సిలికాన్‌ కారిడార్‌గా ఏపీ

* ఇంజినీరింగ్‌ సిలబస్‌లో మార్పులు
* విశాఖలో మెగా ఐటీ హబ్‌
* విశాఖ, తిరుపతిలో ఐటీఐఆర్‌లు

* నూతన ఐటీ విధానాన్ని ఆమోదించిన ఏపీ మంత్రి మండలి
ఈనాడు - హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని 2020 నాటికి సిలికాన్‌ కారిడార్‌గా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నాణ్యమైన ఈ-సేవలు అందించడంతో పాటు, 5 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించాలని నిర్ణయించింది. రాష్ట్ర ఐటీ ప్రగతిలో కీలకమైన నూతన ఐటీ విధానానికి (2014-2020) మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఐటీ ప్రగతి కోసం తిరుపతి, విశాఖలో ఐటీ పెట్టుబడి ప్రాంతీయ మండళ్లు (ఐటీఐఆర్‌), విశాఖలో మెగా ఐటీ హబ్‌ ఏర్పాటు చేయాలని రాష్ట్రం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలో ఐటీ రంగానికి ఘనవైభవం తీసుకువచ్చే ప్రణాళికలో భాగంగా 2020 వరకు ఈ పాలసీ అందుబాటులో ఉండేలా రూపొందించింది. పాలసీలో ఏముంది...
మానవవనరులు
* పరిశ్రమ అవసరాల మేరకు అవసరమైన విభాగాల్లో విద్యార్థులకు శిక్షణ ఇవ్వడంతో పాటు, నాణ్యమైన విద్యను అందించాలి.
* పరిశ్రమల డిమాండ్‌ మేరకు అధునాత సాంకేతిక పరిజ్ఞానాన్ని పాఠ్యాంశాల్లో చేర్చుతూ పాఠ్యప్రణాళికల్లో సవరణలు చేయాలి. పారిశ్రామిక ఔత్సాహిక అభివృద్ధి కోర్సును ప్రవేశపెట్టాలి.
* ఆన్‌లైన్లో విజయవంతంగా పూర్తిచేసిన కోర్సులకు క్రెడిట్స్‌ ఇవ్వాలి. టాప్‌ ఐటీ కంపెనీలు, విదేశీ యూనివర్సిటీల సహకారంతో ఐటీ ఇన్‌స్టిట్యూట్‌ల ఏర్పాటు.
* ఇంజినీరింగ్‌ నాలుగో ఏడాదిలో అప్రెంటీస్‌, ఇంటర్న్‌షిప్‌ తప్పనిసరి. మూడేళ్లలో 100 మందికి ఉపాధి కల్పించిన చిన్న తరహా పరిశ్రమలకు రూ.15 లక్షల ప్రోత్సాహకాలు.
* కొత్త ఆలోచనల నుంచి పరిశ్రమల ఏర్పాటుకోసం ఇన్నోవేషన్‌ పాలసీ. ప్రతి ఇంటి నుంచి ఒక వ్యక్తి ఈ-అక్షరాస్యత సాధించాలి.
మౌలిక సదుపాయాలు
* విశాఖపట్నాన్ని మెగా ఐటీ హబ్‌గా తీర్చిదిద్దడం. 5 లక్షల చ.అడుగుల విస్తీర్ణంతో ఐటీ టౌన్‌షిప్‌, లక్ష చ.అడుగుల విస్తీర్ణంతో సిగ్నేచర్‌ టవర్‌ నిర్మాణం.
* విజయవాడ, కాకినాడ, తిరుపతి, అనంతపురంలో ఐటీ హబ్‌ల నిర్మాణం. పీపీపీ పద్ధతిలో ఐటీ టవర్లు, పార్కులు, జోన్‌ల ఏర్పాటు.
* విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో ఐటీ పెట్టుబడుల ప్రాంతీయ మండళ్లు (ఐటీఐఆర్‌) నెలకొల్పడం. తరువాత తిరుపతి-అనంతపురం ఐటీ కారిడార్‌ ఏర్పాటు.
* విశాఖపట్నం, తిరుపతి విమానాశ్రయాల విస్తరణ వేగవంతం చేయడం, ఐటీ పరిశ్రమకు కోతలు లేని నాణ్యమైన విద్యుత్తు, మౌలిక సదుపాయాల కల్పన.
ప్రోత్సాహకాలు
* కార్మిక చట్టాల నుంచి తనిఖీల మినహాయింపు, ఐటీ కంపెనీలకు ఎస్మా భద్రత, మూడు షిఫ్టుల్లో కార్యకలాపాల నిర్వహణకు అనుమతులు.
* వ్యాపార విస్తరణ, పెట్టుబడులు పరిశీలించి భూములు కేటాయింపు. మెగా ఐటీ హబ్‌లో ఉద్యోగం కల్పించినందుకు ప్రతి ఉద్యోగికి రూ.60 వేల చొప్పున, ఇతర ప్రాజెక్టుల్లో ఉద్యోగానికి రూ.40 వేల చొప్పున ప్రోత్సాహకాలు.
* ప్రతి ఎకరా భూమికి కనీసం 500 మందికి ఉపాధి ఇవ్వాలి. 100 మందికి ఉపాధి కల్పించేందుకు ముందుకు వచ్చే కంపెనీలు మాత్రమే భూ కేటాయింపులకు అర్హమైనవి.
* ఎస్సీ, ఎస్టీ, మహిళా వ్యాపారవేత్తలు నెలకొల్పే ఐటీ కంపెనీలకు విద్యుత్తు బిల్లుల్లో 50 శాతం రాయితీ. మరిన్ని ప్రోత్సాహకాలు.
* ఐదేళ్లలో కనీసం 5వేల మందికి ఉపాధి కల్పించే ప్రాజెక్టులకు మెగా ప్రాజెక్టులుగా గుర్తింపు. ఈ ప్రాజెక్టుల్లో మూడేళ్ల కాలానికి అద్దెలో చ.అడుగుకు రూ.10 చొప్పున రాయితీ, 10 శాతం పెట్టుబడి రాయితీ.
* చిన్నతరహా పరిశ్రమలకు 50 శాతం అద్దె రాయితీ (గరిష్ఠంగా రూ.5 లక్షలు).
* ఐటీ సంస్థను ఏర్పాటు చేసిన రెండేళ్లలో కల్పించే ప్రతి ఉద్యోగానికి రూ.20 వేల చొప్పున రిక్రూట్‌మెంట్‌, శిక్షణ సహాయం.
* గ్రామీణ ప్రాంతాల్లో నెలకొల్పే ఐటీ, చిన్నతరహా ఐటీ పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు.
ఐటీ పరిపాలన
* ఐటీ పరిశ్రమ అనుమతులకు సింగిల్‌ విండో అనుమతుల కేంద్రం ఏర్పాటు. ఈ మేరకు 24 గంటలూ పనిచేసే ఈ-బిజ్‌ పోర్టల్‌ ప్రారంభం.
* పరిశ్రమ ప్రతిపాదన వచ్చిన నాలుగు వారాల్లోగా అనుమతులు మంజూరు చేస్తారు. ఒకవేళ గడువులోగా ప్రభుత్వ నిర్ణయం వెలువడకుంటే, ఆ దరఖాస్తును ఆమోదించినట్లుగా పరిగణిస్తారు.
* ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ కోసం ప్రత్యేక సాధికారత మిషన్‌ ఏర్పాటు.
* రాష్ట్రంలోని ఐటీ పార్కులు, జోన్లు, ఐటీఐఆర్‌, మెగా ఐటీ హబ్‌లు తదితర ఐటీ పరిశ్రమల ప్రాంతాలకు 'ఐలా' హోదా కల్పించడం.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning