వైవిధ్యభరితం... ఇంజినీరింగ్‌

ఇంటర్మీడియట్‌ తర్వాత ఇంజినీరింగ్‌లో ప్రవేశించే విద్యార్థులు ఈ రెండిటికీ తేడా ఏమిటో స్పష్టంగా గ్రహించాలి. ఇంజినీరింగ్‌ విద్యాభ్యాసానికి సంబంధించిన ప్రత్యేక విషయాలపై అవగాహన పెంచుకోవాలి!
ఇంజినీరింగ్‌ చదువుల బండిలో ప్రయోజన పూరితమైన ప్రయాణం మొదలయ్యే తరుణమిది. ఈ నాలుగు సంవత్సరాల కాలవ్యవధిని ఎంత చక్కగా వినియోగించుకుంటే భవిష్యత్తుకు అంత గట్టి పునాది వేసుకున్నట్టవుతుంది. ఈ సమయాన్ని వివిధ దశలుగా విభజించుకుని, ఆయా దశల్లో చెయ్యదగిన చర్యలను గుర్తించాలి. దానికి అనుగుణంగా దినచర్యను క్రమబద్ధీకరించుకోవాలి.
సెప్టెంబరు మొదటి వారం నుంచి దాదాపు మే నెల వరకూ మొదటి సంవత్సరం కొనసాగుతుంది. సాంకేతిక విద్య పరిభాషలో చెప్పాలంటే దాదాపు 40 వారాల పాటు ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం తరగతులు జరుగుతాయి. ఈ కాలంలో ఆరు విభిన్నమైన సబ్జెక్టులు, ఐదు లేబొరెటరీలకు సంబంధించిన సబ్జెక్టులూ చదవాల్సివుంటుంది.
ఈ సబ్జెక్టులన్నింటికీ కలిపి స్థూలంగా 1000 మార్కుల మూల్యాంకనం ఉంటుంది. ఈ మార్కులు రెండు సంవత్సరాల ఇంటర్మీడియట్‌ మార్కుల మొత్తానికీ, అంతేకాకుండా బీటెక్‌లో దాదాపు 25% మార్కులకూ సమానం. అంటే మొదటి సంవత్సరంలో మంచి మార్కులు తెచ్చుకుంటే దాని సత్ప్రభావం మిగిలిన సంవత్సరాలపై కూడా ఉంటుంది. ఇంతటి ప్రభావం చూపే ఈ నలభై వారాల చదువుకు వారాలు/ నెలల వారీ పద్ధతిన తయారవ్వడం చాలా ఉత్తమం, అవసరం కూడా.
కారణాంతరాల వల్ల అంచనాల మేరకు ఎంసెట్‌లో ప్రతిభను కనబరచలేకపోయి ఇష్టమైన కాలేజీ/ బ్రాంచిలో ప్రవేశం పొందలేకపోయినా ఫరవాలేదు. లభించిన బ్రాంచిలో కూడా స్థిరంగా సహజ ప్రతిభను ప్రదర్శిస్తే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు. అంతేకాకుండా కొత్త అవకాశాలు వెతుక్కుంటూ రావచ్చు కూడా. చేయవలసిందల్లా చక్కటి ప్రణాళిక ప్రకారం నడుచుకోవడమే.
అవగాహన ముఖ్యం
బీటెక్‌లో చేరడం మొదటి అడుగు ఐతే బాగా చదవగలమా, అంచనాల మేరకు ఎలా చదవాలి, అన్న ప్రశ్నలు ఉదయించడం సహజం.
1. క్రెడిట్లు: బి.టెక్‌లో ఒక సబ్జెక్టులో ఉత్తీర్ణులైతే కొన్ని క్రెడిట్లు వస్తాయి. అదే ఆ సబ్జెక్టులో ఫెయిల్‌ ఐతే క్రెడిట్లేమీ రావు. అంటే ఒక సబ్జెక్టులో మొత్తం క్రెడిట్లు రావడం, లేకపోతే అసలు క్రెడిట్లు రాకపోవడం అనే రెండే స్థితులుంటాయి. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే- సబ్జెక్టులో పాస్‌ అవ్వడానికి కావలసిన కనీస మార్కులు (40 మార్కులు) వస్తే క్రెడిట్లు వస్తాయి. 40 మార్కులకి పైబడి ఎన్ని వచ్చినా పూర్తి క్రెడిట్లు వస్తాయి.
మొదటి సంవత్సరంలో ఇంచుమించు ప్రతి బ్రాంచిలోనూ ప్రతి సబ్జెక్టుకీ 4 లేదా 6 క్రెడిట్లూ, డ్రాయింగ్‌కి 6 క్రెడిట్లూ, ప్రతి లేబొరెటరీ సబ్జెక్టుకి 4 క్రెడిట్లూ కలిపి మొత్తం 50 క్రెడిట్లు ఉంటాయి. రెండో సంవత్సరం నుంచి ప్రతి సబ్జెక్టుకీ గరిష్ఠంగా 4 క్రెడిట్లూ, ప్రతి లేబొరెటరీ సబ్జెక్టుకి 2 క్రెడిట్ల చొప్పున మొత్తం 25 క్రెడిట్లు ఉంటాయి. మొదటి సంవత్సరం అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులైతే 50 క్రెడిట్లు వస్తాయి. అదేవిధంగా పై సెమిస్టర్లలో కూడా 25 క్రెడిట్లు వస్తాయి.
2. మార్కులు: మొదటి సంవత్సరం 1000 మార్కుల మూల్యాంకనం, రెండో సంవత్సరం నుంచి ప్రతి సెమిస్టరులోనూ గరిష్టంగా 750 మార్కులకు మూల్యాంకనం ఉంటుంది. ప్రతి సెమిస్టరులోనూ ఐదారు సబ్జెక్టులూ, రెండు మూడు లేబొరెటరీ (ప్రయోగశాల) సబ్జెక్టులూ ఉంటాయి. ప్రతి సబ్జెక్టులోనూ గరిష్ఠంగా 100 మార్కుల మూల్యాంకనం, ప్రతి లేబొరెటరీలోనూ గరిష్ఠంగా 75 మార్కులకు మూల్యాంకనం! ఇందులో ప్రతి సబ్జెక్టులోనూ 25 మార్కులు అంతర్గత మార్కులకూ, మిగతా 75 విశ్వవిద్యాలయం నిర్వహించే పరీక్షలకూ కేటాయించివుంటాయి. లేబొరెటరీ సబ్జెక్టులు ఐతే ఇవి క్రమంగా 25, 50 మార్కులుగా ఉంటాయి.
3. లేబొరేటరీలు: ఇంజినీరింగ్‌ వంటి సాంకేతిక విద్యల్లో లేబొరెటరీలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. విశ్వవిద్యాలయం నిర్దేశించిన సిలబస్‌ ప్రకారం ప్రయోగాలుంటాయి. ప్రతి విద్యార్థీ వీటిని అధ్యాపకుల పర్యవేక్షణలో స్వతంత్రంగా చెయ్యవలసి ఉంటుంది. ఇంటర్మీడియట్‌, పాఠశాలల స్థాయుల్లో మాదిరిగా కాకుండా ఇంజినీరింగ్‌లో విద్యార్థులే చేయాల్సివుంటుంది. ఈ లేబొరెటరీకి సంబంధించిన సబ్జెక్టు కూడా ఉండడంచేత మౌలికాంశాల మీద తరగతిలో శిక్షణ, లేబొరెటరీలో ప్రయోగం ద్వారా నేర్చుకోవడం సమాంతరంగా జరిగే ప్రక్రియ. కాబట్టి విద్యార్థి ప్రయోగశాలలో సాధనకు ప్రాముఖ్యం ఇవ్వలసి ఉంటుంది.
4. అసైన్‌మెంట్లు: అంతర్గత మార్కుల్లోని 25 మార్కుల్లో 5 మార్కులు అసైన్‌మెంట్లుకి కేటాయించారు. ఆయా సబ్జెక్టులు బోధించే అధ్యాపకులు యూనిట్ల వారీగా కొన్ని ప్రశ్నలు అసైన్‌మెంట్లుగా ఇస్తారు.
ప్రతి విద్యార్థీ సమాధానాలు రాసి నిర్ణీత సమయంలోగా అసైన్‌మెంట్లు అధ్యాపకులకు దాఖలు చెయ్యాలి. లేకపోతే మార్కులు ఉండవు. ఇంటర్మీడియట్‌కీ, ఇంజినీరింగ్‌కీ ఉన్న ముఖ్య వ్యత్యాసం ఇదే. ఇంటర్మీడియట్‌లో మొత్తం మార్కుల మూల్యాంకనం బోర్డు నిర్వహించే పరీక్షలకే కేటాయించి ఉంటాయి. కానీ బీటెక్‌లో విద్యార్థి చదువుకి సంబంధించి చేసే ప్రతి పనికీ కొన్ని మార్కులు ఆ సబ్జెక్టు అధ్యాకుల అధీనంలో ఉంటాయి. అంటే బీటెక్‌లో మంచి మార్కులు తెచ్చుకోవాలంటే అధ్యాపకుల సహాయ సహకారాలు తప్పనిసరి అన్నమాట.
5. హాజరు నిబంధనలు: విశ్వవిద్యాలయం నిర్వహించే పరీక్షలకు హాజరవ్వాలంటే మొదటి సంవత్సరం/ సెమిస్టరులో కనీసం 75% హాజరు ఉండాలి. 10% శాతం వరకు కళాశాల స్థాయిలోని విద్యామండలి ద్వారా మాఫీ పొందవచ్చు. అంటే పరీక్షలకు అర్హత పొందాలంటే కనీసం 65% హాజరయ్యి ఉండాలి. లేకపోతే పరీక్షలకు అర్హత కోల్పోవడమే కాకుండా, హాజరు లేని కారణంగా అమూల్యమైన విద్యా సంవత్సరం కూడా కోల్పోయి జూనియర్లతో కలిసి చదువవలసి వస్తుంది.
జె.ఎన్‌.టి.యు.హెచ్‌. పరిధిలో ప్రతి సంవత్సరం దాదాపు 15 శాతం నుంచి 20 శాతం మంది విద్యార్థులు హాజరు సరిపోని కారణంగా విద్యాసంవత్సరాన్ని కోల్పోతున్నారని అంచనా.
6. డిటెన్షన్‌ నిబంధనలు: డిటెన్షన్‌ అంటే అనర్హత కారణాల వల్ల కనీసం ఒక విద్యాసంవత్సరం కోల్పోవడం. ఇది రెండు విధాలుగా జరిగే అవకాశం ఉంది. మొదటిగా ఒక సెమిస్టరులో హాజరు 65% కన్నా తక్కువ ఉంటే ఆ సెమిస్టరులో డిటెయిన్‌ అవుతారు. మళ్ళీ ఆ పై సంవత్సరం తమ జూనియర్లతో కలిసి అదే సెమిస్టరులో చదివి హాజరు తెచ్చుకుని పరీక్షలకు అర్హత తెచ్చుకోవలసి ఉంటుంది. రెండో పద్ధతిలో రెండో సంవత్సరం నుంచి మూడో సంవత్సరానికి ఉన్నతి పొందేటప్పుడు; మూడో సంవత్సరం నుంచి నాలుగో సంవత్సరానికి ఉన్నతి పొందేటప్పుడు వర్తించే నియమాల రూపంలో ఉంటాయి.
విద్యార్థుల ప్రయోజనం దృష్టిలో ఉంచుకుని విశ్వవిద్యాలయం కొన్నిసార్లు కొంత వెసులుబాటునివ్వవచ్చు. కానీ ఆ వెసులుబాటు ఏ సంవత్సరం విద్యార్థులకైతే ఇచ్చారో వారికి మాత్రం వర్తిస్తుంది.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning