ఇంజినీరింగ్‌ భవితకు ఆది నుంచీ పునాది!

సాంకేతిక విద్యార్థుల్లో చాలామంది మార్కుల కోసం చదువుతారు; హాజరు నిబంధనల ప్రకారం తరగతులకు వెళ్తారు. ఇంజినీరింగ్‌ విద్య పరిధి ఇంతకంటే విస్తృతమైనదనీ; మెరుగ్గా, సమగ్రంగా భవిష్యత్‌ ప్రణాళిక వేసుకోవాలనీ ఉద్బోధిస్తున్నారు... విజ్ఞాన్‌ విశ్వవిద్యాలయం చైర్మన్‌ డా. ఎల్‌. రత్తయ్య
తెలుగు రాష్ట్రాల్లో ఇంజినీరింగ్‌ ప్రవేశాల సమస్యలన్నీ ఒక కొలిక్కివచ్చి తరగతులు మొదలవుతుండటం సంతోషకరం. తల్లిదండ్రులు ఎన్నో ఆశలు, ఆశయాలు పెట్టుకొని పిల్లలను ఈ వృత్తివిద్యలో చేరుస్తున్నారు. ప్రభుత్వం కూడా వేల కోట్లు ఖర్చు చేస్తోంది. విద్యార్థులు ఆలోచించాల్సిందేమంటే- తాము తయారవ్వాల్సింది టెన్త్‌, ఇంటర్‌లలాగా మరొక పరీక్షకు కాదు, జీవితానికి! దానిలో విజయవంతం కావడానికి చేస్తున్న సన్నాహమిది. దానికి చదువొక్కటే, మార్కులొక్కటే లక్ష్యం కాకూడదు. అర్థవంతమైన చదువుతోపాటు భావ వ్యక్తీకరణ, టీమ్‌ స్పిరిట్‌, సృజనాత్మకత, జీవన నైపుణ్యాలు మొదలైనవి పెంచుకోవాలి.
విషయజ్ఞానం
ఇంటర్మీడియట్‌ వరకూ సాధారణంగా ఎక్కువమంది విద్యార్థులకు గైడ్లు/ నోట్స్‌, క్యూ.ఎక్స్‌.ఏ. పద్ధతిలో చదివి మార్కులు తెచ్చుకోవడం అలవాటు. మరీ ముఖ్యంగా ఎంసెట్‌ స్థాయిలో ఎక్కువకాలం ప్రశ్నలు- జవాబులతోనే గడిపివుంటారు. ఇంజినీరింగ్‌కు కూడా గైడ్లు, ఆల్‌-ఇన్‌-వన్స్‌ లభ్యమవుతున్నాయి. కొంతమేరకు పరీక్షలకు కూడా సరిపోతూ ఉండివుంటాయి. కానీ ఇదే కొనసాగిస్తే ఎంతోకొంత మార్కులు వస్తాయేగాని సబ్జెక్టు అవగాహన ఏ మాత్రం రాదు. సబ్జెక్టుపై ఇష్టం ఎప్పటికీ ఏర్పడదు!
ఎందుకంటే ఇంజినీరింగ్‌ సబ్జెక్టుల్లో ప్రతి కాన్సెప్ట్‌లో తర్కం ఉంటుంది. ఒక కాన్సెప్ట్‌ నుంచి మరొకదానికి వెళ్ళేటప్పుడు అనుసంధానత అవసరం. అది లేకపోతే చదవడానికి వీలవదు. అర్థవంతమైన పునాది ఏర్పడదు. ఉద్యోగాలు రావడానికీ, ఏదైనా సృజనాత్మకంగా ఆలోచించడానికీ అవకాశమే ఉండదు.
కాబట్టి విద్యార్థులు ఇప్పట్నించి ప్రతి సబ్జెక్టుకూ ఒకటి, రెండు ప్రామాణిక పుస్తకాలను ఎంచుకొని చదవాలి. మొదట్లో ఈ ప్రయత్నం చేసినప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. ఏది ఒకసారి, ఏది రెండు సార్లు, ఏది మూడు సార్లు చదవాలో తెలియదు. వారం పది రోజులు కొనసాగిస్తే అప్పుడు అలవాటవుతుంది. నిజజీవితంలో కూడా ఉపయోగపడుతుంది.
చదవడమంటే నిజంగా అభ్యాసం జరగాలి. అంటే ఒకటి లేదా రెండు సార్లు చదివి తర్వాత 'ఎంత అర్థమైంది, ఏం అర్థమైంది' అని ప్రశ్నించుకుని మళ్ళీ ఒకసారి చదువుకోవాలి. దానిలో ఉన్న ప్రాధాన్య అంశాలను నోట్సులాగా రాస్తే అది మెదడులో నిక్షిప్తమవుతుంది. అప్పటిగ్గానీ అది చదవడం పూర్తయినట్లు కాదు. వచ్చే నాలుగు సంవత్సరాలూ నిరంతరం ఇలా అభ్యసిస్తేనే ప్రయోజనం.
హాజరు: చాలామంది విద్యార్థులు 'నిబంధనల' ప్రకారం 75% హాజరీ ఉంటే చాలనుకుని అంతవరకే తరగతులకు వస్తారు. కొంతమంది మెడికల్‌ సర్టిఫికెట్‌తో 65%కే పరిమితమవుతారు. ఈ ధోరణి నష్టదాయకం. ఇంజినీరింగ్‌ సబ్జెక్టులన్నీ తార్కికంగా ఉంటాయి. ఒక అంశం అర్థమయితేనే మిగిలినవన్నీ అర్థమవుతాయి. అందుకే వారంలో ఒకరోజే కదా అనుకుని మానెయ్యడం తగదు. తర్వాత వారం ఏమీ అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగ ఇంటర్వ్యూలకు గానీ, గేట్‌ వంటి పోటీ పరీక్షలకు గానీ అవాంతరం ఏర్పడవచ్చు. 90% తక్కువ కాకుండా హాజరైతే అన్ని రకాలుగా మేలు జరుగుతుంది.
సాంఘిక నైపుణ్యాలు
ఎవరికి వారు చదువుకోడం, తమ విషయాలకు తప్ప వేటికీ ప్రాధాన్యం ఇవ్వకపోవటం ఈ మధ్య చాలామందిలో చూస్తున్నాం. ఉద్యోగంలోగానీ, వ్యాపారంలోగానీ రాణించాలంటే పదిమందితో సత్సంబంధాలు ఉంటేనే సాధ్యం. కాబట్టి ఒకవైపు విద్యేతర కార్యక్రమాల్లో పాల్గొనడం, పదిమందితో కలిసి పనిచెయ్యడం, పక్కవారి కష్టసుఖాల్లో పాలు పంచుకోవడం అలవరచుకోవాలి.
భావ వ్యక్తీకరణ: ఉద్యోగం రావడానికి గానీ, వచ్చిన తర్వాత రాణించడానికి కానీ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ (భావవ్యక్తీకరణ)కు ప్రాధాన్యం ఉంటుంది. వాటిని అభివృద్ధి చేసుకోవడం ప్రతి విద్యార్థీ ప్రధానమైన బాధ్యతగా తీసుకోవాలి. సిలబస్‌ ప్రకారం లేబరెటరీలో నేర్చుకోవడమే కాకుండా తరగతి గదిలో బ్రాంచి స్థాయిలో సెమినార్లలో పాల్గొనడం వంటివి చెయ్యాలి. చిన్న గ్రూపుతో మొదలుకొని పెద్ద గ్రూపుల వరకు వెళ్లేలా శిక్షణ పొందాలి.
వ్యక్తిత్వ నిర్మాణానికి అవసరమైన కార్యక్రమాలల్లో భాగస్వామి కావాలి. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన తెలుగు మీడియంవారైతే ఇంగ్లిష్‌ భాష ప్రాథమిక వ్యాకరణం, పదజాలం మీద పట్టు సాధించడం తప్పనిసరి. విశ్వవిద్యాలయ పరీక్షల్లో ఎన్ని మార్కులొచ్చినా ఈ నైపుణ్యాలు బాగుంటేనే భవిష్యత్‌ అవకాశాలు బాగుంటాయి.
ప్రాజెకు: చదవడం, గుర్తుపెట్టుకుని పరీక్ష రాయడమే కాకుండా ఇంజినీరింగ్‌ విద్యార్థి ఎన్ని వీలైతే అన్ని ప్రాజెక్టులు చేస్తే మేలు. అప్పుడే సబ్జెక్టు మీద నమ్మకం, స్పష్టత వస్తాయి. ప్రాజెక్ట్‌ చేసేటప్పుడు సృజనాత్మకత కూడా అలవాటవుతుంది. అంతేగానీ మార్కుల కోసం ఫైనల్‌ ఇయర్‌ ప్రాజెక్టు ఒక్కదానికే పరిమితం కాకూడదు. అదీ బయట ఎవరో చేసింది అనుకరిస్తే అసలేమీ ప్రయోజనం ఉండదని విద్యార్థులు గ్రహించాలి.
పోటీ పరీక్షలకు...
పైచదువులు చదవాలంటే గేట్‌, టోఫెల్‌, జి.ఆర్‌.ఇ. వంటి పరీక్షలకు ముందునుంచీ సిద్ధమవ్వాలి. ఈ మధ్యకాలంలో జాతీయస్థాయి సంస్థల్లో ఉద్యోగాలకు గేట్‌ స్కోరును పరిగణనలోకి తీసుకుంటున్నారు. సామాన్యంగా ఇంజినీరింగ్‌ థర్డ్‌/ఫోర్త్‌ ఇయర్‌ విద్యార్థులే సిద్ధమవుతుంటారు. అప్పుడు సమయం సరిపోక నష్టపోతున్నారు. అందుకే రెండో సంవత్సరం నుంచీ వారానికి 3, 4 గంటలపాటు ఈ పరీక్షలపై దృష్టి సారిస్తే- పోటీ పరీక్షలకూ, ఉద్యోగాలకూ కూడా ఉపయోగం.
కాబట్టి ఇంజినీరింగ్‌ విద్యార్థులు టెన్త్‌, ఇంటర్‌లాగా మార్కుల కోసం మాత్రమే కాకుండా సబ్జెక్టుపై అవగాహన ఏర్పరచుకోవటం; మిగిలిన అంశాలైన కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, ప్రాజెక్టులూ అన్నీ చేస్తేనే పరిపూర్ణమైన ఉద్యోగార్హత/ వ్యక్తిత్వం ఏర్పరరుచుకుని, రాణించే అవకాశం ఉంటుంది.
ఇంజినీరింగ్‌ కళాశాలల్లో 90% అధ్యాపకులు ఇప్పటికీ లెక్చర్‌ మెథడ్‌ని ఉపయోగిస్తున్నారు. తరగతిలో రోజుకు 7 గంటల పాటు వినడమంటే విసుగు, నిరాసక్తతకు దారితీస్తుంది. ప్రాజెక్టు మెథడ్‌, జి.డి. మెథడ్‌, సెమినార్‌ మెథడ్‌ మొదలైనవన్నీ ఉపయోగిస్తే ప్రతి తరగతీ ఆసక్తికరంగా మారుతుంది.
కౌన్సెలింగ్‌: ప్రతి అధ్యాపకుడూ 10-15 మందిని ఎంచుకుని వారికి చదువులో, ఇతరత్రా ఉన్న సమస్యలను పరిష్కరించి పరిశీలించి మంచి మూడ్‌/ సంతోషకరమైన వాతావరణంలో ఉంచితే పూర్తిస్థాయిలో నేర్చుకోవడం సాధ్యమవుతుంది. పెనాల్టీలు, పనిష్‌మెంట్లతో కాకుండా కౌన్సెలింగ్‌ ద్వారా ఏర్పడే సత్సంబంధాలతోనే చాలావరకు క్రమశిక్షణ రాహిత్యాన్ని తొలగించవచ్చు.
ల్యాబ్‌ నైపుణ్యాలు: విద్యార్థులకు నిజమైన నైపుణ్యం రావాలంటే, పరిశ్రమలకు అనుగుణంగా తీర్చిదిద్దాలంటే థియరీ ఎంత ముఖ్యమో ల్యాబ్‌ కూడా అంతే ప్రాముఖ్యముంటుంది. కానీ చాలా కళాశాలలు పరీక్ష మేరకే ప్రయోగాలు చేయించడం, అది కూడా ఎక్విప్‌మెంట్‌ కొరత వల్ల ప్రయోగం చేసే అవకాశం కొద్దిమందికే ఇవ్వడం విచారించాల్సిన విషయం. పరిశ్రమలు ఆశించిన స్థాయిలో నైపుణ్యాలు కలుగజేయాలంటే ప్రతి విద్యార్థీ ప్రతి ప్రయోగాన్నీ స్వయంగా చెయ్యగలిగిన సామర్థ్యంతో ఉండాలి. దీంతోపాటు ప్రతి అధ్యాయానికీ అనుగుణంగా మినీ ప్రాజెక్టులు రూపొందించాలి. విద్యార్థులు వాటిని చేస్తే ఆసక్తి, సృజనాత్మకత పెరుగుతాయి; బెరుకు తగ్గుతుంది.
విలువైన సమయం: ప్రత్యేకంగా ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం విద్యార్థుల రెస్పాన్సివ్‌ సిస్టమ్‌ కొంచెం భిన్నం. సినిమాల ప్రభావాలుంటాయి. ఈ దశలో తల్లిదండ్రులను వీరు మోటారు సైకిళ్ళు కోరటం క్షేమం కాదు. ఇస్తే ప్రమాదాలకు దారి తీయవచ్చు. ఇలాంటి వాహనాలు ఉన్నవారి చుట్టూ చదువుమీద పెద్దగా శ్రద్ధలేనివారు చేరే ప్రమాదం ఉంటుంది. కాలక్షేపానికి ప్రాధాన్యం పెరిగి, విలువైన సమయం వృథా అయ్యే అవకాశమే ఎక్కువ. అందుకే వాహనాల విషయంలో తల్లిదండ్రులు నిరుత్సాహపరిస్తే విద్యార్థులు అర్థం చేసుకోవాలి.
నేర్చుకునే వనరులు: ఇంతకుముందు లాగా పాఠ్యపుస్తకాలు, గైడ్లు మాత్రమే కాకుండా ఆధునికమైన ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రతిష్ఠాత్మక సంస్థలు రూపొందించిన వీడియోలు/ జర్నల్స్‌ ఇంటర్నెట్‌లో లభ్యమవుతున్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. వీటివల్ల ప్రతిభావంతులైన విద్యార్థులు ఇంకా ముందంజలోకి వెళ్లే అవకాశం ఉంది!

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning