ఆటోమొబైల్‌ ఇంజినీర్లకు గిరాకీ

విభిన్నరకాల వినియోగదారుల అవసరాలను తీర్చే ఉద్దేశంతో కార్లు, స్కూటర్ల తయారీలో ఆటోమొబైల్‌ కంపెనీలు పోటీ పడుతున్నాయి. దీంతో ఈ రంగం అర్హులైన, సుశిక్షితుల కోసం ఎదురుచూస్తోంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ రంగంలో విడిభాగాల తయారీ వల్ల ఆటోమొబైల్‌ ఇంజినీర్లకు గిరాకీ ఎక్కువవుతోంది.
వాహనాల తయారీ గురించి నేర్పడం ఆటోమొబైల్‌ రంగం మౌలిక పాఠ్యాంశం. మౌలిక భావన స్థితి (కాన్సెప్టు) నుంచి ఉత్పత్తి స్థితి (ప్రొడక్షన్‌) వరకూ ద్విచక్రవాహనాలు, కార్లు, లారీలు, బస్సులు, ట్రక్కుల రూపకల్పన, అభివృద్ధి, నిర్మాణ నిర్వహణలు ఈ రంగానికి చెందినవి. మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌ వంటి ఇంజినీరింగ్‌ విభాగాల్లోని ప్రగతిని ఉపయోగించుకుని ఆటోమొబైల్‌ రంగం వాహనాలను తయారుచేస్తోంది.
ఆటోమొబైల్‌ ఇంజినీర్లను ఉత్పత్తి/ డిజైన్‌ ఇంజినీర్లు, అభివృద్ధి ఇంజినీర్లు, మాన్యుఫాక్చరింగ్‌ ఇంజినీర్లు అనే మూడు కోవలకు చెందినవారిగా విభజించవచ్చు.
* మొదటి రకం ఇంజినీర్లు వివిధ విడిభాగాల, ఆటోమొబైల్‌ వ్యవస్థలోని ఉపవిభాగాల డిజైన్‌ కార్యకలాపాలు నిర్వహిస్తారు. ప్రతి విడిభాగాన్నీ డిజైన్‌ చేసి, పరీక్షించి అంచనాలకు అనుగుణంగా ఉన్నదీ లేనిదీ నిర్ణయిస్తారు.
* రెండోకోవకు చెందినవారు వాహనాల పూర్తిస్థాయి నిర్మాణానికి సంబంధించిన వ్యవహారాలకు బాధ్యత వహిస్తారు.
* మూడో రకం ఇంజినీర్లు వాహనాల ఉపవిభాగాల అనుసంధానంపై దృష్టి సారిస్తారు. తయారీదారు అంచనాలమేరకు, ప్రభుత్వం నిర్దేశించిన నియంత్రణల మేరకు వాహనాలు తయారయ్యేటట్టు చూడడం వీరి బాధ్యత.
తక్కువ ఖర్చు, ఎక్కువ వసతులు ఉండి, ఇంధనాన్ని పొదుపు చెయ్యగలిగిన వాహనాల తయారీకి గిరాకీ పెరుగుతోంది. కాబట్టి కొత్త టెక్నాలజీల ఉపయోగంతో ఇటువంటి వాహనాల రూపకల్పన అవసరముంది. ప్రత్యేకంగా కార్ల తయారీలో పెను విప్లవాలకు ఆస్కారమున్నందువల్ల ప్రతిభ కనబర్చగలిగిన ఆటోమొబైల్‌ ఇంజినీర్ల అవసరం ఎంతైనా ఉంది.
ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌ చదవడానికి మెకానిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌, గణితంలో ప్రావీణ్యం అవసరం. వీటితోపాటు రసాయన శాస్త్రంలోని వివిధ లోహాల లక్షణాలపై అవగాహన ఉండాలి. శ్రమకు వెరవని తత్వం అలవరచుకోవాలి. వాహనాల పట్లా, వాటి నిర్మాణం పట్లా ఆకర్షణ కలిగి ఉండాలి.
ఉద్యోగావకాశాలు
మధ్యతరహా పరిశ్రమల నుంచి భారీ పరిశ్రమల వరకు చాలా అవకాశాలుంటాయి. టాటా, బజాజ్‌, హిందుస్థాన్‌ మోటార్స్‌, హిందుజా, మారుతి, హీరో, టీవీఎస్‌ వంటి ప్రముఖ కంపెనీల్లో మంచి అవకాశాలుంటాయి. రాష్ట్రప్రభుత్వం నిర్వహించే బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్ల ఉద్యోగానికి వీరు అర్హులు. వీరు సాధారణ పనివేళలకు మించి పని చేయాల్సి ఉంటుంది. వీరు కూడా మెకానికల్‌ ఇంజినీర్ల నుంచి గట్టిపోటీని ఎదుర్కొంటారు.
సమయ నియమావళికి అతీతంగా, చాలావరకు శబ్దకాలుష్య వాతావరణంలో పని చెయ్యవలసి ఉంటుంది. వాహనాల నిర్మాణ ప్రక్రియలో ఏ చిన్న పొరపాటు జరిగినా దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. గత కొన్ని సంవత్సరాలుగా అంతర్జాతీయంగా ఆటోమొబైల్‌ రంగం మాంద్యానికి గురికావడం మూలాన ఈ రంగం అంత ఆకర్షణీయంగా కనిపించడం లేదు. అందుకే ఈ బ్రాంచి పట్ల ఆదరణ తగ్గుతూ ఉంది. కానీ దీర్ఘకాలంలో ప్రతిభ, అనుభవాల ప్రమాణం మీద మంచి భవిష్యత్తు ఇవ్వగలిగిన బ్రాంచి ఇది.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning