ఐడియాలు ఆహా.. వ్యాపారం వహ్వా!

కళ్లు మూసి కలలు కంటే వ్యాపారం పరుగెత్తదు... ఎదుటివాళ్లని ఆకట్టుకునే పనితనం చూపించాలి... వూహించని ఎత్తులతో ఉక్కిరిబిక్కిరి చేయాలి... కొత్తదారిలో కెవ్వు కేక పుట్టించాలి... విజయమే కాళ్ల బేరానికొస్తుంది... ఈ ట్రెండ్‌నే ఫాలో అవుతూ సక్సెస్‌ సాధించారు కొందరు యువతరంగాలు... సత్తా ఉంటే నిరూపించుకోవడానికి బోలెడు మార్గాలని చెప్పకనే చెప్పారు...
చదువు.. ఆపై ఏదో కొలువు. చాలామంది ఇదే వరుస. దక్కేదేంటి? ఐదంకెల జీతం.. మహా అయితే లక్షల్లో ప్యాకేజీ. దాంతోపాటు కొన్నాళ్లకి చాలామందికి విసుగూ బోనస్‌గా వస్తుంది. ఈ పరిస్థితి రాకముందే కొంతమంది తెలివిగా ఉద్యోగానికి సలాం కొట్టారు. కొత్తదారిలో వెళ్తూ కోట్ల టర్నోవర్‌కి ఎగబాకారు. లక్షణమైన లక్షల జీతం వదిలేస్తావా? జీవితానికి భరోసా ఉంటుందా? లాభాలు కళ్లజూస్తావా? ఇలాంటి సందేహాలు సంధించారు సవాలక్షమంది. అయినా ఉరిమే ఉత్సాహంతో అడుగు ముందుకేసి పట్టుదలే వూతంగా వ్యాపారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు ఆ యువకిశోరాలు.
క్లాస్‌రూం వ్యాపారవేత్త
ప్రతిష్ఠాత్మక బిట్స్‌ పిలానీలో చదువు. కోరుకుంటే లక్షల ప్యాకేజీతో ఉద్యోగం రెడీ. అయినా అన్నీ వదులుకొని సొంత వ్యాపారానికే సిద్ధమయ్యాడు హైదరాబాదీ అభిరామ్‌ ముద్దు. మిత్రులు వరుణ్‌, సంతోష్‌లదీ అదే మనస్తత్వం. ఇంజినీరింగ్‌ మూడో ఏడాదిలోనే themauka.com ప్రారంభించారు. సంస్థలు, విద్యార్థుల మధ్య అనుసంధానంగా ఉంటూ అవసరాలు తీర్చే ఆన్‌లైన్‌ జాబ్‌ పోర్టల్‌ ఇది. ఇంజినీరింగ్‌లో ఉన్నపుడే మార్కెట్‌లో భారీగా ఉద్యోగాలున్నా, వాటిని దక్కించుకోలేక ఉద్యోగార్థులు పడుతున్న వెతలు గమనించారు మిత్రులు. ఈ ఖాళీని పూరించే ఉద్దేశంతో 2011లో మోకా మొదలుపెట్టారు. తమకున్న పరిచయాలతో విద్యార్థులకి ఇంటర్న్‌షిప్‌ చేసే అవకాశం కల్పించారు. వీళ్ల సత్తాపై నమ్మకంతో అమెరికన్‌ ఏంజెల్‌ ఇన్వెస్టర్‌ పెట్టుబడి పెట్టింది. ఇక మరింత రెచ్చిపోయారు. ఓవైపు కాలేజీలు, మరోవైపు సంస్థలతో ఒప్పందం కుదర్చుకున్నారు. విద్యార్థుల డేటాబేస్‌ ఆన్‌లైన్‌లో పెట్టేవాళ్లు. కంపెనీలు పెట్టే పరీక్షలను మానిటర్‌ చేసేవాళ్లు. కాలేజీలకు వెళ్లి రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌లు నిర్వహించారు. ఒక సంస్థ ఓ కళాశాలలో అడుగుపెట్టకుండానే ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూలు నిర్వహించి తమకు నచ్చిన అభ్యర్థిని ఎంపిక చేసుకునేలా అన్ని సౌకర్యాలు కల్పించారు. విద్యార్థులూ నేరుగా లాగిన్‌ అవ్వొచ్చు. ఇలా మొత్తం 35 వేల మంది విద్యార్థులు మోకాలో సభ్యులయ్యారు. ఉద్యోగం ఇప్పించినా విద్యార్థుల నుంచి రూపాయి వసూలు చేయకపోవడం మోకా ప్రత్యేకత. కంపెనీల నుంచే ప్రతిఫలం పొందుతారు. యాభై వేలతో మొదలైన మోకా మూడేళ్లలో వూహించని స్థాయికెళ్లింది. ఈ విజయానికి గుర్తింపు దక్కింది. అమెరికాలోని డ్రేపర్‌ యూనివర్సిటీ అభిరామ్‌ని 'డ్రేపర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హీరో'గా గుర్తిస్తుంది. దీనికి ప్రపంచవ్యాప్తంగా మూడువేల మంది దరఖాస్తు చేసుకుంటే ముప్ఫై మందిని ఎంపిక చేశారు. వారిలో ఒకే ఒక్క ఇండియన్‌ అభిరామ్‌. గతేడాది బెల్జియంలో జరిగిన 'వరల్డ్‌ యంగ్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ సమ్మిట్‌'కి ఆహ్వానం అందింది. ఈ ప్రతిభను గుర్తించి 'ఎగ్జామిఫై' అనే ముంబై కంపెనీ తమ బోర్డులో చేర్చుకొని సంస్థకి చీఫ్‌ మార్కెటింగ్‌, ఆపరేషన్‌ ఆఫీసర్‌గా నియమించుకుంది. విద్యార్థులకు ఆన్‌లైన్‌లో నమూనా పరీక్షలు నిర్వహిస్తుంటుందీ సంస్థ.
బాధలకి అంతర్జాలం మందు...
చిన్నవో, పెద్దవో బాధలు అందరికీ ఉంటాయ్‌. ఇతరులతో చెప్పుకుంటే తగ్గుతాయ్‌. ఇదే sharingdard.com ఆన్‌లైన్‌ వేదికకి ప్రేరణ అంటోంది రితికాశర్మ. ఐఐఎం-లక్నో విద్యార్థి. కోర్సు సమయంలో సహాధ్యాయులు గౌరవ్‌ రాజన్‌, సుమంత్‌ గజ్‌భియే, లిమా జేమ్స్‌లతో తరచూ చర్చల్లో పాల్గొనేది. ప్రతి ఒక్కరూ తమ సమస్యలు, బాధలు ఏకరువు పెట్టేవాళ్లు. మానసిక ఒత్తిళ్లే ఎక్కువ సమస్యలకు కారణమని వాళ్ల పరిశోధనలో తేలింది. భవిష్యత్తులో వీటికి పరిష్కారం చూపించే వేదిక ప్రారంభించాలనుకుంది రితిక. కానీ ఎంబీఏ పట్టా అందగానే 'లెనోవో'లో కొలువు దక్కింది. భారీ వేతనం. ఏడాదే పనిచేసి గత ఆలోచనని అమల్లో పెడుతూ షేరింగ్‌ దర్ద్‌ ప్రారంభించింది. ఒత్తిడి, మానసిక సమస్యలు, భయం, ఒంటరితనం, బాధ, కోపం, గిల్టీనెస్‌, కన్ఫ్యూజన్‌.. ఏ భావాన్నైనా ఇందులో పంచుకోవచ్చు. మిగతా సభ్యులు తోచిన సలహాలిస్తారు. మనసుకు సాంత్వన చేకూర్చే నాలుగు మంచి మాటలు చెబుతారు. దీనికి అనుబంధంగా www.yourcandidfriend.com అనే మరో వెబ్‌సైట్‌ రూపొందించింది రితిక. ఇందులో అయితే మానసిక విశ్లేషకులు, నిపుణులు సమస్యలకు పరిష్కారం చూపిస్తారు. ఆన్‌లైన్‌, లేదా ఫోన్‌లో కౌన్సిలింగ్‌ చేస్తారు. ఈ సేవలకైతే ఫీజు చెల్లించాలి. ఈ రెండూ వూహించనంత సక్సెస్‌ సాధించాయి. స్కూళ్లు, కాలేజీలు, కార్పోరేట్‌ కంపెనీ ఉద్యోగులు క్యాండిడ్‌ఫ్రెండ్‌ సేవల్ని ఉపయోగించుకుంటున్నారు. షేరింగ్‌ దర్ద్‌లో లక్షా పదివేలమంది సభ్యులయ్యారు.
ఆన్‌లైన్‌లో చాయ్‌ చాయ్‌..
టూత్‌పేస్ట్‌ నుంచి బంగారు ఆభరణాల దాకా, చిన్న కేబుల్‌ నుంచి లక్షల విలువ చేసే గాడ్జెట్స్‌దాకా ఇప్పుడు కొనుగోళ్లన్నీ ఆన్‌లైన్‌లోనే. మరి ఇదే వూపుతో ఆన్‌లైన్‌లో చాయ్‌ ఎందుకు అమ్మకూడదు?' అనుకున్నాడు నితిన్‌ పుర్‌స్వానీ. ఈకామర్స్‌ వెబ్‌సైట్ల సృష్టికర్త. అతడి ఆలోచనకు జనం నవ్వుకున్నారు. పట్టించుకోకుండా ముందుకెళ్లాడు. ముంబైలోని బాంద్రాలో ఉండే కొందరు చాయ్‌వాలాలతో ఒప్పందం కుదుర్చుకొని వ్యాపారం ప్రారంభించాడు. కార్పొరేట్‌ ఆఫీసులు, చిరుద్యోగులు, స్థానికులు.. ఎవరైనా www.chotuchaiwala.com లో ఆర్డరిస్తే చాలు ఐదునిమిషాల్లో ఘుమఘుమలాడే చాయ్‌ వాళ్ల టేబుల్‌ మీద ఉంటుంది. నిర్ణీత ధరలతో నెల, మూణ్నెళ్లు, ఏడాది ప్యాకేజీలూ పెట్టాడు. నితిన్‌ అంచనాలు తప్పలేదు. ఆర్డర్లు వెల్లువెత్తాయి. తర్వాత నేషనల్‌ కాలేజ్‌, పోస్టాఫీస్‌, హిల్‌రోడ్డు లాంటి మరిన్ని ప్రాంతాలకు విస్తరించాడు. త్వరలోనే దేశంలోని అన్ని నగరాల్లో ఆన్‌లైన్‌ చాయ్‌కొట్లు తెరుస్తానంటున్నాడు. అటెండరు.. కార్పొరేట్‌ ఉద్యోగి అనే తేడా లేకుండా జనాలకు చాయ్‌ తాగే అలవాటుండటం, చాయ్‌వాలాల క్రమశిక్షణే నాతో ఈ కొత్త వ్యాపారం ప్రారంభించడానికి స్ఫూర్తిగా నిలిచింది అంటాడు నితిన్‌.
ఆలోచన క్లిక్‌మంది...
అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. జీతం ఎక్కువే. టూర్లకెళ్తే మెడకి కెమెరా తగిలించుకొని కనిపించిన దృశ్యాన్ని క్లిక్‌మనిపించడం అమర్‌రమేశ్‌కి సరదా. ఆ ఇష్టంతో సియాటెల్‌లో పేరున్న ఫొటోగ్రాఫర్‌ దగ్గర శిష్యరికం చేశాడు. ఫొటోగ్రఫీ మీద మమకారం ఎక్కువయ్యేసరికి ఉద్యోగం బోర్‌ కొట్టేసింది. ఉన్నపళంగా జాబ్‌కి రిజైన్‌ చేసి పుట్టి పెరిగిన చెన్నై బయల్దేరాడు. అదో సాహసం. ఫొటోగ్రఫీలోనే భవిష్యత్తు వెతుక్కోవాలని పంతం. అప్పుడు 'కంటెంపరరీ ఫొటోగ్రఫీ'కి పెద్దగా ఆదరణలేదు. ముఖ్యంగా వెడ్డింగ్‌ ఫొటోగ్రఫీ ఏదో మొక్కుబడిగా ఉండేది. దీనిపై ప్రయోగాలు చేస్తూ నాణ్యత జోడిస్తే కచ్చితంగా భవిష్యత్తు ఉంటుందని వూహించాడు అమర్‌. అంచనా తప్పలేదు. 'అమర్‌రమేశ్‌ ఫొటోగ్రఫీ' మొదలైంది. మొదట్లో తను పెళ్లిళ్లకు తీసిన ఫొటోల్ని ఆన్‌లైన్‌లో పెట్టాడు. అతడి టేకింగ్‌, ఫొటోల నాణ్యత, మేకింగ్‌ చాలామందికి నచ్చింది. ఆన్‌లైన్‌లో సంప్రదించడం మొదలుపెట్టారు. గిరాకీ పెరిగింది. స్టాఫ్‌ని పెంచాడే తప్ప నాణ్యతలో రాజీ పడలేదు. ఫోటోగ్రఫీలో ఏ కొత్త సాంకేతిక పరిజ్ఞానం వచ్చినా అందిపుచ్చుకున్నాడు.
వినియోగదారులు తన నుంచి ఏం కోరుకుంటున్నారో ముందే అడిగి తెలుసుకోవడం అతడి స్త్టెల్‌. లొకేషన్ల ఎంపిక, యాంగిల్స్‌, అతిథుల వివరాలు సేకరించడం.. ప్రతిదీ పట్టించుకుంటూ ఒక వెడ్డింగ్‌ ప్లానర్‌లా వాళ్లతో కలిసిపోయేవాడు. ఇప్పుడు చెన్నైలో అమర్‌రమేశ్‌ ఫొటోగ్రఫీ అంటే తెలియని వారుండరు. వందల పెళ్లిళ్లకు ఫొటోగ్రఫీ చేశాడు. ఇందులో ఎక్కువ శాతం సెలెబ్రెటీలు, వ్యాపారవేత్తలు, రాజకీయనాయకుల పిల్లల వివాహాలే. ఒక్క పెళ్లికి అతడి కెమేరా క్లిక్‌మనాలంటే రెండులక్షల ఫీజు చెల్లించాల్సిందే. అదీ రెండు మూడు నెలలు ముందుగా బుక్‌ చేసుకుంటేనే.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning