ఉద్యోగాలు 50,000

* ఇంజినీరింగ్‌ పరిశోధన విభాగంలో అవకాశాలు
* ఉత్పత్తుల రూపకల్పన, అభివృద్ధిదే భవిత
* 2020 నాటికి 4 వేల కోట్ల డాలర్లకు ఎగుమతులు
* ప్రత్యేక నైపుణ్యాలే మన సత్తా

ఈనాడు - హైదరాబాద్‌:వాహన, ఏరోస్పేస్‌, సెమీ కండక్టర్‌ తదితర రంగాలకు ఇంజినీరింగ్‌ పరిశోధన, అభివృద్ధి (ఈఆర్‌ & డీ) సేవలందించడం, ఉత్పత్తుల రూపకల్పన (డిజైన్‌), అభివృద్దికి భారత్‌ కేంద్రంగా మారుతోంది. అత్యాధునిక సొల్యూషన్లు అందించడానికి, ఉత్పత్తుల అభివృద్ధికి దేశీయ కంపెనీలు విదేశీ భాగస్వాములతో చేతులు కలుపుతున్నాయి. నమూనా (ప్రోటోటైప్‌) ఉత్పత్తి అభివృద్ధి, టెస్టింగ్‌కు పరిశోధన, అభివృద్ధిలో పరస్పర సహకారం అవసరమని సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత ఏడాది సాఫ్ట్‌వేర్‌ రంగంలోని కంపెనీలు 2 లక్షల మందికి కొత్తగా ఉద్యోగాలు ఇచ్చే వీలుండగా.. ఇందులో ఇంజినీరింగ్‌ పరిశోధన, అభివృద్ధి విభాగంలోని కంపెనీల వాటా 40,000 నుంచి 50,000 వరకూ ఉండనుందని నాస్‌కామ్‌ డిప్యూటీ డైరెక్టర్‌ అవినాశ్‌ కేఆర్‌ తెలిపారు. హైదరాబాద్‌లో నాస్‌కామ్‌ ఇంజినీరింగ్‌ పరిశోధన, అభివృద్ధి సదస్సును నిర్వహించిన సందర్భంగా ఆయన ఇక్కడకు వచ్చారు. ఈ విభాగం ఎగుమతుల ద్వారా ప్రస్తుతం 1,700 కోట్ల డాలర్ల ఆదాయం లభిస్తుంటే.. 2020 నాటికి ఇది 4,000-4,500 కోట్ల డాలర్లకు చేరగలదని, అప్పటికి 10 లక్షల ఉద్యోగాలను సృష్టింగలదని నాస్‌కామ్‌ అంచనా వేస్తోంది. నైపుణ్యం, విశిష్ట డొమైన్ల (డీప్‌ డొమైన్‌)లో సామర్థ్యాలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కొత్త కంపెనీలతో ఈ రంగంలోకి అడుగుపెట్టడం వంటి సానుకూల పరిణామాలు ఇంజినీరింగ్‌ పరిశోధన, అభివృద్ధి విభాగం వృద్ధికి దోహదం చేయనున్నాయి. వాహన, కన్సూమర్‌ ఎలక్ట్రానిక్స్‌, ఏరోస్పేస్‌, సెమీ కండక్టర్‌ పరిశ్రమలకు ప్రస్తుతం కంపెనీలు ప్రధానంగా ఉత్పత్తుల డిజైన్‌, అభివృద్ధి చేస్తున్నాయని.. భవిష్యత్తులో ఇంధనం, ఆరోగ్య సంరక్షణ, చమురు, గ్యాస్‌ రంగాలపై దృష్టి పెట్టగలవని అవినాశ్‌ తెలిపారు. దేశంలో దాదాపు 750 కంపెనీలు ఇంజినీరింగ్‌, పరిశోధన, అభివృద్ధి విభాగంలో పని చేస్తున్నాయి. హైదరాబాద్‌కు చెందిన సైయెంట్‌ (పాత ఇన్ఫోటెక్‌ ఎంటర్‌ప్రైజెస్‌) వీటిలో ప్రధాన కంపెనీ. ఈ కంపెనీ ఏరోస్పేస్‌, ఎనర్జీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, రైలు రవాణా తదితర రంగాలలోని కంపెనీలకు ఇంజినీరింగ్‌ సేవలు అందిస్తోంది. కొత్త ఉత్పత్తులు సృష్టించగల సామర్థ్యాలు మనకు ఉన్నాయని సదస్సులో కీలకోపన్యాసం చేసిన సైయెంట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ కృష్ణ బోదనపు తెలిపారు.
ఏరోస్పేస్‌ కేంద్రంగా హైదరాబాద్‌..
సాఫ్ట్‌వేర్‌ సేవలకు కేంద్రంగా ఉన్న హైదరాబాద్‌ గత 5-10 సంవత్సరాల నుంచి ఏరోస్పేస్‌ పరిశ్రమకు కేంద్రంగా మారుతోందని టాటా హెచ్‌ఏఎల్‌ టెక్నాలజీస్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) రాజరాజన్‌ షణ్ముగం తెలిపారు. ఇప్పటికే ఏరోస్పేస్‌ పరిశ్రమకు కేంద్రంగా ఉన్న బెంగళూరు నుంచి కంపెనీలు హైదరాబాద్‌ వైపు దృష్టి పెడుతున్నాయని వివరించారు. హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌, టాటా టెక్నాలజీస్‌ కలిసి టాటా హెచ్‌ఏఎల్‌ టెక్నాలజీస్‌ను ఏర్పాటు చేశాయి. బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న ఈ కంపెనీ ఏరోస్పేస్‌ రంగంలోని ప్రధాన ఓఈఎం (ఒరిజినల్‌ ఎక్విప్‌మెంట్‌ మ్యానుఫ్యాక్చరర్స్‌)లకు ఇంజినీరింగ్‌, డిజైన్‌, మ్యానుఫ్యాక్చరింగ్‌ సొల్యూషన్లను అందిస్తోంది. రక్షణ రంగంలోకి విదేశీ పెట్టుబడులను అనుమతించడం.. రక్షణ రంగానికి భారీ కేటాయింపులు, పౌర విమానయాన రంగ వృద్ధి వల్ల దేశీయంగా పరిస్థితులు ఆశాజనకంగా కనిపిస్తున్నా.. అంతర్జాతీయంగా ఏరోస్పేస్‌ రంగం వేగం తగ్గింది. ప్రపంచంలో ప్రధాన విమాన తయారీ కంపెనీలైన బోయింగ్‌, ఎయిర్‌బస్‌లు కొత్త ఎయిర్‌క్రాఫ్ట్‌ కార్యక్రమాలను చేపట్టకపోవడం ఇందుకు కారణం.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning