పీఎస్‌యూల్లో ఉద్యోగాల‌కు 'గేట్' వే

- తాజాగా ఎనిమిది సంస్థలు ఆహ్వానం
- ఇదే బాట‌లో మ‌రిన్ని పీఎస్‌యూలు
- మ‌రో వారం ప‌ది రోజుల్లో భారీ సంఖ్య‌లో నోటిఫికేష‌న్లు

ప‌బ్లిక్ సెక్టార్ యూనిట్ల‌లో జాబ్ మేళా మొద‌లైంది. వీటిలో ఉద్యోగానికి గేట్ స్కోర్ ప్రామాణికం కావ‌డంతో అభ్య‌ర్థులు ఒక ప‌రీక్ష‌తో బ‌హుముఖ ప్ర‌యోజ‌నాలు పొందే అవకాశం దొరికింది. గేట్ స్కోర్‌తో ఐఐటీలు, ఇత‌ర ప్ర‌ముఖ సంస్థ‌ల్లో ఇంజినీరింగ్‌లో పీజీ, పీహెచ్‌డీ చేసుకునే అవ‌కాశంతోపాటు పీఎస్‌యూల్లో ఉన్న‌త శ్రేణి ఉద్యోగం సొంతం చేసుకునే సౌల‌భ్యం ఉండ‌డం అభ్య‌ర్థుల పాలిట డ‌బుల్ ద‌మాఖాగా చెప్పుకోవ‌చ్చు. తాజాగా ప‌లు పీఎస్‌యూలు గేట్ స్కోర్‌తో ఉద్యోగానికి ప్ర‌క‌ట‌న‌లు విడుద‌ల చేశాయి. కొద్ది రోజుల్లో మ‌రిన్ని ప్ర‌క‌ట‌న‌లు రావ‌డానికి అవ‌కాశాలున్నాయి. ప్ర‌స్తుతానికి ప్ర‌క‌ట‌న‌లు విడుద‌ల చేసిన పీఎస్‌యూలు, వాటిలో ఖాళీల వివ‌రాలు తెలుసుకుందామా...
ప్రభుత్వ రంగంలోని అగ్రశ్రేణి కంపెనీలు ఇంజినీరింగ్‌ విద్యార్థులకు అద్భుతమైన ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయి. దేశ ఆర్థికాభివృద్ధికి కీలకంగా భావించే నవరత్న, మహారత్న, మినీరత్న కంపెనీలు మంచి వేతనం, ఉద్యోగ భద్రత, ఎదుగుదలకు అవకాశం కల్పిస్తూ ఇంజినీరింగ్‌ విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. చాలావరకు పీఎస్‌యూ కంపెనీలు గేట్‌ స్కోరు ఆధారంగా అభ్యర్థులను నియమించుకోవడం విశేషం. అందువల్ల అభ్యర్థులు గేట్‌లో మంచి స్కోరు తెచ్చుకుంటే ప్రతిష్ఠాత్మక పీఎస్‌యూలో ఉద్యోగం సాధించినట్టే.
ఆప్టిట్యూడ్ తో ట‌ర్న్‌
ప్రభుత్వ రంగంలోని అగ్రశ్రేణి కంపెనీలు గేట్‌ పరీక్ష ఆధారంగా ఇంజినీరింగ్‌ విద్యార్థులను నియమించుకోవడం వెనుక చాలా నేపధ్యం ఉంది. నాలుగేళ్ల కిందటి వరకు ప్రధాన పీఎస్‌యూ కంపెనీలు వేటికవే ప్రత్యేక పరీక్షల ద్వారా నియామకాలు చేపట్టేవి. దీనిలో భాగంగా ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌లు, రాతపరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించేవారు. గేట్‌ పరీక్షలో 2010 నుంచి ఆప్టిట్యూడ్‌ విభాగాన్ని ప్రవేశపెట్టారు. తద్వారా గేట్‌ పరీక్ష.. పీఎస్‌యూల నియామక పరీక్షల మధ్య అంతరం తగ్గింది. దీంతో పీఎస్‌యూ కంపెనీలు స్వయంగా పరీక్షలను నిర్వహించడానికి బదులు గేట్‌ స్కోరును ప్రాథమిక వడపోతకు ప్రాతిపదికగా తీసుకోవడం ప్రారంభించాయి. బీటెక్‌/ బీఈలో ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీ, మెటలర్జీ, సివిల్‌, తదితర బ్రాంచీలు చదివిన అభ్యర్థులకు ఈ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.
ఐవోసీఎల్‌తో బోణీ...
మొదటిసారిగా ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఓసీఎల్‌) గేట్‌ 2011 స్కోరు ఆధారంగా ఇంజినీర్ల నియామకాలను చేపట్టింది. క్రమంగా ఇతర పీఎస్‌యూలు కూడా గేట్‌ స్కోరు వైపు మొగ్గు చూపాయి. గేట్‌ 2012 స్కోరు ఆధారంగా ఐఓసీఎల్‌తోపాటు మరో నాలుగు కంపెనీలు ఇంజినీర్ల నియామకాలు నిర్వహించాయి. అవి... బీహెచ్‌ఈఎల్‌, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్‌, హెచ్‌ఈసీఎల్‌. అనంతరం 2013లో గేట్‌ స్కోరును ఉపయోగించే కంపెనీల సంఖ్య బాగా పెరిగింది. తాజాగా 2014లోనూ అదే ట్రెండ్ కొన‌సాగుతోంది. సొంతగా నియామక పరీక్షలంటే... దరఖాస్తు ప్రక్రియ నుంచి, అడ్మిట్‌ కార్డుల జారీ, పరీక్షలు నిర్వహించడం, స్కోరు కార్డులు పంపించడం వరకు ఎన్నో దశలు ఉంటాయి. దీనికంటే గేట్‌ స్కోరును పరిగణనలోకి తీసుకోవడం ఉత్తమమని కంపెనీలు భావిస్తున్నాయి. పైగా ఈ విధానం ద్వారా ఎక్కువ మందిని ఆక‌ర్షించ‌డానికి, టేలెంట్ పూల్‌ను సులువుగా ప‌ట్టుకోవ‌డానికి అవ‌కాశాలున్నాయి.అందుకే 2013లో 14 పీఎస్‌యూ కంపెనీలు గేట్‌ 2013 ఆధారంగా ఇంజినీర్ల నియామకాలకు ప్రకటనలు విడుదల చేశాయి. అవి.. బీహెచ్‌ఈఎల్‌, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్‌, ఎంఈసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, కాన్‌కర్‌, మెకాన్‌, ఐఓసీఎల్‌, బీఈఎల్‌, నాల్కో, డీడీఏ, హెచ్‌ఈసీఎల్‌, గెయిల్‌. దేశవ్యాప్తంగా, స్వయంగా పరీక్షలు నిర్వహించడంలో వ్యయప్రయాసలను దృష్టిలో ఉంచుకొని, భ‌విష్య‌త్తులో మరిన్ని కంపెనీలు గేట్‌ బాట పట్టే అవకాశం ఉంది.
కోర్ స‌బ్జెక్టుల్లోనే విధులు
అభ్యర్థుల వైపు నుంచి చూస్తే... పైన తెలిపిన ప్రభుత్వ రంగ కంపెనీలన్నీ మంచి పని వాతావరణం కల్పిస్తున్నాయి. ముఖ్యంగా తాము చదువుకున్న కోర్‌ సబ్జెక్టుకు సంబంధించిన విధులను నిర్వర్తించే అవకాశం ఈ ఉద్యోగాల్లో లభిస్తుంది. ఎలాంటి ఒడిదుడుకులు లేని స్థిరత్వం గల ఉద్యోగాలు పీఎస్‌యూల్లో అందుబాటులో ఉన్నాయి. ప్రవేశ స్థాయిలో ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీ, ఇంజినీర్‌ ట్రెయినీ, గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌, గ్రాడ్యుయేట్‌ అప్రెంటీస్‌ ఇంజినీర్‌, ప్రొబేషనరీ ఆఫీసర్‌, తదితర పేర్లతో అభ్యర్థులను నియమించుకుంటున్నాయి. చాలా కంపెనీలు కనీస దరఖాస్తు ఫీజును కూడా వసూలు చేయడం లేదు. గేట్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఆధారంగా ఆయా సంస్థల వెబ్‌సైట్‌ల నుంచి నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. కొన్ని కంపెనీలు ప్రస్తుతం సూచనాత్మక నోటిఫికేషన్‌లను మాత్రమే విడుదల చేశాయి. ఆ కంపెనీల నియామకాల పూర్తి వివరాలు డిసెంబరు / జనవరిలో వెలువడవచ్చు.
ఆకర్షణీయ వేతనాలు..
వేతనాల విషయంలో పీఎస్‌యూలు కార్పొరేట్‌ కంపెనీలతో పోటీపడుతున్నాయి.నిజానికి ప్రవేశ స్థాయిలో అగ్రశ్రేణి ఐటీ, సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకంటే మెరుగైన వేతనాలను అందిస్తున్నాయి. సాఫ్ట్‌వేర్ కంపెనీల‌తో పోల్చితే పీసీఎయూల్లో ఉద్యోగ భ‌ద్ర‌త చాలా ఎక్కువ‌. వేగంగా ఎద‌గ‌డానికి కూడా అవ‌కాశాలు మెండుగా ఉన్నాయి. ప్రారంభ వేతనంగా ఏడాదికి సగటున రూ.9 ల‌క్ష‌ల‌కు పైగా (సీటీసీ) పీఎస్‌యూల్లో లభిస్తుంది.
చాలావరకు పీఎస్‌యూలు అభ్యర్థులకు కొంతకాలం శిక్షణ ఇస్తాయి. తర్వాత నిర్దిష్ఠ వేతన స్కేలుతో శాశ్వత ఉద్యోగులుగా పరిగణిస్తాయి. పీఎస్‌యూ నియామకాల్లో.... విద్యార్హతలు, వయసు విషయంలో వికలాంగులు, ఎస్సీ, ఎస్టీ కేటగిరీల అభ్యర్థులకు మినహాయింపులు ఉంటాయి.
పోటీ తీవ్ర‌మే...
పీఎస్‌యూ ఉద్యోగాలకు పోటీ కూడా తీవ్రంగా ఉంటుంది. గేట్‌లో చాలా అత్యుత్తమ స్కోరు సాధిస్తేనే మొదటి దశ స్క్రీనింగ్‌లో విజయం సాధించగలరు. పీఎస్‌యూలు గేట్‌ ద్వారా నియామకాలు చేపట్టడం ప్రారంభించాక గేట్‌కు కూడా గతంలో కంటే పోటీ అధికమైంది. మంచి ఐఐటీల్లో ఎం.టెక్‌. సీటు సాధించడానికి అవసరమైన కటాఫ్‌, ఇంకా అంతకంటే ఎక్కువ స్కోరు ఉంటేనే పీఎస్‌యూల వడపోతలో నెగ్గుకురాగలరు.
బ‌రిలో ప‌ది ల‌క్ష‌ల మంది అభ్య‌ర్థులు
గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో ఇంజినీరింగ్‌, టెక్నాలజీ సబ్జెక్టుల్లో విద్యార్థుల సమగ్ర అవగాహనను గేట్‌ ద్వారా పరీక్షిస్తారు. ఐఐటీలు, ఐఐఎస్‌సీ బెంగళూరు సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తాయి. ఇటీవలి కాలంలో గేట్‌కు పోటీ, ప్రాధాన్యం బాగా పెరిగాయి. బీటెక్‌ తర్వాత విద్యార్థులు ఎం.టెక్‌.లో చేరడానికి మొగ్గు చూపిస్తుండటం, పీఎస్‌యూ ఉద్యోగాలతోపాటు సీఎస్‌ఐఆర్‌, బార్క్‌లాంటి సంస్థలు పరిశోధన కోర్సుల్లో ప్రవేశాలకు గేట్‌ స్కోరును పరిగణనలోకి తీసుకోవడం వల్ల గేట్‌కు పోటీ తీవ్రమైంది. 2008లో గేట్‌కు 1.8 లక్షల మంది పోటీపడ్డారు. గేట్‌ 2012 ప‌రీక్ష‌కు 7.7 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. గేట్ 2015 ప‌రీక్ష‌లో పోటీప‌డే అభ్య‌ర్థుల సంఖ్య ప‌ది ల‌క్ష‌లు దాటుతుంద‌న‌డంలో సందేహం లేదు. గేట్‌ స్కోరు ద్వారా ఉద్యోగాలు, ఫెలోషిప్‌తో ఉన్నత చదువులు అందుబాటులోకి రావడం పోటీ బాగా పెరగడానికి ప్రధాన కారణం. అంతేగాక క్యాంపస్‌ ప్లేస్‌మెంట్ల కోసం తీసుకునే శిక్షణ గేట్‌కు కూడా ఉపయోగపడుతుంది.
మేథ్స్‌, ఆప్టిట్యూడ్‌ కీలకం...
గేట్‌లో స్కోరును బట్టే పీఎస్‌యూలలో ఉద్యోగ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. అందువల్ల ఈ పరీక్షపై అవగాహన పెంపొందించుకొని, సరైన ప్రణాళికతో ప్రిపేరవడం తప్పనిసరి. గేట్‌ పరీక్షలో మొత్తం 100 మార్కులకు 65 ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థి ఎంచుకున్న కోర్‌ ఇంజినీరింగ్‌ సబ్జెక్టు, ఇంజినీరింగ్‌ మేథ్స్‌, జనరల్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఇంజినీరింగ్‌ సబ్జెక్టుకు 70 శాతం వెయిటేజీ ఉంటుంది. ఆప్టిట్యూడ్‌, మేథ్స్‌ విభాగాలకు ఒక్కోదానికి 15 మార్కులు ఉంటాయి. నిజానికి మేథ్స్‌, ఆప్టిట్యూడ్‌ విభాగాల్లో సరిగా సమాధానాలు రాస్తే గేట్‌లో కనీస ఉత్తీర్ణత మార్కులు సాధించవచ్చు.
సబ్జెక్టులోని ప్రాథమిక భావనలపై అభ్యర్థికి గల పట్టు, సమస్యాత్మక సందర్భాల్లో వాటిని అనువర్తిస్తున్న తీరును గేట్‌లో పరీక్షిస్తారు. ఐఐటీ నోటిఫికేషన్‌ ప్రకారం... ప్రశ్నలను జ్ఞాపకశక్తి, కాంప్రహెన్షన్‌, అప్లికేషన్‌, ఎనాలిసిస్‌ అండ్‌ సింథసిస్‌ కేటగిరీలుగా వర్గీకరిస్తారు. జ్ఞాపకశక్తి ఆధారిత ప్రశ్నలు సాధారణంగా ఒక మార్కు ప్రశ్నల కేటగిరీలో ఉంటాయి.
ప్రాథమిక అంశాలపై మంచి అవగాహన, విస్తృత అభ్యాసం... ఈ రెండూ గేట్‌లో విజయానికి కీలకమైన అంశాలు. పాత ప్రశ్నపత్రాలను సాధించడం, వివిధ అంశాలకు ఇవ్వాల్సిన వెయిటేజీని విశ్లేషించుకోవడం ద్వారా అభ్యర్థులు ప్రిపరేషన్‌ ప్రణాళికను రూపొందించుకోవాలి.
పీఎస్‌యూల్లో విధివిధానాలు...
ఇంజినీరింగ్‌ విద్యార్థుల ఎంపిక ప్రక్రియ, శిక్షణ, తర్వాత పూర్తికాల ఉద్యోగిగా నియమించుకునే సందర్భాల్లో పీఎస్‌యూలు అనేక విధివిధానాలను పాటిస్తున్నాయి. గేట్‌ స్కోరుతోపాటు, ఇంజినీరింగ్‌లో నిర్దిష్ఠ శాతం మార్కులు ఉంటేనే పరిగణనలోకి తీసుకుంటున్నాయి. అనేక కంపెనీలకు కనీసం 65 శాతం మార్కులు తెచ్చుకోవడం తప్పనిసరి. కొన్ని కంపెనీలు సంబంధిత బ్రాంచితో ఏఎంఐఈ, బీఎస్సీ (ఇంజినీరింగ్‌) చదివినవారికి కూడా అవకాశం కల్పిస్తున్నాయి. కోర్‌ బ్రాంచిలకు అనుబంధంగా ఉండే ఇతర బ్రాంచిలు చదివిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకునే సౌలభ్యాన్ని కొన్ని కంపెనీలు కల్పిస్తున్నాయి. కానీ గేట్‌ స్కోరు మాత్రం అందరికీ తప్పనిసరి. గేట్‌లో కనీస ఉత్తీర్ణత మార్కులు అవసరం అని చెప్పినప్పటికీ, మంచి స్కోరు వస్తేనే గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ, ఇతర దశలకు ఎంపికయ్యే అవకాశం ఉంటుంది.
ఎంపికైన అభ్యర్థులను కంపెనీలు అప్రెంటీస్‌లు లేదా ట్రెయినీలుగా నియమించుకుంటాయి. ఈ కాలంలో స్టయిపెండ్‌ ఇస్తాయి. కొన్ని కంపెనీల్లో వసతి సౌకర్యం కూడా లభిస్తుంది. శిక్షణ కాలం కంపెనీని బట్టి మారుతుంటుంది.
పూర్తికాల ఉద్యోగులుగా ఎంపికైన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే అన్ని అలవెన్సులు, సౌకర్యాలు వర్తిస్తాయి. అభ్యర్థులు నిర్దిష్ఠ కాలం ఆయా కంపెనీల్లో తప్పనిసరిగా పనిచేయాలి. ఈమేరకు బాండ్‌ రాయాల్సి ఉంటుంది.
ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీఎల్‌)లో ఉద్యోగాల కోసం పోటీ ఎక్కువగా ఉంటుంది. క‌నీసం లక్షన్న‌ర‌ మంది అభ్యర్థులు ఈ సంస్థలో ఉద్యోగాల కోసం పోటీపడుతుంటారు. బీపీసీఎల్‌, పవర్‌గ్రిడ్‌, ఎన్టీపీసీ, తదితర అగ్రశ్రేణి కంపెనీలకు మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, తదితర విభాగాల అభ్యర్థుల నుంచి పోటీ ఎక్కువగా ఉంటుంది.
గ్రూప్‌ డిస్కషన్‌లు, ఇంటర్వ్యూలు...
గేట్‌ స్కోరు ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు కంపెనీలు గ్రూప్‌ డిస్కషన్‌లు, సైకోమెట్రిక్‌ టెస్ట్‌లు, ఇంటర్వ్యూలు, వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాయి. అభ్యర్థుల సంఖ్య, ఇతర పరిస్థితులను బట్టి కొన్ని కంపెనీలు గేట్‌ స్కోరుతోనే నేరుగా నియామకాలు చేపట్టవచ్చు. ఇంటర్వ్యూ స్థాయిలో ఇంజినీరింగ్‌ మార్కులు, కమ్యూనికేషన్‌ సామర్థ్యాలు కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది. అన్ని ప్రభుత్వ రంగ కంపెనీలు నియామకాల్లో ఫ్రెషర్లకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం విశేషం. ఖాళీల భర్తీలో రిజర్వేషన్లు అమలు చేస్తున్నాయి. అర్హతలు, వయసు, తదితర అంశాల్లో రిజర్వ్‌డ్‌ కేటగిరీల అభ్యర్థులకు మినహాయింపులు వర్తిస్తాయి.
ఇంజినీరింగ్‌ విద్యకు పేరుగాంచిన ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఇతర ప్రముఖ కాలేజీల క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లలో కూడా కొన్ని పీఎస్‌యూలు పాల్గొంటున్నాయి. ఇండియన్‌ ఆయిల్‌, గెయిల్‌, కోల్‌ ఇండియా లిమిటెడ్‌, ఎన్టీపీసీ, ఎన్‌హెచ్‌పీసీ, స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, తదితర అగ్రశ్రేణి పీఎస్‌యూలు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లలో పాల్గొంటున్నాయి. ఆఫ్‌ క్యాంపస్‌ పద్ధతిలో నియామకాలకు మాత్రం గేట్‌ స్కోరుకు పెద్దపీట వేస్తున్నాయి. ఉన్నత శ్రేణి పీఎస్‌యూ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించాలన్నా, కెరియర్‌లో ఎదగాలన్నా, టెక్నికల్‌ నాలెడ్జ్‌తోపాటు మేనేజ్‌మెంట్‌ సామర్థ్యాలు అవసరం.

గేట్ ఆన్‌లైన్‌ దరఖాస్తు సమర్పణ గడువు: 14 అక్టోబరు 2014 (23:59 Hrs.)
తాజాగా వెలువ‌డిన నోటిఫికేష‌న్లు...
భార‌త్ పెట్రోలియం కార్పొరేష‌న్ లిమిటెడ్‌
భార‌త్ పెట్రోలియం కార్పొరేష‌న్ లిమిటెడ్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్ధుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
పోస్టుల‌ వివ‌రాలు.......
మేనేజ్‌మెంట్ ట్రైనీస్
విభాగాలు: మెకానిక‌ల్, ఎల‌క్ట్రిక‌ల్‌, కెమిక‌ల్, సివిల్‌, ఇన్‌స్ట్రుమెంటేష‌న్‌
అర్హత‌లు: బీఈ / బీటెక్ ఉత్తీర్ణత‌
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: గేట్ - 2015 స్కోర్ ఆధారంగా ఇంట‌ర్వ్యూ ద్వారా
ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్ ప్రారంభ తేది: డిసెంబ‌ర్ 17
చివ‌రి తేది: 2015 జ‌న‌వ‌రి 30
చిరునామా:
Bharat Petroleum Corporation Limited,
Bharat Bhavan
II, 5th Floor
4 & 6 Currimbhoy Road,
Ballard Estate,
Mumbai.
ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌
హైద‌రాబాద్‌లోని ఇండియ‌న్ ఆయిల్‌ కార్పొరేష‌న్ లిమిటెడ్‌లో గ్రాడ్యుయేట్ ఇంజినీర్స్ / పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇన్ జియాల‌జీ అండ్ జియోఫిజిక్స్ ఉద్యోగాల కోసం అర్హులైన అభ్య‌ర్ధుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివ‌రాలు...
గ్రాడ్యుయేట్ ఇంజినీర్స్ / పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇన్ జియాల‌జీ అండ్ జియోఫిజిక్స్
విభాగాలు: కెమిక‌ల్, ఎల‌క్ట్రిక‌ల్, జియోఫిజిక్స్, మెకానిక‌ల్‌, సివిల్‌, ఎల‌క్ట్రానిక్స్ & క‌మ్యూనికేష‌న్స్, మెట‌ల‌ర్జీ, కంప్యూట‌ర్ సైన్స్ & ఐటీ, జియాల‌జీ, ఇన్‌స్ట్రుమెంటేష‌న్‌, మైనింగ్‌
అర్హత‌లు: గేట్ - 2015 స్కోర్
ద‌ర‌ఖాస్తు విధానం: గేట్ - 2015 రిజిస్ట్రేష‌న్ నెంబ‌ర్ వ‌చ్చిన త‌ర్వాత ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేయాలి.
ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ద్వారా
ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్ ప్రారంభ తేది: 2014 డిసెంబ‌ర్ 17
చివ‌రి తేది: 2015 ఫిబ్రవ‌రి 21
చిరునామా: Indian Oil Corporation Limited
Hyderabad.
సెంట్ర‌ల్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్‌
సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (సీఈఎల్) గ్రాడ్యుయేట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
గ్రాడ్యుయేట్ ఇంజినీర్
విభాగాలు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, మెటీరియల్స్ సైన్స్.
అర్హతలు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రికల్/ మెకానికల్ ఇంజినీరింగ్/ మెటీరియల్స్ సైన్సెస్‌లో 65 శాతం మార్కులతో బీఈ/ బీటెక్/ బీఎస్సీ ఉండాలి. గేట్- 2015కు దరఖాస్తు చేసుండాలి.
ఎంపిక: గేట్- 2015 స్కోర్ ఆధారంగా ఎంపికచేసి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
రిజిస్ట్రేషన్ ప్రారంభం: డిసెంబరు 18.
చివరితేది: జనవరి 15.
నేష‌న‌ల్ హైడ్రో ఎల‌క్ట్రిక్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్‌
ఫరీదాబాద్‌లోని నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ) ట్రెయినీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు....
ట్రెయినీ ఇంజినీర్
పోస్టుల సంఖ్య: 87
విభాగాలు: ఎలక్ట్రికల్
అర్హతలు: ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో 60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్/ బీఎస్సీ/ ఏఎంఐఈ ఉండాలి. గేట్- 2015కు దరఖాస్తు చేయాలి.
వయసు: 30 ఏళ్లకు మించకూడదు.
ఎంపిక: గేట్- 2015 స్కోర్ ఆధారంగా ఎంపికచేసి గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో పూర్తిచేసిన దరఖాస్తులను ప్రింట్ తీసి పోస్టు ద్వారా పంపాలి.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: జనవరి 15
చివరితేది: జనవరి 31
ప్రింట్ కాపీలను పంపడానికి చివరితేది: ఫిబ్రవరి 7
గేట్- 2015కు చివరితేది: సెప్టెంబరు 30
కోల్ ఇండియా లిమిటెడ్‌
కోల్ ఇండియా లిమిటెడ్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీస్ ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్ధుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
పోస్టుల‌ వివ‌రాలు.......
మేనేజ్‌మెంట్ ట్రైనీస్
విభాగాలు: మెకానిక‌ల్, ఎల‌క్ట్రిక‌ల్‌, జియాల‌జీ, మైనింగ్‌
అర్హత‌లు: బీఈ / బీటెక్ / ఏఎంఐఈ / బీఎస్సీ (ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణత‌
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: గేట్ - 2015 స్కోర్ ఆధారంగా ఇంట‌ర్వ్యూ ద్వారా
ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్ ప్రారంభ తేది: సెప్టెంబ‌ర్ 1
చివ‌రి తేది: అక్టోబ‌ర్ 1
చిరునామా:
COAL INDIA LIMITED
10 Netaji Subhas Road,
Kolkata.
ఓఎన్‌జీసీ
ఆయిల్ & నేచుర‌ల్ గ్యాస్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌లో 745 గ్రాడ్యుయేట్ ట్రైనీ ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్ధుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
పోస్టుల‌ వివ‌రాలు.......
గ్రాడ్యుయేట్ ట్రైనీస్
ఖాళీలు: 745
విభాగాలు: అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సిమెంటింగ్ - 31, సివిల్ - 10, డ్రిల్లింగ్ - 110, ఎల‌క్ట్రిక‌ల్ - 47,ఎల‌క్ట్రానిక్స్ - 18, ఇన్‌స్ట్రుమెంటేష‌న్ - 23, మెకానిక‌ల్ - 72, ప్రొడ‌క్షన్ - 217, రిజ‌ర్వాయ‌ర్ - 14), కెమిస్ట్ - 74, జియాల‌జిస్ట్ - 41, జియోఫిజిసిస్ట్ (స‌ర్ఫేస్ - 28, వెల్స్ - 22),మెటీరియ‌ల్స్ మేనేజ్‌మెంట్ ఆఫీస‌ర్ - 22, ప్రోగ్రామింగ్ ఆఫీస‌ర్ - 4,ట్రాన్స్ పోర్ట్ ఆఫీస‌ర్ - 12.
వ‌య‌సు: 28 నుంచి 31 మ‌ధ్య ఉండాలి.
అర్హత‌లు: ఎమ్మెస్సీ / ఎంటెక్ / ఏదైనా పీజీ ఉత్తీర్ణత‌
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: గేట్ - 2015 స్కోర్‌, ఇంట‌ర్వ్యూ ద్వారా
చివ‌రి తేది: అక్టోబ‌ర్ 1
చిరునామా:
Oil And Natural Gas Corporation Limited
Mumbai..
ఎన్టీపీసీలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీలు
న్యూఢిల్లీలోని నేష‌న‌ల్ థ‌ర్మల్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్ (ఎన్టీపీసీ) ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.......
* ఎగ్జిక్యూటివ్ ట్రైనీలు
అర్హత‌: బీటెక్. గేట్ - 2015కు అర్హత క‌లిగి ఉండాలి.
విభాగాలు: ఎల‌క్ట్రిక‌ల్‌, మెకానిక‌ల్‌, ఇన్‌స్ట్రుమెంటేష‌న్‌, ఎల‌క్ట్రానిక్స్.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. గేట్ - 2015 రిజిస్ట్రేష‌న్ నెంబ‌ర్ వ‌చ్చిన త‌ర్వాత ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: గ్రూప్ డిస్కష‌న్‌, ప‌ర్సన‌ల్ ఇంట‌ర్వ్యూ.
జీతం: రూ.24900 - 50500.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రారంభం: 20-12-2014.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివరితేదీ: 19-01-2015.
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్) ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
ఎగ్జిక్యూటివ్ ట్రెయినీస్
విభాగాలు: కంప్యూటర్ సైన్స్, సివిల్ ఇంజినీరింగ్.
అర్హతలు: కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ ఇంజినీరింగ్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ సివిల్ ఇంజినీరింగ్‌లో కనీసం 65 శాతం మార్కులతో బీఈ/ బీటెక్/ బీఎస్సీ (ఇంజి) ఉండాలి. చివరి ఏడాది విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. గేట్- 2015కు దరఖాస్తు చేసి ఉండాలి.
వయసు: 28 ఏళ్లకు మించకూడదు.
ఎంపిక: గేట్- 2015 స్కోర్ ఆధారంగా ఎంపికచేసి గ్రూప్ డిస్కషన్/ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
గేట్- 2015కు చివరతేది: అక్టోబరు 1
పీజీసీఐఎల్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: జనవరి 15
చివరతేది: ఫిబ్రవరి 27

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning