆలోచనలకు అనుమతి లభించింది. అవసరమైన నిధులను సెబీ ఆమోదిత ఫండ్‌ సంస్థలు సమకూర్చుతున్నాయి. పేరున్న కంపెనీలు సాంకేతిక సహాయ సహకారాలను అందిస్తున్నాయి.
కోచి స్టార్ట్‌ అప్‌లో...
వచ్చిన దరఖాస్తులు        3175
అనుమతించిన స్టార్ట్‌అప్‌లు        679
ఇందులో విద్యార్థుల స్టార్ట్‌అప్‌        249
ఔత్సాహికులకు సహకారమిలా...
స్టార్ట్‌అప్‌ విలేజీ ప్రారంభమైన తరువాత పారిశ్రామిక వేత్తగా ఎదిగేందుకు అవసరమైన ఆలోచనలున్న యువత దరఖాస్తు చేసుకోవాలి.
నిపుణులు, మెంటార్స్‌ ఈ ఆలోచనలను పరిశీలిస్తారు. ఔత్సాహికుడి ఆలోచన, దానిద్వారా వచ్చే లాభాన్ని అంచనా వేస్తారు. ప్రాజెక్టు ఆలోచన నచ్చితే ఐటీశాఖ అనుమతి ఇస్తుంది.
అనంతరం ఆలోచనను ఆచరణలోకి తీసుకువచ్చేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. ప్రాజెక్టుకు అవసరమైన మూలధన పెట్టుబడి సమకూర్చుతారు.
ప్రాజెక్టులో పురోగతి ఉంటే నిధులు సమకూర్చుతారు. లేకుంటే నిలిపివేస్తారు. ఏడాదిలోగా ప్రాజెక్టును మార్కెట్‌ అవసరాలకు అనుకూలంగా తీర్చిదిద్దాలి.
ప్రముఖ ప్రతినిధులు, ప్రాజెక్టు పర్యవేక్షకులు, పరిశోధకులుఅవసరమైన సాంకేతిక, సహాయ సహకారాలు అందించడంతో పాటు ఎదురయ్యే సమస్యలకు పరిష్కార మార్గాలు సూచిస్తారు.
ఈ సంస్థలకు కేంద్ర ప్రభుత్వ పన్ను రాయితీలు లభిస్తాయి.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning