ఇంజినీరింగ్‌లో... తొలి అడుగులు!

కొద్దినెలలుగా ఉన్న అనిశ్చితి తొలగి, రెండు రాష్ట్రాల్లో ఇంజినీరింగ్‌ ప్రవేశాల ప్రక్రియ మొదలయింది. సీట్ల కేటాయింపు... ఆపై సెప్టెంబర్‌ నెల నుంచి తరగతులు ప్రారంభం! విద్యార్థులకు ఈ నాలుగు సంవత్సరాల కాలం ఎంతో ముఖ్యమైనది. భవితను చక్కగా మలుచుకునే ప్రణాళిక వేసుకునే తరుణమిది!
ఇంటర్మీడియట్‌ ముగిసిన దాదాపు నాలుగు నెలల దీర్ఘవిరామం తర్వాత ఇంజినీరింగ్‌ ఔత్సాహికులకు మళ్ళీ చదువుల రుతువు మొదలౌతోంది. ఇప్పటినుంచి మంచి భవిష్యత్తు దిశగా ప్రయాణం మొదలు పెట్టాలి. ఈ సందర్భంగా ఈ నాలుగేళ్ళూ దీర్ఘకాలిక, స్వల్పకాలిక ప్రణాళికల రచన, వాటి అమలు ప్రాముఖ్యం వహిస్తాయి.
ఇంజినీరింగ్‌ ఎలా చదవాలి, ఏయే అంశాలకు ఎంతమేర ప్రాధాన్యం ఇవ్వాలి అనే విషయాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఇలాంటి వృత్తివిద్యలు చదవాలనుకునే విద్యార్థులు మానసికంగా ఎక్కువ ఒత్తిడిని తట్టుకుని, తగినవిధంగా తమ శైలిని మలుచుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. క్రమం తప్పకుండా పునశ్చరణతో కూడా అభ్యాసానికి నాంది పలకాలి.
ఇంజినీరింగ్‌ చదువులో రాణింపునకు తొలిమెట్టు అయిన మొదటి సంవత్సరం, ఆ తర్వాతి సంవత్సరాలూ ఎటువంటి ఒడిదుడుకులూ లేకుండా ముగించగలగడం చాలా అవసరం. ఎందుకంటే డిగ్రీ స్థాయి అభ్యర్థికి తాను చదివిన సబ్జెక్టుల్లోని మౌలికాంశాల అవగాహన ఉంటుందనే అంచనాలుంటాయి. సబ్జెక్టులు, వాటి మౌలిక సూత్రాలపై పట్టున్నవారి ఉద్యోగావకాశాలు మెరుగ్గా ఉంటాయి. కాబట్టి ఇంజినీరింగ్‌లో సబ్జెక్టులపై పట్టు సాధించడానికి మొదటినుంచీ కృషి చెయ్యాలి. దీనితో పరీక్షల్లో కూడా మెరుగైన ఫలితాలు వస్తాయి.
ఏ సంవత్సరం ఎలా?
ఇంజినీరింగ్‌లో మొదటి సంవత్సరం వార్షిక పద్ధతిలో, రెండో సంవత్సరం నుంచీ ప్రతి సంవత్సరం సెమిస్టర్లుగా విద్యాబోధనా పద్ధతులుంటాయి. అంటే ఈ నాలుగేళ్ళ మొత్తం ఏడుసార్లు పరీక్షలను ఎదుర్కోవలసి ఉంటుంది.
* బీటెక్‌లో మొదటి సంవత్సరం అన్ని బ్రాంచీలవారికీ సాధారణమైనది. ఇంచుమించు అన్ని బ్రాంచీల విద్యార్థులు చదివే సబ్జెక్టులూ అందరికీ వర్తించే ఉమ్మడి సబ్జెక్టులు.
* రెండో సంవత్సరం నిజమైన ఇంజినీరింగ్‌ చదువుకు సోపానంగా భావించవచ్చు. ఇక్కడి నుంచి సెమిస్టర్‌ వారీ చదువు కూడా మొదలౌతుంది. ప్రతి సెమిస్టర్‌లోనూ ఐదు నుంచి ఆరు సబ్జెక్టులూ, రెండు/ మూడు లేబొరేటరీ సబ్జెక్టులూ ఉంటాయి. ఈ సంవత్సరంలో విద్యార్థి మూలశాఖకు సంబంధించిన సబ్జెక్టులూ, పై సెమిస్టర్లలో చదువబోయే సబ్జెక్టులకు మూలాధారాలుగా ఉపయోగపడే సబ్జెక్టులూ ఉంటాయి.
ఈ రెండో సంవత్సరంలో సబ్జెక్టులను కేవలం పరీక్షల్లో పాస్‌ అయ్యే కోణంలో చదవకూడదు. కంఠతా పట్టడం/ భట్టీయం వంటివి చెయ్యకుండా బ్రాంచిలో మౌలికాంశాల పటిష్ఠమైన పునాది వేసుకునే కోణంలో నేర్చుకోవాలి. దీనివల్ల పరీక్షలలో పాస్‌ అవ్వడమే కాకుండా మంచి మార్కులూ సంపాదించుకోవచ్చు. రెండో సంవత్సరంలో సబ్జెక్టులను ఆకళించుకున్న విద్యార్థికి పై సెమిస్టర్లలోని సబ్జెక్టుల గురించి భయాందోళనలేమీ ఉండవు.
* మూడో సంవత్సరంలో మూలశాఖకు సంబంధించినవే కాకుండా ఇతర బ్రాంచీలకు చెందిన సబ్జెక్టులు కూడా కొన్ని ఉంటాయి. ఈ సంవత్సరంలో విద్యార్థికి చాలా సబ్జెక్టుల సారాంశం, వాటి మూల సూత్రాలపై ఒక మోస్తరు నుంచి సమగ్రమైన అవగాహన ఏర్పడే అవకాశముంటుంది. అంతే కాదు; నిజజీవితంలో వివిధ రంగాల్లో తన బ్రాంచి పాఠ్యాంశాల ప్రయోగం ఎలా జరుగుతోంది అన్నది కూడా తెలుస్తుంది. తన బ్రాంచీ సంబంధిత సబ్జెక్టులే కాకుండా ఆ బ్రాంచీకి ఉపయోగపడే ఇతర బ్రాంచీల సబ్జెక్టుల గురించి నేర్చుకోవడం పరిజ్ఞానం విస్తృతమవుతుంది. దీనివల్ల మంచి సంస్థల్లో ఆకర్షణీయమైన ఉద్యోగాలు దొరికే అవకాశం పెరుగుతుంది.
* నాలుగో సంవత్సరంలో పై మూడు సంవత్సరాలలో చదివిన సబ్జెక్టుల సూత్రాలపై ఆధారపడి, పరిశ్రమల్లో ఉపయోగపడే సబ్జెక్టులు నేర్చుకుంటారు. అంతేకాకుండా ప్రతి విద్యార్థీ తను సంపాదించిన పరిజ్ఞానం సహాయంతో ప్రాజెక్టు చెయ్యవలసి ఉంటుంది.
మంచి ప్రాజెక్టు చెయ్యడం ప్రతి విద్యార్థికీ సవాలు. విద్యార్థిలోని సబ్జెక్టుకు సంబంధించిన సూత్రాల అమలు, అంతర్లీన ప్రతిభకు ప్రాజెక్టు అద్దం పడుతుంది. కాబట్టి సబ్జెక్టు బాగా నేర్చుకుంటే మంచి ప్రాజెక్టు చెయ్యడం, తద్వారా తర్వాత మంచి ఉద్యోగం సంపాదించుకోవడం కొంత సులభమౌతుంది. వీటన్నిటికి తోడు- కళాశాల ద్వారా ఒకటి/ రెండు పరిశ్రమలకు వెళ్ళి అక్కడ తాను పుస్తకాల్లో చదువుకున్న విషయ పరిజ్ఞానం ఎలా వినియోగమవుతోందో తెలుసుకునే అవకాశం కల్పించుకోవాలి. విద్యార్థికి ఇదెంతో మేలు చేకూరుస్తుంది.
సబ్జెక్టులూ... ప్రయోగాలూ
బీటెక్‌ మొదటి సంవత్సరమే మిగిలిన మూడు సంవత్సరాలకన్నా సులువైనది. ఇక్కడ ఇంటర్మీడియట్‌లో చదివిన భౌతిక, రసాయనిక శాస్త్రాలు, గణితానికి సంబంధించిన రెండు సబ్జెక్టులు, గణితశాస్త్ర మౌలికాలపై ప్రధానంగా ఆధారపడిన 'సి' లాంగ్వేజి, ఆంగ్లం పాఠ్యాంశాలుగా ఉంటాయి. మెకానికల్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌ వారికైతే మెకానిక్స్‌ ఒక సబ్జెక్టుగా ఉంటుంది. ఇవే కాకుండా భౌతిక, రసాయనిక శాస్త్రాల ప్రయోగశాలలు, కంప్యూటర్‌కి సంబంధించిన రెండు ప్రయోగశాలలు, మెకానికల్‌ రంగానికి సంబంధించిన కొన్ని ప్రయోగాలు ఉంటాయి. ఇదే కాకుండా భాషా సామర్థ్యం, భావ ప్రకటన సామర్థ్యం పెంపొందించడం కోసం ఆంగ్లభాష ప్రయోగశాల కూడా ఉంటుంది.
మొదటి సంవత్సరంలో ఇంజినీరింగ్‌ డ్రాయింగ్‌ బహుశా కాస్తంత కష్టమనిపించే ఏకైక సబ్జెక్టు. అంటే ఐదు సబ్జెక్టులు కేవలం అభ్యాసంమీద ఆధారపడినవే. మొదటి సంవత్సరంలోని దాదాపు 1000 మార్కులకు 375 మార్కులు లేబొరేటరీలలో మంచి అభ్యాసం ద్వారా సంపాదించుకోగలిగినవే. ఇంతకుముందే చదివిన భౌతిక, రసాయనిక, గణిత శాస్త్రాలు, ఆంగ్లం కలిపి మొత్తం మార్కులు సులభంగా సాధించుకోగలిగినవే.
అంతేకాకుండా అంతర్గత మార్కుల ప్రభావం కూడా ఉంటుంది. ప్రతి సబ్జెక్టులోనూ ఇవి 25 మార్కులుంటాయి. అంటే లేబొరేటరీ సబ్జెక్టులుగా కాకుండా 150 మార్కులు అంతర్గత మార్కులు. అంటే మొత్తం 525 మార్కుల వరకు కళాశాల అధీనంలోనే ఉంటాయి. స్థూలంగా మొదటి సంవత్సరంలోని మొత్తం మార్కుల్లో దాదాపు సగానికి పైగా సులభంగా సంపాదించుకోగలిగినవే.
ఒకరి సానుభూతి వల్లనో, పక్షపాత వైఖరితోనో లేక మరే ఇతర కారణాలపైనో ఈ మార్కులు తెచ్చుకోవటం అనుచితం. అలాకాకుండా ప్రతిభతో స్వయంగా సంపాదించుకుంటే ఆత్మవిశ్వాసంతో భవితకు పునాదులు వేసుకోవచ్చు. ఒకింత ఓపిక, లక్ష్యం, మంచి ప్రణాళిక, పట్టుదల, ప్రణాళికల ఆచరణ అవసరమౌతాయి. వీటన్నిటికీ కలిపి రోజువారీ మూడు నుంచి నాలుగు గంటల కన్నా ఎక్కువ సమయం అవసరమవ్వదు. విద్యార్థిదశలో ఈ సమయం లభించడం కానీ కేటాయించడం కానీ పెద్ద కష్టమేమీ కాదు.
మొదటి ఏడాది : ఎలా తయారవ్వాలి?
ఏదైనా రంగంలో రాణించాలంటే ముఖ్యంగా మన గురించి మనం తెలుసుకోవాలి. శక్తిసామర్థ్యాలు, వ్యవహారశైలి, ఒక విషయం గురించి మనం తెలుసుకునే, నేర్చుకునే విధానం... వీటిపై స్పష్టత ఉండాలి.
ఏ విధంగా చదివితే సులభంగా అర్థమౌతుందో (వినడం/ చూడటం/ చర్చించడం) గ్రహించడం అవసరం. ఏ మాధ్యమం ద్వారా సులభంగా అర్థమౌతుందో తెలుసుకోవాలి. ప్రతిభ ఎక్కువ ప్రదర్శించగలిగేది... ఒత్తిడి లేని పరిస్థితుల్లోనా, ఒత్తిడి ఉన్నపుడా గమనించుకోవాలి. ఏ వేళలో సమర్థంగా నేర్చుకుంటున్నదీ కూడా (ఉదయం/ సాయంత్రం/ రాత్రిళ్ళు మేల్కొని చదివితే) గ్రహించాలి.
విద్యార్థి దశలో దాదాపు 80% వినికిడి మాధ్యమం ద్వారానే పాఠ్యాంశ బోధన జరుగుతున్నదనీ, ఈ పద్ధతిలో 10% మంది విద్యార్థులు మాత్రమే సమర్థంగా నేర్చుకుంటున్నారనీ కొన్ని అధ్యయనాల ద్వారా రుజువయింది. ఏ పద్ధతిలో ఎక్కువ శ్రమ లేకుండా నేర్చుకోగలుగుతున్నామో తెలుసుకోవడం చాలా అవసరం.
ఈ లక్షణాలు పెంచుకోవాలి
* ఇంజినీరింగ్‌ పట్ల భావావేశంతో కూడిన ఉత్సాహం ఉండాలి.
* చదువు అంటే కళాశాల, హాజరులకు మాత్రమే పరిమితమైనది అనే ఆలోచనకు స్వస్తి పలకాలి.
* ఇతర వనరుల ద్వారా స్వయంగా నేర్చుకోవడానికి సిద్ధం కావాలి.
* విశ్లేషణాత్మక, తులనాత్మక ఆలోచనా సరళిని అలవరచుకోవాలి.
* ఈ నాలుగేళ్ళూ భవిష్యత్తుకు వేసుకునే పునాది అని గుర్తించి, కృషి చేయాలి.
* విద్యాభ్యాసాన్ని కూడా ఒక ఉద్యోగంగానే భావించి శ్రద్ధ, అంకితభావం కనబరచాలి.
ఈ ఏడూ పాటిస్తే ఎదురుండదు
1. బలాలు, బలహీనతలను గుర్తించడం: తన బలాలు, బలహీనతలు గుర్తించడం అన్నిటికన్నా ముందు చెయ్యవలసిన పని. ఇంత చిన్న వయసులోనే దీని అవసరం లేదనిపించవచ్చు. కానీ ఇంజినీరింగ్‌ స్థాయికి వచ్చిన విద్యార్థి నేర్చుకోవలసిన మొదటి పాఠం ఇదే. ముందు ముందు దీనివల్ల కలిగే ఉపయోగాలు అంచనాలకతీతం. బలం ఆత్మ విశ్వాసాన్ని పెంచితే, బలహీనత జాగరూకత నేర్పిస్తుంది. క్లిష్టమైన సందర్భాల్లో వ్యవహారశైలిని ఎలా మలచుకోవాలో నేర్పిస్తుంది.
2. క్రమశిక్షణ: ఇంజినీరింగ్‌ చదువు సాంకేతికపరమైనది అయినందువల్ల క్రమశిక్షణతో కూడుకున్న విద్యాబ్యాసం అవసరమౌతుంది. అంటే ఒక పద్ధతిని అలవరచుకుని దానికి కట్టుబడి ఉండాలి. క్రమశిక్షణతో కూడిన చదువు వ్యక్తిగత సామర్థ్యాలను పెంచడమే కాకుండా ఎన్నో మంచి అవకాశాలను అందిస్తుంది. దీనికితోడు ఉద్యోగంలో ఇతరులతో కలిసి పని చెయ్యడమెలాగో, ఇతరులను నొప్పించకుండా పని జరిపించుకోవడం ఎలాగో తెలుస్తుంది.
3. సమయ నిర్వహణ: అవసరమైనంత సమయాన్ని వివిధ సబ్జెక్టులకు కేటాయించడం అవసరం. లభ్యమయ్యే సమయాన్ని రెండు సమాన భాగాలుగా విభజించి, ఒకటి సబ్జెక్టుల కోసం, రెండోది ప్రాక్టికల్స్‌ కోసం కేటాయించాలి. ఇంటి వద్ద కూడా ఇదే నియమావళిని పాటించాలి. సమయాన్ని ఆయా సబ్జెక్టులు అర్థం చేసుకునే స్థాయి ఆధారంగా కాస్త కష్టమనిపించేవీ, సులభమనిపించేవిగా విభజించి అసమాన భాగాల్లో సమయాన్ని కేటాయించాలి. అన్ని సబ్జెక్టులూ ప్రతిరోజూ చదవాలని అనుకున్నా ఆచరణలో సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి ప్రతి సబ్జెక్టూ వారంలో కనీసం రెండుసార్లు చదివేవిధంగా కేటాయించడం మంచిది. దీనివల్ల అన్ని సబ్జెక్టులూ నేర్చుకోవడమేకాక సమతుల్యత పాటించడమనే ముఖ్యమైన లక్షణం అలవడుతుంది.
నిర్దిష్టమైన టైమ్‌-టేబుల్‌ తయారుచేసుకుని దానిని అమలు పరచాలి. అవసరమైతే అధ్యాపకుల, మిత్రుల సహాయం పొందవచ్చు. ప్రతిరోజూ కష్టమైన సబ్జెక్టూ, సులభమైన సబ్జెక్టూ చదివేలా చూసుకుంటే మేలు.
డ్రాయింగ్‌ సబ్జెక్టు మాత్రం కళాశాలలోనే పూర్తిచేసేవిధంగా చూసుకోవడం ఉత్తమం. డ్రాయింగ్‌కి అవసరమైన టేబుల్‌ కానీ, అధ్యాపకుల సహాయ సహకారాలు కానీ ఇంటివద్ద లభించవు. ఇందులో వచ్చే సందేహాలను అప్పటికప్పుడే నివృత్తి చేసుకోవలసిన అవసరం ఉంటుంది.
4. అసైన్మెంట్లు పూర్తి చెయ్యడం: అధ్యాపకులు తాము బోధించే పాఠాల్లో ప్రతి పాఠ్యాంశం ముగిసిన వెంటనే అసైన్‌మెంట్లు ఇస్తుంటారు. వీటికి సమాధానాలు రాసి నిర్ణీత సమయంలోగా అధ్యాపకులకు సమర్పించాలి. సమయం తక్కువగా అనిపించడం మూలనో, మరే ఇతర కారణాల వల్లనో అసైన్మెంట్లు పూర్తి చెయ్యకపోవచ్చు. దీనివల్ల నష్టం విద్యార్థికే! అందుకే తరగతిలో అసైన్‌మెంట్‌ ఇచ్చిన వెంటనే డైరీలోనో, క్యాలెండర్‌లోనే చివరి తేదీ గుర్తించాలి. అన్ని అసైన్‌మెంట్లూ తేదీలవారీగా పూర్తి చెయ్యాలి. ఇతరుల నుంచి కాపీ కొట్టడం, పుస్తకాలలో నుంచి తిరగరాయటం, అసలు రాయకపోవడం వంటివి చేయకూడదు. వీలైనంతవరకు సొంతంగా సమాధానాలు రాస్తే సబ్జెక్టుపై పట్టు సాధించడమే కాకుండా ప్రెజెంటేషన్‌ మెలకువలు అభ్యసించినట్లవుతుంది.
5. నోట్సు తయారుచేసుకోవడం: సాధారణంగా అధ్యాపకులు చాలా పుస్తకాల నుంచి ఎన్నో ముఖ్యమైన పాయింట్ల గురించి చర్చిస్తారు; స్థూలంగా విపులీకరిస్తారు. ఇంజినీరింగ్‌లో సమయాభావం వల్ల నోట్సు ఇవ్వడం కుదరదు. కాబట్టి విద్యార్థులే తరగతి గదిలో నోట్సు తయారు చేసుకోవాలి. నోట్సు- సబ్జెక్టును ఎంత అర్థం చేసుకున్నాం అనే అంశానికి అద్దం పడుతుంది. చిన్న పాయింట్లుగానో, అర్థవంతమైన చిత్రాల రూపంలోనో రాసుకుని, ఆపై పాఠ్యపుస్తకాలలోనుంచి అదనపు విషయసేకరణ చెయ్యాలి.నోట్సు క్రమ పద్ధతిలో రాసుకోవడం అలవరచుకోవాలి.
6. అధ్యాపకులతో చర్చించడం: అధ్యాపకులతో సబ్జెక్టుల గురించి చర్చించడం, అనుమానాలు తీర్చుకోవడం విద్యార్థులకెంతో మేలు చేస్తుంది. దీనివల్ల సబ్జెక్టు బాగా అర్థమవ్వడమే కాకుండా ఇద్దరి మధ్యా సత్సంబంధాలు ఏర్పడే అవకాశాలుంటాయి.
7. ప్రశ్నలు అడగడం: చాలామంది విద్యార్థులు జంకేది ప్రశ్నలు అడిగే విషయంలోనే. ఎవరైనా నవ్వుతారేమోననో, బిడియంతోనో సందేహాలు అడగరు. కానీ ఒక సబ్జెక్టుపై మంచి పట్టు సాధించాలంటే అనుమాన నివృత్తి అత్యావశ్యకం. నిస్సంకోచంగా అనుమాన నివృత్తి చేసుకుంటే ఎన్నో లాభాలు. సబ్జెక్టు బాగా అర్థమౌతుంది. ఇతరులకు ఎవరికైనా అదే సందేహం ఉండి వారు అడగలేకపోతుంటే వారికి సహాయం చెయ్యడమేకాకుండా, వారికి ధైర్యం కలగజేసినట్లవుతుంది. అధ్యాపకులకు కూడా తరగతి చెప్పాలంటే ఉత్సాహం కలుగుతుంది.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning