సీశాట్‌... ఎలా?

సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీలో సీశాట్‌గా వ్యవహరిస్తున్న జనరల్‌ స్టడీస్‌ పేపర్‌-2 ఇటీవల తరచూ వార్తలకెక్కుతోంది. దీన్ని తొలగించాలని విద్యార్థులు ఆందోళన చేయగా ఈ పేపర్లోని 'ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌ స్కిల్స్‌' భాగాన్ని మెరిట్‌కు పరిగణించబోమని (అర్హతకే పరిమితం చేస్తామని) ప్రభుత్వం ప్రకటించింది. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఈ పేపర్‌కు ఎలా సిద్ధమవాలో చూద్దాం.
కొత్త మార్పు వల్ల చెప్పుకోదగ్గ తేడా ఉండదని అర్థం చేసుకోవాలి. అసలు ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌తో తెలుగు విద్యార్థులు పెద్దగా ఇబ్బందిపడిన సందర్భాలు లేవు. ఏమైనా సంవత్సరాల్లో పాటించే వ్యూహమే ఇప్పుడూ ఉపయోగపడుతుంది.
2011, 2012, 2013 సంవత్సరాల్లో జరిగిన సీశాట్‌ పేపర్‌ తీరు తెలిసినప్పటికీ ఈ ఏడాది వేరే రకంగా ఈ పేపర్‌ రావొచ్చని అభ్యర్థులు నమ్మకంతో ఉన్నారు. పైగా ఈ ఏడాదే 200కు 70 మార్కులను అర్హత మార్కులుగా ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే ఏడాది ఈ మార్కుల సంఖ్య మారవచ్చు.<br>
ఒక్కో విభాగం గురించి...
కాంప్రహెన్షన్‌: మూడేళ్ళలోనూ అత్యధిక సంఖ్యలో ప్రశ్నలు దీని నుంచే వచ్చాయి. ఇదే తీరు కొనసాగవచ్చు. అన్ని రకాల పాసేజ్‌లూ రావొచ్చు. దీనిలో వేగానికి ప్రాధాన్యం. వేగంగా చదివి, అర్థం చేసుకోవటానికి ప్రయత్నించి జవాబు గుర్తించాలి. అయితే నెగిటివ్‌ మార్కు ఉందని మర్చిపోకూడదు.
ఇంటర్‌పర్సనల్‌ స్కిల్స్‌ + కమ్యూనికేషన్‌ స్కిల్స్‌: ఇంతవరకూ ఈ మూడేళ్ళలో దీనిపై ఒక్క ప్రశ్న కూడా రాలేదు. డెసిషన్‌ మేకింగ్‌ ప్రశ్నల్లో భాగంగా ఇవి కలిసివున్నాయి. ఈ సంవత్సరం ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌ను అర్హతకు పరిమితం చేయటం వల్ల ఈ ఇంటర్‌ పర్సనల్‌ స్కిల్స్‌ నుంచి కొన్ని ప్రశ్నలు వస్తాయని అంచనా. అభ్యర్థులను వడపోసి, తగ్గించటానికి యూపీఎస్‌సీ ఈ విభాగాన్ని ఉపయోగించే అవకాశం లేకపోలేదు. దీనికి ప్రత్యేకంగా సన్నద్ధత అవసరం లేదు.
లాజికల్‌ రీజనింగ్‌, అనలిటికల్‌ ఎబిలిటీ: గరిష్ఠసంఖ్యలో ప్రశ్నలు వచ్చే అవకాశముంది. గత ఏడాది ప్రశ్నల తరహాలోనే రావొచ్చు. సాధన చేయటం తప్ప విడిగా వ్యూహం ఏదీ అవసరం లేదు.
డెసిషన్‌ మేకింగ్‌, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌: గత ఏడాది కంటే కొంచెం ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది నుంచీ 'డిఫరెన్షియల్‌ మార్కింగ్‌' ఉంటుంది. అంటే ఈ ప్రశ్నలకు ఒకే ఒక సరైన జవాబు ఉండదు. అన్ని జవాబులూ సరైనవే అయినా అత్యుత్తమ జవాబుకు 2.5 మార్కులు, రెండో ఉత్తమ జవాబుకు 2 మార్కులు, మూడోదానికి 1.5 మార్కులు, చివరిదానికి 1 మార్కు ఇస్తారు.
జనరల్‌ మెంటల్‌ ఎబిలిటీ, బేసిక్‌ న్యూమరసీ: కిందటి సంవత్సరం మాదిరే ప్రశ్నల సంఖ్య రావొచ్చు. ఈ విభాగంలో నూరు శాతం మార్కులు తెచ్చుకునే వీలుందని మర్చిపోకూడదు.
ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ కాంప్రహెన్షన్‌ స్కిల్స్‌: గత ఏడాది వచ్చినన్ని ప్రశ్నలే రావొచ్చు. ఈ మార్కులను మెరిట్‌కు లెక్కించరు. అయితే అర్హత పొందటానికి సగటున ఈ విభాగానికి కేటాయించిన మొత్తం 20 మార్కుల్లో కనీసం 10 మార్కులు తెచ్చుకోవాల్సివుంటుంది.
నేపథ్యం బట్టి...
సీశాట్‌కు సన్నద్ధత వ్యూహం అభ్యర్థి తన విద్యానేపథ్యాన్ని బట్టి నిర్ణయించుకోవాల్సివుంటుంది.
* సాంకేతిక విద్యార్థులు న్యూమరికల్‌ ఎబిలిటీని వేగంగా పూర్తిచేసి, ఇంగ్లిష్‌కు వచ్చేసరికి జోరు తగ్గిస్తారు. రీడింగ్‌ కాంప్రహెన్షన్లో అన్ని పాసేజ్‌లూ పూర్తిచేయలేక విలువైన మార్కులు కోల్పోతారు.
* సాంకేతికేతర విద్యార్థులు జనరల్‌ మెంటల్‌ ఎబిలిటీ, లాజికల్‌ రీజనింగ్‌ ప్రశ్నల దగ్గర ఇబ్బందిపడతారు. అవసరమైనదానికంటే ఎక్కువ వ్యవధి తీసుకుని, విలువైన సమయం కోల్పోతారు.
మరేం చేయాలి?
* సాంకేతిక విద్యానేపథ్యం ఉన్నవారు డెసిషన్‌ మేకింగ్‌, ఇంటర్‌పర్సనల్‌ స్కిల్స్‌తో మొదలుపెట్టి వరసగా లాజికల్‌ రీజినింగ్‌, బేసిక్‌ న్యూమరసీ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ, ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ పూర్తిచేయాలి.
* సాంకేతికేతర నేపథ్యం ఉన్నవారు కూడా డెసిషన్‌ మేకింగ్‌, ఇంటర్‌ పర్సనల్‌ స్కిల్స్‌తోనే ప్రారంభించాలి. తర్వాత వరసగా రీడింగ్‌ కాంప్రహెన్షన్‌, ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌, లాజికల్‌ రీజనింగ్‌, బేసిక్‌ న్యూమరసీ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీలను పూర్తిచేయటం శ్రేయస్కరం.
* ఈ పేపర్లో విజయవంతం కావటానికి వీలైనంత ఎక్కువ సాధనే ఏకైక మార్గం!

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning