ప్రారంభమైన ప్రాంగణ కొలువుల జాతర

ఇంజినీరింగ్‌ కాలేజీల్లో మొదలైన హడావుడి
ఈసారి 20 శాతం అధికంగా నియామకాలు
ద్వితీయ శ్రేణి నగరాలపైనా దృష్టి

ఈనాడు, హైదరాబాద్‌: ఒకవైపు పలు అవాంతరాల్ని దాటుకుంటూ ఇంజినీరింగ్‌ తొలి సంవత్సరంలోకి విద్యార్థులు అడుగు పెట్టే ప్రక్రియ సాగుతుంటే... మరోవైపు నాలుగో సంవత్సరం విద్యార్థులకు కొలువుల జాతర ఆరంభమవుతోంది. హైదరాబాద్‌లోని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రాంగణ నియామకాల (క్యాంపస్‌ ప్లేస్‌మెంట్ల) హడావుడి మొదలైంది. ప్రధాన కాలేజీల్లో కొన్ని ఐటీ కంపెనీలు నియామకాల ప్రక్రియను ప్రారంభిస్తున్నాయి. పరిణామాల్ని చూస్తుంటే ఈసారి ఐటీ రంగంలో నియామకాలు గతేడాదికంటే 20 శాతం అధికంగా ఉండే అవకాశముందని కళాశాలు ఆశాభావాన్ని వ్యక్తంజేస్తున్నాయి. ''ప్లేస్‌మెంట్లు మొదలయ్యాయి. కొన్నికొన్ని కంపెనీలే ఇప్పుడొస్తున్నాయి. మరో వారం పదిరోజుల్లో వీటి సంఖ్య పుంజుకుంటుంది'' అని జేఎన్‌టీయూహెచ్‌ ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌ రామకృష్ణ ప్రసాద్‌ ఈనాడుతో అన్నారు. సంప్రదాయంగా వచ్చే టీసీఎస్‌, మైక్రోసాఫ్ట్‌, డెలాయిట్‌, కాగ్నిజెంట్‌, టెక్‌ మహీంద్ర, ఐబీఎమ్‌....తదితర సంస్థలతో పాటు చెన్నై, బెంగళూరుల నుంచి కొత్తగా ప్రారంభిస్తున్న కంపెనీలు (స్టార్టప్స్‌) కూడా నియామకాలకు ముందుకు వస్తుండటం ఈసారి చెప్పుకోదగ్గ పరిణామంగా చెబుతున్నారు. ''ఆరంభం చూస్తే ఆశాజనకంగా కనిపిస్తోంది. నిరుటితో పోలిస్తే ఈసారి ఎక్కువ సంఖ్యలోనే నియామకాలను తీసుకుంటున్నారు. ఎక్కువ మొత్తంలో ప్యాకేజీలను ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. వీటికి తోడు స్టార్టప్స్‌ కంపెనీలు ముందుకొస్తున్నాయి. ఐటీ ప్లేస్‌మెంట్లు ముగిశాక కోర్‌ గ్రూప్‌ కంపెనీలు వస్తాయి'' అని బీవీఆర్‌ఐటీ ప్లేస్‌మెంట్స్‌ ఇంఛార్జి సతీశ్‌చంద్ర వ్యాఖ్యానించారు. ''మార్కెట్‌ పరిణామాలకు తోడు, కేంద్రంలోని కొత్త ప్రభుత్వం ఆలోచన తీరు కూడా ఈసారి నియామాకాలపై ప్రభావం చూపుతోంది. ఈఏడాది విద్యార్థులకు మంచి ఆశాజనకంగా ఉండనుంది. కేవలం హైదరాబాదే కాకుండా... ద్వితీయశ్రేణి నగరాల వైపు కూడా కంపెనీలు దృష్టిసారిస్తున్నాయి. కొన్ని ఐటీ కంపెనీలతోపాటు ఓ పేరున్న మెకానికల్‌ కంపెనీ కూడా వరంగల్‌కు ప్లేస్‌మెంట్స్‌కు రావటానికి అంగీకరించింది'' అని వరంగల్‌ కిట్స్‌ కాలేజీ శిక్షణ, ప్లేస్‌మెంట్స్‌ డీన్‌ ప్రొఫెసర్‌ పురేందర్‌ తెలిపారు.
కోర్‌ గ్రూప్‌లకూ....ఐటీ సంస్థలతో పాటు కోర్‌ గ్రూప్‌లకు.. ముఖ్యంగా సివిల్‌, మెకానికల్‌, ఆటోమొబైల్‌ విభాగాలకు కూడా ఈసారి మంచి అవకాశాలున్నాయని పలువురు నిపుణులు చెబుతున్నారు. గృహనిర్మాణం, మౌలికసదుపాయాల కల్పన, తయారీ రంగాలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత వల్ల ఈ రంగాల్లో అవకాశాలు విస్తృతమవనున్నాయని పేర్కొంటున్నారు.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning