ఫోన్‌ కొట్టు.. జాబు పట్టు

* కంపెనీలు, ఉద్యోగార్ధుల కోసం 'జాబ్స్‌ డైలాగ్‌'
ఈనాడు, హైదరాబాద్‌: లఘు, చిన్న మధ్య స్థాయి పరిశ్రమల్లో ఉద్యోగాల భర్తీకి దేశంలోనే తొలి మొబైల్‌ ఆధారిత నియామక సొల్యూషన్‌ 'జాబ్స్‌ డైలాగ్‌'ను టీఎంఐ గ్రూప్‌ అనుబంధ సంస్థ టీఎంఐ ఈ2ఈ అకాడమీ అందుబాటులోకి తీసుకువస్తోంది. కంపెనీలు తక్కువ ఖర్చుతో ఉద్యోగులను నియమించుకోవడానికి, ఉద్యోగార్ధులు తమ దగ్గరి ప్రాంతాల్లో ఉద్యోగాన్ని పొందడానికి ఇది దోహదం చేస్తుంది. ఐటీఐ, డిగ్రీ, డిప్లమో, పీజీ చదువుకుని, 0-7 సంవత్సరాల అనుభవం ఉన్న వారు చిన్న, మధ్య స్థాయి పరిశ్రమల్లో ఉద్యోగాల కోసం 040-71012014కు మిస్‌డ్‌ కాల్‌ చేస్తే సరిపోతుందని తర్వాత కాల్‌ సెంటర్‌ వాళ్లు ఫోన్‌ చేసి వివరాలు అడిగి తెలుసుకుంటారని టీఎంఐ గ్రూప్‌ ఛైర్మన్‌, ఎండీ టి.మురళీధరన్‌ తెలిపారు. ఐడియా సెల్యులార్‌ చందాదారులైతే టోల్‌ఫ్రీ నెంబర్‌ 5234550 ఫోన్‌ చేయాలని లేదా సంక్షిప్త సందేశాన్ని (ఎస్‌ఎంఎస్‌) పంపాలన్నారు. విద్యార్హతలు, అనుభవం, ఉంటున్న ప్రదేశం తదితర వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. ఐడియా సెల్యులార్‌తో కుదుర్చుకున్న వినూత్న ఒప్పందం కారణంగా చిన్న, మధ్య స్థాయి పరిశ్రమల పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగార్ధులను గుర్తించడం సాధ్యమవుతుందని మురళీధరన్‌ వివరించారు. www.jobsdialog.com ద్వారా కూడా పేరు, ఇతర వివరాలను సమర్పించవచ్చు. నియామక ప్రక్రియకు ఉద్యోగార్థుల నుంచి ఎటువంటి రుసుము వసూలు చేయమని.. ఉచిత సేవలుంటాయని కంపెనీ వెల్లడించింది. ఉద్యోగులను నియమించుకోవాలనుకునే కంపెనీలు రిజిస్ట్రేషన్‌ కోసం 1800-108-3344 టోల్‌ ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌ చేయాలి. వెబ్‌సైట్‌ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు. కంపెనీల నుంచి సభ్యత్వ, నియామక రుసుములను వసూలు చేస్తారు. కంపెనీలు ఎంచుకునే ప్యాకేజీలను బట్టి రుసుములు ఉంటాయి. ఉద్యోగార్ధుల దరఖాస్తులను పరిశీలించి ఎంపిక చేస్తారు. ఈ సేవలు ముందుగా హైదరాబాద్‌లో తర్వాత ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో అందుబాటులోకి వస్తాయని జాబ్స్‌ డైలాగ్‌ బిజినెస్‌ అధిపతి శ్రీవిద్యా విశ్వనాథన్‌ తెలిపారు. తర్వాత దశల వారిగా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, పశ్చిమ బెంగాల్‌లలోని వివిధ నగరాలకు విస్తరిస్తారు. ఈ నెల 26న కంపెనీల రిజిస్ట్రేషన్‌ కోసం జాబ్స్‌ డైలాగ్‌ను కేంద్ర చిన్న, మధ్య స్థాయి పరిశ్రమల మంత్రి కల్‌రాజ్‌ మిశ్రా ప్రారంభిస్తారు.
20 లక్షల చిన్న పరిశ్రమలు
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో 20 లక్షలకు పైగా లఘు, చిన్న, మధ్య స్థాయి పరిశ్రమలు ఉన్నాయని.. అదే విధంగా 15 లక్షల మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని టీఎంఐ గ్రూప్‌ డైరెక్టర్‌ బి.రామకృష్ణన్‌ తెలిపారు. దేశంలో హైదరాబాద్‌, పుణే, నేషనల్‌ కేపిటల్‌ రీజిన్‌ (ఎన్‌సీఆర్‌) తదితర ప్రాంతాల్లో చిన్న, మధ్య స్థాయి పరిశ్రమల క్లస్టర్లు ఉన్నాయన్నారు. నియామక కన్సల్టెన్సీ కంపెనీగా 1991లో ప్రారంభమైన టీఎంఐ ప్రస్తుతం మేనేనేజిమెంట్‌ స్థాయి ఉద్యోగాల నియామకం, హెచ్‌ఆర్‌ కన్సెల్టింగ్‌, నియామక ప్రకటనలు, బ్రాండింగ్‌ వంటి వివిధ సేవలను అందిస్తోంది. టాటా మోటార్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ తదితరాలు టీఎంఐకి ఖాతాదారులుగా ఉన్నాయి.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning