'సీడ్' గేట్ వే ఫర్ డిజైనర్స్

భవిష్యత్తులో మంచి డిజైనర్‌గా స్థిరపడాలనుకునేవాళ్లు, డిజైన్ కోర్సుల్లో ఉన్నత విద్య, పరిశోధనలు చేయాలనుకునేవాళ్లకు సువర్ణావకాశం 'సీడ్ ద్వారా లభిస్తోంది. ఈ పరీక్షలో అర్హత సాధించినవాళ్లు ప్రముఖ సంస్థలైన ఐఐటీలు, ఐఐఎస్‌సీలో డిజైన్‌లో పీజీ కోర్సుల్లో చేరొచ్చు. ఆసక్తి ఉంటే పీహెచ్‌డీ కూడా చేయొచ్చు. 'కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ డిజైన్-సీడ్ గురించి వివరాలు తెలుసుకుందామా...
డిజైన్‌లో అభ్యర్థి పరిజ్ఞానం, సృజన, దృక్పథం, డ్రాయింగ్ స్కిల్స్... లాంటివి పరీక్షించి, ఉన్నత విద్యకు అవకాశం కల్పించడానికి ఏర్పాటుచేసిందే 'సీడ్. ఈ పరీక్షను ప్రతి సంవత్సరం ఐఐటీ-ముంబై నిర్వహిస్తోంది. ప్రస్తుతం 2015 విద్యా సంవత్సరానికి సీడ్ ప్రకటన వెలువడింది.
అర్హతలు:
ఇంజినీరింగ్/ఆర్కిటెక్చర్/ డిజైన్/ఇంటీరియర్ డిజైన్ కోర్సుల్లో ఎందులోనైనా 10+2 తర్వాత నాలుగేళ్ల కోర్సు చదివుండాలి.
లేదా
10+2 తర్వాత డిజైన్‌లో నాలుగేళ్ల ప్రొఫెషనల్ డిప్లొమా ఉండాలి.
లేదా
10+2 తర్వాత నాలుగేళ్ల బిఎఫ్ఎ కోర్సు పూర్తిచేయాలి.
లేదా
10 తర్వాత డిజైన్‌లో ఐదేళ్ల గ్రాడ్యుయేట్ డిగ్రీతోపాటు ఏడాది పని అనుభవం
లేదా
10+2+3 తర్వాత ఏదైనా రెండు లేదా మూడేళ్ల పీజీ కోర్సు చదివుండాలి.
సంస్థల వారీ అందుబాటులో ఉన్న కోర్సులు
ఐఐఎస్సీ-బెంగళూరు: మాస్టర్ ఆఫ్ ప్రొడక్ట్ డిజైన్ అండ్ ఇంజినీరింగ్
ఐఐటీ- బాంబే: మాస్టర్ ఆఫ్- ఇండస్ట్రియల్ డిజైన్, విజువల్ కమ్యూనికేషన్, నిమేషన్, ఇంటరాక్షన్ డిజైన్, మొబిలిటీ అండ్ వెహికల్ డిజైన్
ఐఐటీ-ఢిల్లీ: మాస్టర్ ఆఫ్ ఇండస్ట్రియల్ డిజైన్
ఐఐటీ-గువాహటి: మాస్టర్ ఆఫ్ డిజైన్
ఐఐటీ-హైదరాబాద్: మాస్టర్ ఆఫ్ విజువల్ డిజైన్
ఐఐటీ-కాన్పూర్: మాస్టర్ ఆఫ్ డిజైన్
ఐఐఐటిడిఎం-జబల్‌పూర్: మాస్టర్ ఆఫ్- ప్రొడక్ట్ డిజైన్ అండ్ ఇంజినీరింగ్, విజువల్ డిజైన్
డిజైన్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రాములు అందిస్తున్న సంస్థలు: ఐఐఎస్సీ-బెంగళూరు, ఐఐటీ- బాంబే, హైదరాబాద్, కాన్పూర్; ఐఐఐటిడిఎం-జబల్‌పూర్
రాత పరీక్ష విధానం
ఇందులో రెండు పార్ట్‌లు (పార్ట్-ఎ, పార్ట్-బి) ఉంటాయి. అభ్యర్థులు ఈ రెండు పార్టులూ రాయాలి. అయితే పార్ట్-ఎలో ఉత్తీర్ణత సాధిస్తేనే పార్ట్-బి జవాబు పత్రాలను మూల్యాంకనం చేస్తారు. మొత్తం సీట్లకు పది రెట్ల సంఖ్యలో అభ్యర్థులను పార్ట్-ఎ నుంచి పార్ట్-బి మూల్యాంకనానికి ఎంపిక చేస్తారు. ఎంపికలో పార్ట్-ఎలో వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకోరు. పార్ట్-ఎ కంప్యూటర్ బేస్డ్ స్క్రీనింగ్ టెస్ట్. పార్ట్-బి పూర్తిగా డ్రాయింగ్ బేస్డ్ పరీక్ష. పార్ట్-బిలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ రూపొందిస్తారు.
పరీక్ష స్వరూపం:
పార్ట్-ఎలో మొత్తం 50 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు. ప్రతి తప్పు సమాధానానికీ అర మార్కు చొప్పున కోత ఉంటుంది. పార్ట్-బిలో మొత్తం 6 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో మొదటి మూడు ప్రశ్నలకు బొమ్మలు గీయడం తప్పనిసరి. వీటికి మొత్తం 50 మార్కులు. తర్వాత 4,5,6 ప్రశ్నల్లో అభ్యర్థి నచ్చిన ప్రశ్నకు చిత్రపటాన్ని గీసుకోవచ్చు. దీనికి 50 మార్కులు. విజువల్ కమ్యూనికేషన్ అండ్ ఇంటరాక్షన్, యానిమేషన్, ప్రొడక్ట్ డిజైన్ విభాగాల నుంచి 4,5,6 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో విభాగానికి ఒక్కో ప్రశ్న అడుగుతారు . అభ్యర్థి ప్రావీణ్యం ఉన్న విభాగాన్ని ఎంచుకోవచ్చు. మొత్తం పార్ట్-బికి 100 మార్కులు.
ప్రశ్నపత్రంలో...
పార్ట్-ఎలో కళాకారులు, శిల్పులు, కట్టడాలు, చిహ్నాలు.. గురించి ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి. ఏదైనా కట్టడం దృశ్యాన్ని చూపించి దాని పేరు అడుగుతారు. ఏదైనా ఆర్ట్ చూపించి దాన్ని ఎవరు వేశారో చెప్పమంటారు. అలాగే వివిధ కంపెనీలు/సంస్థల లోగోలను చూపించి ఆ సంస్థ పేరు చెప్పమంటారు. కారు బొమ్మలు, లోగోలు కూడా చూపించి తయారు చేస్తున్న కంపెనీల పేర్లు గుర్తించమంటారు. కళలు, కళాకారులు, కెమెరా పరిజ్ఞానం, యానిమేషన్, సాంకేతిక పరిజ్ఞానం, చిత్రలేఖనం, పురాతన కట్టడాలు, శిల్పాలు, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్‌తో కూడిన సినిమాలు, డ్రాయింగ్...అంశాలపైనే ఎక్కువ ప్రశ్నలుంటాయి. పార్ట్-బిలో మాత్రం సందర్భం వివరించి బొమ్మ గీయమంటారు. చిత్రలేఖనంపై పట్టుంటేనే పార్ట్-బిని సమర్థంగా ఎదుర్కోవచ్చు.
అందుబాటులోని పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, చెన్నై, బెంగళూరు
* ఎంపికైన అభ్యర్థుల స్కోర్ ఫలితాలు వెలువడిన తేదీ నుంచి రెండేళ్లపాటు చెల్లుబాటవుతుంది. అయితే ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. పైన పేర్కొన్న సంస్థల్లో చేరాలనుకున్నవాళ్లు ప్రత్యేకంగా ఆయా సంస్థల్లో ప్రవేశానికి ప్రకటన వెలువడినప్పుడు దరఖాస్తు చేసుకోవాలి. ఆ సంస్థలు మళ్లీ రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ లాంటివి చేపట్టి అభ్యర్థులను కోర్సులోకి అనుమతిస్తాయి. ఎంపిక విధానం సంస్థను బట్టి మారుతుంది.
* పరీక్ష కోసం గరిష్ఠ వయోపరిమితి విధించ లేదు. అభ్యర్థులు ఎన్నిసార్త్లెనా పరీక్ష రాసుకోవచ్చు.
దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో చేసుకోవాలి.
ఫీజు: జనరల్, ఓబీసీ పురుష అభ్యర్థులకు రూ.2000. ఎస్సీ,ఎస్టీ, పీహెచ్, మహిళలైతే రూ.వెయ్యి చెల్లించాలి.
ఆన్‌లైన్ దరఖాస్తుల కోసం క్లిక్ చేయండి: ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 1, 2014 టెస్ట్ సెంటర్లు ఎంపిక: అక్టోబర్ 15 నుంచి 30లోగా చేసుకోవచ్చు.
హాల్ టికెట్ల డౌన్‌లోడ్: నవంబర్ 7 నుంచి డిసెంబర్ 6 వరకు చేసుకోవచ్చు.
పరీక్ష తేదీ: డిసెంబర్ 7, 2014(ఆదివారం) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు
ఫలితాలు: జనవరి 15, 2015 సాయంత్రం 5 తర్వాత వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.
స్కోర్ కార్డులు: జనవరి 22, 2015 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
వెబ్‌సైట్

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning