జీఆర్‌ఈలో కీలకం

జీఆర్‌ఈలో మన విద్యార్థులు ఎనలిటికల్‌ రైటింగ్‌ విభాగాన్ని పెద్ద సవాలుగా, కఠినమైనదిగా భావిస్తున్నారు. కానీ ఈ విభాగమే ఉత్తమ విద్యాసంస్థల్లో ప్రవేశానికీ, ఆర్థిక సాయం పొందడానికీ ప్రధానం!
అమెరికన్‌ విశ్వవిద్యాలయాల్లో ఎంఎస్‌ చదవదల్చినవారు రాసే పరీక్ష- జీఆర్‌ఈ (గ్రాడ్యుయేట్‌ రికార్డ్‌ ఎగ్జామ్‌). ఐక్యూ, ప్రతిభ అంచనా వేయడానికి నిర్వహించే ఈ పరీక్షలోని మూడు విభాగాలు- ఎనలిటికల్‌ రైటింగ్‌, వెర్బల్‌ రీజనింగ్‌, క్వాంటిటేటివ్‌ రీజనింగ్‌. ఎనలిటికల్‌ రైటింగ్‌లోని మొత్తం 6 పాయింట్లలో సగటున తెలుగు విద్యార్థులు 2.9 పాయింట్లను మాత్రమే స్కోరు చేయగలుగుతున్నారు.
ఏమేం ఉంటాయి?
ఎనలిటికల్‌ రైటింగ్‌తో జీఆర్‌ఈ ప్రారంభమవుతుంది. ఈ విభాగంలో విద్యార్థి రెండు వ్యాసాలను కంప్యూటర్‌పై రాయాల్సి వుంటుంది. మొదటి వ్యాసం- 'సమస్య విశ్లేషణ (The Analysis of an Issue); రెండోది- 'వాదనను విశ్లేషించడం The Analysis of an argument)'. ఒక్కో వ్యాసం రాయడానికి కంప్యూటర్‌ 30 నిమిషాల సమయాన్ని ఇస్తుంది. ఈ వ్యాసాలకు సంబంధించిన విషయాలను పరీక్ష నిర్వాహకులు ముందుగానే జీఆర్‌ఈ అధికారిక వెబ్‌సైట్‌- www.gre.org లో పొందుపరుస్తారు. పరీక్ష రోజున విద్యార్థి రాయడానికి కంప్యూటర్‌ సమస్య, వాదనల్లో ఒక్కోదానిని యాదృచ్ఛికంగా ఎంచి ఇస్తుంది.
రాసిన వ్యాసాలు ఆన్‌లైన్‌లో నేరుగా ఈటీఎస్‌ కార్యాలయానికి చేరతాయి. ఈ రెండు వ్యాసాల్లో ఒక్కోదాన్ని ఈటీఎస్‌లో శిక్షణ పొందిన విద్యావేత్త, ఈ-రేటర్‌ (రేటింగ్‌ ఇచ్చే కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌)ల చేత మదింపు చేయిస్తారు. ఆ రెండు స్కోర్ల సగటును లెక్కలోకి తీసుకుంటారు. చివరగా రెండు వ్యాసాల సగటును ఒకే స్కోరుగా ఎనలిటికల్‌ రైటింగ్‌ విభాగానికి కేటాయిస్తారు. ఈ వ్యాసాలను 0- 6 పాయింట్ల మధ్య గ్రేడ్‌ చేస్తారు.
ఎందుకు చేర్చారు?
అమెరికన్‌ విశ్వవిద్యాలయాల్లో చేరాక విద్యార్థుల ప్రతిభాస్థాయి ప్రదర్శన ఎలా ఉంటుందో ముందస్తుగా అంచనా వేయడానికి జీఆర్‌ఈ ఉపకరిస్తుంది. అమెరికన్‌ కోర్సుల అభ్యాసంలో హోలిస్టిక్‌ అప్రోచ్‌ ప్రధానాంశం. గ్రేడ్‌ చేసేటపుడు విద్యార్థుల అభిరుచి, నైపుణ్యాలను విశాల పరిధిలో తీసుకుంటారు. పరీక్షించే ముఖ్యమైన అంశాల్లో ఒకటి- తరగతిలో విద్యార్థి పాల్గొనే తీరు (క్విజ్‌లు, బృందచర్చ, తోటి విద్యార్థుల బోధన). అలాగే విద్యార్థుల రాతపూర్వక అసైన్‌మెంట్లు.
అమెరికన్‌ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు సమర్పించే అసైన్‌మెంట్లకు జీఆర్‌ఈలోని సమస్య, వాదన తరహా రాయటానికి అవసరమైన నైపుణ్యాలు అవసరం. ఈ వ్యాసాలను జీఆర్‌ఈలో చేర్చడం ద్వారా.. అమెరికన్‌ కోర్సుల్లో చేరే విద్యార్థులు తమ అసైన్‌మెంట్లను విజయవంతంగా చేయడానికి తగిన సన్నద్ధత అందించినట్లవుతుంది.
ప్రవేశాలకు ఎలా ఉపయోగకరం?
అమెరికన్‌ కోర్సుల్లో రాణించాలంటే విశ్లేషణాత్మక (ఎనలిటికల్‌) నైపుణ్యాలు అవసరం. కాబట్టి విశ్వవిద్యాలయాలు విద్యార్థుల నుంచి 6కు 3.5- 4 స్కోరు సాధించాలని ఆశిస్తాయి. 4కు పైగా స్కోరు సాధిస్తే మంచి విశ్వవిద్యాలయంలో ప్రవేశం సంపాదించడమే కాకుండా నచ్చిన ప్రోగ్రాములో చేరే అవకాశముంటుంది. ఉన్నతచదువుల కోసం యూఎస్‌కు వెళ్లే విద్యార్థులు తమ ట్యూషన్‌ ఫీజు, అక్కడ ఉండడానికి అయ్యే ఖర్చులు మొదలైనవాటికి డబ్బు సమకూర్చుకోవడం పెద్ద సవాలే. కాబట్టి విశ్వవిద్యాలయాల నుంచి ఆర్థికసాయం పొందడం వారికి గొప్ప వరమవుతుంది.
5- 10% భారతీయ విద్యార్థులు విశ్వవిద్యాలయంలో చేరేముందే స్కాలర్‌షిప్‌లు పొందుతున్నప్పటికీ.. 40%కు పైగా విద్యార్థులు తాము విశ్వవిద్యాలయంలో చేరిన తరువాత టీచింగ్‌ అసిస్టెంట్‌షిప్‌, రీసెర్చ్‌ అసిస్టెంట్‌షిప్‌ చేస్తూ ఫీజులో రాయితీ, ఆర్థిక సాయాలు పొందుతారు.
కానీ, ఈ ప్రయోజనాలు పొందాలంటే విద్యార్థులు ఎనలిటికల్‌ రైటింగ్‌లో 6కు 4 స్కోరు సాధించాల్సి ఉంటుంది. 4 కంటే తక్కువ స్కోరు సాధించిన విద్యార్థులు అసిస్టెంట్‌షిప్‌లకు అర్హత సాధించాలంటే క్యాంపస్‌లో రాతపరీక్ష రాయాల్సివస్తుంటుంది.
ఈ సందర్భంగా నేనో సరదా సంఘటనను ప్రస్తావించాలని అనుకుంటున్నాను. నా విద్యార్థి ఒకరు ఆగస్టు 2012లో ఒక పేరున్న విశ్వవిద్యాలయంలో చేరాడు. అతడు డిసెంబర్‌ 2012లో నాతో ఫోన్లో మాట్లాడుతూ.. తను స్ప్రింగ్‌ సెమిస్టర్‌ అయిన జనవరి 2013 టీచింగ్‌ అసిస్టెంట్‌షిప్‌కు అర్హత సాధించానని చెప్పాడు. కానీ సమస్య ఏంటంటే.. నా కౌన్సెలింగ్‌, శిక్షణ తీసుకుని కూడా ఎనలిటికల్‌ రైటింగ్‌పై తక్కువ శ్రద్ధ పెట్టాడు. ఫలితంగా ఆ విభాగంలో 3/6 మార్కులే సాధించగలిగాడు. దీంతో విశ్వవిద్యాలయం వారు రెండు వ్యాసాలను రాసి వాటిలో 4/6 స్కోరు సాధిస్తేనే అసిస్టెంట్‌షిప్‌ ఇస్తామనీ చెప్పారు. ఆ వ్యాసాలను తన బదులు నన్ను రాయమని అడగటానికి ఆ విద్యార్థి ఫోన్‌ చేశాడు. ఆశ్చర్యపోయాను. 'ఆ వ్యాసాలను రాసి పంపితే సరిచేస్తాను' అని చెప్పాను. అతడు వ్యాసాలు పంపాడు కానీ వాటిని సరిచేసి, తిరిగి పంపడానికి వారం పట్టింది. ఆ విద్యార్థి ఫోన్‌ చేసి ఇలా చెప్పాడు- 'మామ్‌.. మీకు అసిస్టెంట్‌షిప్‌ వచ్చింది!'
కాబట్టి విశ్వవిద్యాలయాల్లో చేరాక ఆర్థికసాయం పొందాలన్నా; రాతపూర్వక అసైన్‌మెంట్లు బాగా చేయాలన్నా; వారి విద్యాభ్యాసంలో మంచి గ్రేడ్‌ సంపాదించాలన్నా ఎనలిటికల్‌ రైటింగ్‌ తప్పనిసరి. క్యాంపస్‌లో వ్యాసాలు రాయాల్సిన పరిస్థితి తెచ్చుకోకుండా జీఆర్‌ఈ దశలోనే ఈ విభాగానికి శ్రద్ధగా సన్నద్ధం కావాలి!

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning