ఏరోనాటికల్‌లో ఏ ప్రత్యేకతలు?

దాదాపు అన్ని కళాశాలల్లోనూ ఉండే సాంప్రదాయిక బ్రాంచిలకు బదులు విభిన్న తరహా బ్రాంచిల్లో చేరాలనుకునే విద్యార్థులుంటారు. ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌పై ఆసక్తి ఉన్నవారు ఈ తరహానే. వీరు ఈ బ్రాంచి విశిష్టతలను తెలుసుకోవటం అవసరం!
విమాన రంగం తీరుతెన్నులు, వాటి నిర్వహణ, నియంత్రణ, అభివృద్ధికి సంబంధించిన విషయ పరిజ్ఞానం ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ శాఖ ముఖ్య లక్ష్యం. రవాణా, రక్షణ శాఖలకు సంబంధించిన విమానాల రూపకల్పన, రచన, నిర్మాణం, పరీక్షించడం, అమలు, నిర్వహణ ఈ కోర్సుల్లోని మూల పాఠ్యాంశాలుగా ఉంటాయి. అంటే అత్యాధునిక టెక్నాలజీ ప్రయోగం ఈ రంగంలో ఎక్కువ. దీంతో కెరియర్‌ను సవాలుగా తీసుకుని మలచుకోవడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా వీరు అనుభవజ్ఞులైన ఏరోనాటికల్‌ ఇంజినీర్ల పర్యవేక్షణలో ఒక బృందంగా పనిచేయడం వల్ల తమ నైపుణ్యాన్ని పెంచుకోవడానికి వీలుంటుంది.
వృత్తిరీత్యా మెకానికల్‌ ఇంజినీర్లు, ఏరోనాటికల్‌ ఇంజినీర్లు కొన్ని ప్రత్యేకమైన పనులు చేస్తారు. వీరు ఇంజిన్ల నిర్వహణ, ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్‌, రేడియో పరికరాలు, కమ్యూనికేషన్‌ వ్యవస్థ నిర్వహణ, పరికరాల నిర్వహణ, ముందస్తు తనిఖీలకు బాధ్యులుగా ఉంటారు. ఈ విభాగాల్లో వీరికి తర్ఫీదునిచ్చే సబ్జెక్టులు బీటెక్‌లో ఉంటాయి. కాబట్టి విమానరంగ అవసరాలకు తగిన విధమైన కోర్సుగా ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ను చెప్పుకోవచ్చు.
అర్హతలు: భౌతిక, గణిత శాస్త్రాల్లో అవగాహన అవసరం. ప్రత్యేకించి థర్మోడైనమిక్స్‌, వాయుపీడనం, మెకానిక్స్‌, ఫ్లూయిడ్‌ మెకానిక్స్‌ అధ్యాయాలపై పట్టు సాధించాలి. సంకలనం, వ్యవకలనం, వెక్టర్‌ ఆల్జీబ్రా అధ్యాయాలు అభ్యసించి ఉండాలి.
వీటికి తోడు ఉండాల్సిన లక్షణాలు, మెలకువలు...
* బాధ్యత వహించే తత్వం
* వేగంగా, నిర్దిష్టంగా పనిచేయడం (ఎందుకంటే విమానాలను తక్కువ సమయంలో తనిఖీ చేయ్యాల్సి ఉంటుంది)
* దృష్టి లోపం లేకపోవడం
* సాంకేతిక, యాంత్రికపరమైన అభిరుచి
* బృందంలో పని చేయగలగడం
* శారీరక దృఢత్వం
* భావప్రకటన సామర్థ్యం.
ఉద్యోగావకాశాలు
విమాన రంగంలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో వీరికి ఉద్యోగావకాశాలుంటాయి. ప్రైవేటు రంగంలో పవన్‌హన్స్‌, హెలికాప్టర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, జెట్‌ ఎయిర్‌వేస్‌, స్పైస్‌జెట్‌ కొన్ని కంపెనీలు. ప్రభుత్వరంగ సంస్థలైన ఏర్‌ ఇండియాలో కూడా వీరికి ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజినీర్లుగా ఉద్యోగావకాశాలుంటాయి. రక్షణశాఖకు చెందిన హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, డీఆర్‌డీవో, నేషనల్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌, ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌, పౌర విమానయాన శాఖ, క్షిపణి తయారీల కంపెనీల్లో చక్కటి అవకాశాలుంటాయి. బీటెక్‌ మార్గంలోనే కాకుండా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌, ఏరోనాటికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియాలు విడివిడిగా నిర్వహించే సెక్షన్‌-ఎ, సెక్షన్‌-బి పాస్‌ అవడం ద్వారా ఏరోనాటికల్‌ ఇంజినీర్‌ పట్టా పొందవచ్చు.
వీరు ఈ ఉద్యోగాలకోసం మెకానికల్‌, ఏరోస్పేస్‌ ఇంజినీర్లతో పోటీ పడాల్సి ఉంటుంది. ఈ రంగంలో నైపుణ్యం సాధించాలంటే ఉపవిభాగాలైన నిర్మాణ రచన, నేవిగేషనల్‌ గైడెన్స్‌, మిలిటరీ విమాన వాహనాలు, పౌర విమానాలు, హెలికాప్టర్ల వంటి ప్రత్యేక రంగాల్లో అనుభవం సంపాదించుకోవాలి. జీతభత్యాలు ఎక్కువగా ఉన్న ఈ రంగంలో సఫలమవాలంటే పని ఒత్తిడిని తట్టుకోగలగాలి. అప్రమత్తత, చురుకుదనం, జాగరూకత అలవరచుకోవాలి. అత్యాధునిక సాంకేతికత వినియోగించే రంగాల్లో ఈ రంగం అగ్రస్థానంలో ఉంటుంది. కాబట్టి తమ పరిజ్ఞానాన్ని నిత్యం పెంచుకుంటూ ఉండాలి.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning