అరగంట ఉన్నా... అసలు రాసేది 20 నిమిషాలే!

అమెరికాలాంటి దేశాల్లో ఎంఎస్‌ ప్రవేశాలకోసం రాసే జీఆర్‌ఈ (గ్రాడ్యుయేట్‌ రికార్డ్‌ ఎగ్జామ్‌)లో 'సమయం' చాలా ముఖ్యమైన అంశం. నిర్దిష్ట సమయంలో సమగ్రంగా వ్యాసాలను రాసేలా విద్యార్థులు సాధన చేయాలి!
జీఆర్‌ఈ 'అనలిటికల్‌ రైటింగ్‌' విభాగంలో Issue, Argument task లు కంప్యూటర్‌పై రాయాల్సివుంటుంది. వీటికి కేటాయించిన వ్యవధిని జాగ్రత్తగా నిర్వహించుకోవాలి. మొదటి 5- 6 నిమిషాలను చదవడానికీ, విశ్లేషించడానికీ, వ్యాసాన్ని ప్రణాళిక వేసుకోవడానికీ వినియోగించాలి. తరువాతి 20- 22 నిమిషాలను వ్యాసం రాయడానికీ; చివరి 2- 4 నిమిషాలను సబ్‌మిట్‌ చేసేముందు చదివి సరిచూసుకోవడానికీ, చిన్న చిన్న తప్పులను సరిదిద్దుకోవడానికీ ఉపయోగించుకోవాలి.
కాబట్టి అసలు రాసేది 20- 22 నిమిషాలు మాత్రమే. సరైన పరిచయం, ముగింపులతో కూడిన 200- 300 పదాల వ్యాసాన్ని విద్యార్థుల నుంచి ఆశిస్తారు. చివరగా.. ఎంత సమర్థంగా విద్యార్థి విషయాన్ని విశ్లేషించాడు, వ్యాసాన్ని నడిపించాడు, తన వాదనను బలపరచడానికి సమంజసమైన ఉదాహరణలు ఉపయోగించాడా అనేవాటిపై స్కోరు ఆధారపడి ఉంటుంది. ప్రతి వ్యాసానికి కేటాయించిన సమయం 30 నిమిషాలు. దానికి మించి సమయాన్ని పెంచడం/ రెండో వ్యాసానికి సమయాన్ని మిగుల్చుకోవడం అసాధ్యం. తెర మీద ముప్పయ్యో నిమిషం చూపగానే సిస్టంలో 'ఇష్యూ టాస్క్‌' తొలగిపోయి 'ఆర్గ్యుమెంట్‌ టాస్క్‌' కనపడుతుంది.
Analysis of an Issue అంటే?
సమస్య విశ్లేషణ (ద ఎనాలిసిస్‌ ఆఫ్‌ యాన్‌ ఇష్యూ) ఎనలిటికల్‌ రైటింగ్‌ విభాగంలో విద్యార్థి రాసే మొదటి వ్యాసం. ప్రతి టాపిక్‌ ఏదో ఒక సమస్యను లేవనెత్తేదే. విద్యార్థి తన కోణాన్ని వివరించడంలో స్థిరంగా ఉండి, చదివేవారిని ఒప్పించేలా వ్యాసాన్ని రాయాలి. కాబట్టి తన వాదనను సమర్థించుకోవడానికి అనువైన ఉదాహరణలు పొందుపరచాలి. చాలా టాపిక్స్‌లో తుది అభిప్రాయానికి చేరుకునేముందు రెండు వైపులా చర్చించాల్సినవిగా ఉంటాయి. వ్యాసంలో అడిగే అంశాలను (సుమారు 100 టాపిక్‌లు) జీఆర్‌ఈ వెబ్‌సైట్‌ www.gre.org లో ముందుగానే పెడతారు. ఇవన్నీ జనరల్‌ టాపిక్‌లపైనే ఉంటాయి. విద్యార్థులు వీటిపై కొంత జ్ఞానం కలిగి ఉండాలన్నదే వీటి వెనక ఉన్న ఉద్దేశం. విస్తృతంగా చదివే అలవాటు ఈ వ్యాసరచనకు బాగా తోడ్పడుతుంది.
Issue టాపిక్‌కు సన్నద్ధత
* పరీక్షకు ముందే టాపిక్స్‌ చదవాలి.
* ఈ టాపిక్స్‌ గురించి తోటి జీఆర్‌ఈ విద్యార్థులతోగానీ, మీ మెంటార్‌తో కానీ చర్చించండి. ఫలితంగా దానిపై కొంత పరిజ్ఞానం పెంచుకోవచ్చు.
* మీ అనుభవాలు, చదివినవాటి నుంచి తగిన ఉదాహరణలను ఎంచుకోండి. ఇవి మీ కోణాన్ని సమర్థించుకోవడానికి ఉపయోగపడతాయి.
* మీ వ్యాసంలో పరిచయం, విషయం, ముగింపు సరిగా ఉండేలా చూసుకోండి.
* Issue topic లోని రెండో పేరాలో ఇచ్చిన సూచన ఆధారంగా మీ వ్యాసాన్ని నిర్మించుకోండి.
* ఆరంభంలో సమయం పెట్టుకోకుండా రాయవచ్చు. కానీ తర్వాత నిర్దిష్ట వ్యవధిలో రాయటం సాధన చేయాలి. పరీక్షలో సమయ నిర్వహణకు ఈ అభ్యాసం ఉపయోగపడుతుంది.
* మీ వ్యాసాలను నిపుణులతో దిద్దించుకుని, ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోండి.
Analysis of an Argument అంటే?
ఎనలిటికల్‌ రైటింగ్‌ విభాగంలో విద్యార్థి రాసే రెండో వ్యాసం ఇది. ఈ వ్యాసంలోని ప్రతి విషయం ఏదో ఒక వాదనతో ఉంటుంది. విద్యార్థి అదెంత తార్కికంగా ఉందో విమర్శనాత్మక అంచనాను రాతపూర్వకంగా చెప్పాల్సివుంటుంది.
వాదనను విమర్శించడానికి విద్యార్థి ఇవి తప్పకుండా తెలుసుకోవాలి:
* వాదనను దాని ముగింపు/ ఆధారాలు, అంచనాలను బట్టి ఎలా విశ్లేషించాలి?
* వాదనలోని ముగింపును ఎలా నిర్వీర్యం చేయాలి?
* వాదనలోని ముగింపును ఎలా బలపరచాలి?
* టెస్ట్‌మేకర్‌ ఇచ్చిన సూచనల ఆధారంగా వ్యాసాన్ని ఎలా రూపొందించాలి, నడిపించాలి?
సన్నద్ధయ్యేది ఇలా!
* పరీక్షకుడు ఇచ్చిన సమూహంలోని ఆర్గ్యుమెంట్‌ టాపిక్స్‌ను చదవాలి.
* కనీసం 50 టాపిక్స్‌ను ఎంచుకుని వాటి విశ్లేషించటం, నిర్వీర్యపరచటం, బలపరచటం నేర్చుకోండి.
* కనీసం 20 టాపిక్స్‌పై వ్యాసాలను నిర్దిష్ట సమయం పెట్టుకోకుండా, పెట్టుకునీ రాయాలి.
* మీ వ్యాసాలను నిపుణుల చేత విశ్లేషణ చేయించుకోండి.
జీఆర్‌ఈ రాయబోయే విద్యార్థులు అనలిటికల్‌ రైటింగ్‌ స్కోరు ప్రాముఖ్యాన్ని తక్కువ అంచనా వేయకూడదు. ముందస్తు ప్రణాళిక, సన్నద్ధత- పరీక్షలో సఫలమవడానికి అత్యవసరం!

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning