క్యాట్‌లో కొత్త మార్పులు

మేనేజ్‌మెంట్‌ విద్యకు తలమానికం ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)లు. వీటిలో సీటు పొందాలంటే కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (క్యాట్‌)లో మంచి పర్సంటైల్‌ సాధించాల్సి ఉంటుంది. గత ఏడాదితో పోలిస్తే కొన్ని మార్పులతో ఈ ఏడాది క్యాట్‌ జరగబోతోంది. వాటికి అనుగుణంగా వ్యూహం రచించుకుని అమలు చేస్తే విజయం తథ్యం!
నిర్దిష్ట ప్రణాళిక, ఆచరణ ఉంటే క్యాట్‌లో రాణించవచ్చు. ఈ ఏడాది కేవలం రెండు రోజుల్లో, ప్రతిరోజూ రెండు స్లాట్లలో పరీక్ష నిర్వహిస్తున్నారు. అంటే మొత్తం 4 స్లాట్లలో ఈసారి క్యాట్‌ ముగియనుంది.
ఎక్కువ సంఖ్యలో స్లాట్లు ఉండడం మూలంగా గత సంవత్సరం ప్రశ్నల పునరావృతం; నార్మలైజేషన్‌- స్కేలింగ్‌ అంశాల్లో అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈసారి చాలా తక్కువ స్లాట్లు ఉండడం వల్ల ఈ సమస్యలు తలెత్తక పోవచ్చు. టీసీఎస్‌ సంస్థ క్యాట్‌ను నిర్వహించనుంది.
కామన్‌ అడ్మిషన్‌ పరీక్ష ర్యాంకుతో దేశంలోని 13 ఐఐఎంలలో ఉన్న సీట్లను భర్తీ చేస్తారు. ఇవే కాకుండా ఎఫ్‌ఎంఎస్‌ (ఫ్యాకల్టీ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌), నిట్టి (నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌), ఎస్‌పీ జైన్‌ తదితర ప్రతిష్ఠాత్మక కళాశాలల్లో సీట్లను కూడా భర్తీ చేస్తారు. ఐఐఎంలలో సుమారుగా 3000 సీట్లు అందుబాటులో ఉంటాయి.
ఎంబీఏ కోర్సు ఐఐఎంలలో భిన్నంగా ఉంటుంది. కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా కేస్‌ స్టడీస్‌ ఉంటాయి. చదివే ఏ అంశం అయినా సరే, ప్రాక్టికల్‌ అప్రోచ్‌ ఉండేలా చూస్తారు. నిర్వహణ పద్ధతుల (మేనేజ్‌మెంట్‌ టెక్నిక్స్‌)పై పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తారు.దీనికి మాత్రమే పరిమితం కాకుండా వ్యక్తిత్వ వికాసం పెంపొందేలా చేస్తారు.
పరీక్ష స్వరూపం
గతంలోలాగానే ఈసారి రెండు విభాగాలు (సెక్షన్లు) ఉన్నాయి. అవి:
1. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌
2. లాజికల్‌ రీజనింగ్‌, వెర్బల్‌ ఎబిలిటీ
ప్రతి విభాగానికీ 50 చొప్పున 100 ప్రశ్నలుంటాయి. ఇందుకు కేటాయించిన సమయం 170 నిమిషాలు. 2013లో రెండు విభాగాలు కలిపి 60 ప్రశ్నలు వచ్చేవి (ప్రతి విభాగానికీ 30 ప్రశ్నలు), సమయం 140 నిమిషాలు ఉండేది.
అయితే ప్రస్తుతం ప్రశ్నల సంఖ్య 60-100కు పెంచి అదనంగా సమయం 30 నిమిషాలను మాత్రమే పెంచారు. ప్రశ్నల సంఖ్యలో సుమారుగా 66% పెరుగుదల కనిపిస్తే, సమయంలో మాత్రం కేవలం 22% పెరుగుదల ఉంది. అంటే అభ్యర్థులు మరింత వేగంగా, కచ్చితత్వంతో ప్రశ్నలకు సమాధానాలు కనుగొనాలి.
క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ &డేటా ఇంటర్‌ప్రిటేషన్‌
ఈ విభాగంలో 30-35 ప్రశ్నలు క్వాంటిటేటివ్‌ విభాగం నుంచి, 15- 20 ప్రశ్నలు డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ నుంచి వచ్చే అవకాశం ఉంది. కేవలం అభ్యర్థుల గణిత సామర్థ్యం తెలుసుకునేలా ప్రశ్నలుండవు. గణితంతోపాటు అభ్యర్థుల విశ్లేషణాత్మక శక్తి, తార్కిక పరిజ్ఞానం, సమయస్ఫూర్తి తెలుసుకునేలా ప్రశ్నలుంటాయి. విభాగంలోని అన్ని అధ్యాయాల్లో ప్రాథమిక అంశాలపై పూర్తిస్థాయిలో పట్టు అవసరం. రెండో దశలో సాధన చాలా కీలకం. పుస్తకాల్లో ఇచ్చిన విధానాల్లో కాకుండా భిన్నంగా ఏవైనా చేయగలమా అని ఆలోచించే ధోరణిని పెంచుకోవాలి. ప్రతి ప్రశ్నకూ అభ్యర్థులు తనవైన పరిష్కార మార్గాలను ఎంచుకోవాలి. ఆ తర్వాత ప్రామాణిక పుస్తకాల్లో ఇచ్చిన విధానాలు అధ్యయనం చేయాలి. రెండింటి మధ్య తేడాలు, విధానాల్లో పోలికలను పరిశీలించడం ద్వారా విశ్లేషణ, పరిశీలన కోణాలు మెరుగవుతాయి. కేవలం షార్ట్‌కట్‌లపైనే ఆధారపడడం మంచిది కాదు.
క్యాట్‌ లాంటి క్లిష్టతరమైన పరీక్షలో ప్రశ్నల తీరు భిన్నంగా ఉంటుంది. ఒకసారి ఇచ్చిన ప్రశ్ననే కోణాన్ని మార్చి భిన్నంగా ఇస్తారు. దీంతో షార్ట్‌కట్‌ ఉపయోగకరంగా ఉండకపోవచ్చు. అయితే కాన్సెప్టుపై పట్టు ఉంటే, ప్రశ్న ఏ కోణంలో ఇచ్చినా సరే సమాధానం తేలికగా కనుగొనేందుకు వీలుంటుంది.
డేటా ఇంటర్‌ప్రిటేషన్‌లో పట్టు రావాలంటే సరాసరి, శాతాలు, నిష్పత్తులపైన పట్టు అవసరం. ప్రశ్నల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏవి ప్రయత్నించాలి, ఏవి చేయకూడదు అన్న అంశంలో స్పష్టత ఉండాలి.
చాలామంది చివరివరకూ వేచి ఉండి డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ పూర్తిచేయడానికి యత్నిస్తారు. అది సరికాదు. దీన్ని ప్రారంభంలో/ కొన్ని ఇతర ప్రశ్నలు చేశాక ఆరంభించాలి. కనీసం 10- 15 నిమిషాల వ్యవధి ఈ విభాగానికి అవసరం. అంత సమయం వెచ్చించేలా ప్రణాళిక ఉండాలి.
క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌లో జామెట్రీ, ఆల్జీబ్రా, నంబర్‌ సిస్టం, మోడర్న్‌ మ్యాథ్స్‌ అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ నాలుగు అంశాల్లో కనీసం 75% ప్రశ్నలు వస్తాయి. ఈ అంశాల్లో కాన్సెప్ట్‌ చాలా కీలకం. గతంలో 30 ప్రశ్నలు మాత్రమే ఉండేవి. అప్పుడు ఈ నాలుగు అంశాల నుంచి 15- 17 ప్రశ్నల వరకు వచ్చేవి. అయితే తాజాగా ప్రశ్నల సంఖ్య 50కు పెరిగినందున వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అరిథ్‌మెటిక్‌ అంశాల నుంచి గరిష్ఠంగా 5 వచ్చేవి. ఈ దఫా కొన్ని పెరిగే అవకాశం ఉంది.
నార్మలైజేషన్‌ పద్ధతిలో తేలికగా ఉన్న ప్రశ్నను తప్పు చేస్తే నెగెటివ్‌ మార్కింగ్‌ ఎక్కువగా ఉంటుంది. అందుకే కచ్చితత్వానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. కొన్ని సందర్భాల్లో కఠినమైన ప్రశ్న ఎదుర్కొంటున్నపుడు, విద్యార్థులు ఎక్కువ సమయం దానికే వెచ్చిస్తారు. ఇది సరికాదు.
లాజికల్‌ రీజనింగ్‌, వెర్బల్‌ ఎబిలిటీ
30- 35 ప్రశ్నలు వెర్బల్‌ ఎబిలిటీ నుంచి; 15- 20 ప్రశ్నలు లాజికల్‌ రీజనింగ్‌ నుంచి వచ్చే అవకాశం ఉంది. వెర్బల్‌ అంశంలో 45 శాతం మేర కాంప్రహెన్షన్‌ నుంచి అడిగే ఆస్కారం ఉంది. సెంటెన్స్‌ కంప్లీషన్‌ నుంచి కూడా ప్రశ్నలు వస్తాయి. కేవలం డిక్షనరీ అర్థాలను తెలుసుకోకుండా సందర్భోచితంగా అర్థం చేసుకోగలిగే సామర్థ్యాన్నీ పెంచుకోవాలి. ఈ తరహా సన్నద్ధత కాంప్రహెన్షన్‌కు కూడా ఉపయోగకరం. పేరా జంబుల్‌, క్రిటికల్‌ రీజనింగ్‌, పేరా కంప్లీషన్‌ వంటి విభాగాలకు ప్రాథమికాంశాలు (బేసిక్స్‌) అంటూ ఉండవు. వాటిని సాధ్యమైనంత ఎక్కువగా సాధన చేయాలి. ఈ క్రమంలో, జవాబులు ఏవి సరైనవో, ఎందుకు సరైనవో తెలుసుకోవాలి. సరికాని సమాధానాలు ఎందుకు సరికావో కూడా జవాబులను పరిశీలించి తెలుసుకోవాలి.
వెర్బల్‌ పరీక్షకు కనీసం మూడు నెలల ముందు నుంచి రోజూ 3-5 కాంప్రహెన్షన్లు సాధన చేయాలి. పాత విధానంలో మూడు కాంప్రహెన్షన్లు ఉండేవి. తాజా పద్ధతిలో కొన్ని పెరగవచ్చు. తేలికగా, మధ్యస్థంగా ఉన్న కాంప్రహెన్షన్లలో ఎక్కువ స్కోర్‌ చేసుకునేందుకు ప్రయత్నించాలి. నిత్యం ఆంగ్ల దినపత్రికల్లో వచ్చే సంపాదకీయాలను చదివితే రీడింగ్‌ కాంప్రహెన్షన్‌లో పట్టు పెరుగుతుంది. ఫ్రేజల్‌ వెర్బ్స్‌కు కూడా ప్రాధాన్యం ఉంది. రెండు/ మూడు ప్రశ్నలు వస్తాయి. వెర్బల్‌లో ఇవి బాగా స్కోరింగ్‌ అంశం. గ్రామర్‌ క్యాట్‌స్థాయిలో సంక్లిష్టంగా ఉంటుంది. ఈ తరహా ప్రశ్నలకు పరీక్ష చివర్లో సమయం కేటాయించడం మంచిది. రోజుకు కనీసంగా 10 పదాల చొప్పున నేర్చుకోవాలి. దీంతో పరీక్ష నాటికి ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ఒకాబులరీ బాగా ఉన్నవారికి క్యాట్‌లో పైచేయిగా ఉంటున్నది నిర్వివాదాంశం.
అదనంగా నెల వ్యవధి
* నవంబర్‌ 16, 22న పరీక్షలు. గత ఏడాది అక్టోబర్‌లోనే ప్రారంభమయ్యాయి. అంటే ఈ దఫా అభ్యర్థులందరికీ ఒక నెల అదనంగా సన్నద్ధతకు దొరికినట్లే. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
* గతంలో విభాగానికి నిర్దిష్ట సమయం ఉండింది. ప్రస్తుతం ఈ విధానం లేదు. అభ్యర్థులు తన ఇష్టప్రకారం ఏ సెక్షన్‌ను అయినా, ఎంతసేపయినా చేయొచ్చు. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. బాగా పట్టున్న అంశంలో ఎక్కువ స్కోర్‌ చేసుకుంటే మంచి పర్సంటైల్‌ వచ్చే అవకాశం ఉంది.
* పరీక్షకు ముందే సాధ్యమైనన్ని మాదిరి పరీక్షలను రాయాలి. వాటి జవాబులను కూడా పరిశీలించాలి.
క్యాట్‌ 2014: ముఖ్యమైన విషయాలు
అర్హత: 50% మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ/ తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత, ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు 45% మార్కులు ఉంటే సరిపోతుంది.
రిజిస్ట్రేషన్‌ ప్రారంభం: ఆగస్టు 6, 2014
రిజిస్ట్రేషన్‌ ముగింపు: సెప్టెంబర్‌ 30, 2014
పరీక్ష తేదీలు: నవంబర్‌ 16 &నవంబర్‌ 22
పరీక్ష సమయం: 170 నిమిషాలు
ఫలితాల ప్రకటన: డిసెంబర్‌ మూడోవారం
వెబ్‌సైట్‌: www.iimcat.ac.in/

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning