ప్రిలిమ్స్‌ నేర్పే పాఠాలేమిటి?

సివిల్‌ సర్వీసెస్‌ కెరియర్‌పై అభ్యర్థులకు ఏమేరకు అభిరుచి ఉందో పరీక్షించే ప్రయత్నం ఇటీవలి ప్రిలిమినరీలో జరిగింది. ఈ రెండు పేపర్ల ప్రశ్నపత్రం తీరును విశ్లేషించి ఆశావహులు గ్రహించాల్సిన, నేర్చుకోవాల్సిన విషయాలను పరిశీలిద్దాం!
వయసు పరిమితుల్లో వెసులుబాటు, ప్రయత్నాల సంఖ్య పెంచటం మూలంగా ఈసారి సివిల్స్‌కు చాలా ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని అందరూ ఊహించారు. అలాగే యూపీఎస్‌సీకి రికార్డు సంఖ్యలో 9.44,926 దరఖాస్తులు అందాయి. హాల్‌ టికెట్‌ను 6,80,455 మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. వారిలో 4,51,602 మంది మాత్రమే పరీక్ష రాశారు. 59 నగరాల్లోని 2,137 కేందాల్లో వీరు ప్రిలిమినరీ పరీక్ష రాశారు.
హైదరాబాద్‌లో 38,650 మంది రిజిస్టర్‌ చేసుకున్నారు. కానీ కేవలం 18,161 మంది అభ్యర్థులు నగరంలోని 83 కేంద్రాల్లో పరీక్షకు హాజరయ్యారు. విశాఖపట్నంలో 11,710 మంది దరఖాస్తు చేసి, 4,405 మంది హాజరయ్యారు. కొత్త కేంద్రమైన విజయవాడలో 14,640 మంది దరఖాస్తు చేసుకుని 4,755 మంది పరీక్ష రాశారు. తిరుపతి కేంద్రంలో కూడా ఎక్కువ సంఖ్యలోనే అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు.
దరఖాస్తుదారుల సంఖ్యకూ, పరీక్షకు హాజరై రాసేవారి సంఖ్యకూ చాలా తేడా ఉండటం కొత్త అంశమేమీ కాదు. ఇది మొదటినుంచీ ఉన్నదే. అయితే సివిల్స్‌ పరీక్షపై ఏ స్థాయిలో అవగాహన పెరుగుతోందో దరఖాస్తుల సంఖ్యలో పెరుగుదల సూచిస్తోంది. వచ్చే సంవత్సరాల్లో పోటీ పెరగనున్నదని స్పష్టంగా సూచిస్తోంది.
మొదటి పేపర్‌
చాలామంది అభ్యర్థుల్లో పేపర్‌-1 రాసిన తర్వాత ఏమంత ఉత్సాహం కనపడలేదు. ఊహించినవేమీ రాలేదనేది దాదాపు అందరి మాట! కోచింగ్‌ సెంటర్లలో ఇచ్చినవేమీ ఎక్కడా రాలేని చాలామంది చెప్పుకొచ్చారు. గత సంవత్సరాల పేపర్లలోకంటే కఠినంగా వచ్చాయి ప్రశ్నలు.
ఈ నాలుగేళ్ళ ప్రశ్నల విభజనను విశ్లేషిస్తే... ఇండియన్‌ హిస్టరీ, ఇండియన్‌ పాలిటీ- గవర్నెన్స్‌, ఎకనమిక్‌ అండ్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌, జాగ్రఫీల ప్రాధాన్యం స్థిరంగా ఉంటోందని తెలుస్తుంది. ప్రశ్నల స్వభావాన్ని బట్టి ప్రిలిమ్స్‌ పేపర్‌-1... అభ్యర్థులకు చెందిన 'గవర్నమెంటల్‌ ఆప్టిట్యూడ్‌'ను పరీక్షించాలని కోరుకుంటోందని నిర్థారణకు రావొచ్చు. పాలన, భారత సంస్కృతి, భౌగోళిక వ్యవస్థలపై ఆధారపడిన ప్రశ్నలను రూపొందించటం ద్వారా ఈ 'ఆప్టిట్యూడ్‌'ను పరీక్షిస్తున్నారు.
రెండో పేపర్‌
పేపర్‌-2 కూడా గత సంవత్సరాలతో పోలిస్తే కఠినంగానే ఉంది. మొత్తం 80 ప్రశ్నలున్నాయి. ప్రతి ప్రశ్నకూ 2.5 మార్కులు. తప్పు సమాధానానికి 0.833 మార్కుల తగ్గింపు ఉంది.
ఈసారి డెసిషన్‌ మేకింగ్‌ అండ్‌ ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌లో ప్రశ్నలేమీ ఇవ్వలేదు. దీనికి తోడు ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ కాంప్రహెన్షన్‌ స్కిల్స్‌ నుంచి 6 ప్రశ్నలు (2 ప్యాసేజ్‌లు) ఇచ్చారు. యూపీఎస్‌సీ నిర్ణయం ప్రకారం మొత్తం నెట్‌ స్కోరుకు దీన్ని కలపరు. అంటే పేపర్‌-2లో 185 మార్కుల విలువున్న 74 ప్రశ్నలకే మూల్యాంకనం చేస్తారు. ఈ 74 ప్రశ్నల్లో కాంప్రహెన్షన్‌లో 26 (8 పాసేజ్‌లు), 30 రీజనింగ్‌, 18 మ్యాథ్స్‌ ప్రశ్నలున్నాయి.
ఈ ప్రశ్నలను ర్యాండమ్‌ పద్ధతిలో ఇచ్చారు. ప్రశ్నల్లో ఎక్కువ విశ్లేషణాత్మకమైనవి. తర్కం ఉపయోగించి నిర్థారణకు రావలసినవిధంగా రూపొందించినవి. వీటికి సమాధానం రాయటానికి ఆంగ్లభాషలో తగిన పట్టు కూడా అవసరమే. రీజనింగ్‌, ప్రాథమిక గణిత నైపుణ్యాలు ఉపయోగించేలా సంబంధిత ప్రశ్నలున్నాయి. మొత్తమ్మీద క్లిష్టత గత సంవత్సరాలకంటే అధిక స్థాయిలోనే ఉంది. దీంతో అభ్యర్థులు ఈ పేపర్‌ రాయటానికి కొంత సమస్యను ఎదుర్కొన్నారు.

ఆశావహులకు కొన్ని సూచనలు
వచ్చే సంవత్సరాల్లో ఇదే రకంగా ప్రశ్నపత్రాలుంటాయని భావించకూడదు. ప్రశ్నల తీరు ఎప్పటికప్పుడు మారుతుంది. మారుతున్న పరిస్థితులకు తగ్గట్టు తనను మల్చుకోగలిగినవారు మాత్రమే మంచి సివిల్‌ సర్వెంట్లవుతారంటూ పాలనా సంస్కరణల కమిషన్‌ (ఏఆర్‌సీ) చేసిన సిఫార్సులకు అనుగుణంగా ఈ విధానం అవలంబిస్తున్నారు.
* కోచింగ్‌ సెంటర్లకు హాజరై, పాయింట్లు నోట్‌ చేసుకుని, వాటిని పరీక్షల్లో రాసేస్తే ఐఏఎస్‌ అధికారి కావొచ్చని ఆశిస్తూ ఆ భ్రమల్లో ఉండిపోకూడదు. యూపీఎస్‌సీ రిసెర్చ్‌ వింగ్‌ క్రియాశీలకంగా ఉంటుంది. ఇది అభ్యర్థులు ఆశించే ప్రశ్నల గురించి తెలుసుకుని, వాటికి భిన్నమైన అంశాలను గుర్తిస్తుంది. అలా అని అవి ముఖ్యమైనవి కాకుండాపోవు. అత్యధిక ప్రధాన అంశాల జాబితాలో సాధారణంగా ఉండనివి అయివుంటాయి.
* భారత ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్లు చూడటం, ప్రభుత్వ ఆశయాలను ప్రతిబింబించే మ్యాగజీన్లు, మాన్యువల్స్‌ (ఇండియా ఇయర్‌బుక్‌, యోజన, కురుక్షేత్ర...) చదవటం వల్ల అనిశ్చితమైన జనరల్‌స్టడీస్‌లో కొన్ని అధ్యయన అంశాలను గుర్తించి సిద్ధమైనట్టవుతుంది.
* ఇతర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ల పరీక్షల తీరును పరిశీలిస్తుండాలి. అవి ఎగ్జామినర్ల దృక్పథాన్ని సూచిస్తుంటాయి. సాధారణంగా పోటీ పరీక్షల రూపకర్తలందరూ ఒకే రకమైన ఆలోచనాధోరణితో ఉంటారు. పైగా ఈ పరీక్షల విధానాలపై అవగాహన పెంచుకుంటే సన్నద్ధత సరైన రీతిలో సాగుతుందో లేదో చెక్‌ చేసుకోవచ్చు. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ల ప్రశ్నలు ప్రముఖ పోటీ పరీక్షల మ్యాగజీన్లలో లభ్యమవుతాయి.
* పరీక్ష సరిగా రాసివుండకపోతే ఈ ప్రయత్నం వృథా అయిందని అనుకోకూడదు. పోటీపరీక్షలో ఉత్తీర్ణత అనేది ఈత నేర్చుకోవటం లాంటిది. ఈత గురించి ఎన్ని పుస్తకాలు చదివినప్పటికీ ఈతకొలనులో దూకినపుడే ఈత నేర్చుకోవడం వాస్తవంగా మొదలవుతుంది. బ్యాలన్స్‌ తప్పటం, మునిగిపోతాననే భయం... ఇవన్నీ ఈత నేర్చుకోవడంలో భాగమే. కాబట్టి పరీక్షకు హాజరైన విషయం గురించి ప్రతికూలంగా ఆలోచించకూడదు.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning