గూగుల్ మెచ్చి మూడు కోట్లిచ్చింది!

 • నవతరం అమ్మాయి చేసిన ఆలోచనా... దాన్ని ఆచరణలో పెట్టిన తీరూ... ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నెటిజన్లు మెచ్చుకునేట్టు చేసింది. ఫలితం... విజేతగా గూగుల్ నుంచి మూడు కోట్ల రూపాయల భారీ బహుమతి. సనా స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి గ్రామాలకు స్వచ్ఛమైన మంచినీళ్లూ, పర్యావరణహితమైన మరుగుదొడ్ల నిర్మాణం కోసం కృషి చేసిన తెలుగమ్మాయి సంచయితా గజపతిరాజు తన సేవా ప్రస్థానాన్నీ, గూగుల్ పోటీలో విజేతగా నిలిచిన వైనాన్నీ ఇలా చెబుతోంది...

  నెట్ సెర్చింజన్ సంస్థ గూగుల్ 'గ్లోబల్ ఇంపాక్ట్' పేరుతో నిర్వహించిన పోటీకి కొన్ని వేల స్వచ్ఛంద సంస్థల నుంచి దరఖాస్తులొచ్చాయి. వాటి పనితీరుని గమనించి, ఓటు వేసేందుకు పది రోజుల పాటు నెటిజన్లకు అవకాశం ఇచ్చారు. ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. అత్యధిక ఓట్లు నేను ప్రారంభించిన సనా సంస్థ పని తీరుకి పడ్డాయని తెలిసినప్పుడు చెప్పలేనంత ఆనందం కలిగింది. రెండేళ్ల స్వల్ప కాలంలోనే ప్రజల ఆదరణ పొందినందుకు సంతోషంగా అనిపించింది.
  నేను పుట్టింది హైదరాబాద్‌లో. మా అమ్మ ఉమ విశాఖపట్నం నుంచి కొన్ని సంవత్సరాలు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. ధైర్యంగా ముందడుగు వేయడంలో, పేదవారికి సేవ చేయడంలో ఆమే నాకు స్ఫూర్తి. చిన్నప్పుడు అమ్మతో కలిసి నేనూ మారుమూల గ్రామాలకు వెళ్లాను. ప్రజల కష్టాలను దగ్గరగా చూశాను. తరవాత అమ్మతో పాటూ ఢిల్లీకి వెళ్లిపోయాను. అక్కడే చదువుకున్నా. కాలేజీలో చేరాక, పొలిటికల్ సైన్సులో డిగ్రీ చదువుతున్నప్పుడూ బాల్య జ్ఞాపకాలూ, పల్లెల్లో ప్రజలు పడే బాధలూ గుర్తుకొచ్చేవి. అయితే నేను సేవారంగంలోకి రావడానికి ముందు అమ్మ నిర్వహించే మీడియా సంస్థలో చేరి నలభై వరకూ జాతీయ, అంతర్జాతీయ లఘుచిత్రాలనూ, డాక్యుమెంటరీలనూ నిర్మించాను. వాటిల్లో చాలామటుకు సామాజిక సమస్యలను ప్రతిబింబించేవే! ఓ పక్క లఘు చిత్రాలను నిర్మిస్తూనే, న్యాయశాస్త్రం చదివాను. లఘుచిత్రాలను నిర్మిస్తున్నప్పుడే కర్ణాటకలోని గుల్బర్గాలో రైతులతో కలిసి పనిచేస్తున్న ఓ ఎరువుల సంస్థ గురించి తెలిసింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుని, రైతుల జీవితాల్లో వాళ్లు తెస్తున్న మార్పు చూశాక టెక్నాలజీ సాయంతో గ్రామీణ ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలనిపించింది. అలా అనుకొన్నప్పుడు.. మనదేశంలో సగం గ్రామాలకు మరుగుదొడ్డి సౌకర్యం లేదు. తోటి మహిళలు ఇలాంటి కనీస అవసరాలు తీర్చుకోవడానికి ఎంత సిగ్గుపడుతున్నారో అనిపించింది. ఈ కారణం వల్ల ఆడపిల్లలు చదువుకోవడం లేదు. అరవై శాతం మందికి మంచినీటి సౌకర్యం లేదు. కిలోమీటర్లు నడిచి నీళ్లు మోసుకుని రావాల్సిన పరిస్థితి. సాంకేతిక సాయంతో మార్చి మహిళల జీవితాల్లో వెలుగులు చూడాలనుకొన్నా. ఈ ఆలోచనకు అనుగుణంగానే 2011లో సనా (సోషల్ అవేర్‌నెస్ అండ్ న్యూయర్ ఆల్ట్రనేటివ్స్) స్వచ్ఛంద సంస్థను ప్రారంభించా.

  ఒక్కో ఇంటికి ఐదు లీటర్ల నీరు...
  తూర్పు ఢిల్లీ, పేదల బస్తీలోని ఓ పాఠశాలలో నా మొదటి ప్రాజెక్ట్‌ని ప్రారంభించాను. తాగడానికి గుక్కెడు మంచినీళ్లు లేక, అక్కడ చాలామంది ఆడపిల్లలు బడి మానేశారని తెలిసింది.

  అక్కడే ప్రభుత్వ సహకారంతో సౌరశక్తితో పని చేసే ఓ ప్లాంట్‌ని స్థాపించి నీటిని శుద్ధి చేయడం ప్రారంభించాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు తగ్గట్టుగా స్థానికంగా ఉండే వెయ్యి కుటుంబాలకు మంచినీళ్లని శుద్ధిచేసి అందివ్వడం మొదలుపెట్టాం. ఈ తరహా ప్రాజెక్ట్ ఢిల్లీలోనే మొదటిది. ఏడాది తిరిగేసరికి ఫలితాలు కనిపించాయి. బస్తీలోని పిల్లలూ, మహిళలూ అనారోగ్యాల బారిన పడటం తగ్గింది. చుట్టుపక్కల బస్తీల్లోని బాలికల హాజరు పెరిగింది. ఉత్సాహంగా రెండు మిలియన్ లీటర్ల నీటిని శుద్ధి చేసి అందించగలిగే స్థాయికి ప్రాజెక్ట్‌ని విస్తరించాం. ఆ ప్లాంట్ నిర్వహణని స్థానికులే సొంతంగా నిర్వహించుకునేలా తర్ఫీదునిచ్చాం. సౌరశక్తితోనే ఈ పనులు చేయడానికి కారణం ఉంది. ఏం చేసినా పర్యావరణ హితంగా ఉండాలనేది, నా మొదటి ఆలోచన. రెండోది, గ్రామీణ ప్రాంతాల్లో కరెంట్ కోతలు ఎక్కువ. అలాంటప్పుడు విద్యుచ్ఛక్తితో పనిచేసే యంత్రాలు సరైన ఫలితాలు ఇవ్వవు. అందుకే సోలార్ పరికరాలని ఎంచుకొన్నా. ఢిల్లీలో ఈ ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో ముఖ్యమంత్రి షీలాదీక్షిత్, మణిశంకర్ అయ్యర్ వంటి వారి నుంచి ప్రశంసలు లభించాయి. రెట్టించిన ఉత్సాహంతో నా సొంత రాష్ట్రానికి సేవా కార్యక్రమాలు చేయాలనే ఆలోచన వచ్చింది.
  బయోటాయిలెట్ల రూపకల్పన...
  మంచినీళ్లూ, పరిశుభ్రతా... ఈ రెండింటినీ వేర్వేరుగా చూడలేం. వీటిల్లో ఒకటే అందించడం వల్ల, ప్రజల జీవన ప్రమాణాల్లో అంతగా మార్పు రాదు. డయేరియా వంటి వ్యాధులు ఎప్పటిలానే ప్రజల్ని బాధిస్తాయి. ఆర్థికంగా నష్టపరుస్తాయి. అందుకే ఈసారి మంచినీళ్లు అందిస్తూనే... మరుగుదొడ్ల సదుపాయమూ ఏర్పరిచే దిశలో ఆలోచనలు చేశా. అందుకోసం తూర్పుగోదావరి జిల్లాలోని ఎన్.చామవరం ప్రాంతాన్ని ఎంచుకున్నాను. సౌరశక్తితో పనిచేసే నీటి శుద్ధి ప్లాంట్‌నీ, బయో టాయిలెట్ల ఏర్పాటునూ ప్రారంభించా. డీఆర్‌డీవో రూపొందించిన ఆధునిక తరహా బయో డైజెస్టివ్ టాయిలెట్ల నిర్వహణకు ఏమాత్రం ఖర్చవదు. ప్రత్యేకించి సెప్టిక్ ట్యాంక్‌ల నిర్మాణమూ అవసరం లేదు. ఆ వ్యర్థాలూ చేటు చేయవు. పైగా బయోగ్యాస్‌గా రూపాంతరం చెందుతాయి. పది గ్రామాల్లోని వారికి ఈ తరహా మరుగుదొడ్ల సౌకర్యాన్ని అందించే పనులు జరుగుతున్నాయి. ఉప్పు నీటినీ, అంతగా శుభ్రం చేయని నీటిని తాగే అక్కడి గ్రామాల వారికి రోజుకి ఐదు వేల లీటర్లని నీటిని శుద్ధి చేసి అందిస్తున్నాం. ఇందుకోసం సుమారు ఇరవై లక్షలు ఖర్చు చేశాం. కానీ దాతలూ, ప్రభుత్వ నిధుల సహకారం లభిస్తుండటంతో ప్రజలకు ఉచితంగానే ఈ సేవల్ని అందుబాటులోకి తెచ్చాం.
  ఇలా పోటీకి పంపాను...
  రెండు నెలల క్రితం.. నెట్ చూస్తుంటే.. 'సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని పనిచేస్తున్న సేవా సంస్థల గురించి మాకు రాయండి' అన్న గూగుల్ ప్రకటన కనిపించింది. నేనూ దరఖాస్తు చేశాను. మా పని తీరునీ, మేం ఉపయోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్నీ వీడియోల ద్వారా తెలియజేశాను. ఢిల్లీలో న్యాయనిర్ణేతల ముందూ వివరించాను. నేనొక్కదాన్నే కాదు. వేల మంది పోటీపడ్డారు. వివిధ వడపోతల తరవాత ఎంపిక చేసిన, పదిమంది ఫైనలిస్టుల జాబితాలో సనా పేరుంది. పదిమందిలో విజేతని తేల్చేందుకు పది రోజుల పాటూ ఓటింగ్ జరిగింది. నాలుగు సంస్థలు విజేతగా నిలిచాయి. వాటిలో మా సంస్థకి అత్యధికంగా ఐదు లక్షల ఓట్లు వచ్చాయి. మూడు కోట్ల రూపాయల బహుమతి లభించింది. ఈ మొత్తాన్ని... మరో మూడేళ్ల పాటు ఇక్కడి గ్రామాలకు అవసరమైన 54 మిలియన్ లీటర్ల నీటిని అందించడానికి ఉపయోగించాలనుకుంటున్నా. దీనివల్ల 25 వేల మంది లబ్ధి పొందుతారు. అంతేకాదు... పది గ్రామాలకు పూర్తయిన బయోడైజెస్టివ్ టాయిలెట్లను అందించి, కొత్తవి నిర్మించే ఆలోచనలున్నాయి. మహిళలకు వృత్తి విద్యా శిక్షణను అందించడం, గ్రామీణ యువతకు ఆన్‌లైన్ నైపుణ్యాలు అందుబాటులోకి తీసుకొచ్చి ఉద్యోగావకాశాలు పెంచడం నా ముందున్న లక్ష్యాల్లో కొన్ని. 'సనా' కోసం ఏ వేళలో అయినా పనిచేసే సభ్యులున్నారు. వీళ్లు స్థానికులతో, స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తారు
  .

 • Industry      Interaction

  Higher Education

  Job Skills

  Soft Skills

  Comm. English

  Mock Test

  E-learning