శిక్షణకాలంలోనే సాధించాలి

విద్యార్థి.. లేదా ఉద్యోగం కోసం అన్వేషిస్తున్న దశలో కీలకమైనది ఇంటర్న్‌షిప్‌ ఆశించిన ఉద్యోగం సాధించేందుకు ముందు ఎక్కువ మంది మంచి శిక్షణ కోసం ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే ప్రస్తుతం ఏ ఉద్యోగానికి ప్రయత్నించినా.. ఎంతో కొంత నైపుణ్యం.. ప్రతిభ.. అనుభవం తప్పనిసరి. ఇప్పటికే ఉద్యోగాల్లో కుదురుకున్న వారికి ఇలాంటివి సాధారణ విషయాలే. కానీ కొత్తవారికి మాత్రం చాలా పెద్ద సవాల్‌. ఈ సవాల్‌ను అధిగమించాలంటే ఇంటర్ష్నిప్‌ ఉపయోగపడుతుంది. అందువల్ల ఇంటర్ష్నిప్‌ కూడా ఉద్యోగ సాధనలో కీలక పర్వమే. ఇంటర్గ్నా చేరిన తర్వాత ఆ అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకుందాం.
ఇంటర్న్‌షిప్‌ అనేది పూర్తిస్థాయి ఉద్యోగం కాదు. ఈ దశలో ఉన్నపుడు ఈ విషయాన్ని అన్ని వేళలా గుర్తుపెట్టుకోవాలి. మంచి జీతం.. నచ్చిన వేళల్లో పని చేసుకొనే వెసులుబాటు.. సెలవులు వంటివి శిక్షణకాల ఉద్యోగ సమయంలో కుదరదు. ఎందుకంటే ఇక్కడ మీకు ప్రధానంగా అవసరమైనవి డబ్బు.. మంచి జీవితం.. సెలవులు కాదు. ప్రతిభ, నైపుణ్యం, అనుభవం కావాలి. ఇందుకోసం ఇక్కడ కొంచెం ఎక్కువ కష్టపడేందుకు కూడా సిద్ధంగా ఉండాలి. తక్కువ జీతం ఇస్తున్నారనో.. ఇతర ఉద్యోగుల్లాగా చూడటం లేదనో బాధపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీ నైపుణ్యాలను ప్రదర్శించి మీ అవసరం సంస్థకు చాలా ఉందని నిరూపించాలి. దీంతో మీకు శిక్షణకాల సమయంలోనే విలువ పెరుగుతుంది. ఇంటర్న్‌షిప్‌ పూర్తయినతర్వాత ఆ సంస్థ మిమ్మల్ని పూర్తిస్థాయి ఉద్యోగిగా తీసుకొనే అవకాశం ఉంటుంది.
ఇంటర్న్‌షిప్‌లో చేరినపుడు సరిగ్గా ఏడాది తిరిగే సరికి పూర్తిస్థాయి ఉద్యోగాన్ని సాధించాలన్న తపన ఉండాలి. దీనికి తగినట్లు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి. శిక్షణలో నైపుణ్యాలను పెంచుకొంటూనే 'తర్వాత ఏంటి..' అనే విషయంపై కసరత్తు చేయాలి. ఇలా చేయడం వల్ల శిక్షణ కాలం పూర్తయిన వెంటనే ఉద్యోగంలో ఎలా చేరవచ్చన్న అంశాలపై స్పష్టత వస్తుంది.
ఇంటర్న్ గా ఒక సంస్థలో చేరే ముందు కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఇప్పటి వరకు సదరు సంస్థ మీ సీనియర్లు ఎవరికైనా శిక్షణ ఇచ్చిందా?.. అక్కడ శిక్షణ పొందిన వారు ప్రస్తుతం ఎక్కడ ఏం చేస్తున్నారు.. వంటి విషయాలను ఆరా తీయాలి. అప్పుడు ఆ సంస్థలో పని చేయడం వల్ల ఏ మేరకు ప్రయోజనం ఉంటుందో ఒక అంచనాకు రావొచ్చు. అక్కడ పని చేసిన వారి వివరాలు తెలిస్తే.. వారి నుంచి అక్కడి పని తీరు, లభించే ప్రోత్సాహం, కార్యాలయ వాతావరణం వంటి అంశాలను తెలుసుకోవచ్చు. ఇంటర్న్‌గా చేరే ముందు సంస్థ ప్రతినిధులు నిర్వహించే ముఖాముఖిలో శిక్షణ కాలం పూర్తయిన తర్వాత ఆ సంస్థలో ఉద్యోగ అవకాశాల గురించి అడిగి తెలుసుకోవాలి.
క్రమశిక్షణ ఎక్కడైనా ముఖ్యమే. ఇంటర్న్‌షిప్‌లో దీనికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. క్రమశిక్షణతో మెలిగితే ఎవరూ పట్టించుకోకపోవచ్చు. కాని.. క్రమశిక్షణ తప్పితే దాన్ని తీవ్రంగా పరిగణిస్తారు. వస్త్రధారణ, వ్యవహారశైలి కార్యాలయ సంప్రదాయాలకు తగినట్లు ఉండాలి. దీనికి భిన్నంగా వ్యవహరించవద్దు. శిక్షణకాల ఉద్యోగంలో నిరాసక్తత ప్రదర్శించకూడదు. ప్రతి విషయాన్ని సానుకూలంగా తీసుకొని ముందుకు వెళ్లాలి. వీలైనంత వరకు ఎక్కువ బాధ్యతలను తీసుకొనేందుకు ముందుకురావాలి. అయితే.. అవి భారంగా పరిణమించకుండా జాగ్రత్తపడాలి. ఇక్కడ పెద్దపెద్ద పనులను అప్పగించరు. పెద్ద పనులు సాధించాలంటే అప్పగించిన చిన్న పనులను చక్కగా చేసి చూపించాలి.
ఇతర అభ్యర్థులతో పోల్చితే ఇంటర్న్‌షిప్‌ చేసిన అభ్యర్థికి ఉద్యోగ అవకాశాలు కాస్త మెరుగ్గా ఉంటాయి. శిక్షణకాల సమయంలో ఇతర ఉద్యోగులతో సత్సంబంధాలు కలిగి ఉండటంతో పాటు వృత్తిగత నైపుణ్యాలను పెంచుకొంటే మరింత త్వరగా కొలువు వచ్చే వీలుంటుంది. శిక్షణకాలంలో ఒక్కసారి మీ పనితీరు, నైపుణ్యాలు ఇతర ఉద్యోగులకు నచ్చితే చాలు.. వారు మీకు మంచి అవకాశాలను చూపిస్తారు. ఇప్పటికే మంచి అనుభవం ఉంటుంది కనుక.. వారు ఉద్యోగం రావాలంటే ఇంకా ఏం చేయాలో చెబుతారు. వాటిని అందిపుచ్చుకొంటే సరి.
అభివృద్ధి, నైపుణ్యాలు అనుభవం సాధించేకొద్దీ వృద్ధి చెందుతాయి. ఇది నిజమే. కాకుంటే చేసిన పనిలో లోపాలను గుర్తించి వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్తే మరింత నైపుణ్యం వస్తుంది. ఎక్కువ మంది ఈ విషయంలోనే కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. శిక్షణ కాలంలో ఎక్కువగా పొరపాట్లు చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల వాటికి భయపడకుండా వాటిని సరిదిద్దుకొంటూ ముందుకు వెళ్లాలి. చేసిన పొరపాటు మళ్లీ చేయకుండా ఉండాలి. దీంతో పనిలో పరిపక్వత వస్తుంది. పనిలో చేరిన తొలినాళ్లలో వృత్తికి సంబంధించి కొన్ని సందేహాలు.. సమస్యలు వస్తుంటాయి. వాటిని మీరంతట మీరే నివృత్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి. మీ వల్లకాకపోతేనే సీనియర్లను అడగాలి. అంతేకాని మీరు ప్రయత్నించకుండా ఉంటే మాత్రం సరికాదు. ప్రయత్నిస్తేనే అందులోని కష్టనష్టాలు తెలుస్తాయి. ఆ అనుభవం తర్వాత కాలంలో పనికి వస్తుంది.
శిక్షణ కాలంలో ఉన్నపుడు నైపుణ్యాలను పెంచుకొంటూ ఉద్యోగ అవకాశాల కోసం అన్వేషణను కొనసాగించాలి. శిక్షణ పూర్తయిన తర్వాత వెదుక్కోవచ్చు అనుకోవడం సరికాదు. శిక్షణకాలంలోనే ఉద్యోగాలనూ వెదుక్కోవడం వల్ల సమయం ఆదా అవుతుంది. అవకాశాలు పెరుగుతాయి. ఏ రంగంలో అయినా సరే పరిస్థితులు అన్నివేళలా ఒకేలా ఉండవు. అందువల్ల వీలైనంత త్వరగా ఉద్యోగాన్ని సాధించడమే లక్ష్యంగా ఇంటర్న్‌షిప్‌ను కొనసాగించాలి. శిక్షణకాల ఉద్యోగం గడువు పూర్తయ్యేలోపు ఉద్యోగం రాకుంటే ఇంటర్న్‌షిప్‌ను కొనసాగిస్తూనే కొలువును సాధించాలి.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning