ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ తోరణాలు!

* ఆమోదానికి ఐటీ విధానం
* మెగా హబ్‌ల నిర్మాణం
* అనుమతులకు సింగిల్‌విండో విధానం

ఈనాడు, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగం అభివృద్ధికి ప్రభుత్వం కీలక విధానం రూపొందించింది. దేశ, విదేశాల్లోని ఐటీ కంపెనీల పెట్టుబడులు ఆకర్షించేందుకు, వాటికి మెరుగైన ప్రోత్సాహకాలిచ్చేందుకు ఈ కొత్త విధానం ఊతమిస్తోంది. రానున్న ఐదేళ్లలో ఐటీ రంగంలో రూ.12వేల కోట్ల పెట్టుబడులు సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు ఐటీ శాఖ రూపొందించిన విధివిధానాలకు ఆగస్టు 1న జరిగే మంత్రిమండలి సమావేశం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. వారంలో దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ కానున్నాయి. టెక్ మహీంద్రాకు పదెకరాలు, కేంద్ర ప్రభుత్వ పరిశోధన సంస్థ సమీర్‌కు తొలి విడత కింద 13 ఎకరాల కేటాయింపు, విశాఖలో విప్రోసెజ్ ఏర్పాటుపై నిర్ణయం ప్రకటించనుంది. ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ ఐటీలో ఐదు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేందుకు చేస్తున్న కసరత్తులో భాగంగా ఈ విధానం తీసుకువస్తోంది. ప్రస్తుత విధానంతో పోలిస్తే ఏపీ ఐటీ నూతన విధానం పరిశ్రమలకు అనుకూలంగా ఉంటుందని ప్రభుత్వం పేర్కొంటోంది.
ఐటీ విధానంలో కొన్ని ముఖ్యాంశాలు...
* ఐటీ, ఎలక్ట్రానిక్ రంగం అభివృద్ధి, శిక్షణ, ఉపాధి కోసం ప్రభుత్వం సొసైటీ ఫర్ ఐటీ, ఎలక్ట్రానిక్ మిషన్ ఆఫ్ ఏపీ (ఐటీఈఏపీ) ఏర్పాటు చేస్తుంది. ఈ సొసైటీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఛైర్మన్‌గా ఉంటారు.
* ఐటీ పారిశ్రామికవేత్త తమ కార్యకలాపాల విస్తరణకు, కంపెనీ ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వానికి దరఖాస్తు చేసిన నెలలో ఎలాంటి నిర్ణయం లేకుంటే ఆ దరఖాస్తును ఆమోదించినట్లు పరిగణించే క్లాజు చేర్చారు.
* ఐటీ అనుమతుల కోసం ప్రభుత్వం సింగిల్‌విండో విధానం ప్రకటించనుంది. మెగా ప్రాజెక్టుల ఏర్పాటు, ఐటీ అనుమతుల సాయం కోసం ప్రత్యేక అధికారులకు బాధ్యతలు అప్పగిస్తారు.
* ప్రస్తుత భూకేటాయింపు విధానంలో మార్పులు తెస్తూ రాష్ట్రంలోని యువతకు కల్పించే ఉద్యోగాల సంఖ్య ఆధారంగా ఐటీ కంపెనీలకు స్థలాలు కేటాయిస్తారు. ఎన్ని ఎక్కువ ఉద్యోగాలిస్తే భూ కేటాయింపులు ఆ మేరకు పెరుగుతాయి.
* విశాఖపట్నం, తిరుపతిలో ఐటీఐఆర్‌లు, పీపీపీ పద్ధతిలో విశాఖ, విజయవాడ, తిరుపతిలో మూడు మెగా ఐటీహబ్‌లు, అనంతపురం, కాకినాడలో ఐటీహబ్‌లు ఏర్పాటు చేస్తారు.
* ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచి నడిచి, సైకిల్‌పై వెళ్లి విధులు నిర్వహించేలా హబ్‌లలో సౌకర్యాలు కల్పిస్తారు. అంతర్జాతీయ విమానాశ్రయాల నుంచి అనుసంధాన రవాణా ఏర్పాట్లు చేస్తారు.
* ప్రస్తుతమున్న విద్యుత్తు రాయితీ, స్టాంపు డ్యూటీ రీయింబర్స్‌మెంట్, మార్కెటింగ్, నియామక, శిక్షణ సాయం యధావిధిగా కొనసాగడంతో పాటు మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతారు.
* మెగా ఐటీ పార్కుల్లో ఉద్యోగం కల్పించిన కంపెనీకి ప్రతి ఉద్యోగికి రూ.60వేలు, ఇతర ఐటీ కేంద్రాల్లో కల్పించే ఉద్యోగానికి రూ.40వేలు కంపెనీకి ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఉంటాయి.
* భారీ, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, సోషల్‌మీడియా, గ్రామీణ ఐటీ ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించారు.
* కంపెనీల అవసరాల మేరకు మానవ వనరులను తీర్చిదిద్దేలా మార్గదర్శకాలు సూచించారు.
* నూతన ఆలోచనలతో కంపెనీల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారికి సాయం చేసేందుకు ఇన్‌క్యుబేషన్, స్టార్ట్అప్ విలేజీలు ఏర్పాటుచేస్తారు. వీరికి సాయం చేసేందుకు 'కొత్త ఆలోచనల నిధి ఉంటుంది.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning