నైపుణ్యాలతోనే అభివృద్ధి ఫలాలు

* అయిదేళ్లలో నాలుగు లక్షలమందికి అవగాహన కార్యక్రమాలు
* శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు
* రాజీవ్ యువకిరణాలును సమీక్షిస్తాం
* ఏపీ నైపుణ్యాల అభివృద్ధి సంస్థ సీఈఓ గంటా సుబ్బారావు

ఈనాడు-హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధిపథంలో నిలిపే చర్యల్లో భాగంగా ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరిలోనూ నైపుణ్యతను పెంపొందింపచేయడమే తమ సంస్థ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర నైపుణ్యాల అభివృద్ధి సంస్థ సీఈఓ గంటా సుబ్బారావు వెల్లడించారు. అందరిలో అంతర్లీనంగా నైపుణ్యం ఉంటుంది...దానిని సద్వినియోగం చేసుకునే అవకాశాలు రాక..ఆసక్తి చూపకపోతుండటంతో ఫలితాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయని తెలిపారు. నైపుణ్యాల అభివృద్ధి సంస్థ.. అన్ని శాఖలతో సమన్వయంగా వ్యవహరించనుందన్నారు. ఏపీలో నైపుణ్యాల పెంపునకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. దీనికి తగినట్లే..తమ సంస్థ కార్యకలాపాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. నైపుణ్యాల అభివృద్ధి సంస్థ ద్వారా తీసుకురానున్న చర్యలపై త్వరలోనే మార్గదర్శకాలు రానున్నాయని తెలిపారు. ఏపీ ప్రభుత్వం గంటా సుబ్బారావును నైపుణ్యాల అభివృద్ధి సంస్థ సీఈఓగా నియమించిన సందర్భంగా ఆయన 'ఈనాడుకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
ప్రధానాంశాలు...
* చదువుతున్న వారినే కాకుండా..చదువుకు దూరమైన వారిని...వివిధ వృత్తుల్లో ఉన్న వారిని గుర్తించి వారికి అవసరమైన నైపుణ్య కార్యక్రమాలను నిర్వహిస్తాం. ఇందుకు అవసరమైన సమాచార, గణాంకాల సేకరణ జరుగుతోంది. మారిన సాంకేతికతకు అనుగుణంగా నైపుణ్య కార్యక్రమాలను వేగవంతంచేస్తే అభివృద్ధి ఫలాలు త్వరిగతిన అందుబాటులోకి వస్తాయి. వివిధ వృత్తుల్లో ఉన్న వారికి సరైన నైపుణ్యత ఉన్నట్లు కనిపించడంలేదు.
* రానున్న అయిదు సంవత్సరాల్లో కనీసం నాలుగు లక్షల మంది విద్యావంతులకు వారు ఆసక్తి కనబరిచే రంగాల్లో అవగాహన కల్పించే చర్యలు తీసుకోవాలని ప్రాథమికంగా భావిస్తున్నాం. ఇందులో అత్యధికులు ఇంజినీరింగ్ విద్యను పూర్తిచేసే గ్రాడ్యుయేట్లు ఉంటారు.
* ప్రస్తుత విద్యావిధానం సంతృప్తికరంగా లేదు. విద్యా బోధనలోనూ ముఖ్యమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అసలు..తరగతి గది స్వరూపమే మారాల్సి ఉంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుని విద్యార్థులకు అన్ని విషయాలపట్ల కనీస అవగాహన పొందేలా చర్యలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఉపాధ్యాయులు, అధ్యాపకుల బోధన తీరులోనూ సంస్కరణలు అనివార్యం. వీటన్నింటికీ అవసరమైన చర్యలు దశల వారీగా మా సంస్థ ద్వారా జరగబోతున్నాయి.
* ఏపీలోని వివిధ పరిశ్రామిక రంగాలకు సంబంధించిన వారిని సంప్రదించి వారికి ఎలాంటి మానవ వనరులు అవసరమో తెలుసుకునేందుకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నాం. పరిశ్రమల అవసరాలకు తగినట్లు నైపుణ్యం కలిగిన వారు ఎక్కడెక్కడ ఉన్నారో తెలిసేలా 'వెబ్పోర్టల్ను రూపొందిస్తాం. అలాగే..ఏయే వృత్తుల్లో ఎలాంటి నైపుణ్యం కావాలో తెలుసుకుని..శిక్షణ కోసం ముందుకువచ్చే వారిని ప్రోత్సహంచేలా చర్యలనూ తీసుకుంటాం. ప్రస్తుత విజ్ఞాన కేంద్రాల కార్యకలాపాల నిర్వహణ తీరును సమీక్షించి వాటిని అవసరమైన మార్పులతో పటిష్ఠం చేయనున్నాం.
* స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్ వర్క్ ద్వారా శిక్షణ పొందిన వారికి సర్టిఫికేట్లు ప్రదానం చేస్తాం. ఈ సర్టిఫికేట్లకు అన్ని రంగాల వారి నుంచి తగిన గుర్తింపు లభించేలా చర్యలు తీసుకుంటాం.
* ఇప్పటికే ఉద్యోగాల్లో స్థిరపడిన వారికీ ఆయా రంగాలపై అవసరమైన శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తాం. ఐటీ, సాఫ్ట్వేర్ రంగాలకు చెందిన సంస్థలు అభ్యర్థులను ఉద్యోగంలోకి తీసుకున్న తర్వాత మారిన సాంకేతికకు అనుగుణంగా తిరిగి శిక్షణ ఇప్పించేందుకు అవస్థలు పడుతున్నారు. ఈ విషయంలోనూ అవసరమైన చర్యలు మా సంస్థ ద్వారా జరగబోతున్నాయి.
* ఆయా రంగాలపట్ల ఆసక్తి కలిగిన వారికి శిక్షణ ఇప్పించాలంటే వారికి అర్థమయ్యేలా..శిక్షకుల అవసరం ఎంతైనా ఉంది. ముందు వీరిని గుర్తించి...తగిన మౌలిక వసతులు కల్పించి అవసరమైన వారికి శిక్షణ ఇప్పించడం కత్తిమీద సాములాంటిదే. ఇందుకు తగినట్లు మౌలిక వసతులను కల్పించుకోవల్సిన అవసరం ఉంది. రాజీవ్ యువకిరణాలు పథకం కింద గతంలో కొన్ని కార్యకలాపాలు జరిగాయి. వాటినీ సమీక్షించి ప్రస్తుత అవసరాలకు తగినట్లు అవసరమైన మార్పులతో ముందుకుసాగుతాం.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning