దూసుకెళ్తాం.. దుమ్మురేపుతాం

ఉద్యోగం వస్తే చాలు దూసుకెళ్లడానికి సిద్ధంగా ఉంది నవతరం. 30 ఏళ్లు ఆపై వయసు వారితో పోల్చితే పాతికేళ్లలోపు వయసున్న యువతరం వృత్తిగతంగా దూకుడుగా వ్యవహరిస్తోంది. అన్ని రంగాల్లోనూ సీనియర్లతో పోటీ పడుతూ సంస్థలో.. వృత్తిలో తమకంటూ ప్రత్యేక ముద్ర వేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. దీంతో సంస్థలు ఇప్పుడు యువతరానికి అధిక ప్రాధాన్యమిస్తున్నాయి. మిలీనియల్‌ బ్రాండింగ్‌, రాన్‌స్టడ్‌ యూ.ఎస్‌ సంస్థలు ఉద్యోగం.. వృత్తి.. భవిష్యత్తు జనరేషన్‌ జడ్‌ (18 నుంచి 20 ఏళ్ల మధ్య వయసు వారు) ఎలా ఆలోచిస్తోందో ఒక అంచనా వేసేందుకు ఒక అధ్యయనం చేశారు. అందులో యువత వృత్తిగత వ్యవహారాలకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.
కొత్తగా పని చేయాలన్న తపన.. వినూత్న ఆలోచనలు.. సొంతంగా ఏదో ఒకటి చేయాలన్న కాంక్ష.. అన్ని వేళలా సంస్థకు అందుబాటులో ఉండటం.. తదితర విషయాలతో పాటు ఇంటి నుంచీ పని చేసేందుకు నవతరం ఆసక్తి చూపుతోంది. సీనియర్లతో పోల్చితే ఈ జెన్‌ జడ్‌ ఆయా సంస్థల్లో ప్రత్యేక ముద్రవేయడంతో పాటు కొన్ని మార్పులకు కూడా దోహదం చేస్తున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది.
నిజాయితీకి పెద్దపీట
నవతరం వృత్తిగతమైన విషయాల్లో నిజాయతీగా వ్యవహరించేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. ఉద్యోగంలో చేరిన తర్వాత అభివృద్ధి చెందాలంటే నిజాయతీగా ఉండాలని ప్రగాఢంగా విశ్వసిస్తోంది. నాయకుడిగా ఎదగాలన్నా.. కార్యాలయంలో మంచి పేరు సాధించాలన్నా నిజాయతీగా ఉండాల్సిందేనని భావిస్తోంది. ఈ విషయంలో సీనియర్లతో పోల్చితే యువత కాస్తమెరుగ్గా ఉందని తాజా అధ్యయనం పేర్కొంటోంది. సీనియర్లు ఇప్పటికే ఏదో ఒక ఉన్నత స్థానాల్లో ఉంటారు కనుక వారు నిజాయతీగా ఉండటం గొప్ప కాదు.. సాధారణ ఉద్యోగి స్థాయిలో నిజాయతీకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం మంచి పరిణామమని మానవ వనరుల నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం యువత నిజాయతీగా ఉంటోంది కాబట్టే సంస్థ తమను సరిగ్గా పట్టించుకోకున్నా.. తనపై విశ్వాసం తగ్గినా తమ నైపుణ్యాలకు తగినట్లు వేరే చోట ఉద్యోగాలను వెదుక్కొంటున్నారు. సీనియర్లపై గౌరవం తప్ప గతంలోలాగా భయం, ప్రతికూల ఆలోచనలు లేవు. దీంతో వారు తమ ప్రతిభకు తగినట్లు పూర్తిస్థాయిలో పని చేయగలుగుతున్నారు.
వ్యాపారదృష్టి ఎక్కువ...
ప్రస్తుతం స్థిరపడిన ఉద్యోగులతో పోల్చితే నవతరంలో వ్యాపారంపై ఆసక్తి ఎక్కువగా ఉంది. వీరందరూ సొంతంగా కంపెనీలు, వ్యాపారం ప్రారంభిచకున్నా.. ఎక్కువ మంది ఆలోచనలు మాత్రం ఆ దిశగానే ఉంటున్నాయి. జెన్‌ వై (పాతికేళ్లకు పైబడిన వారు) తమ లక్ష్యాలు, సంస్థ అభివృద్ధి, ప్రస్తుత ఉద్యోగం గురించి ఎక్కువగా ఆలోచిస్తుండగా.. నవతరం మాత్రం ఇచ్చిన పనిని చక్కగా త్వరగా ఎలా పూర్తి చేయాలని ఆలోచిస్తోంది. ఈ పని పూర్తయిన తర్వాత వ్యాపారానికి సంబంధించిన అంశాలపై దృష్టి సారిస్తోంది. ఇందుకోసం సీనియర్లకన్నా ఎక్కువగానూ కష్టపడుతోంది.
నేటితరానికి సంప్రదాయబద్ధంగా రోజుకు కొన్ని గంటల పాటు కార్యాలయాల్లో పని చేయడం నచ్చడం లేదు. తమకు నచ్చినట్లు పని వేళలు ఉండాలని భావిస్తోంది. ఫలితంగా ఎక్కువ మంది యువత కార్యాలయాల్లో కన్నా ఇంటి వద్ద నుంచే పని చేసేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. వీరికి నైపుణ్యం.. పని ముఖ్యమేకాని కార్యాలయం... అక్కడి వసతులుకాదు.
సాంకేతిక పరిజ్ఞానంలో ముందున్న నేటితరం వృత్తిపరమైన అన్ని విషయాలకూ గ్యాడ్జెట్స్‌పైనే ఆధారపడుతుందని చాలా మంది భావిస్తారు. కాని వీరికి మితిమీరిన సాంకేతికత వినియోగం వల్ల తలెత్తే ప్రమాదాలు తెలుసు. అందువల్ల వృత్తిగతమైన అంశాలను చర్చించుకోవడానికి, మాట్లాడటానికి నేరుగానే సంప్రదించాలని భావిస్తారు. నేరుగా మాట్లాడటం, కలిసి కూర్చొని చర్చించడం తదితరాలకు ప్రాధాన్యమిస్తారు.
ప్రణాళికతో ముందుకు...
తల్లిదండ్రులో లేదా.. నిపుణుల సూచనల మేరకు ఉన్నత విద్యనభ్యసించడం.. ఆ చదువుకు తగినట్లు ఒక ఉద్యోగాన్ని వెదుక్కోవడం మరోచోట మంచి జీతం వస్తే అక్కడకు మారడం ఇటీవలి దాకా యువతరం తీరు. కాని ఇప్పుడు మారింది. నేటి కుర్రకారుకు తమకు ఏం కావాలో స్పష్టంగా తెలుసు. తల్లిదండ్రుల్లో పెరిగిన అవగాహన, మారిన పరిస్థితులకు తగినట్లు చదువు, కెరియర్‌ పరంగా ప్రస్తుత టీనేజర్లకు కాస్త స్వేచ్ఛ లభిస్తోంది. దీంతో వారు తమ లక్ష్యాన్ని సాధించేందుకు ఏం చేయాలో పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. దీంతో కొన్ని రకాల ఉద్యోగాల్లో సీనియర్లకు గట్టిపోటీ ఇస్తూ తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సాధిస్తున్నారు. ఏ ఉద్యోగం దొరికిదే అందులో చేరిపోవడం.. కాస్త ఎక్కువ జీతానికి ఆశపడి ఉద్యోగాలు మారడం తదితర విషయాల్లో కూడా ఆచి తూచి స్పందిస్తున్నారు. తమ ఆశయాలు, పని వాతావరణం, స్వేచ్ఛ, నైపుణ్యాలకు గుర్తింపు లభిస్తే జీతం ఎక్కువ ఇచ్చినా ఉద్యోగాలు మారేందుకు ఆసక్తి చూపకుండా లక్ష్యాల సాధన వైపు దూసుకెళ్తున్నారు.
అయితే..: కాలానికి తగినట్లు మారకుండా సంప్రదాయ పద్ధతులనే అవలంభిస్తున్న యువత మాత్రం అవకాశాలను అందిపుచ్చుకోవడంలో కాస్త వెనుకబడుతోంది. అందువల్ల కాలానికి తగినట్లు చదువు, సాంకేతికత, వైఖరి, నైపుణ్యాలు మారుతూ ఉండాలి. అప్పుడే వృత్తిగత జీవితంలో మనుగడ ఉంటుంది.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning